Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఆర్థిక రంగం

బ్యాంకులకు మరింత స్వేచ్ఛ!

ప్రమాదఘంటికలు మోగిస్తున్న నిరర్థక ఆస్తుల (ఎన్‌పీఏ) పెరుగుదల, అంతంతమాత్రంగా ఉన్న రుణగిరాకీ, అధికమవుతున్న మూలధన అవసరాలు దేశ బ్యాంకింగ్‌ రంగానికి పెనుసవాళ్లు విసురుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ చొరవతో ఇటీవల 'జ్ఞానసంగం' పేరిట నిర్వహించిన బ్యాంకు అధినేతలు, ఆర్థికరంగ నిపుణుల సమావేశం కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. వినూత్న ప్రయోగానికి నాంది పలికింది. బ్యాంకింగ్‌ రంగంలో సంస్కరణల అమలును మరింత వేగవంతం చేసి, ప్రభుత్వరంగ బ్యాంకులు(పీఎస్‌బీలు) ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరించేందుకు ఆయా రంగాల అధిపతులతో ఒకే వేదికపై జరిగిన అరుదైన ఆర్థికరంగ మేధోమథనమది. దానిపై మోదీ తనదైన ముద్ర వేశారు. 'మేకిన్‌ ఇండియా', స్వచ్ఛభారత్‌, ప్రధానమంత్రి జన్‌ధన్‌ యోజన వంటి పలు ప్రజాహిత, అభివృద్ధి కారక కార్యక్రమాలు ప్రారంభించి దేశవ్యాప్తంగా మోదీ ప్రభంజనం సృష్టించారు. ఆయన ఈసారి దేశ బ్యాంకింగ్‌, ఆర్థిక రంగాలను ఉత్తేజపరచేందుకు జ్ఞానసంగం వేదికపై బ్యాంకులకు, ఆర్థికరంగ నిపుణులకు దిశానిర్దేశం చేశారు. బ్యాంకులపై రాజకీయ ఒత్తిళ్లు ఉండబోవని భరోసా ఇవ్వడం అభినందనీయం. అదేవిధంగా దేశ బ్యాంకింగ్‌ రంగం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లకు దీర్ఘకాలిక పరిష్కారమార్గాలు సూచిస్తూ ప్రభుత్వం, రిజర్వు బ్యాంకు, బ్యాంకింగ్‌ రంగ అధిపతులు, ఆర్థికరంగ నిపుణులందరూ ఒకే వేదికపై పలు కీలక సిఫార్సులు చేయడం హర్షణీయం.

సంస్కరణల బాటలోనే...

గడచిన రెండు దశాబ్దాలకు పైగా ఆర్థిక రంగంలో చోటుచేసుకొన్న సంస్కరణలు దేశ బ్యాంకింగ్‌ రంగాన్ని సమూలంగా మార్చివేయడంతోపాటు అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా ఎదిగేందుకు ఎంతగానో తోడ్పడ్డాయి. మోదీ ప్రభుత్వం సైతం సంస్కరణలను కొనసాగించే దిశలో చర్యలు చేపట్టడం ప్రారంభించింది. ఇటీవల పీఎస్‌బీల సీఎండీల ఎంపిక ప్రక్రియను మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంది. నిబద్ధత, నిజాయతీగల ప్రతిభావంతులనే ఉన్నత పదవులకు ఎంపిక చేయాలన్న దృఢసంకల్పంతో కొన్ని మార్పులు చేసింది. మొన్నటిదాకా సీఎండీ పదవికి ఒకే వ్యక్తిని ఎంపికచేసే విధానాన్ని అమలుచేయగా, ఇటీవల సీఎండీ పదవిని రెండుగా విభజించి ఛైర్మన్‌, ఎండీ పదవులకు వేర్వేరు వ్యక్తులను ఎంపికచేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టి సంస్కరణల బాట పట్టింది. గతంలో ఒక కార్పొరేట్‌ ఉక్కు కర్మాగారానికి (భూషణ్‌ స్టీల్స్‌ లిమిటెడ్‌) అదనపు రుణాన్ని మంజూరు చేసేందుకు రూ.50లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అప్పటి సిండికేట్‌ బ్యాంకు సీఎండీ ఎస్‌.కె.జైన్‌ ఉదంతంతో ప్రభుత్వం వెంటనే స్పందించింది. అప్పట్లో యూపీఏ హయాములో జరిగిన సీఎండీలు, ఎగ్జిక్యుటివ్‌ డైరెక్టర్ల నియామకాలను రద్దుచేసి వాటి స్థానంలో కొత్త నియామకాలు చేపట్టింది. 2018 మార్చి నాటికి 'బాసెల్‌-3' (బ్యాంకింగ్‌ రంగంలో నియంత్రణ, పర్యవేక్షణ, నష్ట నిర్వహణలకు ఉద్దేశించిన సమగ్ర సంస్కరణల ఒప్పందం) నిబంధనల అమలు పూర్తి చేయాలన్న సంకల్పంతో ఆర్‌బీఐ దేశ బ్యాంకింగ్‌ రంగాన్ని సమాయత్తం చేస్తోంది.

ముఖ్యంగా పీఎస్‌బీలు వాటి మూలధనాన్ని 2018నాటికి గణనీయంగా పెంచుకోవాల్సి ఉంది. 2018నాటికి పీఎస్‌బీలు దాదాపు రూ.2.50లక్షల కోట్లదాకా మూలధనం సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఇంత మొత్తాన్ని పీఎస్‌బీలకు ఇవ్వడం ఏ ప్రభుత్వానికైనా తలకుమించిన భారమేనని వేరే చెప్పనక్కర్లేదు. ఈ నేపథ్యంలో బ్యాంకులు క్యాపిటల్‌ మార్కెట్ల ద్వారా మూలధనాన్ని సమీకరించుకోవాల్సి ఉంటుంది. అయితే, అన్ని పీఎస్‌బీలు వాటి అవసరాల మేరకు ఈ పద్ధతిలో నిధుల సమీకరణ చేపట్టడం సాధ్యం కాదు. ఎందుకంటే, కొన్ని బ్యాంకులు వాటికి అవసరమైన మూలధనాన్ని పూర్తిగా మార్కెట్ల ద్వారా సేకరించినట్లయితే ఆయా బ్యాంకుల్లో ప్రభుత్వ వాటా 52శాతం కన్నా దిగువకు తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఇది సాధ్యంకాదు. అందువల్ల పీఎస్‌బీల మూలధన సమీకరణ అంశంపై ప్రభుత్వం వెంటనే దృష్టిసారించి, పటిష్ఠంగా ఉన్న బ్యాంకులకు నేరుగా క్యాపిటల్‌ మార్కెట్ల ద్వారా నిధులు సమకూర్చుకొనేందుకు అనుమతించడంతోపాటు పీజే నాయక్‌ కమిటీ సిఫార్సుల అమలుకు రంగం సిద్ధం చేయాలి.

ఇటీవల కొన్ని పీఎస్‌బీల మధ్య విలీనాలు జరగొచ్చన్న వూహాగానాలు వెలువడ్డాయి. విలీనాలపై జ్ఞానసంగంలో ప్రభుత్వం కొన్ని కీలక ప్రకటనలు చేయవచ్చునని భావించారు. బ్యాంకుల విలీనాల అంశం సమావేశంలో చర్చకు వచ్చినప్పటికీ, ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాన్నీ ప్రకటించలేదు. బ్యాంకులు విలీన ప్రతిపాదనలతో ముందుకు వస్తే పరిశీలిస్తామని అటు ప్రభుత్వం, ఇటు ఆర్‌బీఐ సుముఖత వ్యక్తం చేశాయి. నిజానికి విలీన ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాల్సింది ప్రభుత్వమే; బ్యాంకులు వాటంతట అవే విలీనాలకు సిద్ధమని ప్రభుత్వం చెంతకు ప్రతిపాదనలతో వెళ్లడమన్నది సాధారణంగా జరగదు. సమీప భవిష్యత్తులో కొన్ని పీఎస్‌బీల మధ్య విలీనాలకు అవకాశం లేకపోలేదు. రాబోయే కాలంలో ఇటు దేశీయంగా అటు అంతర్జాతీయంగా నానాటికీ పెరుగుతున్న పోటీని ఎదుర్కొంటూ 'బాసెల్‌-3' నిబంధనలకు అనుగుణంగా బ్యాంకింగ్‌ కార్యకలాపాలు సాగించాలి. అందుకోసం ప్రస్తుతం అరకొర మూలధనంతో, నామమాత్రపు వృద్ధిరేటుతో, భారీ ఎన్‌పీఏలతో కాలం నెట్టుకొస్తున్న కొన్ని చిన్న చిన్న బ్యాంకులు భవిష్యత్తులో విలీనాలపై దృష్టి సారించక తప్పదనేది వాస్తవం. విలీన ప్రక్రియ సామరస్య వాతావరణంలో ఆయా బ్యాంకు యాజమాన్యాల అంగీకారంతోనే జరగాలి. అంతేకాక విలీనాలపై ఆయా బ్యాంకుల ఉద్యోగ సంఘాలను ఒప్పించడం ఎంతైనా అవసరం. అప్పుడే విలీన ప్రక్రియ సజావుగా సాగుతుంది.

భవిష్యత్తులో రుణమాఫీ పథకాలను ప్రకటించే పరంపరకు ప్రభుత్వాలు స్వస్తి పలకాలి. కొన్ని రంగాలకిచ్చే రుణాల వడ్డీ రేట్లపై ప్రస్తుతం అమలులో ఉన్న పరిమితిని ఎత్తివేయాలి. బ్యాంకర్ల కమిటీపైన వెలిబుచ్చిన అభిప్రాయాలు, చేసిన సిఫార్సులు గతంలో ఆర్‌బీఐ వివిధ అంశాల అధ్యయనానికి నియమించిన పలు కమిటీలు విస్తృతంగా చర్చించి, ప్రతిపాదించినవే. ఉదాహరణకు బ్యాంకు బోర్డులను మరింత బలోపేతం చేసి, వాటి పనితీరును మెరుగుపరచే ప్రతిపాదనలతో పీజే నాయక్‌ కమిటీ గత మేలో తమ నివేదికను ఆర్‌బీఐకి సమర్పించించి. బ్యాంకు అధిపతుల (సీఎండీలు, ఎగ్జిక్యుటివ్‌ డైరెక్టర్లు) ఎంపికను ఒక ప్రత్యేక సంస్థకు కట్టబెట్టాలని, ఇందుకోసం 'బ్యాంక్‌ బోర్డ్స్‌ బ్యూరో' స్థాపించాలని అది సిఫార్సు చేసింది. పీఎస్‌బీల్లో ప్రభుత్వ వాటాను 50శాతం దిగువకు తగ్గించాలన్న సంచలనాత్మక సిఫార్సునూ చేసింది. సమ్మిళిత ఆర్థికాభివృద్ధిపై గతంలో నచికేత్‌ మోర్‌ కమిటీ ఎన్నో కీలక సిఫార్సులు చేసింది. బ్యాంకులు వాటి మొత్తం రుణాల్లో కనీసం 40శాతం రుణాలను ప్రాధాన్యతారంగానికి ఇవ్వాలన్న ప్రస్తుత నిబంధనలో కొన్ని మార్పులు చేసి ఈ రుణాలను 50శాతానికి పెంచాలనీ ఆ కమిటీ సిఫార్సు చేసింది. బ్యాంకుల నిరర్థక ఆస్తులు, వాటి గుర్తింపు, వాటిని అరికట్టే విషయంలో గతంలో ఆర్‌బీఐ నియమించిన కమిటీలెన్నో నివేదికలు సమర్పించాయి. ఆర్‌బీఐ ఎప్పటికప్పుడు బ్యాంకుల పారుబాకీల పెరుగుదలను నిశితంగా పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకొంటూనే ఉంది.

అయినప్పటికీ దేశ బ్యాంకింగ్‌ రంగం పారుబాకీలతో సతమతమవుతోంది. బ్యాంకుల ఎన్‌పీఏలు పెరగడానికి కొన్నేళ్లుగా కొనసాగుతున్న ఆర్థిక మాంద్యం ప్రధాన కారణం. ఆయా బ్యాంకులు అవలంబిస్తున్న ఉదాసీన వైఖరి మరో కారణం. వెరసి బ్యాంకుల ఎన్‌పీఏలు భారీగా పెరిగాయి. ఆర్థిక మాంద్యం ప్రభావం అన్ని రంగాలపై పడినప్పటికీ- ప్రైవేటు బ్యాంకులు, ముఖ్యంగా కొత్తతరం ప్రైవేటు బ్యాంకులు (ఐసీఐసీఐ, యాక్సిస్‌ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సి బ్యాంకు, యెస్‌ బ్యాంకు, ఇండస్‌ ఇండ్‌ బ్యాంకు, కొటక్‌ మహింద్రా బ్యాంకు...) వాటి నిరర్థక ఆస్తులను గణనీయంగా కట్టడి చేసుకోగలిగాయి. తాజా గణాంకాల ప్రకారం 2014 సెప్టెంబరు నాటికి పీఎస్‌బీల స్థూల ఎన్‌పీఏలు 12.9శాతానికి వృద్ధి చెందగా, ప్రైవేటు బ్యాంకుల ఎన్‌పీఏలు 4.4శాతం వృద్ధి చెందడం గమనార్హం. జ్ఞానసంగం స్ఫూర్తితో బ్యాంకులు వాటి ఎన్‌పీఏలను అయిదు శాతం లోపు తగ్గించుకొనేందుకు చర్యలు చేపట్టాలి.

కార్యాచరణే కీలకం

జ్ఞానసంగంలో బ్యాంకుల ఆర్థిక ఆస్తుల కట్టడి, పీఎస్‌బీల మూలధన సమీకరణ, కొన్ని బ్యాంకుల మధ్య తలపెట్టిన విలీనాలు, ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ప్రభుత్వానికి ఉన్న వాటాను ఒక ప్రత్యేక సంస్థ(బ్యాంక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీ)కి బదిలీ చేయడం వంటి పలు అంశాలపై ప్రభుత్వం కానీ, ఇటు ఆర్‌బీఐ కానీ ఎటువంటి విధానపరమైన నిర్ణయాలు ప్రకటించలేదు. అయినప్పటికీ, వివిధ కీలకాంశాలపై మరింత అవగాహనతో, సమన్వయంతో సంస్కరణల పథంలో ముందుకెళ్లేందుకు మార్గం సుగమమైందనడంలో ఏమాత్రం సందేహం లేదు. బ్యాంకు యాజమాన్యాలకు మరింత స్వయంప్రతిపత్తి కల్పించడంతోపాటు వాణిజ్యపరమైన (రుణ సంబంధిత) నిర్ణయాలు తీసుకొనే విషయంలో ప్రభుత్వం బ్యాంకులకు అండగా నిలుస్తుందని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ ఇచ్చిన హామీ, బ్యాంకర్లకు నూతనోత్సాహం కలిగించింది. ఎన్‌పీఏల తీవ్రత తగ్గించి ఉపశమనం కల్పించే దిశలో కొన్ని నిబంధనలను పునఃపరిశీలించేందుకు ప్రభుత్వం సహకరిస్తుందన్న కేంద్రమంత్రి హామీ బ్యాంకర్లకు కొండంత బలాన్నిచ్చింది. బ్యాంకులు వాటి నిరర్థక ఆస్తులను తగ్గించుకొనే దిశలో మరింత వ్యూహాత్మకంగా, కఠినంగా వ్యవహరించడంతో పాటు రుణ గిరాకీ పెంచుకొనేందుకు తక్షణ చర్యలు చేపట్టాలి. ప్రభుత్వం పీఎస్‌బీలకు మరింత స్వయంప్రతిపత్తి ఇవ్వడంతోపాటు బ్యాంకు అధిపతులు, ఉన్నతాధికారుల జీతభత్యాల పెంపుపై దృష్టిసారించాలి. వివిధ అంశాలను ప్రైవేటు బ్యాంకులతో పోల్చి చూస్తున్న దశలో వీటి మధ్య జీతభత్యాల్లో నెలకొన్న తీవ్ర అంతరాన్ని కొంతమేరకైనా తగ్గించే ప్రయత్నం చేయాలి. జ్ఞానసంగం స్ఫూర్తితో ప్రభుత్వం, ఆర్‌బీఐ, పీఎస్‌బీలు మరింత సమన్వయంతో దేశ ఆర్థికాభివృద్ధికి కృషి చేయాల్సి ఉంది.

(రచయిత - తుమ్మల కిషోర్)
(రచయిత- బ్యాంకింగ్‌ రంగ నిపుణులు)
Posted on 08-01-2015