Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఆర్థిక రంగం

సరకు రవాణా దేశార్థికానికి నజరానా!

* ప్రపంచ విపణిని ఆకట్టుకుంటున్న భారత్‌

భారత రవాణా రంగం భారీ వృద్ధి దిశగా సాగుతోంది. ఏటా 8 నుంచి 10 శాతం దాకా వృద్ధి చెందే అవకాశం ఉన్నట్లు ‘పెట్టుబడి సమాచార, పరపతి రేటింగ్‌ సంస్థ (ఐసీఆర్‌ఏ)’ అంచనా. ప్రస్తుతం భారత్‌లో రవాణా పరిశ్రమ పరిమాణం సుమారు రూ.11,36,000 కోట్లదాకా ఉన్నట్లు అంచనా. ప్రపంచ బ్యాంకు ‘రవాణా సామర్థ్య సూచీ’కి సంబంధించిన ప్రపంచ ర్యాంకుల్లో భారత్‌ 54వ స్థానం(2014) నుంచి 35వ స్థానానికి (2016)ఎగబాకింది. 20 ర్యాంకుల దాకా అధిగమించడం సానుకూల పరిణామమే. ఇది ఈ రంగం వృద్ధి, సామర్థ్యాన్ని స్పష్టంగా సూచిస్తోంది. మొత్తంగా రవాణా సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకుంటే 2018 వచ్చేనాటికి ఈ ర్యాంకు తిరిగి 44వ స్థానానికి పడిపోయింది. అయినప్పటికీ దేశ రవాణా రంగం వృద్ధికి ఎన్నో అవకాశాలతోపాటు, అవసరం కూడా ఉందని చెప్పాలి. 2017-18 ఆర్థిక సర్వే ప్రకారం భారత రవాణా రంగం 2025 నాటికి రూ.21,500కోట్లకు చేరుతుందని పేర్కొంది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య(పీపీపీ) నమూనాలో ప్రపంచబ్యాంకు రవాణా సామర్థ్య సూచీలో భారత ర్యాంకును రాబోయే సంవత్సరాల్లో 15వ స్థానానికి చేర్చే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోంది. రవాణా వ్యవస్థలన్నీ డిజిటల్‌ రూపంలోకి మారుతుండటంతో ఈ పరిశ్రమలో సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాలు, మార్పులు ప్రవేశిస్తున్నాయి. ప్రస్తుతం అమెరికాలోని అన్నిరకాల కొనుగోళ్లలో 12 నుంచి 15 శాతం వరకు ఇంటి నుంచి ఆన్‌లైన్‌ ద్వారా చేస్తున్నవే ఉంటున్నాయి. 2025 నాటికి ఇది మొత్తం అమ్మకాల్లో 15 శాతానికి చేరనుంది. సరఫరా వ్యవస్థలో ప్రతి దశలో యాంత్రీకరణ వల్ల వేగంగా సరకు అందజేసే అవకాశముంది. ఐఓటీ, డ్రోన్లు, రోబోలు, ఆధునిక సార్టింగ్‌ వ్యవస్థలు, కృత్రిమ మేధ, సరకు రవాణా ఉపకరణాలు, బయోమెట్రిక్స్‌, జీపీఎస్‌, ఆర్‌ఎఫ్‌ఐడీ తదితర సాంకేతిక పరిజ్ఞానాలు సేవలందించనున్నాయి. రవాణా రంగంలో యాంత్రీకరణ పెరిగిన కొద్దీ వ్యయాలు తగ్గే అవకాశం ఉంది. ఆన్‌లైన్‌ మార్కెట్‌ ఈ రంగం విస్తృతికి మరింతగా తోడ్పడనుంది. ఆన్‌లైన్‌ వేలాలు, కాంట్రాక్టు నిర్వహణలు, ఇ-సోర్సింగ్‌ వంటి అంశాలను బ్లాక్‌చైన్‌ పరిజ్ఞానం సమన్వయపరచనుంది. క్లౌడ్‌ పరిజ్ఞానం, కృత్రిమ మేధ వంటివి ఇతోధికంగా తోడ్పడనున్నాయి.

జీవనాడిలా రహదారి వ్యవస్థ
భారతీయ రహదారులు రవాణా రంగానికి జీవనాడిలాంటివి. ఉపరితల రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం 2019 మార్చి నాటికి భారత్‌లో 1,42,126 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులు ఎక్స్‌ప్రెస్‌వేలు, 1,76,166 కిలోమీటర్ల రాష్ట్ర రహదారులు ఉన్నాయి. అతిపెద్ద రహదారి నెట్‌వర్క్‌ విషయంలో భారత్‌ ప్రపంచంలోనే రెండోస్థానంలో ఉంది. దేశంలోని రవాణాలో 60 శాతంపైగా రహదారుల ద్వారానే జరుగుతోంది. 2017 మార్చి నాటికి 1,21,407 కిలోమీటర్ల రైల్వేమార్గం ఉంది. దేశంలో 32 శాతం సరకులు రైలు మార్గంలోనే రవాణా అవుతున్నాయి. దేశంలో 14,500 కిలోమీటర్ల మేర జలమార్గాలున్నాయి. ఇందులో 5,685కిలోమీటర్ల మేర మర పడవలు నడుస్తున్నాయి. 2017-18 నాటికి 5.50కోట్ల టన్నులుగా ఉన్న సరకు రవాణాను 2021-22 నాటికి 10కోట్ల టన్నులకు చేర్చాలని భారత జలమార్గాల ప్రాధికార సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. దేశంలో 12 భారీ, 205 చిన్నపాటి, మధ్యస్థాయి ఓడరేవులున్నాయి. సాగరమాల ప్రాజెక్టు కింద కొత్తగా ఆరు భారీ ఓడరేవుల్ని అభివృద్ధి చేయనున్నారు. రవాణా రంగ సుస్థిర వృద్ధిలో భారత ఓడరేవులు, షిప్పింగ్‌ పరిశ్రమ కీలకపాత్ర పోషించనుంది. పోర్టు, హార్బర్‌ నిర్మాణ, నిర్వహణ ప్రాజెక్టుల్లోకి వందశాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్ని(ఎఫ్‌డీఐ) అనుమతించారు. దేశీయ జలమార్గాలు, ఓడరేవుల అభివృద్ధి, నిర్వహణ చేపట్టే సంస్థలకు పదేళ్ల పన్ను విరామం ప్రకటించారు. దేశంలో రవాణా రంగం చాలా వరకు అసంఘటితంగానే ఉంది. వృత్తిపరమైన నిర్వహణ లేదు. ఎక్కడికక్కడ ముక్కలై, అధిక వ్యయాలు, పెరిగిన చమురు ధరలు, వాహన నిర్వహణ సరిగ్గా లేకపోవడం, నకిలీ విడిభాగాలు, ఇరుకైన, గుంతలతో నిండిన రహదారులు, అధిక రద్దీ, ట్రాఫిక్‌ నియంత్రణ నిబంధనలు సరిగా లేకపోవడం, సంక్లిష్టమైన పన్నుల వ్యవస్థ, వృత్తి నిపుణులు, డ్రైవర్లు తక్కువగా ఉండటం, అస్తవ్యస్త ప్యాకేజింగ్‌, యాంత్రీకరణ లేకపోవడం వంటి బహుళ రకాల సమస్యలతో ఈ రంగం సతమతమవుతోంది. దీనివల్ల ప్రపంచ మార్కెట్లతో పోటీపడటంలో భారతీయ రవాణా వ్యవస్థ వెనకపడుతోంది.

భారత్‌ సువిశాల దేశం కావడంతో పలురకాల వాతావరణ పరిస్థితులతో కూడిన విభిన్న ప్రాంతాల్ని కలిగి ఉంది. దేశ అంతర్గత రహదారుల పరిస్థితి అంతంత మాత్రమే. అవి ప్రమాదాలకు నెలవుగా ఉన్నాయి. ట్రాఫిక్‌ నిలిచిపోవడం, పలుచోట్ల తనిఖీలు, టోల్‌ వసూలు కేంద్రాలు ఉండటం వంటివీ సమస్యాత్మకమే. ఇలాంటి సమస్యలతో రవాణా కంపెనీలు ఎంతో సమయం, ధనం నష్టపోతున్నాయి. వానకాలంలో భీకర వరదలు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఇలాంటి సమస్యల్ని సరికొత్త ఆలోచనలు, ప్రణాళికాబద్ధమైన వైఖరులతో పరిష్కరించాల్సిన అవసరం ఉంది. సరకు రవాణాకు సంబంధించి జాతీయ టోల్‌గేట్ల వద్ద సమయాన్ని ఆదా చేసేందుకు ప్రవేశపెట్టిన ఫాస్టాగ్‌ పరిజ్ఞానం చక్కని ఆలోచన. రవాణా, సరఫరా వ్యవస్థ నిర్వహణపై డిగ్రీ, పీజీ స్థాయుల్లో మరిన్ని కోర్సుల్ని అన్ని విశ్వవిద్యాలయాలు, సాంకేతిక విద్యాసంస్థల్లో ప్రవేశపెట్టాలి. దీనివల్ల రవాణా రంగానికి చక్కని విద్యార్హతలు కలిగిన మానవ వనరుల లభ్యత పెరుగుతుంది. సరకుల్ని వేగంగా చేరవేసేందుకు, వ్యయాల్ని తగ్గించేందుకు జాతీయ రహదారుల్ని పొడిగించడం, రాష్ట్ర రహదారుల్ని విస్తరించడం మంచి పరిష్కారం. డ్రైవర్లకు వృత్తిపరమైన శిక్షణ అందించేందుకు జాతీయ డ్రైవింగ్‌ కేంద్రాల ఏర్పాటు ఈ రంగానికి ఎంతో తోడ్పడుతుంది. అన్ని నగరాలు, పట్టణాల్లో ట్రాఫిక్‌ నిర్వహణ, నియంత్రణ వ్యవస్థల్ని ప్రవేశపెట్టడం తక్షణావసరం. రైలు మార్గాలన్నింటినీ విద్యుదీకరించడం వల్ల రవాణా వ్యయం మరింతగా తగ్గుతుంది.

జల మార్గం ఓ ఆశాకిరణం
దేశం వైశాల్యంలో పెద్దగా, భౌగోళికంగా అసమతౌల్యంగా ఉండటం వంటివి దేశవ్యాప్తంగా ఒకే తరహా రవాణా ప్రణాళికల్ని రూపొందించేందుకు అడ్డంకిగా నిలుస్తున్నాయి. దేశంలోని పెద్ద సంఖ్యలోని పారిశ్రామిక సమూహాలు మెట్రోపాలిటన్‌ నగరాల్లో కాకుండా ఎక్కువగా ద్వితీయశ్రేణి నగరాల్లోనే ఉన్నాయి. ఆసియాలోనే అతిపెద్ద మార్బుల్‌ మార్కెట్‌ రాజస్థాన్‌లోని కిషన్‌గఢ్‌లో ఉండగా- ఆగ్రా, కాన్పూర్‌ దేశంలో తోలు పరిశ్రమ హబ్‌లుగా వెలుగొందుతున్నాయి. మొరాదాబాద్‌ ఇత్తడి ఎగుమతులకు, ఫిరోజాబాద్‌ అద్దాల తయారీ పరిశ్రమకు; తిరుపూర్‌, ఈరోడ్‌, కరూర్‌, సేలం వస్త్ర పరిశ్రమకు కేంద్రాలుగా విలసిల్లుతున్నాయి. ఇలాంటి పారిశ్రామిక క్లస్టర్లపై వేర్వేరు రవాణా ప్రణాళికలతో దృష్టి సారించడం దేశానికి ఎంతో ఉపయుక్తమవుతుంది. భారత సముద్ర తీరమార్గం, నదీ జలమార్గాల్ని పూర్వకాలం నుంచీ పెద్దగా ఉపయోగించుకోకుండా విస్మరిస్తున్నారు. నిజానికివి పర్యావరణ హితకరమైన, చౌక రవాణా మార్గాలుగా ఉపయోగపడతాయి. సముద్ర, నదీ మార్గాల్ని ఉపయోగించుకోవడం వల్ల రవాణా వ్యయాలు రూ.21 వేల కోట్ల నుంచి రూ.27 వేల కోట్లదాకా తగ్గే అవకాశం ఉంది. రైల్వే, రహదారుల తరవాత జల రవాణాయే అత్యంత అనుకూల రంగం; భారత్‌లో పరిస్థితి భిన్నంగా ఉంది. 60 శాతం సరకు రవాణా రహదారుల ద్వారా సాగుతుండగా- 32 శాతం రైల్వేమార్గంలో; మిగతాది సముద్ర, వైమానిక, నదీ జలమార్గాల ద్వారా సాగుతోంది. ప్రస్తుత విధానాన్ని మార్చడం ద్వారా దేశంలో రవాణా వ్యయాల్ని తగ్గించవచ్చు. భారతీయ రవాణా పరిశ్రమ 2.2 కోట్లమందికిపైగా ఉపాధి కల్పిస్తూ, గత అయిదేళ్లకాలంలో 7.8 శాతం సీఏజీఆర్‌తో వృద్ధి సాధించింది. దేశంలో రవాణా పరిశ్రమ ఎదుగుదలకు ప్రభుత్వ వ్యూహాత్మక పెట్టుబడులు, విధానాలు కీలకం. ఈ రంగంలో ప్రపంచ ప్రమాణాలతో సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాల్ని ప్రవేశపెట్టడం అత్యంత ఆవశ్యకం. సరకు రవాణా సాఫీగా సాగేలా చూసేందుకు ఓడరేవుల్ని, విమానాశ్రయాల్ని, రవాణా టెర్మినళ్లను, రైల్వేస్టేషన్లను అనుసంధానించే పని ప్రాధాన్య ప్రాతిపదికన చురుకందుకోవాలి.

సాంకేతిక మెరుగులు అవసరం
దేశీయ రవాణా రంగం బహుళ జాతి సంస్థలతోపాటు, కేంద్ర ప్రభుత్వానికి ప్రాధాన్య అంశంగా మారింది. భారీ పరిమాణంలో వ్యాపార విస్తృతి వల్ల రవాణా, గిడ్డంగులు, సరకుల సత్వర బట్వాడా, కంటెయినర్‌ సేవలు, కొరియర్‌ సేవలు తదితర రంగాల్లో మరిన్ని వృద్ధి అవకాశాలు ఏర్పడతాయి. ఈ క్రమంలో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి నిర్ణేతల్లో రవాణా రంగం సైతం ఒకటయ్యే అవకాశాలున్నాయి. మనదేశంలో రవాణా మార్కెట్‌ పరిమాణం సుమారు 16వేల కోట్ల డాలర్లమేర ఉంటుందని అంచనా. ఈ క్రమంలో ప్రపంచ వాణిజ్య దిగ్గజాలకు భారత రవాణా రంగం ఆకర్షణీయంగా కనిపిస్తోంది. దేశంలో 32లక్షల చదరపు కిలో మీటర్ల పరిధిలో సరకుల్ని తరలించడం ద్వారా రవాణా రంగం దేశ ఆర్థిక వృద్ధిలో కీలకపాత్ర పోషించనుంది. 2019లో భారత్‌ జీడీపీలో రవాణా వ్యయాలు 14 శాతందాకా ఉన్నాయి. అమెరికాలో 9.5 శాతం, జర్మనీలో 8 శాతం, జపాన్‌లో 11 శాతంతో పోలిస్తే- మనదేశంలో అవి కొంత ఎక్కువే. ఈ క్రమంలో 2022 నాటికి ఈ వ్యయాల్ని 10 శాతానికి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మన రవాణా, సరఫరా వ్యవస్థల్ని జర్మనీ, జపాన్‌ వంటి దేశాల నమూనాలు, వ్యూహాలతో పోల్చి చూసినప్పుడు- ఆయా దేశాలు గరిష్ఠ ఉత్పాదకత సాధించేందుకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాల్ని ఉపయోగించడం కనిపిస్తుంది. దేశంలో రవాణా కంపెనీలు మారుతున్న కాలానికి అనుగుణంగా తమ సాంకేతిక పరిజ్ఞానాల్ని మెరుగుపరచుకోవడంలో విఫలమైనట్లు తెలుస్తోంది. ఖర్చుల్ని తగ్గించుకునేందుకు ఇలాంటి చర్యలకు పాల్పడినట్లు కనిపిస్తున్నా, ఈ విధానం దీర్ఘకాలంలో తీవ్రంగా నష్ట పరుస్తుందని చెప్పవచ్చు. 2017-18 ఆర్థికసర్వే ప్రకారం భారత రవాణా పరిశ్రమ రాబోయే సంవత్సరాల్లో 20.5 శాతం చక్రీయ వార్షిక వృద్ధిరేటు (సీఏజీఆర్‌)తో వృద్ధి చెందే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 2.2 కోట్ల మంది ఈ రంగంలో ఉపాధి పొందుతున్నారు. 2025 నాటికి నాలుగు కోట్ల మందికి ఉపాధి కల్పించే అవకాశం ఉన్నట్లు అంచనా. ఈ రంగం భవిష్యత్తు ఆశావహంగా ఉన్న నేపథ్యంలో భారత ప్రభుత్వం వ్యూహాత్మక ప్రణాళికలతో ముందుకు సాగే దిశగా కనిపిస్తోంది.

Posted on 06-03-2020