Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఆర్థిక రంగం

మదుపరులకేదీ రక్షణ ఛత్రం?

* బిల్లులో మార్పులు అవసరం

దేశంలోగల బ్యాంకులు, బీమా, ఆర్థిక సంస్థలు ఎప్పుడైనా విపత్కర పరిస్థితుల్లో చిక్కుకుని విఫలమయ్యే పరిస్థితికి చేరుకోవచ్చు. అలాంటి సందర్భాల్లో వాటిని ఆదుకోవడానికి చర్యలు చేపట్టి, మదుపరుల సొమ్ముకు ప్రభుత్వం భద్రత కల్పించాలి. అదే లక్ష్యంతో ‘ఫైనాన్షియల్‌ రిజల్యూషన్‌ అండ్‌ డిపాజిట్‌ ఇన్సూ్యరెన్స్‌ (ఎఫ్‌ఆర్‌డీఐ)’ బిల్లును రూపొందించారు. సంయుక్త పార్లమెంటరీ సంఘం పరిశీలనలో ఉన్న బిల్లును అవసరమైన సవరణల అనంతరం, వచ్చే శీతకాల సమావేశాల్లో పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. నిజానికి బిల్లు రూపకల్పనపై కొన్నేళ్లుగా ప్రభుత్వం విస్తృత సమాలోచన జరిపింది. ఆర్థిక సంస్కరణలను వేగవంతం చేసే దిశగా ఇది మరో ముందడుగు. అయితే బిల్లులోని ‘బెయిల్‌-ఇన్‌’ నిబంధన తమ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉందంటూ డిపాజిటర్ల నుంచి పెద్దయెత్తున నిరసన వ్యక్తమైంది. దీంతో డిపాజిటర్ల హక్కులను పరిరక్షించి, వారి సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తామంటూ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ స్పందించారు. అయినా సామాజిక మాధ్యమాల్లో నిరసన కొనసాగుతోంది. బ్యాంకు ఉద్యోగుల సంఘాలూ ‘బెయిల్‌-ఇన్‌’ను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి.

ఆనాటి పాఠాలు
2008నాటి అమెరికా ఆర్థిక మాంద్యం ప్రపంచవ్యాప్తంగా పలుదేశాల ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేసింది. అమెరికా సహా అనేక దేశాల బ్యాంకింగ్‌ వ్యవస్థలు కుప్పకూలాయి. వేలకొద్ది బ్యాంకులు, ఆర్థిక సంస్థలు మూతపడ్డాయి. అసంఖ్యాక డిపాజిటర్లు, మదుపరులు సంక్షోభంలో చిక్కుకుపోయారు. పలుదేశాల ఆర్థిక వ్యవస్థలు నేటికీ పూర్తిగా కోలుకోలేదు. ఈ పరిణామాలతో అంతర్జాతీయ సంస్థలు అప్రమత్తమయ్యాయి. సంక్షోభాలను ముందుగానే పసిగట్టి దిద్దుబాటు చర్యలు తీసుకోవడానికి ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు అవసరాన్ని అవి గుర్తించాయి. పలు దేశాలు కొత్త చట్టాలు రూపొందించి ప్రత్యేక సంస్థలను నెలకొల్పాయి. మనదేశమూ కొన్నేళ్ళుగా కసరత్తు జరిపి ఎఫ్‌ఆర్‌డీఐ బిల్లును తీసుకొచ్చింది. దేశంలో బ్యాంకులు, ఆర్థిక సంస్థల వ్యవహారాలను ఇన్నేళ్లుగా రిజర్వుబ్యాంకు పర్యవేక్షించింది. అవి సంక్షోభంలో చిక్కుకున్నప్పుడు దిద్దుబాటు చర్యలు చేపడుతూ వచ్చింది. బీమాసంస్థల సమస్యల పరిష్కారానికి ‘ఇన్సూ్యరెన్స్‌ రెగ్యులేటరీ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ఐఆర్‌డీఏ)’ బాధ్యత వహిస్తోంది.

బ్యాంకులు, ఆర్థిక సంస్థల వైఫల్యాలు మనదేశానికి కొత్తకాదు. అనేక సందర్భాల్లో డిపాజిటర్లు పెద్దయెత్తున నష్టపోయారు. ముఖ్యంగా సహకార బ్యాంకుల విషయంలో వైఫల్యాలు ఎక్కువగా నమోదయ్యాయి. 10-15 ఏళ్లుగా ఈ విపరిణామాలకు అడ్డుకట్ట పడింది. విఫలమవుతున్నవాటిని ఇతర బ్యాంకుల్లో విలీనం చేయడం ద్వారా, డిపాజిటర్ల సొమ్ముకు పూర్తి భద్రత కల్పించడానికి ఆర్‌బీఐ పలుచర్యలు చేపట్టింది. అందువల్ల 2008 సంక్షోభ సమయంలోనూ దేశ బ్యాంకింగ్‌ వ్యవస్థ పటిష్ఠంగా నిలిచింది. 2004లో డిపాజిటర్ల సొమ్ము నష్టపోయే రీతిలో ప్రైవేటు రంగంలోని గ్లోబల్‌ ట్రస్ట్‌ బ్యాంక్‌ సంక్షోభంలో చిక్కుకుంది. అప్పుడు ఆ బ్యాంకును ‘ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌’లో విలీనం చేసి డిపాజిటర్ల సొమ్ముకు భద్రత కల్పించారు. 2003లో పీఎన్‌బీలో నెడుంగడి బ్యాంక్‌ విలీనమైంది. బెనారస్‌ స్టేట్‌ బ్యాంకును బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో విలీనం చేసి పరిస్థితిని ఆర్‌బీఐ చక్కదిద్దింది. ఆర్థిక రంగంలో పెనుమార్పులు చోటుచేసుకున్న రోజులివి. అంతర్జాతీయ ఆర్థిక ముఖచిత్రం క్రమంగా మారుతోంది. దేశంలో ఆర్థిక సంస్కరణలు వేగం పుంజుకొన్నాయి. ఈ నేపథ్యంలో బ్యాంకులు, ఆర్థిక సంస్థల వైఫల్యాలను పసిగట్టి, వాటి నివారణకు సత్వర చర్యలు చేపట్టేందుకు ఓ ప్రత్యేక సంస్థను నెలకొల్పాల్సిన అవసరం ఏర్పడింది. రిజర్వు బ్యాంకు ప్రధానంగా విధానపరమైన అంశాలపై దృష్టిసారించాల్సి వస్తోంది. దీనివల్ల బాధ్యతల విభజన అవసరం ముంచుకొచ్చింది. అప్రాధాన్య అంశాలను ఆర్‌బీఐ నుంచి తప్పించాలని ప్రభుత్వం సంకల్పించింది. ఆ మేరకు ఎఫ్‌ఆర్‌డీఐ బిల్లును వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టాలని యోచిస్తోంది.

ప్రత్యేక సంస్థ
బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, బీమా కంపెనీల పనితీరును పర్యవేక్షిస్తూ, వైఫల్యాలను ముందుగానే పసిగట్టి దిద్దుబాటు చర్యలు చేపట్టేందుకు ఓ ప్రత్యేక సంస్థ- ‘రిజల్యూషన్‌ కార్పొరేషన్‌’ను స్థాపించాలని ఎఫ్‌ఆర్‌డీఐ బిల్లులో ప్రతిపాదించారు. దీనికోసం అధ్యక్షుడు, సభ్యులు గల ఓ బోర్డు ఏర్పాటవుతుంది. ఆర్థిక మంత్రిత్వశాఖ, ఆర్‌బీఐ, సెబీ, ఐఆర్‌డీఏ (ఇన్యూరెన్స్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ), పెన్షన్‌ ఫండ్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీల నుంచి సభ్యులను ఎంపిక చేయాలని బిల్లు సూచించింది. ఇది కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. దేశంలో ఏదైనా బ్యాంకు, ఆర్థిక సంస్థ, బీమా కంపెనీ సంక్షోభ దిశగా దిగజారుతున్న సంకేతాలు అందితే ‘రిజల్యూషన్‌ కార్పొరేషన్‌’ రంగంలోకి దిగుతుంది. విఫల సంస్థను పునరుద్ధరించాలా, ఇతర సంస్థల్లో విలీనం చేయాలా, మొత్తానికి మూసివేయాలా అన్న అంశాలపై ఈ కార్పొరేషన్‌ నిర్ణయం తీసుకొంటుంది. వైఫల్యాల తీవ్రత, ఆర్థిక స్థితిగతుల్నిబట్టి దిద్దుబాటు చర్యలుంటాయి. విఫలమైన సంస్థలను అయిదు రకాలుగా వర్గీకరించి, నష్ట తీవ్రతను బట్టి చర్యలు చేపడతారు. ‘రిస్క్‌’ స్థాయిని బట్టి పరిష్కార మార్గాలను ‘రిజల్యూషన్‌ కార్పొరేషన్‌’ సూచిస్తుంది. వీటిలో సంస్థ ఆస్తులు, అప్పులను వేరే సంస్థకు బదిలీచేయడం; యాజమాన్య మార్పులు, ఆర్థికపరమైన ఉద్దీపనలతో కొనసాగించడం; వేరే సంస్థల్లో విలీనం చేయడం లేదా చివరిగా సంస్థను నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ ద్వారా మూసివేయడం వంటి పలు ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలిస్తుంది. ఇదంతా బాగానే ఉన్నా, మునుపెన్నడూ లేనివిధంగా బిల్లులో ‘బెయిల్‌-ఇన్‌’ నిబంధనను ప్రవేశపెట్టడంతోనే డిపాజిటర్లలో కలకలం మొదలైంది. ఈ నిబంధన కింద విఫలమైన బ్యాంకు లేదా ఆర్థిక సంస్థను గట్టెక్కించేందుకు వాటికి అప్పులిచ్చినవారు, డిపాజిటర్ల సొమ్మునే వినియోగించాల్సి ఉంటుంది. ఉదాహరణకు విఫలమైన సంస్థకు అప్పులిచ్చినవారి రుణాలను రద్దుచేసే అధికారం కార్పొరేషన్‌కు ఉంటుంది. అదేవిధంగా డిపాజిట్ల సొమ్మును పూర్తిగా లేదా కొంతభాగాన్ని దివాలా సంస్థను పునరుద్ధరించేందుకు తాత్కాలికంగా వాడుకోవచ్చు. అదేవిధంగా డిపాజిటర్ల సొమ్ము తిరిగి చెల్లించకుండా ప్రత్యామ్నాయంగా ఇతర సెక్యూరిటీలు, బాండ్ల రూపంలో దీర్ఘకాలంలో చెల్లించే ఏర్పాటు చేయొచ్చు. డిపాజిటర్ల ముందస్తు అనుమతి లేకుండా వారి సొమ్మును ఏ విధంగానైనా వినియోగించే అధికారాన్ని రిజల్యూషన్‌ కార్పొరేషన్‌కు ‘బెయిల్‌-ఇన్‌’ నిబంధన కట్టబెడుతోంది.

ప్రభుత్వరంగ బ్యాంకు(పీఎస్‌బీ)ల డిపాజిటర్ల విషయంలో ఎటువంటి మార్పూ ఉండదు. గతంలో మాదిరిగానే ‘రిజల్యూషన్‌ కార్పొరేషన్‌’ ప్రారంభించిన తరవాతా పీఎస్‌బీల్లో ఉన్న డిపాజిట్లన్నింటికీ ప్రభుత్వ హామీ కొనసాగుతుంది. వాస్తవానికి పీఎస్‌బీలు విఫలం కావు. ఒకవేళ ఏదైనా బ్యాంకుకు అలాంటి పరిస్థితి ఎదురైతే, విలీన ప్రక్రియ ద్వారా డిపాజిటర్లకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకొంటుంది. దీనిపై ఎటువంటి సందేహం అవసరంలేదు. ప్రైవేటు బ్యాంకు విఫలమైతే, ప్రస్తుత పరిస్థితుల్లో డిపాజిటర్లకు ఎటువంటి నష్టం జరగకుండా రిజర్వు బ్యాంకు మరే ఇతర ప్రైవేటు లేదా ప్రభుత్వరంగ బ్యాంకులో విలీనం చేసి పరిస్థితిని చక్కదిద్దే వీలుంటుంది. అంతేకాక బ్యాంకుల డిపాజిట్లకు డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ అండ్‌ క్రెడిట్‌ గ్యారంటీ కార్పొరేషన్‌ (డీఐసీజీసీ) బీమా ఉన్నందువల్ల ప్రతి డిపాజిట్‌దారుకు లక్ష రూపాయల వరకు భద్రత ఉంటుంది. అయితే ‘రిజల్యూషన్‌ కార్పొరేషన్‌’ వచ్చిన తరవాత డీఐసీజీసీ బీమా రద్దవుతుంది. కొత్త సంస్థ ద్వారా ఏ మేరకు డిపాజిటర్ల సొమ్ముకు బీమా సౌకర్యం ఉంటుందన్న దానిపై ఇంకా స్పష్టత లేదు. ఒక్కసారి కొత్త కార్పొరేషన్‌ పని ప్రారంభమైతే- బ్యాంకులు, ఆర్థిక సంస్థల వైఫల్యాల విషయంలో రిజర్వు బ్యాంకు జోక్యం చేసుకోదు. ప్రభుత్వమే నేరుగా రిజల్యూషన్‌ కార్పొరేషన్‌కు సూచనలిచ్చే వెసులుబాటు కలుగుతుంది. ఏదిఏమైనా, డిపాజిటర్ల ప్రయోజనాలకు ప్రభుత్వం పూర్తి భరోసా ఇచ్చి, వారి సొమ్ముకు భద్రత కల్పించేలా ఎఫ్‌ఆర్‌డీఐ బిల్లులో కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉంది.

అనుమతి తప్పనిసరి...
ప్రథమంగా ‘బెయిల్‌-ఇన్‌’ నిబంధనల్లో కొన్ని మార్పులు చేయాలి. విఫలమైన లేదా దివాలా తీసిన సంస్థను ఆదుకొనే క్రమంలో డిపాజిటర్ల సొమ్మును ఏ విధంగానూ వాడుకోకుండా, వడ్డీతో సహా సొమ్మును తిరిగి చెల్లించే వెసులుబాటు కల్పించాలి. సొమ్ము చెల్లింపు క్రమంలో వాటి కాలపరిమితిలో మార్పులు చేయాలన్నా, ఇతర సర్దుబాట్లు అవసరమనుకున్నా డిపాజిటర్ల ముందస్తు అనుమతిని తప్పనిసరి చేయాలి. తద్వారా వారి సొమ్ముకు భద్రత కల్పించాలి. ఒకవైపు విస్తృతంగా ప్రజలకు బ్యాంకింగ్‌ సేవలను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ఆర్థిక సమ్మిళితం వైపు దేశం పరుగులు పెడుతోంది. అదే సమయంలో డిపాజిటర్ల ప్రయోజనాలకు విఘాతం కలిగేలా చట్టాలు తీసుకురావడం ప్రమాదకరం. దీనివల్ల బ్యాంకింగ్‌ వ్యవస్థపట్ల ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతుంది. ఇప్పటిదాకా డిపాజిటర్ల సొమ్ము లక్ష రూపాయల వరకు బీమా ఉంది. కొత్త కార్పొరేషన్‌ రాకతో ఇది రద్దవుతుంది. రిజల్యూషన్‌ కార్పొరేషన్‌ డిపాజిటర్లకు వారి డిపాజిట్లపై ఏ మేరకు బీమా సౌకర్యాన్ని అందజేస్తుందన్న దానిపై బిల్లులో ఎటువంటి ప్రతిపాదనలేదు. ఒకవేళ ‘బెయిల్‌-ఇన్‌’ నిబంధనల్లో డిపాజిటర్ల సొమ్మును పూర్తిగా తిరిగి ఇచ్చే వెసులుబాటు కల్పించినట్లయితే డిపాజిట్లపై బీమా సౌకర్యం కల్పించే అవసరం ఉండకపోవచ్చు. లేనిపక్షంలో డిపాజిట్లపై ప్రస్తుతం ఉన్న లక్ష రూపాయల బీమాను అయిదు లక్షల రూపాయల వరకు పెంచే అంశాన్ని పరిశీలించాలి. దేశంలో పటిష్ఠంగా ఉన్న బ్యాంకులు, ఆర్థిక సంస్థల నియంత్రణా యంత్రాంగం, రిజర్వు బ్యాంకు పర్యవేక్షణల దృష్ట్యా బ్యాంకులు, ఆర్థిక సంస్థల వైఫల్యాలు సంభవించే అవకాశం లేదు. అలాంటి పరిస్థితి ఎదురైనా, సమర్థంగా ఎదుర్కోగల వ్యవస్థ ఉంది. కొత్త ఎఫ్‌ఆర్‌డీఐ బిల్లులో డిపాజిటర్ల ప్రయోజనాలను కాపాడేందుకు అవసరమైన సవరణలు చేయాలి. ప్రజల అనుమానాలను నివృత్తి చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి!

Posted on 11-12-2017