Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఆర్థిక రంగం

దేశార్థికానికేదీ దన్ను?

విశ్వ మానవాళికిప్పుడు అదృశ్య కరోనా వైరస్‌ ఉమ్మడి శత్రువు. కొవిడ్‌-19 పేరిట వ్యవహరిస్తున్న మహమ్మారి విశృంఖల ఖడ్గచాలనానికి రెక్కలు తెగటారి ప్రపంచార్థికం మునుపెన్నడెరుగనంతటి తీవ్ర అనిశ్చితిలోకి జారిపోతోంది. ఎటుచూసినా రంగాలవారీగా క్షీణత, ఇకమీదట ఏం జరగనుందోనన్న ఆందోళన ప్రస్ఫుటమవుతున్నాయి. సుమారు రెండు నెలల క్రితం చైనా అధ్యక్షులు షీ జిన్‌పింగ్‌ ‘పిశాచంతో పోరాడుతున్నా’మని ప్రకటించే సమయానికి అక్కడ నమోదైన కేసులు 106; అమెరికాలో మూడు, ఇటలీలో సున్నా. ఇంతలోనే ఊహాతీత వేగంతో 190కి పైగా దేశాల్ని కమ్మేసిన కొవిడ్‌ 19 పెను విజృంభణకు సుమారు 3.82 లక్షల కేసులు, 17 వేలకు పైగా మరణాలు అద్దం పడుతున్నాయి. కరోనా ధాటికి దేశదేశాల ఆర్థిక వ్యవస్థలు కుదేలవుతున్న తరుణంలో తనవంతుగా బ్రిటన్‌ ఉద్యోగాల రక్షణకు భారీ ప్యాకేజీ ప్రకటించింది. వివిధ సంస్థల సిబ్బంది జాబితాలో కొనసాగుతూ ప్రస్తుతం పనిచేయలేని స్థితిలో ఉన్న ఉద్యోగుల వేతనాల్లో 80 శాతం మేర భరించడానికి అక్కడి ప్రభుత్వం ముందుకొచ్చింది. కరోనా తాకిడితో దెబ్బతిన్న ఆర్థికరంగానికి రూ.2.9 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించిన ఆస్ట్రేలియా, నిరుద్యోగ భృతిని రెట్టింపు చేసింది. పింఛనుదారులకూ నెలనెలా అదనపు సాయం అందించనుంది. పరిశోధన, వ్యాక్సిన్ల అభివృద్ధికి, కరోనా బాధితుల చికిత్సకు 63 వేలకోట్ల రూపాయలకు పైగా నిధిని ప్రత్యేకిస్తామన్న అమెరికా- వాణిజ్య సంస్థలకు లక్షలాది శ్రామికులకు మేలు చేసేలా 1.6 లక్షల కోట్ల డాలర్ల సాయాన్ని, ఆర్థికానికి కొత్త ఊపిరులూదడానికి మరో నాలుగు లక్షల కోట్ల డాలర్ల ప్యాకేజీని సాకారం చేసే నిమిత్తం విస్తృత సంప్రతింపుల్లో నిమగ్నమై ఉంది. ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీ, యూఏఈ సహా మరెన్నో దేశాలూ ఉద్దీపన ప్యాకేజీలను ఇప్పటికే వెలువరించాయి. కరోనాపై పోరులో యావద్భారతాన్నీ ఉరకలెత్తించేలా పకడ్బందీ కార్యాచరణకు కేంద్రం చురుగ్గా కదలాలి!

ఇది మానవాళికి గతంలో ఎన్నడూ అనుభవం కాని మహోత్పాతం. ప్రధాని మోదీ అభివర్ణించినట్లు, కనిపించని శత్రువుతో సాగిస్తున్న ఈ సమరం ప్రపంచ యుద్ధాలనే తలదన్నే మహా వైపరీత్యం! స్టాక్‌ మార్కెట్లు తీవ్ర ఒడుదొడుకులకు లోనవుతున్నాయి. వస్తుసేవలకు డిమాండు తెగ్గోసుకుపోగా- ఉత్పత్తి, సరఫరా వ్యవస్థలు అలవిమాలిన ఒత్తిడి పాలబడ్డాయి. ఉపాధికల్పన చతికిలపడింది. అసంఖ్యాకుల బతుకుతెరువు ఎండమావిని తలపిస్తోంది. సేద్యం, గ్రామీణ భారతాల ముఖచిత్రం చిన్నబోయింది. అసంఘటిత రంగానికి చెందిన, చిన్న మధ్యతరహా సంస్థల్లో పొట్టపోసుకుంటున్న కోట్లమంది బతుకుబండి గాడి తప్పింది. పర్యాటక, ఆతిథ్య, రవాణా రంగాల్లాంటివి వెలాతెలా పోతున్నాయి. ఇటువంటి పరిణామాల్ని ఊహించిన వివిధ దేశాలు యుద్ధప్రాతిపదికన పలు చర్యల అమలుకు సిద్ధపడ్డాయి. ప్రత్యేకించి ఆరోగ్య రంగం, శ్రామిక విపణి, చిన్న మధ్యతరహా సంస్థలు కరోనా దాడికి కమిలిపోరాదన్న ముందుచూపుతో తన పరిధిలో ఐరోపా సంఘం (ఈయూ) 3,700 కోట్ల డాలర్ల పెట్టుబడుల్ని ప్రవహింపజేస్తోంది. దేశీయంగా జాతీయ స్థాయిలోనూ అటువంటి చొరవ ప్రదర్శితం కావాల్సి ఉంది. నిరుపేదలకు అదనపు రేషన్‌ ఇస్తామన్న దిల్లీ రాష్ట్ర ప్రభుత్వం వితంతువులు, దివ్యాంగులకు ఈ నెల రెట్టింపు పింఛన్లు ఇస్తామంటోంది. యూపీ, తెలంగాణ, ఏపీ సహా కొన్ని రాష్ట్రాలు- పనిచేస్తే తప్ప రోజు గడవని పేదలను సాంత్వనపరచే చర్యలు కొన్నింటిని ప్రకటించాయి. ఆర్థిక సత్తువ పరంగా పరిమితులున్నప్పటికీ ఉన్నంతలో రాష్ట్రాలు కనబరచిన ఔదార్యం, విపత్కాలంలో వాటి చొరవకు దర్పణం. 53 శాతం వాణిజ్య సంస్థల్ని కరోనా దుష్ప్రభావం వణికిస్తోందని ‘ఫిక్కీ’ ఇటీవలి సర్వే నిర్ధారించిన నిజాల వెలుగులో, కేంద్రం ఎంత మేర ఆపన్నహస్తం అందిస్తుందో చూడాలి!

కర్కశ వైరస్‌ కట్టడిలో భాగంగా జాతిని సమాయత్తపరచి ‘లాక్‌డౌన్‌’కు పిలుపివ్వడంలో యూకే, అమెరికాల మందకొడితనం, ప్రభుత్వ ఆదేశాలు అమలుపరచడంలో ఇటలీ పౌరుల అలసత్వం- చరిత్రలో చీకటి ఘట్టాలుగా మిగిలిపోతాయి. ప్రాణనష్టంలో చైనాను మించిపోయిన దుఃఖభారం ఇటలీని కుదిపేస్తుండగా- ‘అగ్రజోడీ’ హోదా మసకబారేలా స్వీయవైఫల్యాలు అమెరికా, బ్రిటన్లను కుంగదీస్తున్నాయి. నష్టతీవ్రతకు తగ్గట్లు అవి భూరి ప్యాకేజీలకు రూపకల్పన చేయాల్సివచ్చింది. కరోనా నియంత్రణలో ఇతరుల ఘోరతప్పిదాలను పునరావృతం కానివ్వకుండా అన్ని రకాల జాగ్రత్తలు, సత్వర నిర్ణయాలు తీసుకుంటేనే భారత్‌ గండం గడిచి తెరిపిన పడగలుగుతుంది. ‘జనతా కర్ఫ్యూ’ సందర్భంగా వ్యక్తమైన అపురూప జనస్పందన పరగడుపున పడిపోయి నియమోల్లంఘనలు పెచ్చరిల్లిన పక్షంలో ఎంతటి పెనుముప్పు వాటిల్లగలదోనన్న అంచనాలు భీతిల్లజేస్తున్నాయి. ముంబయి, కోల్‌కతా, బెంగళూరుల్లో తలా అయిదు లక్షలు, దేశ రాజధానిలో 15 లక్షల దాకా కేసులు నమోదయ్యే ప్రమాదం పొంచి ఉందన్న సర్కారీ అంచనాలు- పరిస్థితి చేజారితే కరోనా బాధితుల సంఖ్య మరింతగా విస్తరిస్తుందనీ చాటుతున్నాయి. అంతటి దయనీయ దుస్థితి భారత్‌కు దాపురించకూడదన్నా, మెట్టు జారకుండా కీలక రంగాలూ దేశార్థికం నిలదొక్కుకోవాలన్నా ప్రభుత్వం పాదరసంలా వ్యవహరించాలి. ప్రజానీకమూ బాధ్యతాయుత పాత్రపోషణతో అత్యవసర తోడ్పాటు అందించాలి. అసాధారణ పరిస్థితుల్లో అసాధారణ నిర్ణయాలే శరణ్యం. ఉద్యోగుల్ని పరిశ్రమల్ని ఆదుకునేలా ప్రభుత్వ సంక్షేమ చర్యలు, కరోనా మీద పైచేయి సుసాధ్యమయ్యేలా సామాజిక చేతన- సమపాళ్లలో జత కలిస్తే, మహమ్మారిపై మనదే విజయం!

Posted on 25-03-2020