Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఆర్థిక రంగం

కరోనాతో ప్రపంచార్థికం కుదేలు!

* పలు దేశాలపై ‘చైనా పరిణామాల’ ప్రభావం

చైనాలోని వుహాన్‌ నగరంపై పంజా విసరిన కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) ఆ దేశంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించడమే కాదు, క్రమంగా ఇతర దేశాలపైనా పడగ విప్పుతోంది. వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి చైనా ప్రభుత్వం ఇప్పటి వరకు మొత్తం 16 నగరాలను దిగ్బంధించింది. ఆ నగరాల్లోకి, అక్కడి బహుళనివాస భవన (అపార్ట్‌మెంట్‌) సముదాయాల్లోకి రాకపోకలను నియంత్రించింది. అందరికీ నిర్బంధ వైద్య పరీక్షలు, ఇతర ఆంక్షలు విధించింది. చైనా నూతన సంవత్సరాది కోసం సొంత ఊళ్లకు వెళ్లిన ఏడు లక్షలకు పైగా కార్మికులు కర్మాగారాలకు తిరిగి రావాలంటే కరోనా ఆంక్షలు అడ్డు వస్తున్నాయి. ఫలితంగా హెనాన్‌, హుబై, ఝెజియాంగ్‌, గ్వాంగ్‌ డాంగ్‌, హెనాన్‌ తదితర రాష్ట్రాల్లోని ఫ్యాక్టరీల్లో ఉత్పత్తి కార్యకలాపాలు స్తంభించిపోతున్నాయి. హెనాన్‌ రాష్ట్రంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఐ ఫోన్‌ (ఆపిల్‌) తయారీ ఫ్యాక్టరీ ఉంది. హుబై రాష్ట్ర రాజధాని అయిన వుహాన్‌లో జపాన్‌కు చెందిన హోండా, నిస్సాన్‌లతోపాటు పలు ఐరోపా ఆటొ కంపెనీలూ కర్మాగారాలు నెలకొల్పాయి. బీజింగ్‌లోని తన ఫ్యాక్టరీలో పనిచేసే 3,500 మంది కార్మికులను రెండు వారాలపాటు కర్మాగారానికి రాకుండా ఇంటినుంచే పని చేయాలని జర్మనీకి చెందిన ఫోక్స్‌ వ్యాగన్‌ గ్రూప్‌ ఆదేశించింది. జర్మనీకి చెందిన బీఎండబ్ల్యు, అమెరికాకు చెందిన టెస్లా, బ్రిటన్‌కు చెందిన జాగ్వార్‌, ల్యాండ్‌ రోవర్‌ కంపెనీలు కూడా చైనాలో తమ కార్ల తయారీ కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడిందని ప్రకటించాయి.

దెబ్బ తింటున్న సరఫరా గొలుసులు
దేశవిదేశీ కంపెనీల కోసం కార్లు, ఎలక్ట్రానిక్స్‌ విడిభాగాలు, పారిశ్రామిక సాధనాలను తయారు చేసే ఫ్యాక్టరీలు చైనాలో చాలా ఉన్నాయి. వాటిలో చాలాభాగం అమెరికా, జర్మనీ, జపాన్‌, ఫ్రాన్స్‌ వంటి అభివృద్ధి చెందిన దేశాలు ఏర్పాటు చేసినవే. నేడు ఒక వస్తువు పూర్తిగా ఒకే దేశంలో తయారు కావడం లేదు. దాని విడి భాగాలు వేర్వేరు చోట్ల తయారవుతున్నాయి. వాటిని ఒక చోట కూర్చి అనేక దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఉదాహరణకు స్మార్ట్‌ ఫోన్ల కెమేరాలు ఒక దేశంలో ఉత్పత్తయితే, డిస్‌ ప్లే తెరలు మరో దేశంలో తయారవుతున్నాయి. కారు ఇంజిన్‌ ఒక చోట, విడి భాగాలు వేర్వేరు దేశాల్లో తయారవుతున్నాయి. దీన్నే అంతర్జాతీయ సరఫరా గొలుసుగా వ్యవహరిస్తున్నారు. తైవాన్‌, దక్షిణ కొరియా, వియత్నాం, బంగ్లాదేశ్‌, మలేసియా తదితర దేశాలు ఈ గొలుసులో కీలక అంతర్భాగాలు. కరోనా దెబ్బకు ఈ గొలుసులు దెబ్బతింటున్నాయి. ఫలితంగా చైనాకూ ఇతర దేశాలకూ మధ్య ఎగుమతులు, దిగుమతులకు విఘాతమేర్పడుతోంది. ఉదాహరణకు చైనా నుంచి జపాన్‌కు దుస్తులు, శుద్ధి చేసిన ఆహార ఉత్పత్తులు ఎగుమతి అవుతాయి. అవి ఇప్పుడు సందిగ్ధంలో పడ్డాయి. చైనా నుంచి ‘వైరింగ్‌ హార్మెస్‌’లు రాకపోవడంతో దక్షిణ కొరియాలో హ్యుండయ్‌ మోటార్‌ కంపెనీ కొన్ని యూనిట్లను మూసేయాల్సి వచ్చింది. జనసమ్మర్దం కలిగిన ప్రాంతాలకు వెళితే కరోనా సోకుతుందనే భయంతో అనేక ఆసియా దేశాల ప్రజలు బహిరంగ బజార్లకు, షాపింగ్‌ మాల్స్‌కు, రెస్టారెంట్లకు వెళ్లడం తగ్గించేస్తున్నారు. ఇది చిల్లర వర్తకాన్ని దెబ్బతీస్తోంది. కరోనా వల్ల చైనీయుల బృంద పర్యటనలను ప్రభుత్వం నిషేధించడం, పలు దేశాలు చైనీయులకు ప్రవేశం నిరాకరించడం, ఇతర దేశాల పర్యాటకులు చైనాకు రాకపోవడంవల్ల టూరిజం రంగం క్షీణించనుంది. దీనివల్ల వియత్నాం, థాయిలాండ్‌, సింగపూర్‌ దేశాలకు పర్యాటక ఆదాయం బాగా తగ్గిపోనుంది. కరోనా దెబ్బకు సింగపూర్‌ 10 లక్షల మంది చైనా పర్యాటకులను కోల్పోనుంది. వ్యాపార కూడళ్లయిన హాంకాంగ్‌, మకావులకు నష్టం అంతా ఇంతా కాదు. థాయిలాండ్‌ జీడీపీలో ప్రయాణ సేవల వాటా 11.2 శాతమైతే, హాంకాంగ్‌లో 9.4 శాతం. భారత్‌, ఇండోనేసియాలకు చైనా పర్యాటకుల రాకపోకలు తక్కువ కాబట్టి, టూరిజంపరంగా కరోనా ప్రభావం ఈ దేశాలపై అంతగా ఉండదు. మరోవైపు బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌, లుఫ్టాన్సా, ఎయిరిండియాలతోపాటు అనేక దేశాల విమానయాన సంస్థలు చైనాకు ప్రయాణాలను నిలిపేయడమో, తగ్గించడమో చేశాయి. టూరిజం, విమానయాన రంగాలకు ఏర్పడిన విఘాతం, జులై 24 నుంచి టోక్యోలో ప్రారంభం కావలసిన వేసవి ఒలింపిక్స్‌పై దుష్ప్రభావం చూపుతుందని జపాన్‌ ఆందోళన చెందుతోంది. కార్లు, పారిశ్రామిక యంత్రాలు, పరికరాలు, ఫార్మా, గృహోపకరణాల తయారీ, కంప్యూటర్లు, స్మార్ట్‌ ఫోన్లు, ఇతర హైటెక్‌ వస్తువులు, వాటి విడిభాగాల తయారీకీ చైనాయే ప్రధాన కేంద్రం. కరోనావల్ల 2020 తొలి త్రైమాసికంలో కార్ల ఉత్పత్తి 15 శాతం తగ్గనుంది. కార్ల విడిభాగాలను తయారు చేసే బాష్‌, మాగ్నా ఇంటర్నేషనల్‌, ఎలక్ట్రానిక్స్‌ తయారీదారు ఎన్‌విడియా కూడా ఉత్పత్తి తగ్గించక తప్పదంటున్నాయి. అసలే మాంద్య భయాలతో ఆందోళన చెందుతున్న ప్రపంచ దేశాలకు కరోనా గోరుచుట్టుపై రోకటిపోటులా పరిణమిస్తోంది. ఈ వైరస్‌ చైనాతోపాటు ప్రపంచ జీడీపీనీ వెనక్కు లాగవచ్చు. చైనాకు భారీ ఉత్పాదక యంత్రాలను ఎగుమతి చేసే జర్మనీకీ ఆర్డర్లు తగ్గేట్లున్నాయి.

ఊరట కలిగిస్తున్న అవకాశాలు
చైనా నుంచి సరఫరాలు తగ్గడంవల్ల ప్రపంచ దేశాలు కొన్ని వస్తువుల కోసం భారత్‌పై ఆధారపడే అవకాశం ఉండటం కొంతలో కొంత ఊరట. పింగాణి, గృహోపకరణాలు, ఫ్యాషన్‌, జీవనశైలి వస్తువులు, దుస్తులు, చిన్న తరహా ఇంజినీరింగ్‌ వస్తువులు, ఫర్నిచర్‌ను ఎగుమతి చేసే సామర్థ్యం భారత్‌కు ఉంది. ఇప్పటికే ఈ వస్తువుల గురించి పాశ్చాత్య కంపెనీలు భారత్‌ను వాకబు చేయనారంభించాయి. కరోనా వైరస్‌ నుంచి రక్షణ కోసం ముఖానికి ధరించే ముసుగులు (మాస్క్‌ల) కోసం పెద్ద ఆర్డర్లే వచ్చాయి. దేశంలోని మాస్క్‌లను ఎగుమతి చేసేస్తే- రేపు అవసరానికి అందుబాటులో లేకుండా పోతాయని భావించిన భారత్‌ మొదట మాస్క్‌ల ఎగుమతిని నిలిపేసినా తరవాత కొనసాగించింది. అయితే గిరాకీ విపరీతంగా ఉండటంతో దాన్ని తీర్చలేక భారతీయ ఉత్పత్తిదారులు కొత్త ఆర్డర్లు తీసుకోవడం మానేశారు. చైనా మాదిరిగా భారతదేశం ప్రపంచానికి ఫ్యాక్టరీగా మారాలంటే దీర్ఘకాల ప్రణాళికతో పట్టుదలగా కృషిచేయాల్సి ఉంటుంది.

నేడు ప్రపంచ దేశాల్లో ఉత్పత్తయ్యే సరకుల్లో 10.4 శాతాన్ని చైనా దిగుమతి చేసుకొంటోంది. 2002లో చైనా దిగుమతుల వాటా కేవలం నాలుగు శాతం. అందుకే 2003లో సార్స్‌ వైరస్‌ వల్ల కలిగిన నష్టంకన్నా, కరోనా వైరస్‌ వల్ల నష్టం ఎన్నోరెట్లు ఎక్కువగా ఉంటుంది. 2003తో పోలిస్తే నేడు చైనా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకంగా మారడమే దీనికి కారణం. ప్రపంచ స్థూలోత్పత్తి (జీడీపీ)లో 15 శాతం చైనా ద్వారా లభిస్తోంది. దీంట్లో కోత పడితే ప్రపంచ జీడీపీ కూడా తగ్గిపోతుంది. భారతదేశానికి అతి పెద్ద వ్యాపార భాగస్వామి చైనాయే. 2018-19లో భారత్‌ చేసుకున్న మొత్తం దిగుమతుల్లో 14 శాతం ఒక్క చైనా నుంచే వచ్చాయి. అదే సంవత్సరం భారత్‌ చేసిన ఎగుమతుల్లో అయిదు శాతం చైనాకు వెళ్లాయి. కరోనా సమస్య ఎక్కువ కాలం కొనసాగితే ఎగుమతులు, దిగుమతులు క్షీణిస్తాయి. చైనాలో విడిభాగాల ఉత్పత్తికి అంతరాయం ఏర్పడి అక్కడి సరఫరాదారులు ధరలు పెంచేశారు. దీనివల్ల భారత్‌లో ద్రవ్యోల్బణం పెరిగి, ఉత్పత్తి తగ్గి ఉద్యోగాల్లో కోత పడుతుంది. ప్రపంచ దేశాలు ఆర్థికంగా పరస్పరాశ్రితమైన ఈ తరుణంలో- ఒకరికొకరు సహకరించుకోవడం ద్వారానే కరోనా గండాన్ని అధిగమించాలి.

భారత్‌కు తప్పని ప్రతికూలతలు
కొన్ని ముడి సరకులను, విడిభాగాలను ముందుగానే చైనా నుంచి దిగుమతి చేసుకుని నిల్వచేసిన భారతదేశం స్వల్పకాలంలో దుష్ప్రభావాన్ని తప్పించుకోగలిగినా మున్ముందు ప్రతికూలతలను ఎదుర్కోక తప్పదు. చైనా నుంచి భారతదేశం ప్రధానంగా ఎలక్ట్రానిక్స్‌, ఇంజినీరింగ్‌ వస్తువులు, రసాయనాలను దిగుమతి చేసుకొంటోంది. ప్రస్తుతం దిగుమతులకు అంతరాయం ఏర్పడినందున 2020-21లో భారతీయ కార్పొరేట్‌ రంగ వృద్ధి నెమ్మదించవచ్చు. మరి మూడు నాలుగు నెలల్లోగా కరోనా వైరస్‌ను అదుపులోకి తీసుకురాలేకపోతే భారతీయ కంపెనీలు గడ్డు స్థితిని ఎదుర్కోక తప్పదు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 6.5 శాతం వృద్ధి రేటు సాధించాలని భారత్‌ ఆశిస్తున్నా, కరోనా ఆరు నెలల్లోగా అదుపులోకి రాకపోతే భారత్‌ వృద్ధి ఆశలు నెరవేరేది కష్టమే. సకాలంలో చైనా విడిభాగాలు అందక మహింద్రా అండ్‌ మహింద్రా, మారుతి కార్ల ఉత్పత్తి నెమ్మదించే ప్రమాదం ఉంది. ప్రస్తుతం కరోనా భయంతో చైనాలో 60 శాతం ఆటొ కూర్పు కర్మాగారాలు మూతపడటంతో, ఇతర దేశాల నుంచి విడిభాగాలను దిగుమతి చేసుకోవాలన్నా దానికి కొంత వ్యవధి పడుతుంది. భారత్‌ పది నుంచి 30 శాతం ఆటొమోటివ్‌ పరికరాలను చైనా నుంచి దిగుమతి చేసుకొంటోంది. విద్యుత్‌ వాహనాల ఉత్పత్తికి అవసరమైన బ్యాటరీలు, ఇతర విడిభాగాల కోసం చైనా మీద ఆధారపడుతున్నాం. కరోనా ప్రభావంతో భారత ఆటొమొబైల్‌ రంగంలో ఉత్పత్తి ఎనిమిది శాతానికి పైగా క్షీణించవచ్చని ఫిచ్‌ సంస్థ హెచ్చరించింది.

వజ్రాలు, తోలు వస్తువులు, ఔషధాల తయారీ రంగాలపై ప్రభావం తీవ్రంగా ఉండబోతోంది. పాదరక్షలకు కావలసిన సోల్స్‌ చైనా నుంచే రావాలి. చైనా నుంచి సౌర ఫలకాల సరఫరా మందగిస్తే సౌర విద్యుదుత్పత్తిలో భారత్‌ వెనకబడుతుంది. ఎయిర్‌ కండిషనర్లు, వాషింగ్‌ మెషీన్లు, టీవీలు, స్మార్ట్‌ ఫోన్ల విడిభాగాలు చైనా నుంచి రావలసిందే. విడిభాగాల సరఫరాకు విఘాతమేర్పడటంవల్ల ఈ వస్తువుల ధరలు పెంచక తప్పకపోవచ్చు. షియోమీ ఇప్పటికే తన స్మార్ట్‌ ఫోన్ల ధరలు పెంచే విషయం ఆలోచిస్తోంది. మరోవైపు మందుల తయారీకి ముడి సరకులైన బల్క్‌ డ్రగ్స్‌, ఏపీఐలు చైనా నుంచి రావాలి. కరోనా వైరస్‌ ప్రభావంతో చైనా నుంచి వాటి సరఫరా తగ్గిపోతోంది. ఈ పరిస్థితిలో మందుల ఉత్పత్తి తగ్గి, ధరలు పెరగడం అనివార్యం. పారాసెటమాల్‌ వంటి సాధారణ మందుల ముడి పదార్థాల ధరలు పది రోజుల్లోనే రెట్టింపయ్యాయి. భారతదేశం కరోనా సంక్షోభాన్ని మేల్కొలుపుగా తీసుకుని సొంత గడ్డపై బల్క్‌డ్రగ్స్‌, ఏపీఐ, వైద్య పరికరాల ఉత్పత్తికి విస్తృతంగా మౌలిక వసతులను ఏర్పరచాలి.

- కైజర్‌ అడపా
Posted on 17-02-2020