Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఆర్థిక రంగం

ఆహార రాయితీపై మళ్ళీ పంచాయితీ

* నేటి నుంచి డబ్ల్యూటీఓ సమావేశాలు

అంతర్జాతీయ వేదికపై వ్యవసాయ సబ్సిడీలు మరోసారి కీలక చర్చనీయాంశం కాబోతున్నాయి. అర్జెంటీనా రాజధాని బ్యునస్‌ ఎయిర్స్‌లో నేటినుంచి 13వ తేదీ వరకు జరిగే పదకొండో మంత్రిత్వ స్థాయి సమావేశంలో ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ)లోని 164 సభ్య దేశాలు పాల్గొంటున్నాయి. వ్యవసాయ సబ్సిడీలపై ఈ సమావేశంలో తీసుకోబోయే నిర్ణయాలపైనే భారత్‌ దృష్టి కేంద్రీకృతమై ఉంది. ఐరోపా, అమెరికా, కెనడా, జపాన్‌, స్విట్జర్లాండ్‌, నార్వే వంటి సంపన్న, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి దేశాలు ప్రత్యేక అజెండాతో ఈ సమావేశాలకు హాజరవుతున్నాయి. భారత్‌వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల సార్వభౌమ హక్కులను కాలరాసి- రైతులకు ఆహార రాయితీలు ఇవ్వకుండా, కనీస మద్దతు ధర చెల్లించకుండా నిరోధించడమే సంపన్న దేశాల వ్యూహం. రైతులనుంచి సేకరించే వ్యవసాయ ఉత్పత్తులకు 1986-’88నాటి ధరల ప్రకారం ఉత్పాదక విలువను లెక్కకట్టి దానిపై పదిశాతానికి మించి చెల్లించరాదని భారత్‌, చైనా వంటి దేశాలపై సంపన్న రాజ్యాలు ఒత్తిడి తెస్తున్నాయి. ఒకవేళ వర్ధమాన సమాజం అన్నదాతలకు అంతకుమించి చెల్లించినట్లయితే దాన్ని వాణిజ్య నిబంధనల ఉల్లంఘనగా డబ్ల్యూటీఓ పరిగణిస్తోంది. ఏదోరకంగా వర్ధమాన దేశాల మెడలు వంచి, వాటి వ్యవసాయ ఎగుమతుల విలువ తగ్గించేందుకు ధనిక దేశాల కూటమి చేస్తున్న ప్రయత్నాలకు బ్యునస్‌ ఎయిర్స్‌లో బలమైన ప్రతిఘటనే ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తోంది.

అమెరికా ద్వంద్వవైఖరి
అమెరికా, ఐరోపా దేశాలు ఉమ్మడిగా తమ రైతులకు ఏటా 16 వేలకోట్ల డాలర్లకుపైగా భారీ రాయితీలు అందిస్తున్నాయి. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో వ్యవసాయంనుంచి దఖలుపడుతున్న వాటాలో సుమారు సగభాగాన్ని అమెరికన్‌ సర్కారు తిరిగి రైతుల సబ్సిడీలపై ఖర్చు పెడుతోంది. 2014లో అమెరికా ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లు వర్ధమాన దేశాల రైతులకు శరాఘాతంగా పరిణమించింది. అమెరికాలో వ్యవసాయ క్షేత్రాలను నిర్వహిస్తున్న కార్పొరేషన్లకు ఆ బిల్లు వరదాయనిలా మారింది. ప్రపంచవ్యాప్తంగా సోయా, పత్తి, మొక్కజొన్న, పౌల్ట్రీ ఉత్పత్తుల ధరలను ఆ సంస్థలు ఏకపక్షంగా ప్రభావితం చేశాయి. దాంతో వర్ధమాన దేశాల్లో ఆయా పంటలు పండిస్తున్న రైతులను కోలుకోలేని విధంగా దెబ్బతిన్నారు. అమెరికా వ్యవసాయ బిల్లు కారణంగా ధరలు దారుణంగా కోసుకుపోవడంవల్ల పత్తి రైతులు దేశంలో ఏటా రూ.5,280 కోట్ల మేర నష్టపోతున్నారు. అమెరికాతో పోలిస్తే రాయితీల రూపంలో సేద్యానికి భారత్‌ అందిస్తోంది అత్తెసరు మొత్తమే. జీడీపీలో వ్యవసాయం వాటాగా వస్తున్న మొత్తంలో పదిశాతం మాత్రమే సబ్సిడీలపై వ్యయం చేశారు. ప్రధాని మోదీ సారథ్యంలో ఆ మొత్తం స్వల్పంగా పెరిగింది. వాస్తవాలు ఇలా ఉంటే భారత్‌ వంటి దేశాలపై- రాయితీలకు కోతపెట్టాలంటూ ధనిక రాజ్యాలు పదేపదే ఒత్తిడి తీసుకురావడమే విడ్డూరం.

అమెరికాలో సేంద్రియ సాగు, పర్యావరణ పరిరక్షణ తదితరాల పేరిట వ్యవసాయ జీడీపీ వాటాలో 40 శాతం నిధులను ‘గ్రీన్‌బాక్స్‌’ రాయితీల రూపంలో రైతులకు అందజేస్తున్నారు. ప్రపంచ వాణిజ్య సంస్థ వీటిని ‘విపణి విచ్ఛిన్న’ (మార్కెట్‌ డిస్టార్టింగ్‌) రాయితీలుగా పరిగణించడం లేదు. రైతులకు ఎంత రాయితీ చెల్లించినా వాటిని ‘గ్రీన్‌ బాక్స్‌’ కింద చూపిస్తూ అమెరికా వంటి దేశాలు డబ్ల్యూటీఓ నిబంధనలకు చిక్కకుండా తప్పించుకుంటున్నాయి. చాలావరకు రైతులకు నేరుగా నగదు బదిలీ చేయడం ద్వారా అమెరికాలో సబ్సిడీల ప్రక్రియను అమలుపరుస్తున్నారు. ఇవేవీ డబ్ల్యూటీఓ నిషేధం పరిధిలోకి రావు. భారత్‌ పరిస్థితి వేరు. రైతులకు మద్దతు ధరలు చెల్లించడంతోపాటు, వ్యవసాయ ఉత్పాదకాలపైనా భారత్‌లో సబ్సిడీలు ఇస్తున్నారు. సగానికిపైగా జనాభా సేద్యంపై ఆధారపడి ఉన్న, సుమారు మూడోవంతు జనం అర్ధాకలితో అలమటిస్తున్న దేశంలో రైతులకు ఈ మాత్రం మద్దతు తప్పనిసరి. కానీ, ఈ తరహా చర్యలు ‘స్వేచ్ఛా విపణి’ నిబంధనల మేరకు ప్రపంచ వాణిజ్య సంస్థ నిర్దేశించిన ‘మార్కెట్‌ విచ్ఛిన్న’ రాయితీల పరిధిలోకి వస్తాయని ధనిక దేశాలు గొంతు చించుకుంటున్నాయి. అమెరికాలో వ్యవసాయ రాయితీల రూపంలో రైతులకు నేరుగా నగదు బదిలీ చేస్తున్నారు. ప్రపంచ వాణిజ్య సంస్థ అందుకు అనుమతి ఇస్తోంది. ఆ దేశంలో కేవలం 1.1 శాతం ప్రజలు మాత్రమే సేద్యంపై ఆధారపడి ఉన్నారు. అంటే అటుఇటుగా నాలుగు లక్షల కుటుంబాలు ఆ దేశంలో వ్యవసాయంపై ఆధారపడి ఉన్నాయన్నమాట. నాలుగు లక్షల కుటుంబాలకు నగదు బదిలీ చేయడం అమెరికన్‌ ప్రభుత్వానికి పెద్ద సమస్య కాదు. కానీ, భారత్‌ పరిస్థితి భిన్నం. దేశంలో 12 కోట్ల కుటుంబాలు సేద్యమే జీవనాధారంగా కొనసాగుతున్నాయి. వీరితోపాటు కోట్ల సంఖ్యలోని వ్యవసాయ ఉత్పత్తుల వినియోగదారులకు నగదు బదిలీ చేయడం సాధ్యమయ్యే పనికాదు. దానికన్నా ఉత్పత్తుల క్రయవిక్రయాలు, ధరల స్థాయిలోనే ప్రభుత్వం నిర్మాణాత్మకంగా జోక్యం చేసుకుంటే అటు రైతులకు, ఇటు వినియోగదారులకూ ప్రయోజనం చేకూరుతుంది. ధనిక దేశాల దాష్టీకాన్ని భారత్‌ మొదటినుంచీ అనేక వేదికలపై ప్రశ్నిస్తూనే ఉంది. 2013 బాలిలో, 2015నాటి నైరోబీ సదస్సులో వర్ధమాన దేశాలను కూడగట్టుకుని న్యాయమైన హక్కులకోసం భారత్‌ గట్టిగానే గళం విప్పింది. ఆహార భద్రత సాధనకోసం కృషి చేస్తున్న దేశాలపై ‘పదిశాతం పరిమితి’ ఎత్తేయాలని కోరుతూ గతంలోనే భారత్‌ అభివృద్ధి చెందుతున్న 45 దేశాలతో కలిసి డబ్ల్యూటీఓలో వాదించింది. కానీ, అమెరికా, ఐరోపా సమాఖ్య దేశాలు భారత్‌ వాదనను తోసిపుచ్చాయి. ఈసారి బ్యునస్‌ ఎయిర్స్‌లో వర్ధమాన గళం మరింత పదునెక్కనుంది. చైనాతో కలిసి భారత్‌ ఈసారి సంయుక్తంగా ఉద్యమిస్తోంది. అమెరికా, ఐరోపా సమాఖ్యలతోపాటు వివిధ సంపన్న దేశాలు తమ రైతులకు అందిస్తున్న 16 వేలకోట్ల డాలర్ల ‘వాణిజ్య విచ్ఛిత్తి’ సబ్సిడీలను ఉపసంహరించుకోవాలని కోరుతూ దిల్లీ, బీజింగ్‌లు సంచలన డిమాండ్‌ను ముందుకు తెచ్చాయి. భారత్‌, చైనాల ఈ ఉమ్మడి ప్రతిపాదనకు 100కు పైగా దేశాలనుంచి మద్దతు లభిస్తుండటం విశేషం.

దశాబ్దాలపాటు మద్దతు ధరలతో వ్యవసాయ ఉత్పత్తులకు బలమైన దడి కట్టుకుని, రైతులకు దన్నుగా నిలిచిన అమెరికా, ఐరోపాలు- అదే పని చేస్తున్న వర్ధమాన సమాజంమీద మాత్రం ఒంటికాలిపై లేస్తుండటమే విచిత్రం. ధనిక దేశాల పక్షాన రచించిన డబ్ల్యూటీఓ నిబంధనల్లో మార్పుకోసం భారత్‌, చైనాలు ప్రస్తుతం పట్టుబడుతున్నాయి. ఆహార భద్రత సాధనలో వర్ధమాన దేశాల హక్కులపై 2001లోనే దోహాలో జరిగిన చర్చలు ఎటూ తేలకుండా ముగిశాయి. నాటినుంచి ఇప్పటివరకు ఆహార భద్రత హక్కుల విషయమై ఇదమిత్థంగా తేలిందేమీ లేదు. ఇవాళ్టినుంచి బ్యునస్‌ ఎయిర్స్‌లో ప్రారంభమయ్యే మంత్రిత్వస్థాయి సమావేశంలో ఆ దిశగా గట్టి హామీకోసం భారత్‌ కృషి చేయాల్సి ఉంది. పదహారేళ్లనుంచి నలుగుతున్న సమస్యలకు పరిష్కారాలు ప్రతిపాదించకుండానే కొత్త అజెండాను భుజానికి ఎత్తుకునేందుకు ఈయూ దేశాలు పావులు కదుపుతున్నాయి. మూడో ప్రపంచ దేశాలతో కలిసి భారత్‌ ఈ ప్రయత్నాలను గట్టిగా అడ్డుకోవాల్సి ఉంది.

వాణిజ్యసంస్థల కోసం ఆరాటం
పదహారేళ్ల క్రితం 2001లో డబ్ల్యూటీఓ ఆవిర్భావం మొదలు ప్రపంచ వ్యవసాయ వాణిజ్యంలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రస్తుతం ప్రధానమైన కొన్ని కార్పొరేట్‌ సంస్థల చేతుల్లోనే ప్రపంచ వ్యవసాయ వాణిజ్యం కేంద్రీకృతమై ఉందంటే అతిశయోక్తి కాదు. ఏడీఎం, బంగ్‌, కార్గిల్‌, ద్రెఫస్‌ అనే నాలుగు సంస్థల చేతుల్లోనే ప్రపంచ ధాన్య వాణిజ్యంలో 75 శాతం కేంద్రీకృతమై ఉంది. ప్రాంతీయ పంటల స్థానే మొక్కజొన్న, సోయా వంటి వాణిజ్య పంటలు పండించాలని ఈ కార్పొరేట్లు స్థానిక రైతు సమాజాలపై ఒత్తిడి తీసుకువస్తాయి. మోన్‌శాంటో, డ్యుపాంట్‌, డౌ, సిన్‌జెంటా, బేయర్‌, బీఏఎస్‌ఎఫ్‌ అనే ఆరు సంస్థలు ప్రపంచవ్యాప్త ఎరువుల విపణిలో ముప్పాతిక శాతాన్ని నియంత్రిస్తున్నాయి. పౌల్ట్రీ, పశువుల పెంపకంతో ముడివడిన అతిపెద్ద సంస్థలు పౌల్ట్రీ ఉత్పత్తుల్లో 72 శాతానికి, కోడిగుడ్ల ఉత్పత్తిలో 43 శాతానికి, పందిమాసం ఉత్పత్తిలో 55 శాతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. డబ్ల్యూటీఓలో ఈ సంస్థలదే హవా. తమ దేశాల్లోని ప్రభుత్వాలను ప్రభావితం చేయడం ద్వారా ఆయా సంస్థలు డబ్ల్యూటీఓ మెడలు వంచుతుంటాయి. 2008 నుంచీ అమెరికా ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ సంస్కరణలకు ఎప్పటికప్పుడు మోకాలడ్డుతూ వస్తోంది. మూడో ప్రపంచ దేశాల్లో కోట్ల సంఖ్యలోని పేద రైతులకు ఆయా ప్రభుత్వాలు అందిస్తున్న రాయితీలు, మద్దతు ధరలకు కోతకోయాలని అగ్రరాజ్యం ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉంది. మరోవంక తాను మాత్రం 1995 నుంచి 2004వరకు 30 రకాల వ్యవసాయ ఉత్పత్తులకు వాటి ఉత్పాదక విలువలో పది శాతాన్ని ఏటా మద్దతు ధరగా చెల్లిస్తూ వస్తోంది. ఐరోపా సమాఖ్య అనేక వ్యవసాయ ఉత్పత్తులకు వాటి విలువలో కనీసం 50 శాతాన్ని మద్దతుగా చెల్లించింది. సంపన్న దేశాలు తమ రైతులకు భారీయెత్తున ఇస్తున్న సబ్సిడీలకు కోతకోయాలని, ఆ మేరకు ప్రపంచ వ్యవసాయ వాణిజ్య నిబంధనలను ప్రజాస్వామికంగా సంస్కరించాలని భారత్‌ ఇప్పటికే అనేక వేదికలపై గళం వినిపించింది. ఆకలి, దారిద్య్రంనుంచి ప్రపంచానికి విముక్తి కల్పించడమన్నది ఐక్యరాజ్య సమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో కీలకమైనది. ఆహార భద్రత కల్పనలో పేద దేశాల హక్కులను అధికారికంగా గుర్తిస్తూ అంతర్జాతీయ తీర్మానం వెలువడినప్పుడే ఆ లక్ష్యం దిశగా ముందడుగు పడుతుంది. ప్రపంచ వాణిజ్య సంస్థ సమావేశాల్లో ఆ మేరకు భారత్‌ మీద పెద్ద బాధ్యతే ఉంది!

Posted on 12-12-2017