Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఆర్థిక రంగం

ఆశల పద్దు

చుట్టూ నైరాశ్యం కమ్మిన స్థితిలో, నిర్మాణాత్మక చర్యలతో ముందడుగేస్తున్నామంటూ కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్‌ నిన్న పార్లమెంటులో ప్రవేశపెట్టిన సుదీర్ఘ బడ్జెట్‌- ఒక్క ముక్కలో, ఆకాంక్షల పద్దు. గత జులైనాటి తన తొలియత్నంలో బడ్జెట్‌ కూర్పు విధివిధానాలను మార్చేసిన మహిళా ఆర్థికమంత్రి ఈసారీ సదాశయాల వల్లెవేతకు, సమున్నత లక్ష్యాల సాధనపట్ల అనురక్తికి తన ప్రసంగంలో విశేష ప్రాధాన్యమిచ్చారు. ఆశల భారతం, అందరి ఆర్థికాభివృద్ధి, కరుణార్ద్ర సమాజం... ఇవే సూత్రాలుగా అల్లిన ప్రతిపాదనలతో మొత్తం బడ్జెట్‌ వ్యయం దేశ చరిత్రలో మొదటిసారి రూ.30 లక్షల కోట్ల రూపాయలకు పైబడింది. ఇది చూపులకు ఏపుగానే ఉన్నా, తరచిచూస్తే శంకలు రేకెత్తక మానవు. 2019-20 బడ్జెట్‌ రాశి (రూ.27.86 లక్షల కోట్లు) సవరించిన అంచనాల్లో రమారమి రూ.88 వేలకోట్ల దాకా తెగ్గోసుకుపోయింది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 3.3 శాతానికి పరిమితమవుతుందని నిరుడు అంచనా వేసిన ద్రవ్యలోటు 3.8 శాతానికి ఎగబాకినట్లు నిన్నటి బడ్జెట్‌ ప్రసంగమే నిర్ధారించింది. అటువంటప్పుడు- సరికొత్త బడ్జెట్‌ పద్దు, 3.5 శాతం వద్ద ఆగుతుందంటున్న ద్రవ్యలోటు మున్ముందు సవరించిన అంచనాల్లో భారీ కుదుపులకు లోనుకావని విశ్వసించేదెలా? వచ్చే అయిదేళ్లలో భారత్‌ను అయిదు లక్షల కోట్ల డాలర్ల వ్యవస్థగా అవతరింపజేసేందుకు మౌలిక వసతుల రంగాన నూరు లక్షల కోట్ల రూపాయల మేర వెచ్చిస్తామన్న మోదీ ప్రభుత్వం, 18 రాష్ట్రాల్లో పట్టాలకు ఎక్కించదలచిన పథకాల జాబితాను గత నెలలోనే క్రోడీకరించింది. కేంద్రం, రాష్ట్రాలు చెరో 39 శాతం, ప్రైవేటు సంస్థలు తక్కిన 22శాతం భరిస్తే లక్ష్యం నెరవేరినట్లేనని అప్పట్లో పేర్కొన్న ప్రభుత్వం ఇప్పటికి రూ.22 వేలకోట్లు అందుబాటులో ఉన్నాయంటోంది. మిగతాది ఎలా ఎప్పటికి సమకూరుతుందన్నదే ప్రశ్న. ‘కృషి-ఉడాన్‌’ పథకానికి దన్నుగా కొలువు తీరుస్తామంటున్న వంద అదనపు విమానాశ్రయాలు, 150 పాసింజర్‌ రైళ్లకు ప్రభుత్వ ప్రైవేట్‌ భాగస్వామ్య పద్ధతి అనుసరిస్తామంటున్నా- అమలుపై సందేహాలకు సమాధానాలు దొరకడం లేదు. కేంద్ర రుణభారంలో తగ్గుదలను బడ్జెట్‌ సూచిస్తుండగా, పెట్టుబడులపై ప్రైవేటు ఆసక్తి సన్నగిల్లుతున్న తరుణంలో- మౌలిక పద్దు ముణగదీసుకోకుండా ప్రభుత్వం ఏమేమి వ్యూహాలు రచిస్తున్నదో తెలియదు!

ఆందోళనకర మాంద్యాన్ని చెల్లాచెదురు చేసేందుకంటూ కొన్నాళ్లుగా వాహన, స్థిరాస్తి, బ్యాంకింగ్‌ తదితర రంగాలకు ప్రత్యేక తాయిలాలు వెలుగు చూస్తున్నాయి. సరఫరాపరంగా చేపట్టే అటువంటి చర్యలు తాత్కాలికంగానే పనిచేస్తాయి. గిరాకీని పెంపొందించే ఉద్దీపన చర్యలకు బడ్జెట్లో ప్రాధాన్యం ఇస్తారన్న అంచనాల నేపథ్యంలో, జరిగింది వేరు. ఆదాయాలు పెంపొందించి, ప్రజల కొనుగోలు శక్తిని ఇనుమడింపజేయడమే స్వీయధ్యేయమన్న ఆర్థికమంత్రి నూతన ఐచ్ఛిక పన్ను విధానానికి తెరతీశారు. ఆదాయ పన్ను శ్లాబుల్లో మార్పులకు చోటుపెట్టిన కసరత్తు మధ్య, ఎగువ తరగతికి ఊరట ప్రసాదిస్తుందంటున్నా- ఎవరికి ఎంతమేర నికర లబ్ధి చేకూరుతుందన్నది పదబంధ ప్రహేళికగా మారింది. ఇది పరోక్షంగా స్థిరాస్తి రంగాన్ని కుంగదీసే ప్రమాదం ఉందంటున్నారు! జనాభాలో ఆదాయపన్ను చెల్లింపుదారుల సంఖ్య దాదాపు ఆరు కోట్లు. ఆ పరిధిలోకి రాని చేరని పౌరుల ఆదాయాలు, కొనుగోలు శక్తి పెంపుదలకు బడ్జెట్‌ చేయదలచిందేమిటి? దేశజనాభాలో అత్యధికులు గ్రామీణులు, ముఖ్యంగా రైతులు. వ్యవసాయం, నీటిపారుదల, గ్రామీణాభివృద్ధికి రూ.2.99 లక్షల కోట్ల కేటాయింపులు, పదహారు సూత్రాల కార్యాచరణ వినసొంపుగా ఉన్నా- వనరుల పరిమాణం, కొత్తగా తాలింపు పెట్టిన జాబితాల మూస పాతదే. ఈసారి సేద్య రుణాలను రూ.15 లక్షల కోట్లకు విస్తరింపజేస్తామంటున్నారు. ఫసల్‌ బీమా యోజన సగంమంది అన్నదాతలకైనా వర్తించనట్లే, వ్యవస్థాగత పరపతి మూడొంతుల రైతులకు దక్కడం లేదన్నది బహిరంగ రహస్యం. నీలివిప్లవం, శీతల గిడ్డంగులు, వంద నీటిఎద్దడి జిల్లాల్లో ప్రత్యేక అజెండా తదితరాలన్నింటికన్నా ఎంతో ముఖ్యమైంది- గిట్టుబాటు. అన్నదాతకు జీవన భద్రత కల్పించడానికి ఉద్దేశించిన స్వామినాథన్‌ మేలిమి సిఫార్సుల్ని పక్కనపెట్టి, రైతు బాగుసేత పేరిట ప్రభుత్వాలు ఏం చేయబోయినా- పొలాలు వికసించవు. రైతులు తెరిపినపడక, నిధుల కొరతతో గ్రామీణ ఉపాధి పథకం వేసారుతుండగా- గిరాకీ పెరిగి, వృద్ధిరేటు ఊపందుకోవడమన్నది పగటి కల. పాలకుల మాటల్లోని ఔదార్యం చేతల్లోకి తర్జుమా కాని మూగవేదన పల్లెలది. అటు, గిరాకీని ఉద్ధరించలేని విధాన చికిత్స దెబ్బకు మార్కెట్లూ కుంగిపోయాయి!

బడ్జెట్‌ సమర్పణకు ముందురోజు పార్లమెంటు సముఖానికి చేరిన ఆర్థిక సర్వే ఉపాధి కల్పనలో మందభాగ్యాన్ని పారదోలేందుకు ‘చైనా నమూనా’ అనుసరణీయమని సూచించింది. 2030నాటికి ఎనిమిది కోట్ల ఉపాధి అవకాశాల్ని సృష్టించే క్రమంలో ఎలెక్ట్రానిక్స్‌ తయారీ రంగానికి తోడ్పాటు అందించే కొత్త పథకాల్ని బడ్జెట్‌ ప్రస్తావించింది. స్థానిక సంస్థల్లో ఇంజినీరింగ్‌ విద్యార్థులకు అప్రెంటిస్‌ విధానం, విదేశాల్లో నర్సులకు ఇతర పారామెడికల్‌ సిబ్బందికి ఉన్న డిమాండును దృష్టిలో పెట్టుకుని శిక్షణ కార్యక్రమాలు... ప్రపంచంలోనే అత్యధికంగా యువత పోగుపడిన దేశంలో- బుడిబుడి అడుగులు. విద్యారంగానికి రూ.99,300 కోట్లు కేటాయించిన చేత్తోనే నైపుణ్యాభివృద్ధి కేంద్రాలకు కేవలం రూ.3,000 కోట్లు విదపడం ప్రభుత్వ ప్రాథమ్య క్రమంలో లొసుగును కళ్లకు కడుతోంది. విస్తృత వాస్తవికావసరాల దృష్ట్యా రూ.1.17 లక్షల కోట్లు అనుగ్రహించాలని కోరిన ఆరోగ్యశాఖకు నిన్నటి బడ్జెట్‌ ఇవ్వజూపింది రూ.69వేల కోట్లు. అంతర్జాతీయంగా చిన్నపరిశ్రమల స్థితిగతుల్ని, ఇతర దేశాల్లో అత్యుత్తమ ప్రమాణాల్ని అధ్యయనంచేసి కమిటీలందించిన సిఫార్సులు ఈసారీ అరణ్యరోదనమయ్యాయి. పర్యాటక రంగ ప్రోత్సాహానికి త్వరలో మరిన్ని తేజస్‌ రైళ్లు ప్రవేశపెడతామన్న బడ్జెట్‌- ఆతిథ్య రంగాన్ని పరిపుష్టీకరించి ఎడాపెడా ఆర్జిస్తున్న విదేశీ అనుభవాల్ని అలవాటుగా పెడచెవిన పెట్టింది. ద్రవ్య యాజమాన్య అంశాన్ని ప్రస్తావిస్తూ- మార్కెట్‌ రుణాల పద్దులోకి చేరని కేంద్రప్రభుత్వ అప్పు, దానిపై వడ్డీ చెల్లింపుల్ని భారత సంచిత నిధినుంచి మినహాయించుకుంటామని విత్తమంత్రి నొక్కి వక్కాణించడం, విభజిత వనరుల్లో రాష్ట్రాల వాటా కుంగిపోయే ముప్పును సూచిస్తోంది. సవరించిన అంచనాల ప్రాతిపదికన నిరుటిలాగే కీలక పద్దులకు కుడిఎడంగా ఇంచుమించు అంతే మొత్తం కేటాయించినా- వాక్చాతుర్య ప్రదర్శనలో నిర్మలా సీతారామన్‌ ‘రికార్డు’ నెలకొల్పారు. ఈ బడ్జెట్‌ వంటకంతో, ఆర్థిక సర్వే ఊహించిన ‘అనుకూల వాతావరణం’ సాకారమై కోట్లాది భారతీయుల జీవన ప్రమాణాల మెరుగుదల, జాతి సమతులాభివృద్ధి సాధ్యపడతాయంటే- నమ్మశక్యం కాదు!

Posted on 02-02-2020