Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఆర్థిక రంగం

మాంద్యానికి మందుకోసం!

* కేంద్రం బడ్జెట్‌ కసరత్తు

మందగమనంతో వేగం తగ్గిన ఆర్థిక వ్యవస్థకు రాబోయే వార్షిక బడ్జెట్‌ ఉద్దీపనను అందించగలదా? ఇప్పుడు అందరి చూపులూ ఫిబ్రవరి ఒకటిన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ సమర్పించనున్న కేంద్ర బడ్జెట్‌పైనే ఉన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం బడ్జెట్‌ విషయంలో నేరుగా కార్యరంగంలోకి దిగారు. ఆర్థికవేత్తలు, పరిశ్రమ దిగ్గజాలతో దిల్లీలో బడ్జెట్‌ సన్నాహక సమావేశాల్లో పాల్గొని, వారి సూచనలు, సలహాలను ఆలకించారు. భారత్‌లో తీవ్రస్థాయి ఆర్థిక మందగమనం నెలకొన్న నేపథ్యంలో వస్తున్న పద్దు కావడంతో ఇది మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. 2019 జులై-సెప్టెంబర్‌ త్రైమాసికంలో నామినల్‌ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి 6.1 శాతానికి తగ్గిపోయింది. 2011-12 నుంచి జీడీపీ సిరీస్‌లో ఇదే అత్యంత మందగమనంతో ఉన్న వృద్ధిరేటు. కొన్నాళ్ల క్రితం విడుదలైన ప్రభుత్వ అధికారిక అంచనాల ప్రకారం 2019-20లో ప్రస్తుత మార్కెట్‌ ధరల ప్రకారం జీడీపీ వృద్ధి 7.5 శాతంగా ఉండొచ్చని వెల్లడైంది. గత కొన్నేళ్లలో ఇదే అత్యంత తక్కువ.

వృద్ధిలో మందగమనాన్ని ఎదుర్కొనేందుకు బడ్జెట్‌ ద్వారా ద్రవ్య ఉద్దీపనకు కృషి జరుగుతుందని అంచనా. ఈ మందగమనం నుంచి బయటపడేందుకు ప్రభుత్వం వ్యయాల్ని పెంచే విషయంలో మరింత జాగ్రత్తగా ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. ఇందుకు పలు కారణాల్ని చెప్పుకోవచ్ఛు ఇందులో మొదటిది- భారీస్థాయిలో వ్యయాల్ని పెంచేందుకు ప్రభుత్వం వద్ద డబ్బులు లేకపోవడం. జీడీపీ వృద్ధిరేటు మందగించినప్పుడు, పన్ను వసూళ్లూ తగ్గుతాయి. తగ్గిన పన్ను ఆదాయం ప్రభుత్వ వ్యయాలకు పెద్ద ఆటంకంగా మారుతుంది. ప్రభుత్వ పన్ను ఆదాయం సైతం లక్ష్యంకన్నా తక్కువగానే ఉంటుందని అంచనా. కంప్ట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ అకౌంట్స్‌ (సీజీఏ) గణాంకాల ప్రకారం, 2009-10 నుంచి పోలిస్తే 2019-20 ఆర్థిక సంవత్సరం తొలి ఏడు నెలల కాలంలో స్థూల పన్నుల్లో వృద్ధి అత్యంత తక్కువగా ఉన్నట్లు తేలింది. ఇప్పటికే కార్పొరేట్‌ లాభాలపై పన్నురేట్లు తగ్గించుకోవడం ద్వారా కార్పొరేట్‌ పన్ను సంస్కరణల్ని అమలు చేసిన ప్రభుత్వం తన ఆదాయాల్ని త్యాగం చేసింది. ప్రభుత్వానికి మరో ఆర్జన మార్గం పన్నేతర ఆదాయం. ఇందులో ఆర్‌బీఐ నుంచి ప్రభుత్వానికి వచ్చే నిధుల లెక్కతేలిపోగా- బీపీసీఎల్‌, ఎయిర్‌ ఇండియా వాటాల అమ్మకాలు ఈ ఏడాది పూర్తయ్యే అవకాశం ఉంది. పన్ను ఆదాయాల్లో పడిన గండిని పన్నేతర ఆదాయాలు పూడుస్తాయని ఆశించే అవకాశం సైతం లేకుండా పోయింది.

రెండో కారణం- ప్రజా మౌలిక సదుపాయాలపై వ్యయాల్ని పెంచడం వల్ల పెద్దగా ప్రయోజనం కలిగే అవకాశం ఉండదు. మౌలిక రంగ ప్రాజెక్టులు పూర్తయ్యేందుకు సుదీర్ఘ సమయం పడుతుంది. మరోవైపు వృద్ధికి అత్యవసర ప్రేరణ కావాలి. దీనికి కాలమే కీలకాంశం. మూడో కారణం- వ్యయాల్ని పెంచడం ద్వారానే కాకుండా, పన్నురేట్లలో కోతల ద్వారానూ ఉద్దీపనలు అందించవచ్ఛు కాకపోతే, వ్యక్తిగత ఆదాయ పన్ను రేట్లలో కోత విధించడంవల్ల జనాభాలో కొద్దిమందికి మాత్రమే ప్రయోజనం చేకూరుతుంది. భారత జనాభాలో ఆదాయ పన్ను చెల్లిస్తున్నవారు అయిదు శాతమే ఉన్నారు. 2019 ఫిబ్రవరి మధ్యంతర బడ్జెట్‌లోనూ ఈ తరహా మార్గాన్ని ప్రయత్నించి చూశారు. అప్పటి ఆర్థిక మంత్రి పీయూష్‌ గోయల్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో అయిదు లక్షల రూపాయల మేర ఆదాయం ఉండేవారికి ఆదాయ పన్ను రాయితీ కల్పించారు. ఫలితంగా వారికి వెయ్యి రూపాయల వరకు మిగిలింది. ఇంటి ఆస్తిని అమ్ముకుంటే ఇచ్చే మూలధన మినహాయింపులో అదనపు ప్రయోజనం కల్పించారు. వేతన జీవులకు ‘స్టాండర్డ్‌ డిడక్షన్‌’ను రూ.40 వేల నుంచి రూ.50 వేలకు పెంచారు. బ్యాంకు ఖాతాల్లో పొదుపు సొమ్ము నుంచి వడ్డీపై పన్ను మినహాయింపును రూ.10 వేల నుంచి రూ.50 వేలకు పెంచారు. ఇలా పలురూపాల్లో రాయితీలు, ప్రయోజనాల్ని అందించినా 2019 మొత్తంగా మందగమనం అలాగే కొనసాగింది. నాలుగో కారణం- ఆర్థిక ఉద్దీపనకు సహాయం అందించే లక్ష్యంతో ప్రభుత్వ రుణాల్ని పెంచే మార్గం ఉన్నా, అది ఇప్పటికే గరిష్ఠానికి చేరింది. కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు, ప్రభుత్వరంగ సంస్థల మొత్తం రుణాలు జీడీపీలో సుమారు 8 నుంచి 9 శాతానికి చేరాయి. ఇవి సరిపోక ప్రభుత్వం జీడీపీలో 2.4 శాతం విదేశాల నుంచీ రుణాలుగా తెచ్చింది. గృహరంగ పొదుపులు ప్రస్తుతం జీడీపీలో 6.6 శాతం దాకా ఉన్నాయి. ఆదాయాల్లో వృద్ధి మందకొడిగా ఉంది. ఉద్యోగాల కల్పన కూడా సరిపడినంత స్థాయిలో జరగలేదు. ఈ కారణాల వల్ల పొదుపులో ఎదుగుదల అంతగా లేదు.

ప్రభుత్వ రుణాలు భారీగా పెరగడం వల్ల విదేశీ రుణదాతలపై ఆధారపడటం అధికమవుతోంది. అమెరికా-ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న ఈ పరిస్థితుల్లో రూపాయి మారకం రేటు విలువపై ప్రభావం పడే అవకాశం ఉంది. అందువల్ల బడ్జెట్‌లో వ్యయాల్ని తగ్గించకుండా చూసుకోవడం అవసరం. పీఎం కిసాన్‌, ఎమ్‌జీఎన్‌ఆర్‌ఈజీఏ(ఉపాధి హామీ)వంటి కార్యక్రమాల ద్వారా ప్రభుత్వం వ్యయాల్ని పెంచి, లబ్ధిదారుల చేతుల్లో డబ్బులు ఆడేలా చెయ్యడం ద్వారా గ్రామీణ ఆదాయాలను ఇనుమడింపజేయాలి. ఫలితంగా వస్తు వినియోగం అధికమై దేశార్థికం గాడిలో పడుతుంది.

- పూజా మెహ్రా
(రచయిత్రి- ఆర్థిక రంగ నిపుణులు)
Posted on 18-01-2020