Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఆర్థిక రంగం

ఆర్థిక రథానికి జోడు గుర్రాలు!

* కేంద్రం-ఆర్‌బీఐ సమన్వయం కీలకం
దేశ ఆర్థిక రథాన్ని ముందుకు దూకించడంలో ఒక్కో సారథిది ఒక్కో తీరు. కట్టుతప్పుతున్న ధరలను నియంత్రించి, ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడమే ప్రాథమిక లక్ష్యంగా మొన్నటిదాకా ఆర్‌బీఐ గవర్నర్‌గా ఉన్న రఘురామ్‌ రాజన్‌ క్రియాశీలంగా వ్యవహరించారు. ఆయన స్థానే ఇటీవల బాధ్యతలు స్వీకరించిన ఉర్జిత్‌ పటేల్‌ వచ్చీ రావడంతోనే కొత్త పంథా తొక్కి పలువురిని సంభ్రమాశ్చర్యాలకు గురిచేశారు. ద్రవ్యోల్బణ భయాలను తోసిరాజంటూ తొలి పరపతి విధాన సమీక్షలోనే వడ్డీరేట్లను పావు శాతం తెగ్గోసి- తన మొగ్గు వృద్ధివైపేనని ఆయన స్పష్టమైన సంకేతాలిచ్చారు. క్షేత్రస్థాయి వాస్తవాలను మదింపువేసి ఉర్జిత్‌ తీసుకున్న నిర్ణయం పారిశ్రామిక, వాణిజ్య వర్గాల్లో కొత్త ఉత్సాహం నింపింది. ఉర్జిత్‌ పటేల్‌ ఆగమనానికి మునుపు వడ్డీరేట్ల తగ్గింపుపై ఎడతెగని తాత్సారం జరిగింది. ఒక దశలో ప్రభుత్వ అభివృద్ధి విధానాలకు అనుగుణంగా ఆర్‌బీఐ వ్యవహరించాలా లేక ఆర్‌బీఐ వ్యూహాలకు తగినట్లుగా ప్రభుత్వ పంథా ఉండాలా అన్న చర్చ సైతం జోరుగా సాగింది. ఆర్‌బీఐ స్వతంత్ర ప్రతిపత్తిపై వాదవివాదాలకు తెరదించుతున్నట్లుగా, ప్రభుత్వంతో కలిసి కేంద్ర బ్యాంక్‌ మరింత సమన్వయంతో ముందుకు సాగాల్సిన అవసరాన్ని ఉద్బోధిస్తున్నట్లుగా తాజా పరిణామాలుండటం శుభసూచకం!

పెరిగిన బాధ్యతలు
కేంద్ర బ్యాంకు పాత్ర, విధులు క్రమక్రమంగా ఎదుగుతున్నాయి. ఈ పరిణామ ప్రక్రియ అడుగడుగునా అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. 1900లో ప్రపంచమంతటా కొన్ని కేంద్ర బ్యాంకులు మాత్రమే ఉండేవి. కరెన్సీ, నాణాల ముద్రణ, విదేశ మారక ద్రవ్య నిల్వల నియంత్రణ వంటి విధులను ప్రభుత్వం తరపున అవి నిర్వహించేవి. కాలక్రమంలో ద్రవ్యోల్బణం అదుపు, వడ్డీరేట్ల నిర్ణయం వంటి బాధ్యతలు దఖలుపడ్డాయి. కేంద్ర బ్యాంకులు ప్రభుత్వ జోక్యానికి అతీతంగా స్వతంత్రంగా వ్యవహరించాలనే భావన మొదట అభివృద్ధి చెందిన దేశాల్లో వేళ్లూనుకుంది. 1979-82 మధ్యకాలంలో అమెరికాలో పాల్‌ వోకల్‌ నాయకత్వంలోని ఫెడరల్‌ రిజర్వు (కేంద్ర బ్యాంకు) ద్రవ్యోల్బణాన్ని విజయవంతంగా అదుపు చేసినప్పటి నుంచి ఈ భావన మరింత బలపడింది. వోకర్‌ అనుసరించిన విధానానికి చట్టరూపం కల్పించారు. దీంతో కేంద్ర బ్యాంకులకు మరింత స్వేచ్ఛ ఇవ్వాలనే వాదం బలపడింది. లాట్వియా, హంగరీ, ఆర్మీనియా, బోస్నియా దేశాల కేంద్ర బ్యాంకులు ప్రపంచంలో అత్యంత స్వతంత్రంగా వ్యవహరించే సంస్థలుగా పేరుపడ్డాయి. భారత్‌, అమెరికా, సౌదీ అరేబియా, సింగపూర్‌ కేంద్ర బ్యాంకులు స్వాతంత్య్ర సూచీలో బాగా దిగువన ఉన్నాయి. కానీ, 2008లో ఆర్థిక సంక్షోభం విరుచుకుపడిన తరవాత అమెరికా, బ్రిటన్‌ తదితర దేశాల్లో కేంద్ర బ్యాంకుల స్వాతంత్య్రంపై పునరాలోచన ప్రారంభమైంది. ఈ బ్యాంకులు ప్రభుత్వాల నుంచి ఆర్థిక, రాజకీయ మద్దతు పొందనిదే నిలబడలేని పరిస్థితి వచ్చింది.
ఇటీవలి కాలంలో బ్యాంకేతర మార్గాల్లో ఫైనాన్సింగ్‌ చేయడం ఎక్కువై ద్రవ్య విధానం బలహీనపడింది. అయినా, బ్యాంకేతర రంగ పాత్ర, కార్యకలాపాల గురించి పూర్తి సమాచారం లేదు. కేంద్ర బ్యాంకుల ద్రవ్య విధానానికి, ప్రభుత్వ కోశ విధానానికి మధ్య అంతరం పెరిగిపోయి ఆర్థిక సుస్థిరతకు ముప్పు ఏర్పడుతోంది. ప్రభుత్వానికి పన్నుల ద్వారా లభించే ఆదాయం, వివిధ ప్రాజెక్టులపై అది చేసే వ్యయం కోశ విధాన పరిధిలోకి వస్తాయి. దేశంలో కరెన్సీ సరఫరా, ద్రవ్యోల్బణ అదుపు ద్రవ్య విధానం పరిధిలో ఉంటాయి. కోశ విధానం ప్రభుత్వ అజమాయిషీలో ఉంటే ద్రవ్య విధానం కేంద్ర బ్యాంకు చేతుల్లో ఉంటుంది. ఈ రెండింటి మధ్య అసమతూకం ఆర్థిక అస్థిరతకు దారితీస్తుంది. భారతదేశంలో యువ జనాభా ఎక్కువగా ఉండటంతో పుష్కలంగా ఉపాధి అవకాశాలు సృష్టించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. వడ్డీ రేట్లు తగ్గించి ద్రవ్య సరఫరా ఎక్కువ చేయనిదే కొత్త పరిశ్రమల స్థాపనకు నిధులు లభించవు. ఇక్కడ అనుసరించే విధానానికి, జపాన్‌, ఐరోపా, అమెరికాల విధానానికి చాలా తేడా ఉంటుంది. జపాన్‌లో వృద్ధుల జనాభా పెరుగుతుంటే, ఐరోపాకు వలసల తాకిడి ఎక్కువవుతోంది. సహజంగానే ఈ దేశాల కేంద్ర బ్యాంకులు అనుసరించే విధానాలకు, భారత్‌ వంటి వర్ధమాన దేశాల విధానాలకు చాలా తేడా ఉంటుంది. అభివృద్ధి చెందిన దేశాల్లో ఆర్థిక రంగం పరిణతి చెందినా అంతర్జాతీయ పరిణామాలతో తీవ్రంగా ప్రభావితమవుతోంది. ఉదాహరణకు చైనా దగ్గర అపార విదేశ ద్రవ్యరాశులు పోగుపడి ఉండటం అమెరికా ‘ఫైనాన్స్‌’ మార్కెట్లపై నేరుగా ప్రభావం చూపింది. దీన్ని నివారించడానికి 2004-2005 మధ్య అమెరికా ప్రభుత్వం పలు ఆంక్షలు విధించే విషయం పరిశీలించింది. తరవాత 2008లో అమెరికాలో విరుచుకుపడిన ఆర్థిక సంక్షోభం మిగతా ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది.
ఏదిఏమైనా అమెరికా, జర్మనీ, స్విట్జర్లాండ్‌లు తప్ప అనేకానేక దేశాల్లో ఇటీవలి వరకూ ద్రవ్య విధానాన్ని ప్రభుత్వమే నియంత్రించేది. అదే బ్రిటన్‌ కేంద్ర బ్యాంకు-బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌ను 1694లో స్థాపించినా 1997లో మాత్రమే దానికి కార్యనిర్వహణపరంగా స్వేచ్ఛనిచ్చారు. అంటే అంతవరకు వడ్డీరేట్లను ప్రభుత్వమే నిర్ణయించేదన్న మాట. అమెరికా ఫెడరల్‌ రిజర్వు ప్రజలకు, కాంగ్రెస్‌ (పార్లమెంటు)కు జవాబుదారీ వహించాలి. వర్ధమాన దేశాల్లో ఫైనాన్స్‌ విపణులు ఇంకా పరిణతి చెందలేదు కాబట్టి అక్కడి కేంద్ర బ్యాంకులకు పూర్తి స్వాతంత్య్రం ఇవ్వడం ప్రస్తుతానికి అభిలషణీయం కాదు. పలు వర్ధమాన దేశాలు సోషలిస్టు వ్యవస్థ నుంచి మార్కెట్‌ ఆర్థిక వ్యవస్థకు మారుతున్నాయి. ఈ దేశాల్లో ఇటీవలి వరకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ప్రభుత్వ యాజమాన్యంలోనే ఉండేవి. ప్రభుత్వ బ్యాంకులు ప్రధానంగా ప్రభుత్వ ప్రాజెక్టుల్లో, సంస్థల్లో పెట్టుబడులు పెడుతూ వచ్చాయి. ఈ దేశాల్లో విదేశ మారక ద్రవ్య రేట్లను మార్కెట్‌ యంత్రాంగం కాకుండా నేరుగా ప్రభుత్వాలే నిర్ణయిస్తున్నాయి. కుగ్రామాలకు, పేదలకు బ్యాంకింగ్‌ సేవలు అందించడానికి ప్రాధాన్యమిస్తున్నాయి. కేంద్ర బ్యాంకులు ఇలా అనేక రకాల బాధ్యతలను తలకెత్తుకొంటున్నందున వాటికి పూర్తి స్వాతంత్య్రం ఇవ్వడం అభిలషణీయం కాదు. అవి ప్రభుత్వాలతో కలిసి పనిచేయడం ఉత్తమం. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి, ఆర్థిక సుస్థిరత, సమ్మిళిత అభివృద్ధి సాధన, ద్రవ్యోల్బణం అదుపు. ఉపాధి అవకాశాల విస్తరణకు ప్రభుత్వాలు తమ ఆర్థిక విధానాలను అంకితం చేస్తాయి. ఈ లక్ష్యాలను సాధించడానికి ప్రభుత్వాలు, కేంద్ర బ్యాంకులు కలిసికట్టుగా కృషి చేయాలి. అంతేతప్ప కేంద్ర బ్యాంకు స్వాతంత్య్రానికి ఇక్కడ ప్రాధాన్యం లేదు. అదీకాకుండా ప్రజాప్రతినిధుల నుంచి స్వాతంత్య్రం కావాలనడం ప్రజాస్వామ్యంలో ఏ విధంగానూ సమర్థనీయం కాదు. అది సాధ్యపడదు కూడా. ఏ ప్రజాస్వామ్యంలోనైనా ప్రభుత్వాలు తమ ప్రజల, పరిశ్రమల అవసరాలను తీర్చడానికే అగ్ర ప్రాధాన్యమిస్తాయి. సమాజంలోని వివిధ వర్గాలకు వనరుల కేటాయింపు, నిధుల వ్యయీకరణలో సమతూకం పాటిస్తాయి. అందువల్ల ఎన్ని విభేదాలున్నా ప్రభుత్వం, కేంద్ర బ్యాంకు ఎప్పటికప్పుడు సంప్రతించుకుంటూ సమన్వయీకృతంగా ముందుకుసాగాలి. అమెరికా, బ్రిటన్‌, కెనడాల్లో జరుగుతోంది ఇదే.

ఏకాభిప్రాయంతో ముందుకు...
భారత్‌ వంటి వర్ధమాన దేశంలో కేంద్ర బ్యాంకు స్వయంప్రతిపత్తి గురించి తర్జనభర్జన జరపడం మంచిది కాదన్న మాజీ రిజర్వు బ్యాంకు గవర్నర్‌ బిమల్‌ జలన్‌, 1997-98 ఆసియా ఆర్థిక సంక్షోభం గురించి ప్రస్తావించారు. ‘ఆ సంక్షోభ ప్రభావం భారత్‌ మీద కూడా పడి మన విదేశ మారక నిల్వలు తరిగిపోసాగాయి. అప్పట్లో రూపాయి మారక విలువను నిభాయించేటప్పుడు మన ఆర్థిక వ్యవస్థపై ప్రజల్లో, విదేశాల్లో నమ్మకం సడలిపోకుండా జాగ్రత్తపడాల్సి వచ్చింది. ఆ సమయంలో రిజర్వు బ్యాంకు స్వతంత్య్రంగా వ్యవహరిస్తూనే ప్రభుత్వంతో చేయీచేయీ కలిపి పనిచేసింది. ఏకాభిప్రాయం, సమన్వయం, స్వేచ్ఛ ఇలా అన్ని లక్షణాలు కలగలిశాయి. ఆసియా సంక్షోభాన్ని ఎలా ఎదుర్కోవాలనే అంశంపై ప్రభుత్వం, రిజర్వు బ్యాంకు మధ్య ఏకాభిప్రాయం నెలకొంది. అదే సమయంలో ప్రభుత్వం భారతీయ పార్లమెంటుకు జవాబుదారీ అని మరచిపోకూడదు. కొన్ని చర్యలు ఆర్థికంగా అనివార్యమైనా రాజకీయాలతో నిమిత్తం లేకుండా వాటిని తీసుకోలేం. ఆర్థికాన్ని అవతలికి నెట్టే శక్తి రాజకీయాలకు ఉంది. జటిలమైన సమస్యలు ఎదురైనప్పుడు ప్రభుత్వం, రిజర్వు బ్యాంకు పరస్పరం సంప్రతించుకుని పరిష్కారంపై ఏకాభిప్రాయానికి రావాల్సి ఉంటుంది’ అని జలన్‌ అన్నారు. ‘ఇదే మాట మరోరకంగా చెప్పాలంటే ఏ సమస్యా లేనప్పుడు రిజర్వు బ్యాంకు స్వతంత్య్రంగా పనిచేసుకుపోతుంది. ఏదైనా తీవ్ర సమస్య ఎదురైతే ప్రభుత్వంతో సంప్రతిస్తూ పరిష్కారం కనుగొంటుంది. కనుక సంప్రతింపులు-ఏకాభిప్రాయ సాధనే భేషైన మార్గం’ అని ఆయన వివరించారు.
భార్యాభర్తల్లో ఎవరు ఎక్కువ స్వతంత్రులు అనే ప్రశ్న తలెత్తడం దాంపత్యానికి మంచిది కాదు. దంపతులిద్దరూ కలిసిమెలసి జీవిస్తూ, సంసారంలో ఎదురయ్యే సమస్యలపై చర్చించుకొని ఏకాభిప్రాయంతో పరిష్కారం సాధించినప్పుడు వారి వైవాహిక జీవితం సుఖంగా సాగుతుంది. రిజర్వు బ్యాంకు, కేంద్ర ప్రభుత్వం కూడా ఇదే పంథాలో ముందుకుసాగాలి. ప్రజలందరికీ ఆర్థిక శ్రేయస్సు చేకూర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం స్థూల ఆర్థిక విధానాన్ని రూపొందించుకొంటుంది. ఈ విశాల విధానంలో అంతర్భాగాలైన ద్రవ్య, కోశ విధానాలు పరస్పరాశ్రితమే తప్ప వేటికవి స్వతంత్రంగా పనిచేయకూడదు. సంపన్న దేశాల కేంద్ర బ్యాంకులు స్వతంత్రంగా వ్యవహరించినంత మాత్రాన వర్ధమాన దేశాల బ్యాంకులూ అదే విధంగా ప్రవర్తించాలని లేదు. ఆర్థిక విపణులు, స్థూల ఆర్థిక వ్యవస్థ పరిణత స్థాయిని అందుకున్న సంపన్న దేశాల్లో కేంద్ర బ్యాంకులకు స్వతంత్రంగా వ్యవహరించే వెసులుబాటు ఉంటుంది. వర్ధమాన దేశాలకు అది ఒక విలాసం మాత్రమే. భారతదేశం ఈ తేడాలను అర్థంచేసుకుని ముందుకుసాగాలి!

Posted on 07-10-2016