Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఆర్థిక రంగం

నగదు... తగదు!

* లావాదేవీలకు ఇక ‘యూపీఐ’
నగదు లావాదేవీలు వేగంగా తగ్గుముఖం పడుతున్న కాలమిది. అంతర్జాలం ద్వారా డబ్బు ఇచ్చిపుచ్చుకోవడం వూపందుకున్న తరుణంలో- ఈ మార్పునకు మరింత విప్లవాత్మకతను జోడిస్తూ కేంద్ర ప్రభుత్వం ఏకీకృత చెల్లింపు (యూపీఐ) వ్యవస్థను ప్రవేశపెట్టింది. బ్యాంకు ఖాతా నెంబరు, సంబంధిత ఐఎఫ్‌ఎస్‌సీ సంఖ్య వంటి సూక్ష్మ వివరాలన్నింటినీ నమోదు చేసుకున్న తరవాత మాత్రమే గతంలో అంతర్జాల చెల్లింపులకు అవకాశం ఉండేది. యూపీఐ విధానం ఈ ప్రక్రియను మరింత సరళీకరిస్తోంది. రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలోని భారత జాతీయ చెల్లింపుల సంస్థ (ఎన్‌పీసీఐ), దేశంలోని వివిధ బ్యాంకుల ఉమ్మడి కృషి కారణంగా యూపీఐ సాకారమైంది. తొలి దశలో భాగంగా దేశంలోని 21 బ్యాంకులకు ఈ చెల్లింపుల ప్రక్రియలో పాల్గొనేందుకు అనుమతి లభించింది. మిగిలిన బ్యాంకులకు మరో మూడు నుంచి ఆరు నెలల వ్యవధిలో యూపీఐ లావాదేవీల్లో పాలుపంచుకొనేందుకు అవకాశం లభిస్తుంది. ఎన్‌పీసీఐ నిర్దేశించిన కఠిన నిబంధనలకు కట్టుబడి, ముందస్తు నమూనా పరీక్షల్లో విజయవంతమైన బ్యాంకులకు మాత్రమే తొలి దశ అనుమతి లభించింది. నిబంధనల ప్రకారం ఈ ప్రక్రియను మొదట వెయ్యిమంది వినియోగదారులకు పరిచయం చేయాలి. మొత్తంగా కొత్త వ్యవస్థ ఆధారంగా అయిదు వేల లావాదేవీలు నమోదు కావాలి. నిర్వహించిన లావాదేవీల్లో కనీసం 90 శాతం విజయవంతం కావాల్సి ఉంటుంది. మొదట 29 బ్యాంకులు ఇందుకు అంగీకరించి ముందుకొచ్చినా అంతిమంగా 21 బ్యాంకులు మాత్రమే అర్హత సంపాదించగలిగాయి. యూపీఐ మొబైల్‌ అప్లికేషన్‌ డౌన్‌లౌడ్‌ చేసుకున్నవాళ్లందరూ ఈ లావాదేవీల్లో పాలుపంచుకోవచ్చు. చెల్లింపుదారుడికి, స్వీకర్తకు ఈ అప్లికేషన్‌ ఉంటే క్షణాల్లో లావాదేవీలు సాధ్యపడతాయి. ఏ బ్యాంకు అన్నదానితో నిమిత్తం లేకుండా, మొబైల్‌ అప్లికేషన్‌ను ఉపయోగించి, క్షణాల్లో ఎక్కడినుంచి ఎక్కడికైనా లావాదేవీలు చేయగల సౌకర్యం ప్రపంచంలో ఇదే తొలిసారి అని ఎన్‌పీసీఐ పేర్కొంటోంది. బ్యాంకు ఖాతా లేనివారు సైతం మొబైల్‌ ఫోన్‌లో సంబంధిత బ్యాంకు అప్లికేషన్‌ ద్వారా రూపొందించుకున్న ఐడీ సాయంతో గరిష్ఠంగా లక్ష రూపాయల దాకా డబ్బు పంపగల వెసులుబాటు నిజానికి అద్భుతం.

పెరుగుతున్న ఆదరణ
దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులు ఈ ప్రక్రియను అందిపుచ్చుకొన్న తరవాత దీనివల్ల ఒనగూడే నిజమైన ప్రయోజనాలు అందరికీ తెలిసి వస్తాయి. గడచిన రెండు మూడేళ్లుగా దేశంలో ఎలక్ట్రానిక్‌ చెల్లింపులు వూపందుకుంటున్న నేపథ్యంలో యూపీఐ ఆగమనం ప్రాధాన్యం సంతరించుకుంది. 2015-16కుగాను ఎలక్ట్రానిక్‌ లావాదేవీల పరిమాణం 49.5 శాతం, విలువ 9.1 శాతం పెరిగినట్లు రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దేశంలో ఎలక్ట్రానిక్‌ లావాదేవీలకు అత్యధికులు ఉపయోగిస్తున్న పద్ధతి నేషనల్‌ ఎలక్ట్రానిక్‌ ఫైల్‌ ట్రాన్స్‌ఫర్‌(నెఫ్ట్‌). గడచిన మూడేళ్ల కాలంలో ‘నెఫ్ట్‌’ లావాదేవీలు రెండింతలు పెరిగాయి. నగదు లావాదేవీలపై ప్రధానంగా ఆధారపడిన భారత ఆర్థిక వ్యవస్థ ఈ కొత్త విధానాలు ఎనలేని మేలు చేస్తాయి. 1935లో(ఆర్‌బీఐ ఏర్పడినప్పుడు) చలామణీలోని కరెన్సీ విలువ రూ.172 కోట్లు. 2016 మార్చి నాటికి ఆ విలువ రూ.16.45 లక్షల కోట్లకు పెరిగింది. గడచిన నాలుగు దశాబ్దాల్లో కరెన్సీ చలామణీ మరే అభివృద్ధి చెందిన దేశంతో పోల్చినా నాలుగు రెట్లు పెరిగినట్లు ఆర్‌బీఐ అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ స్థాయిలో కరెన్సీ నోట్లు ముద్రించడం, చలామణీ చేయడం అత్యధిక వ్యయ ప్రయాసలతో కూడుకున్న ప్రక్రియ. వివిధ రకాల కరెన్సీల నిర్వహణ లావాదేవీల కోసం ఆర్‌బీఐ రూ.21 వేలకోట్లు ఖర్చు చేస్తున్నట్లు నివేదిక వెల్లడిస్తోంది. మరోవంక దేశ జీడీపీ పరిమాణంలో మూడింట రెండు వంతులు నగదు లావాదేవీల ద్వారానే దఖలు పడుతోంది. అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ పరిస్థితి లేదు. అమెరికాలో కుటుంబాలు సగటున నిర్వహించే నగదు లావాదేవీలు 22 శాతమే. కెన్యా వంటి దేశాలూ ఎలక్ట్రానిక్‌ లావాదేవీల విషయంలో ఎంతో ముందున్నాయి. ఈ నేపథ్యంలో యూపీఏ ఆగమనం దేశ లావాదేవీల ముఖచిత్రాన్నే మార్చేస్తుంది. జన్‌ధన్‌ బ్యాంక్‌, ఆధార్‌ సంఖ్య, మొబైల్‌ నంబర్‌ (జామ్‌) ఉన్నవారందరూ త్వరలో వారి రోజువారీ అవసరాల మేరకు యూపీఏ ద్వారా లావాదేవీలు నిర్వహిస్తే ఆర్థిక వ్యవస్థలో గుణాత్మక మార్పులు ఆవిష్కారమవుతాయి. దేశవ్యాప్తంగా 23.93 కోట్ల జన్‌ ధన్‌ బ్యాంకు ఖాతాలున్నాయి. జన్‌ ధన్‌తో సంబంధం లేని కోట్లాది సాధారణ బ్యాంకు ఖాతాలు ఇందుకు అదనం.
బ్యాంకు గుమ్మం ఎక్కాల్సిన అవసరం లేకుండా కేవలం మొబైల్‌ ఫోన్‌లో ఒక్క మీట నొక్కి లావాదేవీలు నిర్వహించుకునే అవకాశం అందరికీ అందుబాటులోకి వస్తే దేశంలో వినియోగ మార్కెట్‌ ఇబ్బడిముబ్బడిగా విస్తరిస్తుంది. ఎలక్ట్రానిక్‌ లావాదేవీలు పెరిగితే గృహ వినిమయంలో సగటున ఏటా 0.185 శాతం ఇనుమడించినట్లు, తద్వారా ఉద్యోగావకాశాలూ పెరిగినట్లు ఇటీవలి ఓ అధ్యయనం వెల్లడించింది. 2011-2015 మధ్యకాలంలో ఎలక్ట్రానిక్‌ లావాదేవీల కారణంగా అభివృద్ధి చెందుతున్న దేశాల జీడీపీలో 0.08శాతం, అభివృద్ధి చెందిన దేశాల్లో 0.03శాతం వృద్ధి కనిపించినట్లు మూడీ నివేదిక స్పష్టం చేస్తోంది.

విప్లవాత్మక మార్పు
ఎక్కడో దూరంగా ఉండే బ్యాంకులకు వెళ్ళి లావాదేవీలు నిర్వహించుకోవడం గ్రామీణులకు కుదిరే పనికాదు. ఈ ఏడాది మార్చి నాటికి దేశంలో 1.98 లక్షల ఏటీఎం యంత్రాలు, 13.5 లక్షల విక్రయ కేంద్ర టర్మినళ్లు(పీఓఎస్‌లు) ఉన్నాయి. చిన్నపాటి కొనుగోళ్లకోసం ప్రజలకు జేబులో డబ్బు పెట్టుకు తిరగక తప్పడం లేదు. దేశంలోని కుటుంబాల బ్యాంకింగ్‌ లావాదేవీల సగటు ఇప్పటికీ బాగా తక్కువగానే ఉంది. దేశంలో చెక్‌ ద్వారా జరిగే లావాదేవీల సగటు రూ.75,000. ఎలక్ట్రానిక్‌ పద్ధతిలో డబ్బును బదలాయించే ఐఎంపీఎస్‌ ద్వారా జరుగుతున్న లావాదేవీల సగటు రూ.8,000. పీఓఎస్‌ కేంద్రాలవద్ద క్రెడిట్‌ కార్డును ఉపయోగించే చేసే లావాదేవీల సగటు మొత్తం రూ.3,000. నిరుడు డెబిట్‌ కార్డు ద్వారా చోటుచేసుకున్న లావాదేవీల సగటు రూ.2,993గా తేలింది. యూపీఐ ద్వారా లక్ష రూపాయల వరకూ లావాదేవీలు చేసే వీలుంది. దేశంలోని కుటుంబాలు వివిధ పద్ధతుల ద్వారా చేస్తున్న క్రయ విక్రయాల సగటుతో పోలిస్తే యూపీఏ వెసులుబాటు కల్పిస్తున్న మొత్తం చాలా ఎక్కువ. రూపాయి కంటే తక్కువ మొత్తంనుంచి గరిష్ఠంగా లక్షరూపాయల వరకు స్వేచ్ఛగా లావాదేవీలు నిర్వహించుకునే అవకాశం లభిస్తోంది. కిరాణా కొట్టులో రూపాయి విలువ చేసే లావాదేవీ జరిపినా క్రయ విక్రయదారులిరువురికీ యూపీఐ ఐడీ ఉంటే మొబైల్‌ ద్వారా డబ్బులు బదలాయించే అవకాశం నిజంగా ఎంత విప్లవాత్మకమైన మార్పు! 23 కోట్ల మొబైల్‌ ఫోన్లు ఉన్న దేశంలో ఏకీకృత చెల్లింపు వ్యవస్థకు సరైన ప్రచారం కల్పించి, ప్రజల్లోకి తీసుకువెళితే- దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త రెక్కలు తొడినట్లే!

Posted on 13-09-2016