Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఆర్థిక రంగం

చమురు విపణిలో కల్లోలం!

* ధరల పతనంతో ప్రకంపనలు
భారతదేశం 80శాతం మేరకు చమురు దిగుమతి చేసుకుంటోంది. ప్రపంచంలో చైనా తరవాత అత్యధిక జనాభా కలిగినది ఇండియానే. ఆ మేరకు దేశంలో ఇంధన అవసరాలూ ఎక్కువే. ఈ దృష్ట్యా చమురు చవగ్గా లభించటం భారత్‌కు ప్రయోజనదాయకమే. ఈ పరిణామం కారణంగా చమురు దిగుమతి బిల్లు, కరెంటుఖాతా లోటూ తగ్గుతాయన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. ఆదా అయ్యే డబ్బుతో దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకొనే అవకాశం ఉంటుంది. దేశీయంగానూ చమురు ధరల్ని గణనీయంగా నియంత్రిస్తే రవాణా ఛార్జీలు, తయారీ రంగంలో ఉత్పత్తి వ్యయాలూ తగ్గుతాయి. దానివల్ల ద్రవ్యోల్బణం దిగి వస్తుందని, వృద్ధికి వూతమిచ్చేలా రేట్లలో కోత విధించేందుకు భారత రిజర్వు బ్యాంకు(ఆర్‌బీఐ)కీ అవకాశం చిక్కుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ప్రపంచ మార్కెట్లలో ముడిచమురు ధరలు మొన్న జనవరి 12న ఒక్కసారిగా పతనమయ్యాయి. అమెరికాలోని నార్త్‌ సీ, వెస్ట్‌ టెక్సాస్‌ ఇంటర్మీడియెట్‌(డబ్ల్యూటీఐ)ల నుంచి లభించే బ్రెంట్‌ క్రూడ్‌ ధరల్ని ప్రపంచ పెట్టుబడిదారులు అంతర్జాతీయ ప్రమాణాలుగా భావిస్తారు. అక్కడి ధరల్లో నమోదయ్యే హెచ్చుతగ్గుల్ని బట్టి ప్రపంచ ముడిచమురు ధరలపై వారు ఒక నిర్ణయానికి వస్తారన్న మాట. ఆ రోజు రెండుచోట్లా ముడిచమురు ధరలు తీవ్రంగా పడిపోయి, పీపా 30డాలర్లకు కాస్త అటూఇటూ స్థాయికి చేరుకొన్నాయి. అమెరికా ఆంక్షల్ని తొలగించిన దరిమిలా మార్కెట్లోకి భారీయెత్తున చమురు ప్రవహింపజేయడానికి ఇరాన్‌ సిద్ధపడటంతో- క్రూడాయిల్‌ ధర తాజాగా 28డాలర్ల దిగువకు పడిపోయి, ప్రకంపనలు సృష్టిస్తోంది. వాస్తవంలో ఈ ఏడాది ఆరంభంనుంచీ ప్రపంచవ్యాప్తంగా ముడిచమురు ధరలు తగ్గిపోతూనే ఉన్నాయి. ఈ పరిస్థితి చూసి బార్లే్కస్‌, మాక్వెరీ, బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా మెరిల్‌ లించ్‌, స్టాండర్డ్‌ ఛార్టర్డ్‌ వంటి మార్కెట్‌ విశ్లేషక సంస్థలు 2016వ సంవత్సరానికి సంబంధించి తమ అంచనాలు సవరించుకొన్నాయి. చమురు పీపాధర 10 డాలర్లకు పడిపోవచ్చునంటూ స్టాండర్డ్‌ చార్టర్డ్‌ మరీ నిరాశాజనక దృశ్యాన్ని ఆవిష్కరించింది. చమురు ధరలు మౌలిక అంశాలను బట్టి కాకుండా అమెరికా డాలరు, ఈక్విటీ ధరల వంటివాటిలో హెచ్చుతగ్గులను బట్టి మారుతున్నాయని, ఈ దృష్ట్యా రానున్న కాలంలో అవి దారుణంగా పడిపోవచ్చునంటూ తన అంచనాను స్టాండర్డ్‌ ఛార్టర్డ్‌ సమర్థించుకొంది. చమురు ధరలు పతనమవుతున్న తీరును చూస్తుంటే, దాని జోస్యం నిజమయ్యేలాగే కనిపిస్తోంది. వాస్తవంలో చమురు ధరల పతనం 2014 మధ్యలోనే ప్రారంభమైంది. ఇవి ఇంత తీవ్రస్థాయిలో పడిపోవడానికి గల కారణాలు ఏమిటన్నదానిపై లోతైన విశ్లేషణ అవసరం.

మూడు ముఖ్యాంశాలు
చమురు మార్కెట్‌ పరిస్థితి 1970 తరవాత ఇప్పుడే అత్యంత దారుణంగా తయారైంది. 2014 వేసవిలో బ్రెంట్‌ ముడిచమురు ధర పీపాకు 115 డాలర్లు. ఇప్పుడది 12ఏళ్లలో ఎన్నడూలేనంతగా 30డాలర్ల దిగువకు పడిపోయింది. చమురు మార్కెట్లో ‘గిరాకీ-సరఫరా’ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. షేల్‌గ్యాస్‌ అమెరికా అందుబాటులోకి వచ్చింది. చమురు సరఫరాను తగ్గించుకొనే విషయంలో పెట్రోలు ఎగుమతిచేసే దేశాల సంస్థ(ఒపెక్‌)లో ఏకాభిప్రాయం సాధ్యపడలేదు. ముఖ్యంగా ఈ మూడు అంశాలు ప్రస్తుత చమురు ధరల పతనానికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. మొదటి అంశాన్ని తీసుకొంటే- డిమాండు పెరిగినప్పుడు వస్తూత్పత్తి ధర పెరగడం, డిమాండు తగ్గినప్పుడు అదీ తగ్గిపోవడం సహజం. చమురు ధరలకూ ఇదే సూత్రం వర్తిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక కార్యకలాపాలు మందగించిన దరిమిలా చమురు గిరాకీ పడిపోయింది. పారిశ్రామిక ప్రపంచంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాల అభివృద్ధి కారణంగా ఇంధన సామర్థ్యం బాగా పెరిగింది. చమురు బదులు ప్రత్యామ్నాయ ఇంధన వనరులను ఉపయోగించే వినియోగదారుల సంఖ్య పెరిగింది. ఫలితంగా, ప్రపంచవ్యాప్తంగా చమురు గిరాకీ పడిపోయింది. దాంతో ముడిచమురు ధరలు దిగివచ్చాయి. అదే సమయంలో అమెరికాలో భారీయెత్తున షేల్‌ సహజవాయు నిక్షేపాలు బయటపడ్డాయి.

ఆ దేశం చమురు ఉత్పాదక సామర్థ్యం పెరిగింది. అమెరికా దేశీయ చమురు ఉత్పత్తి సామర్థ్యం ఆరేళ్లలో రెట్టింపు అయింది. దాంతో ఆ దేశం ఇదివరకటికన్నా తక్కువగా ముడిచమురు దిగుమతి చేసుకొంది. అమెరికాలో చమురు ఉత్పత్తి పెరగడం రెండు రకాల పరిణామాలకు దారితీసింది. దానివల్ల ప్రపంచ మార్కెట్లో చమురు సరఫరా పెరిగి ధరలు తగ్గాయి. మరోవైపు, ఇంతకుముందు అమెరికాకు భారీగా చమురు ఎగుమతి చేస్తూ వచ్చిన నైజీరియా, అల్జీరియా, సౌదీ అరేబియా వంటి దేశాలు కొత్తమార్కెట్లు వెతుక్కోవలసి వచ్చింది. ముఖ్యంగా ఆసియావైపు అవి దృష్టి సారించాయి. ఈ దేశాల్లో గిరాకీ పెంచుకోవడానికి చమురు ధరలు తగ్గించుకోవలసి వచ్చింది. ఆసియాలో ప్రత్యేకించి చైనా, భారత్‌ అత్యధికంగా చమురు దిగుమతి చేసుకొంటున్నాయి. ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ, గిరాకీ స్థిరంగానే ఉన్నప్పటికీ, చైనా వృద్ధి తగ్గిపోతోంది. పారిశ్రామిక ఉత్పత్తి నుంచి వినియోగ ఆధారిత వృద్ధి వైపు చైనా మళ్లడంతో చమురు గిరాకీ తగ్గి, ధరలు మరింతగా పతనమవుతున్నాయి.

ఒపెక్‌ చాలా శక్తిమంతమైన కూటమి. ప్రపంచ చమురు ఉత్పత్తిలో 40శాతం వాటా ఈ దేశాలదే. ఒపెక్‌లో సౌదీ అరేబియా కీలకపాత్ర పోషిస్తోంది. ఒపెక్‌లో మూడోవంతు చమురు ఆ ఒక్క దేశమే ఉత్పత్తి చేస్తోంది. చమురు ఉత్పత్తి తగ్గించుకోవడానికి ఆ దేశం సిద్ధపడటం లేదు. ధరలు పెరగడానికి వీలుగా చమురు ఉత్పత్తి తగ్గించాల్సి వస్తే, ఆ దేశమే అత్యధికంగా ఉత్పత్తి తగ్గించుకోవలసి ఉంటుంది. అందుకు సౌదీ సుముఖంగా లేదు. సౌదీలో నిరుడు 36,700కోట్ల రియాళ్ల మేరకు బడ్జెట్‌లోటు నమోదైంది. ఒక రియాల్‌ విలువ రూ.18. ఈ లెక్కన ఆ మొత్తం రూ.6,60,600 కోట్లకు సమానం. ఇప్పటికే లోటు బడ్జెట్‌తో ఉన్న సౌదీ అరేబియా, చమురు ఉత్పత్తిని తగ్గించుకొంటే మరింత నష్టపోతానని భయపడుతోంది. ఉత్పత్తి తగ్గించడంవల్ల చమురు ధర పెరిగే అవకాశం ఉన్నప్పటికీ, తగ్గించుకొనే చమురు ఉత్పత్తిలో తన వాటా అధికంగా ఉండటం వల్ల తనకు పెద్దగా ప్రయోజనం చేకూరదని ఆ దేశం భావిస్తోంది. పైపెచ్చు చమురు ధరలు పెరిగితే, తన బద్ధశత్రువైన ఇరాన్‌ కూడా భారీగా లబ్ధిపొందుతుందని సౌదీకి తెలుసు. పశ్చిమ దేశాలు ఆంక్షలు సడలించడంతో ఇప్పటికే జోరుమీదున్న ఇరాన్‌, మున్ముందు మరింత బలం పుంజుకోకుండా చూడాలన్నది సౌదీ ప్రయత్నం. మరోవైపు కెనడా, ఇరాక్‌, రష్యాలు చమురు ఉత్పత్తి పెంచుతున్నాయి. ఫలితంగా చమురు మార్కెట్లలో సరఫరాలు పెరిగి, ముడిచమురు ధరలు మరింత పతనమయ్యే అవకాశాలు ఉన్నాయి.

ప్రతికూల ప్రభావాలు
చమురు ధరల పతనం వివిధ దేశాలపై విభిన్నరీతిలో ప్రభావం చూపుతోంది. చమురు దిగుమతి చేసుకొనే దేశాలను ఒకరకంగా, ఎగుమతి చేసే దేశాలను మరోవిధంగా అది ప్రభావితం చేస్తోంది. అధికంగా దిగుమతి చేసుకొంటున్న చైనా, భారత్‌ వంటి ప్రవర్ధమాన ఆర్థిక వ్యవస్థలు అత్యధికంగా ప్రయోజనం పొందుతున్నాయి. కానీ ప్రస్తుత పరిస్థితి రానున్న కాలంలో ప్రపంచ భౌగోళిక, రాజకీయ, ఆర్థిక వ్యవస్థల్ని తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశం ఉంది. వెనిజువెలా, కొలంబియా, ఇరాన్‌, నైజీరియా, ఈక్వెడార్‌, బ్రెజిల్‌, రష్యా తదితర దేశాల ఆర్థిక వ్యవస్థలు చమురు ఎగుమతుల ద్వారా లభించే వనరుల మీదే ఆధారపడుతున్నాయి. ఆ వనరులు తగ్గిపోతే ఈ దేశాలు ఆర్థికంగా దెబ్బతినడమే కాకుండా, రాజకీయంగానూ ఇబ్బందులు ఎదుర్కొంటాయి. ఆదాయాలు తగ్గిపోవటంతో ఆ దేశాలు వ్యయాలు తగ్గించుకోవడంతోపాటు పన్నులు పెంచాల్సి వస్తుంది. అవి దేశీయంగా ప్రజాగ్రహానికి దారితీసే చర్యలే.

సౌదీ అరేబియా, పర్షియా సింధుశాఖలోని దాని మిత్రదేశాలు చమురు ద్వారా పొందే ఆదాయంలో ఈ ఏడాది 30వేలకోట్ల డాలర్ల మేరకు నష్టపోయే అవకాశం ఉందని అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్‌) సంస్థ అంచనా వేసింది. దానివల్ల ప్రపంచ ఆర్థిక మార్కెట్లలో ఆ దేశాలు పెట్టే పెట్టుబడులు తగ్గిపోతాయి. ఇది హర్షించదగ్గ పరిణామమేమీ కాదు. పైగా, పేద దేశాలకు సహాయం అందజేస్తున్న చమురు సంపన్న దేశాలు, తమ సహాయ మొత్తాలను తెగ్గోయవచ్చు. దానివల్ల ఆఫ్రికాతో పాటు అభివృద్ధి చెందని ఇతర దేశాల్లో ప్రస్తుత సమస్యలు సంక్షోభరూపం దాల్చవచ్చు. చమురు ధరల పతనం కారణంగా చమురు అన్వేషణ తగ్గిపోయి, ప్రపంచవ్యాప్తంగా చమురు అన్వేషణ, శుద్ధి (రిఫైనరీ) పరిశ్రమల్లో నిరుద్యోగిత పెరిగే సూచనలు ఉన్నాయి. పారిశ్రామిక దేశాలకు చెందిన బడా చమురు కంపెనీలెన్నో వందలకోట్ల డాలర్ల పెట్టుబడులతో చమురు అన్వేషణ, ఉత్పత్తి చేపడుతున్నాయి. ఇప్పుడు ఆదాయాలు దెబ్బతిని, అవి దివాలా తీసే ప్రమాదం ఉంది. ఆ కంపెనీలకు చాలావరకు నిధులు సమకూర్చింది బ్యాంకులు, ఆర్థిక సంస్థలే కనుక, అవి పూర్తిగా మునిగిపోవచ్చు. చమురు ధరలు నియంత్రణలో ఉండాల్సిందే కానీ, మరీ ఈ స్థాయిలో పతనం కావడంవల్లే సమస్యలు వచ్చి పడుతున్నాయి. అవి నిజంగానే పీపా 10డాలర్ల స్థాయికి కనుక పడిపోతే, అభివృద్ధి చెందిన దేశాలూ అల్లాడిపోవడం ఖాయం.

జారవిడవరాని అవకాశం
ఇరాన్‌ మీద అమలుపరుస్తున్న ఆంక్షల్ని అమెరికా తొలగించటం భారత్‌కు కలిసివచ్చే మరో సానుకూల పరిణామం. అణు కార్యక్రమాన్ని నియంత్రించేందుకు ఇరాన్‌ తగినన్ని చర్యలు చేపట్టినందువల్ల, ఆ దేశంపై ఇక ఆంక్షలు కొనసాగించాల్సిన అవసరం లేదని ఐరోపా సమాఖ్య(ఈయూ), అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ(ఐఏఈఏ) అభిప్రాయపడిన దరిమిలా అమెరికా ఆ చర్య తీసుకొంది. ఫలితంగా ప్రపంచ దేశాలతో సాధారణ వాణిజ్య సంబంధాలు కొనసాగించేందుకు ఇరాన్‌కు ఇప్పుడు అవకాశం లభించింది. దీన్ని సద్వినియోగపరచుకొంటూ, పెద్దస్థాయిలో చమురు ఎగుమతికి ఇరాన్‌ సన్నాహాలు చేస్తోంది. ఇరాన్‌ నుంచి చవగ్గా చమురు లభించనుండటం భారత్‌కు మరింత లబ్ధి చేకూర్చేది. పైకి అంతా బాగానే ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. అంతర్జాతీయ స్థాయికి అనుగుణంగా దేశంలో చమురు ధరలు తగ్గడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్నులు, శుద్ధివ్యయాలు, చమురు మార్కెటింగ్‌ కంపెనీల పంపిణీ వ్యయాలు; రిటైలర్ల లాభాలు అన్ని కలగలిసి దేశంలో పెట్రోలు, డీజిలు ధరలు దిగిరాకుండా అడ్డుకొంటున్నాయి.

చమురు ధరల పతనం భారత్‌మీద కొన్ని ప్రతికూల ప్రభావాలూ చూపే అవకాశం ఉంది. పశ్చిమాసియా దేశాల్లోని భారతీయ సంతతి ప్రజలు పంపే డబ్బు మొత్తాలు తగ్గి, విదేశ మారక ద్రవ్య నిల్వలు పడిపోవచ్చు. పశ్చిమాసియాలోని భారతీయ కార్మికుల్లో 96శాతం గల్ఫ్‌ సహకార మండలి (జీసీసీ)లోని బహ్రెయిన్‌, కువైట్‌, ఒమన్‌, ఖతర్‌, సౌదీ అరేబియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యుఏఈ) దేశాల్లోనే ఉన్నారు. భారత్‌కు విదేశాల నుంచి లభించే మొత్తాల్లో 60శాతం ఈ ఆరు దేశాల్లోని భారతీయ కార్మికులు పంపుతున్నదే. 2014-15లో జీసీసీ దేశాల్లోని భారతీయ సంతతి ప్రజలు 6,500కోట్ల డాలర్ల మేరకు స్వదేశానికి పంపారు. చమురు ధరల భారీ పతనం వల్ల ఆ మొత్తాలు గణనీయంగా పడిపోవడమే కాదు, అక్కడ ఉపాధి అవకాశాలకూ గండిపడి, భారతీయ కార్మికులు, ఉద్యోగులు తిరిగి వచ్చేయాల్సిన దుస్థితి ఏర్పడవచ్చు. అదే జరిగితే, భారత్‌లో సామాజిక-ఆర్థిక పరిస్థితులు తీవ్రంగా ప్రభావితమవుతాయి. ప్రపంచ చమురు ధరలు భారత్‌ నియంత్రణలో లేవు. కానీ, ప్రస్తుత సానుకూల పరిస్థితిని భారత్‌ సద్వినియోగం చేసుకోవచ్చు చైనా అదే పని చేస్తోంది. చవగ్గా లభిస్తున్న చమురును భారీయెత్తున దిగుమతి చేసుకొని, వ్యూహాత్మకంగా నిల్వ చేసుకుంటోంది. భారత్‌లో- విశాఖ, పాడూర్‌, మంగళూరుల్లో నిల్వ కేంద్రాలు ఉన్నప్పటికీ, వాటి సామర్థ్యం చైనాతో పోలిస్తే చాలా తక్కువ. తగ్గుతున్న చమురు ధరల ద్వారా పూర్తిస్థాయి ప్రయోజనం పొందాలంటే, ఇండియా అలాంటి మరిన్ని చమురు నిల్వ కేంద్రాలను నిర్మించాలి. అందుకోసం భారీగా నిధులు కేటాయించాలి. ప్రస్తుతం దేశం ముందున్న మేలైన మార్గం ఇదే!

- కె.ఎం.బాబు
Posted on 20-1-2016