Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఆర్థిక రంగం

పారు బాకీలతో పారా హుషార్‌!

* బ్యాంకింగ్‌ రంగానికి కాయకల్ప చికిత్స
దేశ బ్యాంకింగ్‌ రంగాన్ని పట్టి పీడిస్తున్న మొండిబాకీల (నిరర్ధక ఆస్తులు) సమస్య, నానాటికి మరింత తీవ్రరూపం దాలుస్తూ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. రెండు మూడేళ్లుగా మొండిబాకీలను తగ్గించేందుకు బ్యాకింగ్‌ వ్యవస్థ తీవ్ర కృషిచేస్తున్నా సమస్య ముదురుతుండటం ఆందోళనకర పరిణామం. మొండి బాకీల భారం, క్షీణిస్తున్న వ్యాపారాభివృద్ధి బ్యాంకుల లాభదాయకతపై ప్రభావం చూపాయి. కొన్ని బ్యాంకులు నష్టాల బాట పట్టాయి. మరికొన్ని నామమాత్ర లాభాలకు పరిమితమయ్యాయి. గతంలో భారీనష్టాల్లో మునిగిన కొన్ని బ్యాంకులు మాత్రం స్వల్ప లాభాలు ఆర్జించడం కొంతలో కొంత వూరట. నిరుడు నవంబర్‌ ఎనిమిదిన ప్రకటించిన పెద్దనోట్ల రద్దు ప్రభావం వల్ల దాదాపు అన్ని రంగాల నుంచి (చిల్లర రుణాలు మినహా) రుణ గిరాకీ బాగా క్షీణించింది. మూడో త్రైమాసికంలో (అక్టోబర్‌-డిసెంబర్‌) బ్యాంకుల డిపాజిట్లు భారీగా పెరిగినప్పటికీ, రుణ గిరాకీ లేకపోవడం చాలా బ్యాంకులపై ప్రతికూల ప్రభావం చూపింది. పెరుగుతున్న మొండి బాకీలు, క్షీణిస్తున్న నికర వడ్డీ మార్జిన్లు, తగ్గుతున్న రుణ గిరాకీ, పతనమవుతున్న లాభదాయకతలు బ్యాంకులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. చిన్న బ్యాంకుల మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్న పరిణామాలివి. మరోవైపు కొత్తగా రంగప్రవేశం చేసిన, చేస్తున్న చెల్లింపుల బ్యాంకులు, ఫిన్‌టెక్‌ సంస్థల(ఆర్థిక సాంకేతిక అంకుర సంస్థలు) శిక్షాఫైనాన్స్‌, క్యాటలిస్ట్‌ ల్యాబ్‌ (ప్రాఫిట్‌ బుక్స్‌, గ్యాన్‌ధీన్‌ వంటివి) నుంచి బ్యాంకులు గట్టిపోటీ ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో దేశ బ్యాంకింగ్‌ రంగం ఏకీకరణ దిశగా అడుగులు వేయక తప్పని పరిస్థితి ఎదురవుతోంది. బలహీన బ్యాంకులు విలీన మార్గాలు ఎంచుకోవడం అనివార్యం. 2018 నుంచి అమలులోకి రానున్న ‘బాసెల్‌-3’ నిబంధనలకు అనుగుణంగా కార్యకలాపాలు సాగించాలంటే ఆర్థిక పరిపుష్టి, నిర్వహణ సామర్థ్యం బ్యాంకులకు ఉండి తీరాలి. కనుక కష్టనష్టాల ముంగిట నిలిచిన చిన్న బ్యాంకులు భవిష్యత్తులో విలీనాల బాట పట్టే అవకాశాలు ఉన్నాయి.

సమస్యలతో సతమతం
మితిమీరిన మొండిబాకీల వల్ల ప్రభుత్వరంగ బ్యాంకులు (పీఎస్‌బీలు) సంక్షోభంలో కూరుకుపోయాయి. 2017 ఆర్థిక సర్వే ప్రకారం పీఎస్‌బీల స్ట్రెస్డ్‌ అసెట్లు (నిరర్థక ఆస్తులతో పాటు పునర్‌వ్యవస్థీకరించిన ఖాతాలు, రైట్‌-ఆఫ్‌ చేసిన ఖాతాల మొత్తాలు) వాటి మొత్తం రుణాల్లో 20 శాతం దాకా ఉన్నాయి. దేశ బ్యాంకింగ్‌ వ్యాపారంలో 70 శాతానికి పైగా వాటా పీఎస్‌బీలదే. దేశంలోని వాణిజ్య బ్యాంకులు దాదాపు రూ.74లక్షల కోట్ల రుణాలు ఇచ్చాయి. వీటిలో పీఎస్‌బీల వాటా రూ.50 లక్షలకోట్ల దాకా ఉన్నాయి. వీటిలో రూ.10 లక్షల కోట్ల వరకు ‘స్ట్రెస్డ్‌ అసెట్లు’ ఉండటం ఆందోళనకరం. అక్టోబరు- డిసెంబరు 2016 త్రైమాసిక ఫలితాలను పరిశీలిస్తే- నిరర్థక ఆస్తుల పెరుగుదల వల్ల పీఎస్‌బీలు ఎంత సంక్షోభంలో పడ్డాయో బోధపడుతుంది. పెద్దనోట్ల రద్దు ప్రభావం ప్రస్తుత ఆర్థిక సంవత్సరాంతానికి పూర్తిస్థాయిలో బ్యాంకుల రుణవసూళ్లపై పడనుంది. ఫలితంగా నాలుగో త్రైమాసికానికి (జనవరి-మార్చి 2017) బ్యాంకుల మొండిబాకీలు మరింతగా పెరగవచ్చు. గత సెప్టెంబర్‌ 30నాటికి పీఎస్‌బీల స్థూల నిరర్థక ఆస్తులు రూ. 6,30,323 కోట్లుండగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరాంతానికి ఇవి ఏడు లక్షల కోట్ల రూపాయలను దాటిపోయే ప్రమాదం ఉంది. పీఎస్‌బీల స్థూల నిరర్థక ఆస్తులు మూడో త్రైమాసికంలో నిరుటితో (31-12-2015)తో పోలిస్తే, సగటున 50శాతం పైగా పెరిగాయి! ఇండియన్‌ బ్యాంక్‌ మినహా అన్ని బ్యాంకుల ఎన్‌పీఏలు అనూహ్యంగా పెరిగాయి. కొన్ని ప్రైవేటు రంగ బ్యాంకుల స్థూల నిరర్థక ఆస్తులు పెరిగినప్పటికీ, వాటి మొత్తం రుణాల్లో ఎన్‌పీఏల శాతం పీఎస్‌బీల కంటే చాలా తక్కువగా ఉన్నాయి. కొత్తతరం ప్రైవేటు బ్యాంకులు అన్ని గణనీయమైన వ్యాపారాభివృద్ధి(డిపాజిట్ల, రుణాల పెరుగుదల)తో లాభాలు పెంచుకుంటున్నాయి. పీఎస్‌బీల్లో ఏడెనిమిది బ్యాంకులు నష్టాల్లో కొనసాగుతుండగా, మరికొన్ని స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. విద్యుత్‌, మైనింగ్‌, ఉక్కు, సిమెంట్‌, జౌళి, మౌలిక రంగాలకు రుణాలిచ్చిన బ్యాంకులకు మొండి బాకీల తీవ్రత ఎక్కువగా ఉంది.
ఆర్థిక మందగమనం నుంచి ఇంకా బయటపడని పలు రంగాలు రుణ చెల్లింపులు సకాలంలో చేయలేకపోవడంతో బ్యాంకుల మొండిబాకీలు పెరుగుతున్నాయి. కొన్ని బ్యాంకులు పెద్ద కార్పొరేట్‌ సంస్థలకు అవసరానికి మించి విచ్చలవిడిగా రుణ వితరణ చేశాయి. రుణ వసూళ్లలో అలసత్వం ప్రదర్శించాయి. బ్యాంకుల ఎన్‌పీఏలు అనూహ్యంగా పెరగడానికి ఈ లోపాలూ దోహదం చేశాయి. విజయ్‌ మాల్యా వంటి ఉద్దేశపూర్వక ఎగవేతదారులు పెరుగుతుండటంతో పరిస్థితి మరింత క్లిష్టమవుతోంది. కార్పొరేట్లకు, బడా పారిశ్రామికవేత్తలకు ఇచ్చిన భారీ రుణాల విషయంలో రాజకీయ జోక్యం, కొన్ని బ్యాంకుల్లో ఉన్నతస్థాయి అవినీతీ మొండిబాకీలు పెరగడానికి కారణమయ్యాయి. బ్యాంకు యాజమాన్యాలు అనుసరించే రుణ వితరణ విధానాలు, రుణ వసూళ్ల యంత్రాంగం పనితీరు వంటి అంశాలూ కొంతమేరకు మొండి బాకీలపై ప్రభావం చూపుతాయి. ఆర్థిక మందగమనంలో కూడా కొన్ని బ్యాంకులు మొండి బాకీలు అంతగా పెరగకుండా జాగ్రత్తపడి నికర లాభాలు గణనీయంగా పెంచుకున్నాయి. బ్యాంకుల పనితీరు మెరుగుదలకు కొన్నేళ్లుగా రిజర్వు బ్యాంకు కొన్ని కార్యక్రమాలు చేపట్టింది. పలు చట్టాలకు ప్రభుత్వమూ పదునుపెట్టింది. దివాలా చట్టాన్ని(2015) అమలులోకి తెచ్చింది. మొండిబాకీలను తగ్గించుకోవడానికి బ్యాంకులూ సామ దాన దండోపాయాలను అమలు చేస్తున్నాయి. రిజర్వు బ్యాంకు ‘బ్యాంకుల ప్రొవిజనింగ్‌’ నిబంధనలను కఠినతరం చేస్తోంది. ‘కార్పొరేట్‌ డెట్‌ రీస్ట్రక్చరింగ్‌’ (సీడీఆర్‌), ‘స్ట్రాటజిక్‌ డెట్‌ రీస్ట్రక్చరింగ్‌’ (వ్యూహాత్మక రుణ పునర్‌వ్యవస్థీకరణ) వంటి పథకాలను ప్రవేశపెట్టింది. ‘స్కీమ్‌ ఫర్‌ సస్టైనబుల్‌ స్ట్రక్చరింగ్‌ ఆఫ్‌ స్ట్రెస్డ్‌ అసెట్స్‌’ పథకానికి శ్రీకారం చుట్టింది. అయితే ఈ పథకాలేవీ ఆశించిన ఫలితాలు ఇవ్వలేకపోయాయి. దేశవ్యాప్తంగా 33కు పైగా రుణవసూళ్ల ట్రైబ్యునళ్లు (డీఆర్‌టీ) ఉన్నప్పటికీ రుణ వసూళ్లు నామమాత్రంగా జరుగుతున్నాయి. వీటిలో 90 వేలకుపైగా కేసులు అపరిష్కృతంగా ఉన్నాయి. మౌలిక సదుపాయాల లోటు, సిబ్బంది కొరత వంటివి దీనికి కారణం. ఎన్‌పీఏల భారం తగ్గించడానికి గతంలో ‘అసెట్‌ రీకన్‌స్ట్రక్షన్‌ కంపెనీ’ (ఏఆర్‌సీ)లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. మొండిబాకీలను ఏఆర్‌సీలకు తక్కువ ధరకు అమ్మివేయడం ద్వారా బ్యాంకులు ఎన్‌పీఏల భారం తగ్గించుకోవచ్చునన్నది వీటి ఏర్పాటు వెనకగల లక్ష్యం. ఏఆర్‌సీలు సైతం ప్రస్తుతం నిధుల కొరత సమస్యను ఎదుర్కొంటున్నాయి. 20 ఏఆర్‌సీలకు బ్యాంకులు రూ.1.46 లక్షలకోట్ల మొండిబాకీలను విక్రయించాయి. అయినప్పటికీ నిరర్ధక ఆస్తుల సమస్య నుంచి బ్యాంకులు బయటపడలేదు.

ఆదుకోవాల్సిన తీరిది...
ఆరు లక్షల కోట్లకు పైగాగల బ్యాంకుల మొండిబాకీల్లో అత్యధిక శాతం బడా కార్పొరేట్‌ సంస్థలవే. కేవలం పది పదిహేను కార్పొరేట్‌ సంస్థలకు చెందిన మొండిబాకీలే రూ.5,73,682 కోట్లు ఉన్నాయి. వీటిలో కొన్ని రాబట్టుకున్నా బ్యాంకులు ఒడ్డునపడతాయి. ఈ దిశగా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలి. 2017 ఆర్థిక సర్వేలో ప్రభుత్వరంగ ఆస్తుల పునరావాస సంస్థ (పారా)ను స్థాపించి పీఎస్‌బీల మొండిబాకీలను ఈ సంస్థకు బదిలీ చేసే ప్రతిపాదనను ప్రభుత్వం ముందుకు తెచ్చింది. ఈ సంస్థ ప్రస్తుతం ఉన్న ఏఆర్‌సీల వంటిదే. కాకపోతే ‘పారా’లో 49 శాతం ప్రభుత్వ వాటా ఉంటుంది. ప్రస్తుతం ఉన్న ఏఆర్‌సీలు ప్రైవేటు రంగంలోనివే. ఆర్థిక సర్వేలో ప్రతిపాదించిన ‘పారా’ ప్రభుత్వ సంస్థగా కొనసాగుతుంది కాబట్టి, పీఎస్‌బీల మొండిబాకీల బదలాయింపు ఆశించినమేరకు వేగంగా జరిగే అవకాశం ఉండొచ్చు. ప్రతిపాదనపై లోతైన చర్చ జరిపి బ్యాంకింగ్‌ వ్యవస్థ అవసరాలకు అనుగుణంగా దీన్ని రూపొందించాలి. అంతకన్నాముందు ఆర్‌బీఐ, బ్యాంకులకు తక్షణం కొంత వూరటనిచ్చే చర్యలను ప్రభుత్వం చేపట్టాలి. రెండో విడత ‘రుణ పునర్‌వ్యవస్థీకరణ’ చేసే వెసులుబాటు బ్యాంకులకు కల్పించే అంశాన్ని ఆర్‌బీఐ పరిశీలించాలి. దీనివల్ల బ్యాంకులకు అదనపు మొండి బాకీల భారం తగ్గుతుంది. గతంలో పునర్‌వ్యవస్థీకరించిన ఖాతాలు తిరిగి మొండిబాకీలుగా మారే ప్రమాదం తాత్కాలికంగా తప్పుతుంది. వివిధ రంగాలు ఆర్థిక మందగమనం నుంచి బయటపడి, ఆర్థిక వ్యవస్థ పుంజుకొన్నట్లయితే ఈ ఖాతాల్లో రుణ చెల్లింపులు ప్రారంభమై పరిస్థితులు చక్కబడే అవకాశం ఉంది. గతంలో రూపొందించిన పథకాలు, స్థాపించిన సంస్థలను గాలికి వదిలేయరాదు. మరింత సమర్థంగా పనిచేసేలా వాటిని బలోపేతం చేయాలి. ‘రుణవసూళ్ల ట్రైబ్యునళ్ల’కు కొత్తరూపు ఇచ్చి, వాటికి మౌలిక సదుపాయాలు కల్పించాలి. వాటిలో కొన్నేళ్లుగా పేరుకుపోయిన పెండింగ్‌ కేసులను సత్వరం పరిష్కరించేలా చర్యలు చేపట్టాలి. ప్రస్తుతం ఉన్న ఏఆర్‌సీలను మరింత బలోపేతం చేసే చర్యలు చేపట్టాలి. పీఎస్‌బీల డైరెక్టర్ల, ఛైర్మన్ల నియామకాల ప్రక్రియ చేపట్టి, విలీనాల ప్రక్రియకు మార్గదర్శకాలను రూపొందించే లక్ష్యాలతో నిరుడు ఏప్రిల్‌ నుంచి ‘బ్యాంక్‌ బోర్డ్‌ బ్యూరో’ (బీబీబీ) పని ప్రారంభించింది. చిన్న బ్యాంకులను ఆర్థికంగా శక్తిమంతం చేసి, పెద్ద బ్యాంకుల్లో విలీనం చేయడానికి బీబీబీ మార్గదర్శక ప్రణాళిక రూపొందించాలి. క్రియాశీలక పాత్ర పోషించడం ద్వారా పీఎస్‌బీలను సంక్షోభం నుంచి గట్టెక్కించగలగాలి!

Posted on 04-02-2017