Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఆర్థిక రంగం

సంస్కరణలకు పాతికేళ్లు...

* సాహసోపేత నిర్ణయాలతో దేశాన్ని కాపాడిన మేధావి
* ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించిన అపర చాణక్యుడు
* నాటి సంస్కరణల ఫలితమే.. నేటి ఆర్థిక పురోగతి

నిన్నటికి నిన్న కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కీలకమైన ఔషధ, రక్షణ, పౌరవిమానయాన రంగాల్లో నూరుశాతం విదేశీ పెట్టుబడులను అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది. గత ఏడాది డిసెంబరులోనూ కొన్ని సంస్కరణలు తీసుకురాగా, మలివిడగా ఇప్పుడు కీలకమైన రంగాల్లో విదేశీ పెట్టుబడులకు వీలుకల్పించారు. తద్వారా ఎఫ్‌డీఐ లను ఆకర్షించగల అత్యంత ఆకర్షణీయమైన దేశం మనదే అవుతోందని నరేంద్ర మోదీ ట్వీట్‌ చేయటం గమనార్హం. దేశంలో ఆర్ధిక సంస్కరణలు మొదలు పెట్టి పాతికేళ్లు పూర్తయిన తరుణంలో ఎఫ్‌డిఐ లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయాలు తీసుకోవటం యాదృశ్చికమే. పాతికేళ్ల క్రితం... 1991లో అప్పటి ప్రధానమంత్రి పీవీ నరసింహారావు సంస్కరణలకు ద్వారాలు తెరవగా, తదుపరి ప్రభుత్వాలు వాటిని కొనసాగిస్తూ రావటంతో భారతదేశం దశా దిశా మారిపోయింది. ఇప్పుడు చూస్తున్న వేగవంతమైన వృద్ధి, విస్తరించిన ప్రైవేటు భాగస్వామ్యం, ఉద్యోగాలు- సంపద సృష్టి అప్పట్లో సంస్కరణలు చేపట్టిన ఫలితమేనని చెప్పకతప్పదు.
అసలు 1990 కంటే మందు దేశం ఎలా ఉండేదో ఇప్పటి తరానికి వూహకైనా అందదు. ఇప్పుడు అయితే ప్రతి ఒక్కరి చేతిలో సెల్‌ఫోన్‌ కనిపిస్తోంది. ఏ మోటార్‌ సైకిల్‌ లేదా కారు కావాలంటే కొనుక్కోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగమే ఆధారం కాదు. సిమెంటు కొనటానికి పర్మిట్‌ అవసరం లేదు. కానీ ల్యాండ్‌లైన్‌ ఫోన్‌ కావాలంటే రెండు మూడేళ్లకు పైగా ఎదురు చూడాల్సి వచ్చేదంటే నమ్ముతారా? స్కూటర్‌ బుక్‌ చేసుకుంటే ఆయిదారేళ్లకు కానీ అది చేతికి రాదంటే ఆశ్చర్యమే కదా! వ్యాపారం మొదలు పెట్టాలంటే ప్రభుత్వం చుట్టూ లైసెన్సు కోసం తిరిగితిరిగి విసిపోవాలని తెలుసా. రెండున్నర దశాబ్దాల క్రితం మనదేశంలో ఇదే పరిస్థితి ఉండేది. అప్పుడంతా ప్రభుత్వ నియంత్రణే. అసలు ప్రజలకు లభించే వస్తువుల సంఖ్య ఎంతో తక్కువ. ప్రతిదీ ప్రభుత్వ నియంత్రణలోనే ఉండేది.
దీనికి తోడు అదుపు తప్పిన ద్రవ్యోల్బణం, అధిక లోటు, అప్పులు పుట్టని పరిస్థితి, దిగుమతుల కోసం అవసరమైన విదేశీ మారక ద్రవ్య నిల్వలు నిండుకున్న వైపరీత్యం... ఎటుచూసినా నిరుత్సాహకరమైన వాతావరణం. 1980 దశకంలో మొదలైన ఆర్ధిక పతనం 1990 నాటికి వచ్చేసరికి మరింత తీవ్రరూపం దాల్చి పెను సంక్షోభం గా మారిపోయింది. ఇక మనదేశం దివాలా తీస్తుందని, అంతర్జాతీయ సమాజం ముందు నవ్యుల పాలు కాకతప్పదని భావిస్తున్న తరుణంలో తలవని తలంపుగా ప్రధాని పీఠాన్ని అధిరోహించిన తెలుగు తేజం, పీవీ నరసింహారావు అందరి వూహలను తలకిందులు చేస్తూ సంస్కరణలకు తెరతీశారు. తద్వారా భారతదేశంలో సంస్కరణలకు ఆద్యుడయ్యారు. సరిగ్గా పాతికేళ్లు తిరిగేసరికి మనదేశం ప్రపంచంలోనే అధిక వృద్ధి సాధిస్తున్న దేశంగా మారింది. వ్యాపార అవకాశాల కోసం, పెట్టుబడుల కోసం ఇతర దేశాలు మనవైపు చూస్తున్న సానుకూలత సాధ్యమైంది..., దీని వెనుక పాతికేళ్ల పరిణామక్రమం ఉంది.

పుట్టెడు కష్టాలు
1991 కి ముందే భారతదేశానికి ఆర్ధిక కష్టాలు ఉన్నాయి. నెమ్మదిగా సమస్య పెద్దదైంది. ఆర్ధిక లోటు జీడీపీలో 8.4 శాతానికి పెరిగిపోయింది. ప్రభుత్వం దాదాపుగా దివాలా తీసే పరిస్థితి. విదేశీ మారక ద్రవ్య నిల్వలు అడుగంటిపోయాయి. చేతిలో కేవలం మూడు వారాల దిగుమతులకు అవసరమైన విదేశీ మారకద్రవ్యమే ఉంది. ప్రభుత్వానికి అత్యవసరంగా 2.2 బిలియన్‌ డాలర్ల అప్పు కావలసి వచ్చిన నేపధ్యంలో మనదేశం 67 టన్నుల బంగారాన్ని తనఖా పెట్టింది. ఉన్నఫళాన 47 టన్నుల బంగారాన్ని విమానాల్లో బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌కు, 20 టన్నుల బంగారాన్ని యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ స్విట్జర్లాండ్‌కు పంపించారు. అటువంటి సంక్షోభ పరిస్థితుల్లో పీవీ నరసింహారావు ప్రధానమంత్రి పీఠాన్ని చేపట్టారు. వెనువెంటనే సంక్షోభ నివారణ చర్యలకు నడుంకట్టారు. మన్మోహన్‌ సింగ్‌ను తన ఆర్ధిక మంత్రిగా ఎంచుకున్నారు. నూతన పారిశ్రామిక విధానానికి రూపకల్పన చేశారు. దేశాన్ని దివాలా అంచుల నుంచి కాపాడి గాడిలో పెట్టేందుకు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారు. అవే మనదేశంలో తొలితరం ఆర్ధిక సంస్కరణలు.

విప్లవాత్మకమైన నిర్ణయాలు
పీవీ నరసింహారావు కు అప్పట్లో ప్రధానమంత్రి పదవి ముళ్ల పీఠమే. ఎన్నో సమస్యలు, సవాళ్లు ఆయన కోసం ఎదురుచూస్తున్నాయి. దేశం ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోవటం అన్నింటికంటే పెద్దది. వెనువెంటనే ఆయన రంగంలోకి దిగారు. 1991-92 బడ్జెట్‌లో వినూత్నమైన ఆర్ధిక సంస్కరణలు ప్రతిపాదించారు. విదేశీ పెట్టుబడులకు వీలుకల్పించారు. లైసెన్స్‌ రాజ్‌ను సరళీకరించరారు. దిగుమతి ఆంక్షలు తగ్గించారు. నెమ్మదిగా పరిస్థితిని గాడిలో పెట్టారు. అప్పట్లో తీసుకున్న నిర్ణయాలు ఎటువంటివంటే...
* పన్ను ఆదాయాన్ని పెంపొందించుకోవటం లక్ష్యంగా రాజా చెల్లయ్య సారధ్యంలోని పన్ను సంస్కరణల సంఘం చేసిన ముఖ్యమైన సిఫార్సులను ఆమోదించారు. పంచదారపై సబ్సిడీని రద్దు చేశారు. కొన్ని ఎంపిక చేసిన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో మూలధన వాటాలు విక్రయించటానికి పచ్చజెండా వూపారు.
* బ్యాంకింగ్‌ రంగాన్ని బలోపేతం చేసే దిశగా ద్రవ్య, ఆర్ధిక రంగ సంస్కరణలు ప్రతిపాదించారు. నరసింహన్‌ కమిటీ నివేదిక ఆధారంగా నగదు లభ్యత నిష్పత్తి (ఎస్‌ఎల్‌ఆర్‌) నగదు నిల్వ నిష్పత్తి (సీఆర్‌ఆర్‌) తగ్గించారు. బ్యాంకు వడ్డీ రేట్లపై ఉన్న నియంత్రణను తొలగించారు. బ్యాంకుల వ్యవహారాల్లో జోక్యాన్ని తగ్గించి ప్రభుత్వ, ప్రైవేటు, విదేశీ బ్యాంకుల మధ్య పోటీ ఉండేవిధంగా చర్యలు తీసుకున్నారు.
* స్టాక్‌ మార్కెట్‌కూ సంస్కరణలను విస్తరించారు. సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజి బోర్డు ఆఫ్‌ ఇండియా (సెబీ) కు 1992 లో చట్టబద్ధత కల్పించారు. స్టాక్‌ మార్కెట్‌ కార్యకలాపాలను సమర్ధమంతంగా పర్యవేక్షించి మూలధన సమీకరణకు వీలు కల్పించాలని నిర్దేశించారు.
* పారిశ్రామిక సంస్కరణలకూ అప్పుడే పునాది పడింది. 1991 జులై 24న నూతన పారిశ్రామిక విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పరిశ్రమను లైసెన్సు రాజ్‌ నుంచి బయటకు తీసుకురావటం దీనివల్లే సాధ్యపడింది. 18 రకాలైన పరిశ్రమలకు తప్పిస్తే మిగిలిన రంగాల్లోని పరిశ్రమలకు లైసెన్సు అవసరం లేకుండా నిబంధనలు మార్చారు. దీంతో దాదాపు 80 శాతం పరిశ్రమలు లైసెన్సు రాజ్‌ నుంచి బయటకు వచ్చాయి. ఎంఆర్‌టీపీ చట్టాన్ని తొలగించారు. దీనివల్ల పెద్ద కంపెనీలు సామర్ధ్యాన్ని విస్తరించటానికి, కొత్త ప్రాజెక్టులు చేపట్టటానికి వీలుకలిగింది. ప్రభుత్వ రంగానికి నిర్దేశించిన పారిశ్రామిక రంగాల సంఖ్యను తగ్గించి ప్రైవేటు రంగానికి అధిక భాగస్వామ్యం కల్పించారు.
* వర్తక, వాణిజ్య రంగాల్లోనూ మార్పులు వచ్చాయి. 1991 కంటే ముందు దిగుమతులపై పలు రకాలైన ఆంక్షలు ఉండేవి. తదుపరి ఈ ఆంక్షలు తొలగించారు. పన్ను రేట్లను హేతుబద్దీకరించారు. దీనివల్ల దిగుమతి సుంకాలు బాగా తగ్గాయి.
* విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంది. దీనివల్ల అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అవసరమైన రంగాల్లో 51 శాతం విదేశీ పెట్టుబడికి వీలుకలిగింది. తదుపరి దీన్ని 74 శాతానికి, ఆ తర్వాత నూరుశాతానికి పెంచారు. విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎఫ్‌ఐపీబీ) ని ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు వీలుగా మార్పులు చేస్తూ వచ్చారు.
* రూపాయి మారక విలువ తగ్గించటం ఎంతో ముఖ్యమైన నిర్ణయం. చెల్లింపుల సంక్షోభం నుంచి గట్టెక్కటానికి రూపాయి విలువ తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 1991 జులై మొదటి వారంలో రూపాయి మారకం విలువను దాదాపు 20 శాతం తగ్గించారు.

సత్వర ఫలితాలు
1991 సంస్కరణలు త్వరితంగానే ఫలితాలు చూపించాయి. ఆంక్షలు ఎత్తివేసి సరళీకరించిన రంగాల్లో వేగవంతమైన వృద్ధి కనిపించింది. టెలీకామ్‌, విమానయాన రంగాలు విశేషంగా లాభపడ్డాయి. ఈరోజు కమ్యునికేషన్‌, మౌలిక సదుపాయాలు, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ...తదితర రంగాలు బహుముఖ వృద్ధి సాధించాయంటే, అందుకు సంస్కరణలే కారణం. పాతికేళ్ల క్రితం ఆర్ధిక సంస్కరణలకు ద్వారాలు తెరిచింది అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు అయితే ఆర్ధిక మంత్రిగా ఆయన వెన్నంటి నిలిచింది మన్మోహన్‌ సింగ్‌. 1991లో ఆర్ధిక మంత్రి హోదాలో ఆయన ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ఆర్ధిక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఆయన ప్రభుత్వంలో వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న పీ చిదంబరం సైతం ఈ ప్రక్రియలో క్రియాశీలకమైన పాత్ర పోషించారు. వాణిజ్య శాఖ కార్యదర్శిగా, ఆ తర్వాత ఆర్ధిక శాఖ కార్యదర్శిగా పనిచేసిన మాంటెక్‌ సింగ్‌ అహ్లువాలియా ప్రభుత్వ నిర్ణయాలకు అనుగుణంగా లైసెన్సు లు తొలగించటం, నియంత్రణలు ఎత్తివేయటం ద్వారా సత్వర పారిశ్రామికాభివృద్ధికి దోహదపడ్డారు. పీవీ తర్వాత ప్రధానమంత్రులుగా వ్యవహరించిన ఐకే గుజ్రాల్‌, వాజ్‌పేయి, మన్మోహన్‌ సింగ్‌ వరకూ అందరూ తమదైన శైలిలో ఆర్ధిక సంస్కరణలు అమలు చేశారు. దశాబ్దకాలం పాటు ప్రధానిగా వ్యవహరించిన మన్మోహన్‌ సింగ్‌ తనదైన శైలిలో సంస్కరణలను ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ప్రస్తుత ప్రధాని మోదీ హయాంలో సంస్కరణలు మరింతగా వూపందుకున్నాయి.

పీవీ నుంచి మోదీ వరకూ - సంస్కరణల పరిణామ క్రమం
1991 నూతన పారిశ్రామిక విధానాన్ని ఆవిష్కరించిన పీవీ నరసింహారావు ప్రభుత్వం. సంస్కరణలకు అదే మూలం. ఆ ఏడాది ఆగస్టు లో అత్యంత ప్రాధాన్యమైన 47 రంగాల్లో 51 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు వీలు కల్పిస్తూ ప్రభుత్వ నిర్ణయం. ఎగుమతి వర్తక సంస్థలు, హోటళ్లు, పర్యాటక వ్యాపార సంస్థల్లోనూ 51 శాతం విదేశీ పెట్టుబడులకు అవకాశం. విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎఫ్‌ఐపీబీ) ఏర్పాటు.
1992 నుంచి 2000 వరకూ: ఆటోమ్యాటిక్‌ పద్ధతిలో సాఫ్ట్‌వేర్‌ రంగంలోకి విదేశీ పెట్టుబడులను అనుమతించిన ప్రభుత్వం. విదేశీ బ్రాండ్లకు అనుమతి.
ఔషధ రంగంలో 51 శాతం వరకూ విదేశీ పెట్టుబడికి పచ్చజెండా.
పారిశ్రామిక విధానం, ప్రోత్సాహక శాఖ కిందకు వచ్చిన ఎఫ్‌ఐపీబీ. రూ.600 కోట్ల వరకూ పెట్టుబడి ప్రతిపాదనలను పరిశ్రమల శాఖ మంత్రి అనుమతించే వీలు. రూ.600 కోట్ల కంటే మించిన పెట్టుబడి ప్రతిపాదనలు పరిష్కరించే అధికారం కేబినెట్‌ కమిటీకి.
మొబైల్‌ టెలీఫోన్ల రంగంలో 49 శాతం విదేశీ పెట్టుబడి.
జాతీయ రహదార్లు, టోల్‌ రోడ్లు, పోర్టుల నిర్మాణాల్లో విదేశీ పెట్టుబడుల పరిమితి 74 శాతం నుంచి 100 శాతం వరకూ పెంపు.
నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల్లో (ఎన్‌బీఎఫ్‌సీ) నూరు శాతం ఎఫ్‌డిఐ. బీమా రంగంలో 26 శాతం విదేశీ పెట్టుబడులకు అనుమతి.
2001 నుంచి 2008 మధ్యకాలంలో: మందుల తయారీ, ఎయిర్‌పోర్టులు, హోటళ్లు- పర్యా టకం, టెలీకామ్‌, బ్యాంకింగ్‌, రక్షణ రంగాల్లో విదేశీ పెట్టుబడులకు అనుమతి.
పెట్రోలియం, సహజ వాయువు ఉత్పత్తుల రంగంలో నూరు శాతం ఎప్‌డిఐ. ప్రైవేటు బ్యాంకుల్లో 74 శాతం వరకూ. టౌన్‌షిప్‌ల నిర్మాణంలో నూరు శాతం ఎఫ్‌డిఐ. టెలీకాం రంగంలో 74 శాతం. రేడియో బ్రాడ్‌కాస్టింగ్‌లో 20 శాతం విదేశీ పెట్టుబడికి వీలు. సింగిల్‌ బ్రాండ్‌ రిటైల్‌లో 51 శాతం విదేశీ పెట్టుబడికి అనుమతి. ఎయిర్‌పోర్టుల్లో నూరుశాతం, విమాన రవాణా సేవల రంగంలో 74 శాతం విదేశీ పెట్టుబడి.
2012 మల్టీ బ్రాండ్‌ రిటైల్‌ లో 51 శాతం, ఏవియే షన్‌ కంపెనీల్లో 49 శాతం, మొబైల్‌ టీవీ, టెలీపోర్టుల్లో 74 శాతం పెట్టుబడులకు అనుమతి.
2014 రక్షణ రంగంలో 49 శాతం ఎప్‌డిఐ. కొన్ని రకాలైన రైలు ప్రాజెక్టుల్లో నూరు శాతానికి అనుమతి.
2015 బీమా, పింఛను రంగాల్లో 49 శాతం విదేశీ పెట్టుబడి.
2016 కీలకమైన రక్షణ, ఫార్మా, విమానయానం, ఆహార ప్రాసెసింగ్‌, సింగిల్‌ బ్రాండ్‌ రిటైల్‌ తదితర పలు రంగాల్లో నూరుశాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడికి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. కొన్ని రంగాల్లో 74 శాతం వరకూ ఆటోమ్యాటిక్‌ పద్ధతిలో, ఆపైన ప్రభుత్వ అనుమతితో విదేశీ పెట్టుబడులకు వీలుకలుగుతోంది.

- ఈనాడు ప్రత్యేక విభాగం
Posted on 22-06-2016