Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఆర్థిక రంగం

సంస్కరణలకూ మంద భాగ్యమేనా?

* నెమ్మదించిన భారత ఆర్థిక వ్యవస్థ

ప్రస్తుతం నెలకొన్న మందగమన పరిస్థితులు క్రమంగా ఆర్థిక వ్యవస్థను మాంద్యం దిశగా తీసుకెళ్తున్నాయన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థలో వరసగా రెండు త్రైమాసికాలలో వాస్తవ జీడీపీ తగ్గుముఖం పడితే ఆ పరిస్థితిని మాంద్యం లేదా సంక్షోభం అంటారు. దేశంలో ద్రవ్యలోటు అంతకంతకూ పెరిగిపోయి, వ్యవసాయ, పారిశ్రామిక ప్రగతి కుంటుపడటంతోపాటు ఉపాధి అవకాశాలు క్షీణిస్తూ, వినియోగం తగ్గుతున్న వేళ ఆర్థిక వ్యవస్థలో మాంద్యం పరిస్థితులు ప్రారంభమైన సూచనలు కనిపిస్తున్నాయి. 2008లో ఏర్పడిన మాంద్యం ప్రపంచ దేశాలపై తీవ్ర ప్రభావం చూపినా, దేశీయ గిరాకీ, వినియోగం భారత్‌ను సమస్య నుంచి బయట పడేసిందని, ఈసారి మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని గోల్డ్‌మ్యాన్‌శాక్స్‌ సంస్థ స్పష్టం చేస్తోంది. ఆర్థిక వ్యవస్థకు అండగా ఉంటూ వచ్చిన దేశీయ వినియోగం పడిపోవడం వల్ల రానున్న రోజుల్లో ఆర్థిక కష్టాలు తప్పకపోవచ్చని ఆ సంస్థ తెలిపింది. నేడు మన ఆర్థిక వ్యవస్థలో తలెత్తిన కొన్ని ప్రతికూల పరిణామాలను చూస్తుంటే, మున్ముందు పెనుప్రమాదం పొంచి ఉన్నట్లు అర్థమవుతోంది.

ప్రధాని నరేంద్ర మోదీ తొలి విడత ప్రభుత్వ హయాంలో వృద్ధిరేటు సగటున ఎనిమిది శాతం స్థాయిలో సానుకూలంగా ఉంది. రెండో విడత పాలనకాలంలో తాజాగా ప్రకటించిన రెండు త్రైమాసికాలలోనూ జీడీపీ వృద్ధి 4-5 శాతం స్థాయుల్లో మాత్రమే నమోదైంది. అంటే వృద్ధిరేటు సుమారు సగానికి సగం తగ్గిందన్న మాట. నోట్ల రద్దు, జీఎస్టీ వంటి తొందరపాటు చర్యలతో ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని కొంతమంది అభిప్రాయం. ఈ పరిణామాల ఫలితంగా దేశవృద్ధిరేటు 2017-18 నాలుగో త్రైమాసికంలో నమోదైన 8.1 శాతం నుంచి 2019-20 తొలి త్రైమాసికానికి అయిదు శాతానికి దిగజారింది. ఇది గత 25 త్రైమాసికాలలో కనిష్ఠం. పారిశ్రామిక వృద్ధిరేటు ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి కేవలం 0.6 శాతం మాత్రమే నమోదయింది. రెండో త్రైమాసికంలో మరింతగా పతనమయింది. వ్యవసాయ రంగంలో 2017-18లో అయిదు శాతం వృద్ధి చోటుచేసుకోగా 2018-19లో 2.8 శాతానికి తగ్గింది. 2019-20 తొలి త్రైమాసికానికి 2.1 శాతానికి క్షీణించింది. సేవారంగంలో కూడా 2018-19 మూడు, నాలుగు త్రైమాసికాలలో వృద్ధిరేటు తగ్గుదల మొదలయింది. చివరికి భారత పరపతి రేటింగును సుస్థిరం నుంచి ప్రతికూల స్థితికి తగ్గించే ముప్పు నెలకొంది. ఇలాంటి పరిస్థితిని అప్పట్లోనే ఊహించిన ఆర్‌బీఐ మాజీ గవర్నరు రఘురాం రాజన్‌- దిద్దుబాటు చర్యల దిశగా కొత్త సంస్కరణల అవసరముందని సూచించారు. అయితే, ఈ పరిణామం తాత్కాలికమేనని, ఇది లోతైన వ్యవస్థీకృత మాంద్యం కాదని ఆర్‌బీఐ ప్రస్తుత గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌ కొన్నాళ్లక్రితం స్పష్టంచేయడం గమనార్హం.

సాహసోపేత నిర్ణయాలు అవసరం
ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలంటే ప్రధాని మోదీ పెద్దయెత్తున ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టాల్సిన సమయం వచ్చింది. మౌలిక వసతుల కల్పనపై భారీగా నిధులు వెచ్చించడం, పర్యావరణ హిత పరిశ్రమల ఏర్పాటుకు సానుకూల వాతావరణం కల్పించడం, విద్య నాణ్యతను మెరుగు పరచడం, విస్తృతంగా ఉపాధి అవకాశాలు కల్పించడం వంటివి కొత్త ఆర్థిక సంస్కరణలలో భాగంగా మారాలి. గత 25 ఏళ్లలో భారత్‌ జీడీపీ అనూహ్యంగా పెరగగా, జనాభా కూడా 40 శాతంపైగా పెరిగింది. మౌలిక వసతుల కల్పన మాత్రం ఆ స్థాయిలో పెరగలేదు. పల్లెల నుంచి పట్టణాలకు సాగుతున్న వలసల ప్రక్రియ, పట్టణాల్లో మౌలిక వసతుల సమస్యను మరింత క్లిష్టతరం చేస్తోంది. 1991లో ప్రవేశపెట్టిన సంస్కరణల మాదిరిగానే, దేశ ఆర్థిక వ్యవస్థ మళ్ళీ పరుగులు తీయాలంటే ప్రధానమంత్రి రెండో విడత సంస్కరణలతో సాహసోపేత నిర్ణయాలు తీసుకోవాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థ స్వల్పమార్పులతో పుంజుకునే అవకాశం లేదు. ప్రజల వాస్తవ ఆదాయాలు పెరిగే పరిస్థితీ కనిపించడం లేదు. నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకుతుండటంతో కుటుంబ వినియోగం తగ్గుతోంది. ప్రస్తుత పరిస్థితులను చక్కదిద్దాలంటే రెండే రెండు మార్గాలున్నాయి. అవి 1. ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించడం 2. ప్రజలపై పన్నుల భారాన్ని తగ్గించి వినియోగాన్ని పెంచడం! ప్రభుత్వ పెట్టుబడులు, ఖర్చులను ఒక స్థాయికి మించి పెంచడం అసాధ్యం. ఎందుకంటే, అలాచేస్తే ద్రవ్యలోటు సాధారణ స్థాయి మూడు శాతంకన్నా పైకి పెరుగుతుంది. ఈ ఏడాదిలో ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి అనేక రాయితీలను, ఉద్దీపన పథకాలను ప్రకటించారు. కార్పొరేట్‌ పన్నురేటును తగ్గించడం ఆటొమొబైల్‌ రంగంలో తరుగుదలను 15 శాతం నుంచి 30 శాతానికి పెంచడం, స్థిరాస్తి రంగానికీ రూ.25 వేల కోట్లు కేటాయించడం వంటివి వీటిలో భాగమే. ఇవేవీ కేంద్రం ఆశించిన రీతిలో ఫలితాల్ని అందించలేదు. కాబట్టి, కొత్త ఆర్థిక సంస్కరణలలో భాగంగా ప్రజలపై పన్నుల భారాన్ని ముఖ్యంగా ఆదాయపు పన్ను భారాన్ని తగ్గించి తద్వారా వినియోగ వస్తువులకు గిరాకీని పెంచాలి. ఉపాధి హామీ పథకానికి నిధులు పెంచి గ్రామీణ కొనుగోలు శక్తిని ప్రోత్సహించాలి. ఇక పట్టణాల విషయానికొస్తే, రోడ్లు, విద్యుత్‌, సాగునీటి ప్రాజెక్టులు, గిడ్డంగులు వంటి మౌలిక వసతుల నిర్మాణాల ద్వారా పట్టణ కార్మికులలో కొనుగోలు శక్తిని పెంచాలి. కొన్ని రోజులుగా వాయిదాలు పడుతూ వస్తున్న విదేశీ వాణిజ్య విధానాన్ని వెంటనే ప్రకటించాలి. చైనా ఎగుమతులు తగ్గుతుండటంతో, దీనిని భారత్‌ మంచి అవకాశంగా మలచుకుని, అందులో సింహభాగం పొందే దిశగా అడుగులు వేయాలి.

కొనుగోలు శక్తి పెంపే తక్షణ కర్తవ్యం
ఆర్థిక వ్యవస్థ మందగమన స్థితికి రావడానికి దేశంలో చోటుచేసుకున్న కొన్ని పరిణామాలే కారణం. పెరుగుతున్న నిరుద్యోగం వల్ల ప్రజల ఆదాయాలు తగ్గి వస్తుసేవల కొనుగోలు శక్తి క్షీణిస్తుంది. దీనివల్ల డిమాండ్‌ తగ్గి, వాటి అమ్మకాలు మందగిస్తాయి. ఫలితంగా పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు తగ్గిస్తారు. ఉత్పత్తి తగ్గుతుంది. దీనివల్ల మరి కొంతమంది కార్మికులు కొలువులు కోల్పోతారు. ఫలితంగా నిరుద్యోగం మరింత పెరిగి ప్రజల్లో కొనుగోలు శక్తి పడిపోతుంది. ఇదొక ‘విష వలయం’లా పనిచేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్ని ప్రభుత్వాలు మార్చాలి. అందుకోసం, మౌలిక వసతుల కల్పన ద్వారా కొత్త ఉద్యోగాలు సృష్టించి ప్రజల్లో కొనుగోలు శక్తిని పెంచాలి. రాబోయే అయిదేళ్లలో దేశంలో రూ.102 లక్షల కోట్ల విలువైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు చేపడతామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ ప్రకటించిన నేపథ్యంలో వస్తుసేవలకు గిరాకీ పెరిగే అవకాశం ఉంది. తద్వారా పారిశ్రామిక వేత్తలు ఉత్పత్తిని పెంచడానికి అధికంగా పెట్టుబడులు పెడతారు. ఉత్పత్తితోపాటు కొత్త కొలువులు కూడా వస్తాయి. ఫలితంగా ప్రజల ఆదాయాలు పెరిగి కొనుగోలు శక్తి పెరగడంతో వృద్ధిరేటు పరుగు పెడుతుంది. సంక్షోభం దిశగా ఆర్థిక వ్యవస్థ పయనిస్తున్నపుడు ఏ దేశ ప్రభుత్వమైనా గిరాకీ నిర్వహణ చర్యలు చేపట్టాలి. కానీ, కేంద్రం ఈ దిశగా చర్యలు తీసుకోకుండా సరఫరా నిర్వహణ చర్యలకు పూనుకొంది. పలు రాయితీలను ఉద్దీపన పథకాలను ప్రకటించింది. నేడు దేశం ఎదుర్కొంటున్నది. సరఫరా సమస్య కాదు. గిరాకీ సమస్య. కేంద్రం ఈ దిశగా అడుగులు వేయకుండా పారిశ్రామికవేత్తలు అడిగినవన్నీ ఇచ్చింది. గిరాకీ సమస్యను పరిష్కరించాలంటే ప్రజల్లో కొనుగోలు శక్తిని పెంచడమే ఏకైక మార్గం. కొత్త కొలువులు సృష్టించి కార్మికుల, కర్షకుల ఆదాయాలు పెరిగేలా చేయాలి.

నేడు భారత ఆర్థిక వ్యవస్థ మాంద్యంలో చిక్కుకుందా, లేదా మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ వాపోతున్నట్లు మాంద్యం అంచుల్లో ఉందా... ఇదే ఇప్పుడందరినీ కలవరపెడుతున్న అంశం. అయితే, ప్రభుత్వం మాత్రం- ఇది తాత్కాలిక చక్రీయ పరిణామమేనని, అంతగా భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తోంది. మరోపక్క అయిదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలంటే రాష్ట్రాలు క్రియాశీలక పాత్ర పోషించాల్సి ఉంది. పెట్టుబడులు పెట్టేవారంతా పన్ను రహిత ప్రభుత్వ బాండ్లకే ఎక్కువగా ఆకర్షితులయ్యారు. ఆర్‌బీఐ వరసగా వడ్డీరేట్లు తగ్గించడంతో పలు బ్యాంకుల్లో ఫిక్స్డ్‌ డిపాజిట్లు కూడా భారీగా తగ్గాయి. ఇది దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి ఏమాత్రం ఆరోగ్యకరం కాదు. దీని ప్రభావం పలు రంగాలపై పడుతుంది. సామాన్యులకు మరిన్ని కష్టాలు ఎదురయ్యే పరిస్థితులు ఏర్పడతాయి. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బీఐ దేశ ఆర్థిక వ్యవస్థ సుస్థిరాభివృధ్ధికి తగిన దిద్దుబాటు చర్యలు తీసుకొని మందగమన స్థితిలో ఉన్న ఆర్థిక వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించే ప్రయత్నం చేయాలి. చుక్కల్ని తాకుతున్న నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించి, వాటిని నేలపైకి దించేందుకు చర్యలు చేపట్టాలి.

సంక్షోభం అంచున...
నోట్ల రద్దు వంటి చర్యలవల్ల అప్పటిదాకా సవ్యంగా ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంది. ముఖ్యంగా బ్యాంకింగ్‌ వ్యవస్థ పరిస్థితి పెనం మీది నుంచి పొయ్యిలోకి పడినట్లయింది. కేంద్రం, ఆర్‌బీఐ ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా, బ్యాంకుల్లో మోసాలు పెరుగుతూనే ఉన్నాయి. ఇదికాకుండా, అమ్మకాల్లో క్షీణత, వ్యవసాయ దిగుబడుల తగ్గుదల, 100 రకాలకుపైగా వృత్తుల వారికి ఉపాధి కల్పిస్తున్న స్థిరాస్తి రంగం దెబ్బతినడం ఫలితంగా వినియోగం తగ్గడం, ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ సంస్థ కుప్పకూలడం, మిగిలిపోయిన సరకు నిల్వలు, అత్యధికులకు ఉపాధి కల్పిస్తున్న సూక్ష్మ చిన్న, మధ్య పరిశ్రమలు పెద్ద సంఖ్యలో మూతపడడం, కార్మికుల తొలగింపు వంటి వార్తలు తాజాగా తెరపైకి వచ్చాయి. పన్ను వసూళ్లు సైతం తగ్గుతూ వచ్చాయి. ఈ పరిస్థితి తాత్కాలికమా, వ్యవస్థీకృతమా... తాత్కాలికమైతే ఎంతకాలం అనేది పెద్ద ప్రశ్న. మరోవైపు, మన ఆర్థిక వ్యవస్థ సంక్షోభం దిశగా పయనిస్తోందా అనేది ఇప్పుడు అందరిలో మెదులుతున్న అనుమానం. నోట్ల రద్దు, జీఎస్టీ ప్రభావానికి గురైన వ్యవసాయం, చిన్న తరహా పరిశ్రమలు మాత్రమే కాకుండా, వినియోగం తగ్గడం, ఎన్‌బీఎఫ్‌సీ సంక్షోభం, తగ్గిన పెట్టుబడులు, ప్రభుత్వ అధిక వ్యయాలు, ఎగుమతుల క్షీణత, డీలా పడిన పారిశ్రామిక ఉత్పత్తి, అమెరికా-చైనాల వాణిజ్య యుద్ధం, ప్రపంచ మందగమనం వంటి ప్రతికూల పరిణామాలు నేటి ఈ పరిస్థితికి దారితీశాయి.

- ప్రొఫెసర్‌ పి.వెంకటేశ్వర్లు
(రచయిత- ఆంధ్ర విశ్వవిద్యాలయ వాణిజ్య విభాగ ఆచార్యులు)
Posted on 28-01-2020