Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఆర్థిక రంగం

అసాధారణ విధానాలే శరణ్యమా?

* ద్రవ్యలభ్యత కోసం ఆర్‌బీఐ కసరత్తు

కరోనా దెబ్బకి అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలూ కుదేలవుతున్నాయి. ఈ మహమ్మారి మనదేశంలోకి చొరబడక ముందే ఇక్కడి ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉంది. ప్రస్తుత లాక్‌డౌన్‌తో వస్తుసేవల ఉత్పత్తితోపాటు, ఇతర ఆర్థిక కార్యకలాపాలు స్తంభించడంతో ప్రభుత్వాలకు రాబడి ఆగిపోయింది. దేశంలో ఆర్థిక కార్యకలాపాలను ప్రోత్సహించేందుకు గత ఏడాది రిజర్వుబ్యాంకు చాలాసార్లు రెపోరేటును తగ్గించింది. రెపోరేటు తగ్గిన స్థాయిలో బ్యాంకులు తామిచ్చే రుణాలపై వడ్డీరేట్లను తగ్గించలేదు. దీనికితోడు ‘ఆపరేషన్‌ ట్విస్ట్‌’ విధానం ద్వారా రిజర్వుబ్యాంకు పెద్ద మొత్తంలో స్వల్పకాల ప్రభుత్వ బాండ్లను అమ్మి, దీర్ఘకాల బాండ్లను కొనుగోలు చేసింది. ఈ చర్యల ద్వారా దేశంలో దీర్ఘకాలిక వడ్డీరేట్లను తగ్గించి ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యత్వాన్ని పెంచి, ఆర్థికవృద్ధికి చేయూత ఇవ్వాలన్నది రిజర్వుబ్యాంకు వ్యూహం. అయితే, ఇలాంటి చర్యలేవీ ఆశించిన రీతిలో ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేయలేదు. ఈ క్రమంలో ప్రస్తుతం దేశాన్ని వృద్ధివైపు నడిపేందుకు దాదాపు రూ.10 లక్షల కోట్లు అవసరమని ఆర్థికవేత్తల అభిప్రాయం.

సంప్రదాయేతర పద్ధతులపై చర్చ
వస్తుసేవల ఉత్పత్తికి, వినియోగానికి డిమాండును సృష్టించి, ఆర్థిక వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించాలంటే ‘క్వాంటిటేటివ్‌ ఈజింగ్‌’, ‘హెలికాప్టర్‌ మనీ’ వంటి సంప్రదాయేతర అసాధారణ ద్రవ్య విధానాలను అనుసరించాలనే చర్చ జరుగుతోంది. సాధారణ ద్రవ్యవిధానంలో- ద్రవ్యోల్బణాన్ని ప్రభావితం చేయడానికి కేంద్రబ్యాంకు రెపో, రివర్స్‌ రెపో వంటి వడ్డీరేట్లలో మార్పులు చేపడుతుంది. అయినప్పటికీ ఆర్థిక వ్యవస్థలో కార్యకలాపాలు ఊపందుకోకపోతే కేంద్ర బ్యాంకు విధానాలు ఆర్థిక వ్యవస్థను ఎలా ప్రభావితం చేస్తాయన్న ప్రశ్న తలెత్తింది. దీనికి ఒక పరిష్కారంగా అమెరికా, జపాన్‌లాంటి దేశాల్లో తెరమీదకు వచ్చిందే ఈ అసాధారణ ద్రవ్య విధానం. ఇది రెండు రూపాలుగా ఉంటుంది. ఒకటి- క్వాంటిటేటివ్‌ ఈజింగ్‌, రెండు- హెలికాప్టర్‌ మనీ. బ్యాంకులు తదితర ఆర్థిక సంస్థల నుంచి ప్రభుత్వ, ప్రయివేటు బాండ్లను పెద్ద మొత్తంలో కేంద్ర బ్యాంకు కొనుగోలు చేస్తుంది. అది ఆయా సంస్థల్లో ద్రవ్యాన్ని పెంచుతుంది. బ్యాంకుల్లో డిపాజిట్లు కూడా పెరుగుతాయి. దీనికితోడు పెద్దయెత్తున బాండ్లను కొనుగోలు చేయడం వల్ల, బాండ్ల ధరకు-వాటి ప్రతిఫలాలకు రుణాత్మక సంబంధం ఉండటం వల్ల, అదే మెచ్యూరిటీతో మార్కెటులో ఉన్న బాండ్ల ప్రతిఫలాలు తగ్గుతాయి. అంటే దేశంలో దీర్ఘ కాల రుణాల వడ్డీరేట్లు తగ్గుతాయి. దీంతో బ్యాంకులు, మిగతా ఆర్థిక సంస్థలు బాండేతర రూపాల్లో, ఎక్కువ వడ్డీనిచ్చే ఆర్థిక ఆస్తులపై పెట్టుబడి పెడతాయి. ఈక్విటీ పెట్టుబడులకు గిరాకీ పెరుగుతుంది. అది కొత్త ఆస్తుల సృష్టికి దారితీస్తుంది. ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యత్వం పెరగడంతో బ్యాంకు రుణాలు అందుబాటులోకి వస్తాయి. ఈ ప్రక్రియనే ‘క్వాంటిటేటివ్‌ ఈజింగ్‌’ అంటారు. దీన్ని జపాన్‌, అమెరికా, ఐరోపా సమాఖ్య, ఇంగ్లాండ్‌ దేశాల కేంద్ర బ్యాంకులు అమలు చేశాయి. బిలియన్‌ డాలర్ల విలువైన కరెన్సీని బాండ్ల కొనుగోలు రూపంలో వ్యవస్థలోకి ప్రవేశపెట్టారు. మాంద్యంలోకి జారుకుంటున్న తమ ఆర్థిక వ్యవస్థలను కాపాడటానికి ఇది కొంతమేర తోడ్పడింది. కానీ ఇది బ్యాంకుల్లో నిరర్థక ఆస్తులు పెంచిందని, ఉత్పత్తిపై చెప్పుకోదగ్గ ప్రభావం చూపించలేక పోయిందనే విమర్శ ఉంది. అంతేకాకుండా ముందున్న నిధులనే పూర్తిగా వినియోగించని సంస్థలకు మరిన్ని నిధులు ఇవ్వడం వల్ల కలిగే ప్రయోజనం అంతంత మాత్రమే! ఈ పరిస్థితుల్లో ‘హెలికాప్టర్‌ మనీ’ అనే మరో కొత్త ద్రవ్య విధానం తెరపైకి వచ్చింది. ప్రఖ్యాత ఆర్థికవేత్త మిల్టన్‌ ఫ్రీడ్మన్‌ 1969లో దీన్ని ప్రతిపాదించారు. ఇందులో కొత్త కరెన్సీని పెద్ద మొత్తంలో ముద్రించి దేశ పౌరులకు నగదును నేరుగా అందజేయడం లేదా ప్రభుత్వం మౌలిక సౌకర్యాల రంగంలో ఖర్చు చేయడం జరుగుతుంది. ఉదాహరణకు, దేశంలోని ప్రతి పౌరుడి బ్యాంకు ఖాతాలో లక్ష రూపాయలు జమ చేయడం. లేదా పెద్దయెత్తున నగదును ముద్రించి ప్రభుత్వానికి కానుకగా ఇవ్వడం. ఆ డబ్బుల్ని ప్రభుత్వం మౌలిక సదుపాయాల రంగంపై ఖర్చు చేయడం. మొదటి విధానం వల్ల ప్రజల కొనుగోలు శక్తి నేరుగా ప్రభావితం అవుతుంది. వస్తుసేవలకు డిమాండ్‌ పెరుగుతుంది. అయితే ప్రభుత్వం ఇచ్చిన డబ్బును కొంతమంది ప్రజలు తమ అవసరాల కోసం ఖర్చు చేయకుండా బ్యాంకు ఖాతాల్లోనే ఉంచవచ్చు. లేదా పొదుపు చేయవచ్చు. దానివల్ల సమస్య మొదటికే వస్తుంది. కేంద్ర బ్యాంకు కొత్తగా ముద్రించిన నగదును రుణంగా కాకుండా కానుకగా ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి రుణభారం పెరగదు. కానీ హెలికాప్టర్‌ మనీ విధానాలు అధిక ద్రవ్యోల్బణానికి దారితీస్తాయి. కేంద్ర బ్యాంకు- స్వతంత్ర నిర్ణయాధికారాన్ని, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించే శక్తిని దెబ్బతీస్తాయి.

మన దారెటు?
జీడీపీ వృద్ధిరేటు ఆందోళన కలిగిస్తోంది. రెపోరేటు 4.4 శాతానికి చేరింది. కోర్‌ ద్రవ్యోల్బణం (గత నెల చివరి నాటికి) 4.03 శాతానికి పడిపోయింది. 2020-21లో వృద్ధిరేటు కేవలం 1.5 శాతం నుంచి 2.8 శాతం మధ్య ఉంటుందని ప్రపంచబ్యాంకు అంచనా వేసింది. ఈ పరిస్థితుల్లో సమష్టి డిమాండును పెంచడమే ఏకైక మార్గం. దీనివల్ల ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటును వేగంగా ప్రేరేపించవచ్చు. ఇందుకు సాధారణ ద్రవ్య విధానాన్ని అనుసరిస్తే చాలాకాలం పట్టవచ్చు. రిజర్వుబ్యాంకు తన విధాన రేట్లలో చేసే మార్పులు బ్యాంకు రుణాల వడ్డీలలో ప్రతిబింబించక పోవడమే ఇందుకు నిదర్శనం. ప్రభుత్వం కోశ విధానపరంగా ప్రకటించే ఉద్దీపన చర్యలు సాధారణంగా ప్రభుత్వ రుణాలను లేదా పన్నులను పెంచుతాయి. ఎఫ్‌ఆర్‌బీయం చట్టం పరిమితిని మించి ప్రభుత్వాలు ఇప్పటికే అప్పులు చేశాయి. ఇది మరింత ఎక్కువైతే ప్రభుత్వ విశ్వసనీయత ప్రశ్నార్థకం అయ్యే పరిస్థితి వస్తుంది. సాధారణ పద్ధతిలో రుణాలు తీసుకుని ఖర్చు చేయడం వల్ల ప్రభుత్వ రుణం పెరుగుతుంది. దేశంలో నామమాత్రపు వడ్డీరేట్లు సున్నా స్థాయికి చేరలేదు కనుక వడ్డీరేటు విధానం ద్వారా ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసే అవకాశం ఇప్పటికీ ఉంది. కానీ, బ్యాంకులు దీన్ని నీరుగారుస్తున్నాయి. బ్యాంకుల వడ్డీరేట్లలో తగ్గుదల తక్కువగా ఉంది. అవి తమ లాభాలను నిలుపుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. పెరుగుతున్న నిరర్థక ఆస్తులు, నష్టాలు దానికి కారణం కావచ్చు. కనుక సాధారణ ద్రవ్య విధానంతోపాటు, క్వాంటిటేటివ్‌ ఈజింగ్‌ విధానాన్ని ఒకే సమయంలో అమలు చేసే అంశాన్ని పరిశీలించాలి. కేంద్ర బ్యాంకు ప్రభుత్వ బాండ్లను కొనుగోలు చేసి వాటి గడువు తీరేదాకా ఉంచుకుని అసలును, వడ్డీని తిరిగి ప్రభుత్వానికి చెల్లించడమూ క్వాంటిటేటివ్‌ ఈజింగ్‌లో ఒక భాగం. ఈ విధానంలో కేంద్ర బ్యాంకు ప్రభుత్వానికే బ్యాంకుగా పని చేస్తుంది. కాబట్టి కేంద్ర బ్యాంకు కొత్త నగదు ముద్రణ ద్వారా ప్రభుత్వం నుంచి కొనుగోలు చేసిన బాండ్ల వల్ల ప్రభుత్వ రుణం పెరగదు. ఈ బాండ్ల మొత్తాన్ని మౌలిక సదుపాయాల రంగంపై ఖర్చు చేయడం వల్ల ఆర్థిక వ్యవస్థలో జవసత్వాలు నింపేందుకు అవసరమైన ఉత్తేజం అందుతుంది. అది వినియోగ వ్యయాన్ని, ఆర్థిక వృద్ధిని వేగంగా ప్రేరేపిస్తుంది. భవిష్యత్తు ద్రవ్యోల్బణంపై అంచనాలను పెంచుతుంది. ఈ దిశగా ప్రభుత్వం కార్యాచరణకు ఉపక్రమించాల్సిన అవసరం ఉంది.

Posted on 20-04-2020