Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఆర్థిక రంగం

సరళతర పన్ను... వస్తుసేవల దన్ను!

* జీఎస్టీతో ప్రయోజనాలు అపారం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడేళ్ల పదవీకాలంలో సాధించిన అతి గొప్ప ఆర్థిక విజయం- వస్తుసేవల పన్ను (జీఎస్టీ) బిల్లుకు పార్లమెంటు ఆమోదం పొందడం! దేశంలో ఏకీకృత పన్నుల వ్యవస్థకు నాంది పలుకుతున్న ఈ నూతన విధానం వల్ల ఆహార ధాన్యాల ధరలు తగ్గినా, రైతుకు లాభమేమిటన్న ప్రశ్న దూసుకొచ్చింది. వ్యవసాయ ఉత్పత్తులకు అదనపు విలువ కల్పించడానికి వీలుగా ‘సంపద’ పథకాన్ని తెస్తున్నట్లు ప్రధాని మోదీ తాజాగా ప్రకటించడంతో దానికీ సమాధానం లభించినట్లయింది. మొత్తమ్మీద జీఎస్టీ- బహుళ ప్రయోజన దాయకమనడంలో సందేహం లేదంటున్న వ్యాసమిది...
దేశమంతటికీ ఒకే తరహా పన్నుల విధానాన్ని వర్తింపజేసే వస్తుసేవల పన్ను (జీఎస్టీ) చట్టం అన్ని ఆటంకాలను దాటుకుని పట్టాలకెక్కనుంది. ఈ చట్టానికి అడుగడుగునా అడ్డుతగిలిన రాజకీయ పార్టీలు చివరకు పచ్చజెండా వూపాయి. మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్‌ వంటి పారిశ్రామిక రాష్ట్రాలతోపాటు ఉత్తర్‌ ప్రదేశ్‌, బిహార్‌, పశ్చిమ్‌ బంగ వంటి బడా వినియోగ రాష్ట్రాలూ జీఎస్టీ చట్టంవల్ల కలిగే దీర్ఘకాలిక ప్రయోజనాలను గ్రహించి తమ అభ్యంతరాలను పక్కనపెట్టాయి. ఇలా అన్ని పక్షాలూ భేదాభిప్రాయాలను అధిగమించి జాతి ఆర్థిక శ్రేయస్సు కోసం ఒక్క తాటిమీదకు రావడం మామూలు విషయం కాదు. ఇండియా ఇరుగుపొరుగు దేశాలతోపాటు ఇతర ముఖ్య దేశాలనూ ఆర్థికంగా అనుసంధానించే నవీన సిల్క్‌ రోడ్‌ నిర్మాణానికి చైనా ఉరుకులు పరుగులు తీస్తున్న సమయంలో భారత్‌ అత్యవసరంగా తనను తాను ఏకీకృత విపణిగా ఆవిష్కరించుకొనక తప్పదు. చైనా సిల్క్‌ రోడ్‌ ద్వారా అనేక దేశాల్లో తన సరకులు అమ్ముకోబోతున్న దృష్ట్యా, భారతదేశం కనీసం తన రాష్ట్రాలనైనా ఉమ్మడి విపణిగా అనుసంధానించాలి. స్మార్ట్‌ఫోన్లు, టెలికాం పరికరాలు, ఇతర ఎలక్ట్రానిక్‌ సాధనాలతోపాటు రసాయనాల తయారీలో చైనాయే అగ్రగామి. ఈ రంగాల్లో తన మిగులు ఉత్పత్తిని ఇతర దేశాల్లో విక్రయించడానికి చైనా ‘ఒన్‌ బెల్ట్‌... ఒన్‌ రోడ్‌’(ఓబొర్‌) పేరిట భూతల, సముద్రతల సిల్క్‌ రూట్ల నిర్మాణాన్ని జోరుగా చేపట్టింది. ఈ నేపథ్యంలో భారత్‌ ‘మేక్‌ ఇన్‌ ఇండియా’ కార్యక్రమం ద్వారా ప్రముఖ పారిశ్రామిక దేశంగా అవతరించాలని తలపెట్టింది. దీనికింద ఇబ్బడిముబ్బడిగా పెరిగే పారిశ్రామిక ఉత్పత్తులను మొదట స్వదేశంలోనే నిరాటంకంగా అమ్ముకోవడానికి జీఎస్టీ తోడ్పడుతుంది. ఇంట గెలిచాక రచ్చ గెలవడానికి, చైనాతో ఆర్థికంగా తలపడటానికి భారతదేశానికి జీఎస్టీ తొలిమెట్టు కానుంది.

పేదలకు మేలు
కొన్ని ఆహార వస్తువులపై పూర్తిగా పన్ను మినహాయించడం, మరికొన్నింటిపై తగ్గించడం జీఎస్టీ చట్టం విశిష్టత. దీనివల్ల ఆహార ద్రవ్యోల్బణం తగ్గి, పేద ప్రజానీకానికి మేలు కలుగుతుంది. ఇంతకుముందు అనేక రాష్ట్రాల్లో బియ్యం, గోధుమలు, పప్పుగింజలపై కొనుగోలు లేదా అమ్మకం పన్నులు విధించేవారని 13వ ఆర్థిక సంఘ కార్యదళం అధ్యయనంలో తేలింది. ప్రాథమిక ఆహార వస్తువుల ఉత్పత్తికి అవసరమైన సాధనాలపై, అంతిమ ఉత్పత్తిపై పన్నులు విధించేవారు. ఇక నుంచి ఆ పద్ధతి మారనుంది. ప్రజాపంపిణీ వ్యవస్థ (పీడీఎస్‌) పరిధిలోకి వచ్చే ఆహార సరకులన్నింటికీ జీఎస్టీని మినహాయించబోతున్నారు. అంటే బియ్యం, గోధుమల వంటి ప్రాథమిక ఆహార వస్తువులకు జీఎస్టీ వర్తించదు. మరోరకంగా చెప్పాలంటే ప్రాథమిక ఆహార సరకులపై ఉత్పత్తి పన్ను ఉండదు. కేవలం ఉత్పత్తి సాధనాలపైనే పన్ను విధిస్తారు. పేదల వినియోగ వ్యయంలో ఎక్కువ భాగం ఆహారానికే ఖర్చవుతుంది కాబట్టి జీఎస్టీవల్ల వారికి ఎంతో లబ్ధి చేకూరుతుంది. ఆహార ధరలు తగ్గడంతోపాటు పేదలు ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా యథాప్రకారం ఆహార సరకులు పొందుతూనే ఉంటారు. జీఎస్టీ చట్టం నుంచి ప్రాథమిక విద్యావైద్య సేవలను పూర్తిగా మినహాయించడం మరో ప్రజోపయోగ చర్య. ఈ విషయంలో పేద, మధ్యతరగతి ప్రజలపై జీఎస్టీ అదనపు భారం మోపదు. జీఎస్టీ పన్ను ఖరారైన వస్తువుల సంఖ్య 1,211. వాటిలో 81 శాతం సరకులపై 18 శాతం, లేదా అంతకు తక్కువ పన్ను విధిస్తారు. సబ్బులు, తలనూనెలు, టూత్‌పేస్ట్‌ల వంటి రోజువారీ వాడకం వస్తువులపై 18 శాతం పన్ను మాత్రమే వేస్తారు. మిగిలిన సరకులపై 28 శాతం పన్ను ఉంటుంది. కార్లు, ఇతర విలాస వస్తువులపై మాత్రం 28 శాతం మించి పన్నులు వేస్తారు. సదరు అదనపు పన్నును ‘సెస్‌’ అంటారు. దీన్ని 15 శాతం వరకు విధించవచ్చు. అంటే విలాస వస్తువులపై అత్యధికంగా 43 శాతం వరకు పన్ను విధించవచ్చు. ఈ విలాస సెస్సు ద్వారా కేంద్ర, రాష్ట్రాలు అదనపు ఆదాయం సమకూర్చుకోగలుగుతాయి. జీఎస్టీ చట్టం మూలంగా స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) మధ్యకాలికంగా రెండు శాతం అదనపు వృద్ధి నమోదు చేయనుంది. చిల్లర సరకుల ద్రవ్యోల్బణం మరింత తగ్గుతుంది. దీనివల్ల రిజర్వు బ్యాంకు వడ్డీరేట్లను మరింత తగ్గించగలుగుతుంది. అప్పుడు పరిశ్రమలు, వ్యాపారాలకు సులభతర రుణాలు లభించి ఉత్పత్తి పెరుగుతుంది. వ్యక్తులకు, కుటుంబాలకు తక్కువ వడ్డీకి రుణాలు లభించడం వల్ల వినిమయమూ పెరుగుతుంది. వీరినుంచి ఇళ్లు, కార్లు, తదితరాలకు గిరాకీ పెరగడంవల్ల దేశంలో ఉత్పత్తి వూపందుకొంటుంది.
పాలు, పప్పులు, ఆహార ధాన్యాలపై జీఎస్టీ పన్ను ఉండదు. వంటనూనెలు, తేయాకు వంటి ఇతర ఆహార సరకులపై పన్ను తక్కువగా ఉంటుంది. దీనివల్ల ఆహార ధరలు తగ్గి వినియోగదారుడు లాభపడినా, రైతుకు ప్రయోజనం ఏమిటనే ప్రశ్న వస్తుంది. రైతు కష్టపడి అధిక దిగుబడులు సాధించినా, అతడి పరిస్థితి అమ్మబోతే అడవి చందంగా మారింది. అందుకే రైతుల జీవన ప్రమాణాలు ఏమీ మెరుగుపడలేదు. వ్యవసాయ ఉత్పత్తిని ముడిసరకుగా అమ్మే పద్ధతి నుంచి వాటిని ‘ప్రాసెస్‌’చేసి అమ్మడం ద్వారా మాత్రమే రైతు ఆదాయం పెంచుకోగలుగుతాడు. ఇలా విలువను జోడించే ఆర్థిక కార్యకలాపాలవైపు రైతు మళ్లాలి. వ్యవసాయ ధరల్లో హెచ్చుతగ్గుల వల్ల రైతులు దెబ్బతినకుండా తగు ఏర్పాట్లు చేయడం ప్రభుత్వాల బాధ్యత!
జీఎస్టీ పూర్తిస్థాయిలో అమలైతే భారత ఆర్థిక వ్యవస్థ సంఘటిత వ్యవస్థగా మారుతుంది. వ్యాపార కార్యకలాపాలు డిజిటల్‌ రూపంలో సాగుతాయి. ఈ రూపాంతరం వల్ల అసంఘటిత రంగంలోని చేనేత కార్మికులు, ఇతర చేతివృత్తులవారు ఇకనుంచి డిజిటల్‌ పద్ధతిలో లావాదేవీలు జరిపే నైపుణ్యం అలవరచుకోవాలి. లేకుంటే భారీ బ్రాండెడ్‌ ఉత్పత్తిదారుల పోటీని తట్టుకోవడం కష్టం. ఉదాహరణకు స్థానికంగా కొబ్బరి పీచు పరుపులు, చెక్కటేబుళ్లు, బీరువాలను తయారుచేస్తున్నవారు చైనా నుంచి, భారతదేశంలోని పలు రాష్ట్రాల నుంచి పోటీని ఎదుర్కొంటున్నారు. డిజిటల్‌ వ్యాపార వేదికల వల్ల ఈ పోటీ నానాటికీ ముమ్మరమవుతోంది. దీన్ని సమర్థంగా ఎదుర్కోవడానికి కావలసిన డిజిటల్‌ నైపుణ్యాలను స్థానిక చేతివృత్తులవారికి అలవరచాలి. లేదంటే వీరు బడా బ్రాండెడ్‌ ఉత్పత్తిదారుల పోటీని తట్టుకోలేక దెబ్బతింటారు.

రావాల్సిన మార్పులెన్నో...
బ్యాంకులు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) వ్యవహారాలు చూసే పన్ను అధికారులు వీరికి చేయూతనివ్వాలి. డిజిటల్‌ వేదికపై వ్యాపారం చేసే నైపుణ్యాన్ని నేర్పాలి. జీఎస్టీ చట్రంలో ఇమడాలంటే అసంఘటిత, ఎంఎస్‌ఎంఈ సంస్థలవారికి కొంత ఖర్చవుతుంది. వీరిలో చాలామంది మొదటిసారిగా పరోక్ష పన్నుల పరిధిలోకి వస్తారు. కొత్త పన్నుల వ్యవస్థలో నెగ్గుకురావాలంటే వీరికి పన్ను సలహాదారులు, అకౌంటెంట్ల సలహా సంప్రతింపులు అవసరమవుతాయి. అంటే ఈ తరహా వృత్తి ఉద్యోగాలు వేల సంఖ్యలో ఉత్పన్నమవుతాయి. ఇంతవరకు అసంఘటిత రంగంలోని ఎంఎస్‌ఎంఈలు సంఘటిత రంగంకన్నా వేగంగా పురోగమించాయి. దీనికి కారణాలు అనేకం- ఒకటిన్నర కోట్ల రూపాయలకన్నా తక్కువ టర్నోవరు ఉండే ఎంఎస్‌ఎంఈ సంస్థలు ఎక్సైజ్‌ సుంకం చెల్లించనక్కర్లేదు. ఉద్యోగులకు భవిష్య నిధి (పీఎఫ్‌), గ్రాట్యుటీ కూడా చెల్లించనక్కర్లేదు. పెద్ద సంస్థల స్థాయిలో పన్నుల భారమూ ఉండదు. అసలు కొన్ని అసంఘటిత ఎంఎస్‌ఎంఈలైతే పన్నుల కోసం సరైన రికార్డులూ నిర్వహించవు. దీనివల్ల వీటి నిర్వహణ వ్యయం తక్కువగా ఉంటోంది. ఇప్పుడు జీఎస్టీ మినహాయింపు పరిమితిని రూ.1.5 కోట్ల నుంచి రూ.20 లక్షలకు తగ్గించడం వల్ల వేలాది ఎంఎస్‌ఎంఈలు పన్నుల పరిధిలోకి రానున్నాయి. జీఎస్టీ చట్టం వల్ల ఇకనుంచి డిజిటల్‌ పద్ధతిలో క్రయవిక్రయాలు ఎక్కువవుతాయి కాబట్టి అసంఘటిత ఎంఎస్‌ఎంఈలు పన్నులు చెల్లించకుండా తప్పించుకోలేవు. జీఎస్టీ చట్టం అమలులోకి వచ్చాక సరకు రవాణా ఖర్చులు 1.5 నుంచి రెండు శాతం మేరకు తగ్గవచ్చునని అధ్యయనాలు సూచిస్తున్నాయి. మున్ముందు వివిధ రకాల పన్నులు చెల్లించడానికి రహదారి తనిఖీ కేంద్రాల వద్ద సరకుల ట్రక్కులు బారులు తీరే దృశ్యాలూ అరుదవుతాయి.
మొబైల్‌, ఇంటర్నెట్‌ వంటి టెలికాం సేవలు, స్మార్ట్‌ఫోన్లు, లాప్‌టాప్‌లు, కంప్యూటర్లు, వైఫై, డీటీహెచ్‌ సేవలు, ఆన్‌లైన్‌లో విమాన టికెట్ల బుకింగ్‌, ఆహార పదార్థాలు, పానీయాలను ఇంటి వద్దకు తీసుకువచ్చే సేవలు, సినిమా టికెట్లు, క్రికెట్‌ మ్యాచ్‌ టికెట్లు, బ్యూటీపార్లర్‌ సేవలకు జీఎస్టీ మూలంగా ఇదివరకటి కన్నా కాస్త ఎక్కువ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. దీని ప్రభావాన్ని సంఘటిత రంగంలోని సంస్థలు బాగా తట్టుకోగలుగుతాయి. జౌళి రంగంలో ఏకీకృత విపణి సృష్టి వల్ల కూడా బ్రాండెడ్‌ దుస్తుల అమ్మకందారులు ఎక్కువ లాభపడతారు. మొత్తంమీద పన్నుల వ్యవస్థ సరళీకృతమై, దేశమంతటికీ ఒకేవిధంగా వర్తిస్తుంది కాబట్టి ఎంఎస్‌ఎంఈల వ్యాపారం విస్తరిస్తుంది. వాటి నిర్వహణ సామర్థ్యం మెరుగుపడుతుంది. అలాగని పాత వ్యవస్థ నుంచి కొత్త వ్యవస్థకు మారడం అంత తేలికేమీ కాదు. గరిష్ఠ అక్షరాస్యత కలిగిన ఫ్రాన్స్‌, సింగపూర్‌ వంటి దేశాలకూ చాలా సమయం పట్టింది. జీఎస్టీ ప్రాముఖ్యాన్ని గుర్తించి, అది శీఘ్రంగా సక్రమంగా అమలుకావడానికి అందరూ సహకరిస్తే భారత ఆర్థిక వ్యవస్థ కొత్త శిఖరాలకు చేరడం ఖాయం!

Posted on 27-05-2017