Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఆర్థిక రంగం

నట్టేట ముంచుతున్న నమ్మక ద్రోహాలు

* వ్యాపార సంస్థలకు ఆర్థిక నష్టాలు

వ్యాపారాలకు ప్రతి రోజూ సవాలే, నష్టభయమే. ఆర్థిక మోసాలవల్ల వ్యాపార సంస్థల లాభాలు దెబ్బతినడమే కాదు, చాలా సందర్భాల్లో వాటి మనుగడ సైతం ప్రమాదంలో పడుతుంది. మోసమనేది సమాజానికి పునాది అయిన నమ్మకాన్ని దెబ్బతీస్తుంది. పరస్పర నమ్మకం లేకుండా సామాజిక, ఆర్థిక కార్యకలాపాలు ముందుకు సాగలేవు. నమ్మకద్రోహం చేసి లబ్ధి పొందడం మోసగాళ్లకు పరిపాటి. వివిధ రకాల మోసాలను శిక్షించడానికి భారత శిక్షాస్మృతి (ఐపీసీ)లో అనేక సెక్షన్లు ఉన్నాయి. ఎదుటివారిని బురిడీ కొట్టించి, వారి స్థిరచరాస్తులను కాజేయడం నేటితరం ఆషాఢభూతుల్లాంటి మోసగాళ్ల నైజం. కపటం, నష్టం మోసానికి బొమ్మాబొరుసు లాంటివని న్యాయస్థానాలు నిర్వచించాయి. బోగస్‌ పత్రాలతో ఎదుటివారి ఆస్తులను కబ్జా చేయడం, పిరమిడ్‌ పథకాలతో ప్రజలను వంచించడం, వివిధ మార్గాల్లో వినియోగదారులను బోల్తా కొట్టించడం, నాసి రకం వస్తుసేవలను అంటగట్టడం వంటి ఆర్థిక మోసాలు నేడు బాగా ముదిరిపోయిన సంగతి తెలిసిందే.

విస్తరిస్తున్న నేరాలు
భారత ఆర్థికాభివృద్ధి వేగం పుంజుకొని కొత్త అవకాశాలతో పాటు మోసాలూ పెచ్చరిల్లుతున్నాయి. అవినీతి, నల్లధనం వంటి పాత నేరాలకు తోడు ఆధునిక సాంకేతికత పుణ్యమా అని కొంగొత్త నేరాలు, మోసాలు పుట్టుకొచ్చాయి. సైబర్‌ మోసాలకు ఎల్లలు లేవు. ప్రపంచమంతటా అవి విస్తరిస్తున్నాయి. దేశదేశాల్లో 62 శాతం వ్యాపారాలు ఏదో ఒక తరహా మోసాలకు గురి అవుతున్నట్లు అధ్యయనాల్లో తేలింది. భారతీయ వ్యాపారాల్లో మూడోవంతు స్వదేశంలోను, ఇతర దేశాల నుంచి మోసాలను ఎదుర్కోవలసి వస్తోంది. 2018లో సర్వే చేసిన కంపెనీల్లో 49 శాతం చిన్నాపెద్దా ఆర్థిక నేరాలు, మోసాల బారినపడ్డాయి. 2016లో 36 శాతమే మోసగాళ్ల పాలబడ్డాయి. దీన్నిబట్టి ఆర్థిక మోసాలు క్రమంగా అధికమవుతున్నాయని తేలుతోంది. తమ వ్యాపారాలను, ఖాతాదారుల ప్రయోజనాలను మోసాల బారినుంచి రక్షించుకోవడానికి కొత్త సాంకేతికతల మీద, ఇతర జాగ్రత్త చర్యల మీద కంపెనీలు ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తోంది. ఆ మేరకు వాటి పెట్టుబడి వ్యయం పెరిగి లాభాల మీద ప్రతికూల ప్రభావం పడుతోంది.

ఈ మధ్యకాలంలో ఉద్యోగులు, అధికారులే తమ కంపెనీలను మోసం చేసే ధోరణి ప్రబలుతోంది. వీరు తమకుతాముగా మోసాలకు పాల్పడవచ్చు. కొందరు బయటివారితో చేతులు కలిపి ఆర్థిక నేరానికి ఒడిగడుతుంటారు. బాగా తెలిసినవారే మోసం చేసే ధోరణి సమాజంలో పెచ్చరిల్లుతోంది. ఇటీవల 128 దేశాల్లో జరిపిన సర్వే- వ్యాపార సంస్థలు పలు విధాలుగా మోసాల బారిన పడుతున్నాయని వివరించింది. కంపెనీల అంతర్గత సమాచారం బయటకు పొక్కుతున్నాయంటూ సర్వేలో పాల్గొన్నవారిలో 39 శాతం స్పందించారు. డేటా చౌర్యం (29 శాతం), బయటివారి వల్ల కంపెనీ ప్రతిష్ఠ దెబ్బతినడం (29 శాతం), బయటివారి వల్ల మోసం (28 శాతం), కంపెనీ ఉద్యోగులు లేదా అధికారుల మోసం (27 శాతం), మేధాహక్కుల చోరీ (24 శాతం), బోగస్‌ పత్రాల సృష్టి (17 శాతం), నల్లధనాన్ని సక్రమ ధనంగా చలామణీ చేయడం (16 శాతం) వంటి కారణాలు ఉన్నాయన్నారు. భారతదేశ పరిస్థితీ ఇందుకు భిన్నం కాదు. ఇక్కడ కంపెనీ ఉద్యోగులు, అధికారుల వల్లనే 45 శాతం మోసాలు సంభవిస్తున్నాయి. తెలిసినవారి వల్ల 29 శాతం మోసాలు జరుగుతున్నాయి. ముక్కూమొహం తెలియని అపరిచితుల వల్ల జరిగే మోసాలు తక్కువే. కంపెనీల సీనియర్‌ మేనేజర్లు చేసే మోసాలు ఈమధ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. 2016లో 16 శాతంగా ఉన్న ఈ తరహా మోసాలు 2018లో 24 శాతానికి ఎగబాకాయి. ప్రపంచమంతటా అత్యధిక మోసాలు అంతర్గత తనిఖీల్లోనే బయటపడుతున్నాయి. ఆధునిక సాంకేతికత వల్ల బ్యాంకులకు, కంపెనీలకు బయటి నెట్‌ వర్కులతో అనుసంధానత ఏర్పడటం వల్ల మోసగాళ్లకు అవకాశాలను కల్పించింది. వైరస్‌ల ద్వారా బ్లాక్‌ మెయిల్‌ చేయడం, దొడ్డిదోవన నెట్‌వర్కుల్లో చొరబడి బ్యాంకు ఖాతాల్లోని సొమ్మును, కంపెనీ డేటా బ్యాంకుల్లోని సమాచారాన్ని చోరీ చేయడం సులువైంది. అందుకే దేశాల మధ్య సైబర్‌ భద్రత, మేధాహక్కులు, డేటాల చోరీ గురించి వివాదాలు రేగుతున్నాయి. చైనా మీద అమెరికా ఇందువల్లనే గుర్రుగా ఉంది. అంతర్గత సమాచారాన్ని బయటివారికి వెల్లడించడం, డేటా దొంగిలించడాలను నేడు పెద్ద ఆర్థిక నేరాలుగా పరిగణిస్తున్నారు. ఈ తరహా నేరాల వల్ల కంపెనీలు భారీగా నష్టపోతున్నందువల్ల నివారణ చర్యల ఆవశ్యకతను అందరూ గుర్తిస్తున్నారు.

మోసాలపై పోరాటం
వ్యక్తుల నిజాయతీ, విద్యాస్థాయి, చైతన్యం సమాజ పోకడలను నడిపిస్తాయి. ఇవి కొరవడితే మోసాలు పెరిగిపోతాయి. అలాంటి వాతావరణంలో వాటిని అరికట్టడం కష్టమవుతుంది. ఏ వ్యక్తి అయినా తన దగ్గర లేని యాజమాన్య హక్కును ఇతరులకు ఇవ్వలేడన్నది ఓ లాటిన్‌ న్యాయసూత్రం. ఈ సంగతి అందరూ గుర్తుంచుకుంటే మోసాలను ఆదిలోనే నివారించవచ్చు. ఏదైనా బేరం కుదుర్చుకొనేటప్పుడు, అవతలి వ్యక్తి దగ్గర నిజంగానే సరకుందా లేదా అని నిర్ధారించుకొంటాం. అంటే అతడు నిజాయతీపరుడేనా, చేసుకున్న ఒప్పందానికి కట్టుబడి ఉంటాడా అని ఒకటికి రెండుసార్లు తనిఖీ చేసుకుంటాం. పూర్తి జాగరూకత, శ్రద్ధ ప్రదర్శిస్తాం. లేకుంటే మోసపోతాం. పరిచయస్థుల మీద ఇంత శ్రద్ధ పెట్టం కనుక తేలిగ్గా నమ్మకద్రోహానికి గురవుతాం. అనేకమంది పనిచేసే సంస్థల సంగతి వేరే చెప్పాలా? సంస్థలో పనిచేసేవారు మోసాలకు పాల్పడితే వెంటనే పసిగట్టలేం కూడా. కాబట్టి అన్ని సంస్థలు తమ అంతర్గత, బహిరంగ లావాదేవీల విషయంలో జాగరూకత ప్రదర్శించాలి. ప్రతిదీ క్షుణ్నంగా తనిఖీ చేసుకోవాలి. అవతలి వ్యక్తి నిజ ఉద్దేశాలేమిటో కనిపెట్టి ముందే జాగ్రత్త పడాలి. ఇతర దేశాల్లో మోసాలను ముందుగానే పసిగట్టి నివారించడానికి మోసాల సాధికార తనిఖీదారులు ఉంటారు. వారికి ప్రభుత్వ ధ్రువీకరణ ఉంటుంది. కంపెనీలు, వ్యక్తులు ఈ తనిఖీదారుల సేవలను స్వీకరిస్తారు. దీన్ని ‘ఫోరెన్సిక్‌ ఆడిట్‌’గా వ్యవహరిస్తారు. భారతదేశంలోనూ ఇలాంటి నిపుణులతో ఆడిట్‌ చేయించే సౌలభ్యం ఉండాలి. ఆర్థిక నేరాలు, మోసాలను శిక్షించడానికి న్యాయపరమైన సంస్కరణలు తీసుకురావాలి. ప్రస్తుతం మన దేశంలో కింది నుంచి పైస్థాయి వరకు న్యాయస్థానాలన్నీ కేసుల బరువుతో సతమతమవుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆర్థిక మోసాల విచారణకు ప్రత్యేక కోర్టులను ఏర్పాటుచేయాలి. వీటి నిర్వహణకు నిర్దిష్ట విధానాలను రూపొందించి వాటికి చట్టబద్ధత కల్పించాలి. ఆర్థిక మోసాలవిచారణను ప్రత్యేక కోర్టులు నిర్దిష్ట కాలంలో పూర్తి చేసి శిక్షలు విధించాలని చట్టంలో స్పష్టంగా పేర్కొనాలి. ప్రస్తుతం దివాలా చట్టంలో ఇటువంటి ఏర్పాటు ఉంది. ఆర్థిక నేరాలు, మోసాలపరిష్కారానికి ప్రత్యేక కోర్టులకు తోడుగా ప్రత్యామ్నాయ వివాద పరిష్కార వేదికలు, మధ్యవర్తిత్వ వెసులుబాటు ఉండాలి. వేగంగా న్యాయం జరిగి శిక్షలు పడతాయనే బెదురు ఉన్నప్పుడు ఆర్థిక మోసగాళ్ల ముందరికాళ్లకు బందాలు పడతాయి. మోసం చేసేముందు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవలసిన అగత్యం వారికి ఎదురవుతుంది. ఫలితంగా వ్యక్తులు, సంస్థల మధ్య నమ్మకం పెరిగి ఆర్థిక లావాదేవీలు జోరందుకుంటాయి. వ్యాపార కార్యకలాపాలు విస్తరిస్తాయి. ఆర్థికాభివృద్ధి వేగం పుంజుకొని జీడీపీ, తలసరి ఆదాయాలు విజృంభిస్తాయి.

రాటుతేలాల్సిన వ్యవస్థలు...
అనేక ఆర్థిక నేరాలు వెలుగులోకి రాకుండా ఉండిపోతున్నాయి. మోసపోయిన సంస్థలు, వ్యక్తులు ఆ సంగతి వెల్లడించడానికి ఇష్టపడటం లేదు. దీంతో అసలు ఆర్థిక నేరాలు, మోసాల వల్ల జరుగుతున్న మొత్తం నష్టమెంత అనేదానిపై స్పష్టత లేదు. అమెరికా పరిస్థితి దీనికి భిన్నం. అక్కడ ఫెడరల్‌ వాణిజ్య సంఘం (ఎఫ్‌టీసీ) తదితర ఫెడరల్‌ సంస్థలు తరచుగా ఆర్థిక నేరాలు, వాటి బాధితుల జాబితాను ప్రచురిస్తుంటాయి. ఏటా అమెరికా జనాభాలో 16 శాతం అంటే నాలుగు కోట్లమంది వివిధ రకాల ఆర్థిక మోసాలకు పాల్పడుతున్నారని ఎఫ్‌టీసీ నివేదికలు తెలుపుతున్నాయి. భారతదేశంలో ఈ తరహా మోసాల వల్ల భారీగా నష్టపోతున్న సంస్థల్లో బ్యాంకులూ ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకింగ్‌ మోసాల వల్ల రూ.71,500 కోట్ల మేరకు నష్టం వాటిల్లింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో 3,766 మోసాలు జరిగాయి. అంతక్రితం సంవత్సరంతో పోలిస్తే ఇవి 15 శాతం ఎక్కువ. గత అయిదేళ్లలో పిరమిడ్‌ పథకాలు, చట్టవిరుద్ధ డిపాజిట్‌ పథకాల వల్ల ప్రజలకు రూ.1.2 లక్షల కోట్ల మేరకు నష్టం వాటిల్లింది. దీనిమీద సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. ఇంకా రూ.45,000 కోట్ల మేరకు జీఎస్టీ మోసాలు జరిగాయి. వ్యక్తులమధ్య జరిగే మోసాలు అదనం. కపటంతో ఎదుటివారి స్థిరచరాస్తులు కాజేయడం, ఒప్పందాలు ఉల్లంఘించడం, బోగస్‌ పత్రాలు సృష్టించడం, దొంగ సంతకాలు చేయడం, అకౌంటింగ్‌ మోసాలు వ్యక్తుల స్థాయిలో జరుగుతున్నాయి. వీటి మీద పోలీసులకు ఫిర్యాదు చేయడం, కోర్టుల్లో కేసులు వేయడం ఎక్కువైపోయింది. వీటిని పరిష్కరించడం పరిపాలన యంత్రాంగానికి, న్యాయ వ్యవస్థకు భారంగా పరిణమిస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం శీఘ్ర పరిష్కారాలను అన్వేషించాలి.

Posted on 08-01-2020