Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఆర్థిక రంగం

నలు మూలలకూ ‘భారత్‌ మాల’

* కేంద్రం చొరవతో రహదారులకు మహర్దశ
బ్యాంకులకు అదనపు మూలధనం సమకూర్చడంతోపాటు రహదారుల విస్తరణకు నరేంద్ర మోదీ ప్రభుత్వం నడుంకట్టడం మన ఆర్థిక వ్యవస్థ దశదిశలను మార్చేయనుంది. కేంద్రసర్కారు ఇటీవల ఆర్థిక ఉద్దీపన కింద ప్రకటించిన తొమ్మిది లక్షల కోట్ల రూపాయల్లో రూ.6.92 లక్షల కోట్ల మొత్తాన్ని రహదారుల రంగానికే కేటాయించింది. నిజానికి బ్యాంకుల మూలధనానికి, రహదారుల నిర్మాణానికి లంకె ఉంది. రహదారుల నిర్మాణానికి బ్యాంకులు ఇచ్చిన రుణాలు నిరర్థక ఆస్తులుగా, పారు బాకీలుగా మిగిలిపోవడంవల్లే బ్యాంకులు సంకటస్థితికి చేరుకున్నాయి. రహదారుల వంటి మౌలికవసతుల పథకాలు స్తంభించిపోవడం వల్ల బ్యాంకుల మూలధనం హరించుకుపోయింది. ఈ నష్టాల వూబి నుంచి వాటిని బయటకు లాగడానికి ప్రభుత్వం తాజా ఉద్దీపనను ప్రకటించింది. దీని కింద రహదారులకు మునుపెన్నడూ లేనంత భారీగా నిధులు లభించనున్నాయి. భూగోళం చుట్టుకొలత 40 వేల కిలోమీటర్లయితే, ప్రభుత్వం అంతకు రెట్టింపు (83,677 కిలోమీటర్ల) పొడవున కొత్త రహదారులను అయిదేళ్లలో నిర్మించాలని తలపెట్టింది. ప్రస్తుతం భారతదేశంలోని జాతీయ రహదారుల పొడవు 96,260 కిలోమీటర్లు. అన్ని తరహాల రహదారులను కలుపుకొంటే 33 లక్షల కిలోమీటర్లుగా లెక్కతేలతాయి. రహదారులు దేశ ఆర్థిక ప్రగతికి జీవనాడులు. కాబట్టి, వాజ్‌పేయీ హయాములో మాదిరిగా నేటి మోదీ ప్రభుత్వమూ వీటికి ఎనలేని ప్రాముఖ్యమిస్తోంది. వాజ్‌పేయీ ప్రభుత్వం ప్రారంభించిన స్వర్ణ చతుర్భుజి రహదారి ప్రాజెక్టు దేశం నలుమూలలనూ అనుసంధానించి, ఆర్థిక ప్రగతికి గొప్ప వూతమిచ్చింది. రహదారులు తదితర మౌలికవసతుల నిర్మాణం భారీ ఉద్యోగావకాశాలను కల్పిస్తుంది. తద్వారా ఆర్థికాభివృద్ధి రేటు ఇనుమడిస్తుంది. ప్రైవేటు పెట్టుబడులు పెరిగి, వృద్ధిరేటు మరింత పుంజుకొంటుంది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో అయిదు శాతానికి సమానమైన మొత్తాన్ని ప్రభుత్వరంగ మౌలిక వసతుల ప్రాజెక్టులపై వెచ్చిస్తే జీడీపీ ఒకటి నుంచి 1.2 శాతం వరకు పెరిగే వీలుంది. కేంద్రం తాజాగా ప్రకటించిన రహదారి ప్రాజెక్టులకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా వెల్లడికాలేదు.

దేశార్థికానికి ఆలంబన
కేంద్రం తలపెట్టిన 83,667 కిలోమీటర్ల రహదారుల్లో 34,800 కిలోమీటర్లు భారత్‌మాల ప్రాజెక్టు కింద నిర్మితం కానున్నాయి. కేంద్రం చేపట్టే భారత్‌మాలపై రూ.5.35 లక్షల కోట్లు వ్యయం చేయనున్నారు. ఇందులో రూ.2.09 లక్షల కోట్లు మార్కెట్‌ నుంచి రుణాలుగా, రూ.1.06 లక్షల కోట్లు ప్రైవేటు పెట్టుబడుల రూపంలో సేకరిస్తారు. ఇంకా రూ.2.19 లక్షల కోట్లను కేంద్ర రహదారి నిధి, టోల్‌ ఆపరేటర్‌ బదిలీ (టీఓటీ) నమూనాలో సేకరిస్తారు. భారత్‌మాల రోడ్లతోపాటు జాతీయ రహదారి ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) రహదారి ప్రాజెక్టులు, సరిహద్దు రోడ్లు, ఫీడర్‌ రోడ్లు, అనుసంధాన కారిడార్లనూ చేపడతారు. భారత్‌మాల కింద దేశ పశ్చిమ సరిహద్దుల నుంచి తూర్పు సరిహద్దుల వరకు వివిధ రాష్ట్రాల ద్వారా రహదారులు నిర్మిస్తారు. పల్లెలు, మారుమూల ప్రాంతాలకూ రహదారులు వేస్తారు. ఎన్‌హెచ్‌ఏఐ, కేంద్ర ఉపరితల రవాణా శాఖలు నిర్మించబోయే 48,877 కిలోమీటర్ల రోడ్లపై రూ.1.57 లక్షల కోట్లు ఖర్చు చేస్తారు.

యూపీఏ ప్రభుత్వ నిస్తేజం వల్ల 2012-2014 మధ్యకాలంలో పడకేసిన రహదారి రంగం ఇప్పుడిప్పుడే తేరుకొంటోంది. నితిన్‌ గడ్కరీ కేంద్ర ఉపరితల రవాణా శాఖమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు రోజుకు 40 కిలోమీటర్ల చొప్పున కొత్త రహదారులు నిర్మిస్తామని హామీ ఇచ్చినా, ఈ ఏడాది మార్చి వరకు దినసరి నిర్మాణం 2.30 కిలోమీటర్లకు మించలేదు. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం 8,200 కిలోమీటర్ల రోడ్లను మాత్రమే నిర్మించగలిగారు. ప్రభుత్వం తలపెట్టిన ప్రకారం వచ్చే అయిదేళ్లలో 83,677 కిలోమీటర్ల రహదారులను పూర్తిచేయాలంటే ఏటా 16,700 కి.మీల కొత్త రోడ్లు నిర్మించాల్సి ఉంటుంది. ఇప్పటి నిర్మాణ తీరు చూస్తే అది సాధ్యమవుతుందని నమ్మకం కలగడం లేదు. ప్రైవేటురంగమూ క్రియాశీలం కానిదే నిర్మాణం వూపందుకోదు. ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో ఈపీసీ, హైబ్రిడ్‌ యాన్యుటీ పద్ధతుల్లో ప్రాజెక్టులు చేపడితే, ప్రభుత్వం అనుకున్న ప్రకారం వచ్చే అయిదేళ్లలో 83,677 కిలోమీటర్ల రహదారులను పూర్తిచేయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. భారత్‌మాల రహదారి ప్రాజెక్టుల నిర్మాణ దశలో 10 కోట్ల ఉద్యోగాలు లభిస్తాయని అంచనా. ఈ రోడ్లు పూర్తయ్యాక ఆర్థిక కార్యకలాపాలు పుంజుకొనడం వల్ల రెండు కోట్ల 20లక్షల శాశ్వత ఉద్యోగాలు పుట్టుకొస్తాయి. మొత్తంమీద 14కోట్ల 20 లక్షల పనిదినాల సృష్టి జరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. కొత్త రహదారుల వల్ల వాహనాల ప్రయాణవేగం 20-25 శాతం దాకా పెరుగుతుందని గడ్కరీ చెబుతున్నారు. ఫలితంగా సరకుల రవాణా వేగవంతమై ఉత్పత్తి, సరఫరాలు జోరందుకొంటాయి. సరకుల బట్వాడా మందకొడిగా ఉండటంవల్లే భారతీయ ఎగుమతులు ఖరీదైనవిగా మారి అంతర్జాతీయ విపణిలో పోటీపడలేకపోతున్నాయి. కొత్త రహదారుల వల్ల రోడ్డు ప్రమాదాలు సగానికి సగం తగ్గిపోతాయని అంచనా. భారత్‌మాల పూర్తయ్యాక దేశంలో 80 శాతం రవాణా వాహనాలు జాతీయ రహదారుల మీదనే పయనిస్తాయని అంటున్నారు.

కేంద్రం ప్రకటించిన రహదారి ప్రాజెక్టు ప్రశంసనీయమే. కానీ, దీనికి కావలసిన నిధులు, భూమి సేకరణ, పర్యావరణ అనుమతులు సమకూరడం తేలికకాదని నిపుణులు అంటున్నారు. భారతదేశంలో ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) నమూనాలో చేపట్టిన అనేక రోడ్డు ప్రాజెక్టులకు ఎన్నో అవరోధాలు ఎదురయ్యాయి. వీటిని తొలగించడానికి విజయ్‌ కేల్కర్‌ కమిటీ సిఫార్సులను అమలుచేస్తే ప్రైవేటు పెట్టుబడులు పెరుగుతాయి. పీపీపీ ప్రాజెక్టులు వూపందుకొంటాయి. భారత్‌మాల ప్రాజెక్టు పరిధిలోకి రాని రహదారుల నిర్మాణానికి కేంద్ర రహదారి నిధి నుంచి రూ.97 వేల కోట్లు అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది. మరో రూ.59 వేల కోట్లను బడ్జెట్‌ నుంచి కేటాయిస్తారు. ఎన్‌హెచ్‌ఏఐకి ‘ట్రిపుల్‌ ఏ’ రేటింగ్‌ ఉండటంతో మార్కెట్‌ నుంచి రుణాలు సేకరించడం సులువు కానుంది. ఈ రుణాలపై బ్యాంకులకన్నా అది ఎక్కువ వడ్డీ ఇవ్వగలుగుతుంది. ప్రస్తుతం బ్యాంకుల నుంచి మౌలిక వసతుల ప్రాజెక్టులకు రుణాలు అందే అవకాశం లేకపోవడంతో భవిష్యనిధి, పింఛన్‌ నిధుల నుంచి రూ.10 లక్షల కోట్ల రుణాలు తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. వీటికి అధిక వడ్డీ ఇస్తుంది.

వాజ్‌పేయీ చూపిన బాట...
దిల్లీ, ముంబయి, కోల్‌కతా, చెన్నై మహానగరాలను కలుపుతూ వాజ్‌పేయీ ప్రభుత్వం నిర్మించిన స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్టు ఇంతవరకు భారతదేశం చేపట్టిన అతిపెద్ద రహదారి ప్రాజెక్టు. అది ప్రపంచంలో అయిదో బృహత్తర పథకం. పుణె, బెంగళూరు, అహ్మదాబాద్‌, సూరత్‌, కాన్పూర్‌ నగరాలతోనూ అనుసంధానమైన ఈ ప్రాజెక్టు కింద మొత్తం 5,846 కిలోమీటర్ల పొడవున నాలుగు, ఆరు మార్గాల రహదారులు నిర్మించారు. ఈ రహదారుల నుంచి 10 కిలోమీటర్ల పరిధిలో పారిశ్రామిక ఉత్పత్తి కార్యకలాపాలకు గొప్ప వూతం లభించినట్లు ప్రపంచ బ్యాంకు నిర్ధారించింది. దేశ పారిశ్రామికాభివృద్ధిలో 43 శాతం స్వర్ణ చతుర్భుజి కారణంగా సంభవించినదే. రహదారులకు సమీపంలోని జిల్లాల్లో పారిశ్రామికీకరణ వూపందుకొంది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం, గుజరాత్‌లోని సూరత్‌లలో కొత్త పరిశ్రమల స్థాపన నూరు శాతం పెరిగింది. తద్వారా కొత్త పారిశ్రామికోత్పత్తి సుసాధ్యమైంది. భూమి, నిధుల సేకరణ, కాంట్రాక్టుల ప్రధానంలో ఆలస్యం జరగడంవల్ల స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమైనా, వ్యయం మాత్రం పెరగకపోవడం విశేషం. స్వర్ణ చతుర్భుజికి రూ.34,300 కోట్లు వ్యయమవుతుందని అంచనా వేయగా, చివరకు రూ. 32,492 కోట్లతోనే ప్రాజెక్టు పూర్తయింది. అయితే, ఇది అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా నిర్మితం కాలేదనేవారూ ఉన్నారు. స్వర్ణ చతుర్భుజితోపాటు మరికొన్ని ఇతర పథకాల కింద నిర్మించిన 6,500 కిలోమీటర్ల నాలుగు మార్గాల రహదారులను ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య నమూనా కింద ఆరు మార్గాలుగా విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జాతీయ రహదారి అభివృద్ధి పథకం అయిదో దశకింద ఈ విస్తరణను చేపట్టారు. కానీ, దీనికి కాంట్రాక్టుల ప్రదానంలో జాప్యం వల్ల ఇంతవరకు 2,800 కిలోమీటర్ల మేరకే ఆరు మార్గాల రహదారిగా విస్తరించగలిగారు. ప్రస్తుతం 80 కిలోమీటర్లకు ఒక టోల్‌గేట్‌ చొప్పున ఉంది. టోల్‌ వ్యవస్థలను కుదించడమో లేక ఎలక్ట్రానిక్‌ పద్ధతికి మారడమో జరగాలి. స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్టులో ఎదురైన ఇతర సమస్యలు, లోపాల నుంచి నేర్చిన పాఠాలను భారత్‌మాల ప్రాజెక్టును పకడ్బందీగా చేపట్టడానికి ఉపయోగించాలి. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 10 శాతానికి సమానమైన మొత్తాన్ని రహదారులు, రేవులు, విద్యుత్‌ వంటి మౌలికవసతుల ప్రాజెక్టుల్లో పెట్టుబడి పెడితే వచ్చే అయిదేళ్లలో జీడీపీ ఏటా 8-9 శాతం చొప్పున పెరుగుతుంది. తప్పటడుగులు వేయకపోతే భారత్‌ ఏటా 10-11 శాతం వృద్ధిరేటు నమోదు చేయడం అసాధ్యమేమీ కాదని రిజర్వు బ్యాంకు మాజీ గవర్నరు ఒకరు ఉద్ఘాటించారు. అది నెరవేరాలంటే ప్రాజెక్టులకు వేగంగా అనుమతులిచ్చి పకడ్బందీగా, వేగంగా వాటిని అమలు చేయడం ఎంతో ముఖ్యం!

Posted on 08-12-2017