Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఆర్థిక రంగం

కూలుతున్న ఆర్థిక వ్యవస్థలు

దూదిగుట్టలో నిప్పు నెరసులా కరోనా వైరస్‌ సృష్టిస్తున్న పెనువిధ్వంసం- ప్రపంచ మానవాళి బతుకుల్ని, బతుకు తెరువుల్ని ఒక్కతీరుగా బుగ్గిపాలు చేస్తోంది. 16 లక్షలు దాటిన కొవిడ్‌ కేసులు, లక్షకు చేరువైన మరణాలతో నెలకొన్న భయానక పరిస్థితికి తోడు దేశదేశాల ఆర్థిక సౌధాలూ కుప్పకూలుతున్నాయి. మూడు నెలల క్రితంనాటి అంచనాలు తలకిందులై 170 దేశాల్లో తలసరి ఆదాయాలు కుంగిపోతున్నాయని ఐఎమ్‌ఎఫ్‌ తాజాగా స్పష్టీకరించింది. ప్రపంచ శ్రామికశక్తిలో 81 శాతానికి(330 కోట్లమందికి) బతుకు తెరువు కల్పించే పరిశ్రమలు పాక్షికంగానో, పూర్తిగానో మూతపడ్డాయని ఇటీవలే ఐక్యరాజ్య సమితి అధ్యయనమూ చాటింది. మహమ్మారి కరోనా మరెంత కాలం చావుబాజాలు మోగిస్తుందన్న దాన్నిబట్టి పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లయ్యే ప్రమాదమూ ఉందని ఐఎమ్‌ఎఫ్‌ హెచ్చరిస్తోంది. కరోనా పీడ సమసిపోయేనాటికి ప్రపంచ జనాభాలో దాదాపు సగం మంది పేదరికంలోకి జారిపోతారన్నది ‘ఆక్స్‌ఫామ్‌’ సంస్థ అంచనా. ఎక్కడికక్కడ పరిశ్రమలు మూతపడి, ఉపాధి అవకాశాలు కోసుకుపోయి ఒక్క అమెరికాలోనే కోటీ 70లక్షల మంది నిరుద్యోగ భృతి కోసం చకోరాలై ఎదురుచూస్తున్న దురవస్థ- నడినెత్తిన మాంద్యం ఉరుముతోందనడానికే దాఖలా! 1930ల నాటి మహామాంద్యం తరహా విపత్తు కాచుకొని ఉందన్న ఐఎమ్‌ఎఫ్‌ భవిష్యద్ద్దర్శనం మరింతగా భీతి గొలుపుతోంది!

మొదటి ప్రపంచ యుద్ధం ముగిసేదశలో విరుచుకుపడిన స్పానిష్‌ ఫ్లూ అయిదు కోట్లమంది అభాగ్యుల్ని పొట్టనపెట్టుకొని మానవ మహావిషాదం సృష్టించింది. పిమ్మట పదేళ్లకు అమెరికా షేర్‌ మార్కెట్‌ కుప్పకూలడంతో మొదలైన మహామాంద్యం దేశదేశాల్ని అతలాకుతలం చేసింది. అదే నేడు, అన్ని ఖండాలపైనా కరోనా చేస్తున్న మృత్యుదాడి- మనుషులతోపాటు ఆర్థిక వ్యవస్థల ఆయువునూ ఒకేసారి కబళిస్తోంది. కోరసాచిన కొవిడ్‌కు భయపడి నూరు దేశాలు సరిహద్దుల్ని మూసేశాయి. ఎగుమతి దిగుమతులే పడుగుపేకల్లా అల్లుకొన్న అంతర్జాతీయ వాణిజ్యానికి రెక్కలు తెగడంతో అభివృద్ధి చెందుతున్న దేశాలే తీవ్రంగా దెబ్బతినిపోతున్నాయి. జి-20 దేశాలు ఇప్పటికే అయిదు లక్షల కోట్ల డాలర్ల ప్యాకేజీలతో దేశీయ ఆర్థిక వ్యవస్థల్ని గాడిన పెట్టడానికి విశ్వప్రయత్నం చేస్తున్నాయి. ఆపాటి విత్త సత్తువ లేని దేశాలు అంతర్జాతీయ సాయం కోసం ఎదురుచూస్తున్నాయి. ప్రపంచ వాణిజ్యం ఈ ఏడాది 13నుంచి 32శాతం దాకా కుంచించుకుపోనుందన్న డబ్ల్యూటీఓ- 1930ల్లో మాదిరిగా రక్షణాత్మక విధానాలు పొటమరించే ప్రమాదాన్ని శంకిస్తోంది. వర్ధమాన దేశాలు నిలదొక్కుకునేలా రెండున్నర లక్షల కోట్ల డాలర్ల ప్యాకేజీ అందించాలన్న ఐక్యరాజ్య సమితి మొత్తుకోళ్లు ఫలించకపోతే- మాంద్యం మంటల్లో బీదాబిక్కీయే సమిధలయ్యేది!

మానవాళి భవిష్యత్తుకు కరోనా దెయ్యంలా దాపురించిందన్న రిజర్వ్‌బ్యాంక్‌ వ్యాఖ్య అక్షర సత్యం. ఏటా అయిదు లక్షలకోట్ల డాలర్ల వంతున కరోనా ప్రపంచార్థికాన్ని కొల్లగొట్టనుందని, అది జపాన్‌ స్థూల దేశీయోత్పత్తి కంటే అధికమన్న అంచనాలు హృదయశల్యం! కొవిడ్‌కు వ్యాక్సిన్‌ కనుగొనేదాకా ఆటుపోట్లు తప్పవంటున్న నేపథ్యంలో- ప్రగతిరథ చక్రానికి ఇరుసు లాంటి వ్యవస్థల్ని ఆదుకోవడానికి అన్ని దేశాలూ శతథా ప్రయత్నిస్తున్నాయి. పది లక్షల కోట్ల రూపాయల ఉద్దీపన ప్యాకేజీని ఇండియా సత్వరం ప్రకటించాల్సిన అవసరం ఉందని ఫిక్కీ లాంటి వాణిజ్య సంస్థలతోపాటు, ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. మూడు వారాల లాక్‌డౌన్‌ కారణంగా ఇండియా తొమ్మిది లక్షల కోట్ల రూపాయల నష్టం చవిచూసినట్లు అధ్యయనాలు చాటాయి. దేశార్థిక రథం ధీమాగా ముందడుగు వేసేలా పరిశ్రమలకే నాలుగు లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రాణావసరమన్న పరిస్థితుల్లో- భారత్‌ వ్యూహం ద్విముఖం కావాలి. కొవిడ్‌ బారి నుంచి ప్రజల్ని, దేశ ప్రగతిని కాచుకొనేలా సర్కారీ విధానాలు పదునుతేలాలి!

Posted on 11-04-2020