Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఆర్థిక రంగం

నిధులకు నీళ్లు... విధులకు సీళ్లు

* 15వ ఆర్థిక సంఘంపైనే జిల్లా, మండల పరిషత్తుల ఆశలు

ఒకప్పుడు దేదీప్యమానంగా వెలుగొందిన జిల్లా, మండల పరిషత్తులు ఇప్పుడు కాంతిహినమయ్యాయి. అభివృద్ధి పనులు ఏవీ చేయలేక పోతున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇవి ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోయాయి. కాసింత సాయం కోసం 15వ ఆర్థిక సంఘంవైపు చూస్తున్నాయి. ఎన్‌కే సింగ్‌ నేతృత్వంలో కొత్త ఆర్థిక సంఘాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఆలస్యం- తమ సమస్యలను ఏకరువు పెడుతూ తెలంగాణలోని జిల్లా, మండల పరిషత్తుల నుంచి వినతుల పరంపర మొదలైంది. ప్రస్తుతం అమలులో ఉన్న వైవీ రెడ్డి సారథ్యంలోని 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల కారణంగా తాము తీవ్రంగా నష్టపోయామని, నిధుల కోసం అందరిముందు చేతులు చాచాల్సిన దుర్గతి పట్టిందని అవి ఆవేదన చెందుతున్నాయి. 15వ ఆర్థిక సంఘం సిఫార్సులను ఎన్‌కే సింగ్‌ కమిటీ 2019 అక్టోబరు నాటికి ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంది. 2020 ఏప్రిల్‌ ఒకటి లగాయతు అవి అమలులోకి రావాల్సి ఉంది. ఆర్థిక సంఘం అన్ని రాష్ట్రాల్లో పర్యటించి ప్రభుత్వంతో సహా వివిధ విభాగాలు, స్థానిక సంస్థల నుంచి వినతులు స్వీకరిస్తుంది. పల్లెవాసులకు మౌలిక వసతులను కల్పించేది గ్రామ పంచాయతీలే కనుక నిధులు అన్నింటినీ నేరుగా వాటికే ఇవ్వాలని 14వ ఆర్థిక సంఘం సూత్రీకరించడం వల్ల తమకు ప్రాధాన్యం తగ్గిపోయిందని జిల్లా, మండల ప్రజాపరిషత్తులు వాపోతున్నాయి. అందువల్లే కొత్త సంఘం సిఫార్సుల విషయంలో అవి ఇప్పటినుంచే కసరత్తు ప్రారంభించాయి.

పనులు ఎక్కడివక్కడే...
పంచాయతీలకు పైస్థాయిలో జిల్లా, మండల పరిషత్తులు ఉంటాయనే విషయం ఆర్థిక సంఘానికి తెలియని విషయం కాదు. మరెందుకు వాటాలు ఇవ్వకుండా పక్కన పెట్టినట్లు? పన్నుల్లో వాటాను రాష్ట్రాలకు 32 శాతం నుంచి 42 శాతానికి పెంచినందువల్ల జిల్లా, మండల పరిషత్తుల బాధ్యతలను రాష్ట్రాలే చేపట్టాలనేది దాని వాదన. కేంద్రం కొన్ని పథకాలకు నిధులను అకస్మాత్తుగా రద్దు చేసి, వాటి తదుపరి కొనసాగింపు పైకాన్ని కూడా తాను పెంచి ఇస్తున్న పన్నుల వాటా నుంచే రాష్ట్రాలు ఖర్చుపెట్టుకోవాలని సూత్రీకరించింది. ఇలా కేంద్రం 42 శాతం వాటాను ఓ అస్త్రంగా ప్రయోగిస్తుండటంవల్ల జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ వంటి వ్యవస్థలు నీరుగారిపోయాయి. అంతకుముందు ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం కేంద్రం నుంచి స్థానిక సంస్థలకు వచ్చే నిధుల్లో జడ్పీ, మండల పరిషత్‌, గ్రామ పంచాయతీలకు నిర్ణీత వాటాలు ఉండేవి. జడ్పీ పెద్ద‌న్న పాత్ర పోషిస్తూ గ్రామాల్లోని ప్రధాన రోడ్లు, గ్రామాల తాగునీటి పథకాల నిర్వహణ, పాఠశాలల్లో వసతుల కల్పన వంటి కీలక బాధ్యతలు ఎన్నింటినో చేపట్టేది. మండల పరిషత్‌ కూడా మంచినీటి బోర్లకు మరమ్మతులు చేయించటం, రోడ్ల నిర్మాణం వంటి విధులు నిర్వహించేది. 14వ ఆర్థిక సంఘం సిఫార్సులు అమలులోకి వచ్చిన 2015 ఏప్రిల్‌ నుంచి ఇటువంటి పనులన్నీ నిలిచిపోయాయి. అన్ని నిధులు నేరుగా గ్రామ పంచాయతీలకు వెళ్లిపోతున్నాయి. మునుపటి మాదిరిగా జిల్లా పరిషత్‌, మండల పరిషత్తులకు వాటాలు అందడం లేదు. అందువల్ల జిల్లా, మండల పరిషత్‌ ప్రాదేశిక (జడ్‌పీటీసీ, ఎంపీటీసీ) సభ్యుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. పనులు జరగనప్పుడు- పార్టీ గుర్తులపై ఎన్నికైన వీరిని ప్రజలు నిలదీయడం సహజం. వారికి సమాధానాలు చెప్పుకోలేక వీరంతా సతమతమవుతున్నారు. వీరి నుంచి ఎన్నికైన జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ ఛైర్‌పర్సన్లదీ అదే పరిస్థితి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఎప్పుడు జడ్పీ, మండల పరిషత్‌ సమావేశాలను నిర్వహించినా నిధులు, విధుల అంశమే ప్రధాన చర్చనీయాంశమవుతోంది. జడ్పీ ఛైర్‌పర్సన్ల వాహనాలకు కనీసం డీజిలు ఖర్చులైనా అందని దుర్గతి ప్రస్తుతం నెలకొంది. ఒకప్పుడు కలెక్టరేట్ల మాదిరిగా భాసిల్లిన జడ్పీలు ఇప్పుడు కనీసం ప్రహరి గోడను కట్టుకోవాలన్నా ఎవరో ఒకర్ని ప్రాధేయపడాల్సిన అగత్యం ఏర్పడుతోంది. 14వ ఆర్థిక సంఘం చేసిన కొన్ని సిఫార్సులను అప్పట్లోనే అందులోని సభ్యుడు అభిజిత్‌ సేన్‌ వ్యతిరేకించారు. తన అసమ్మతిని తెలిపారు. అందుకు ఛైర్మన్‌ వైవీ రెడ్డి ఇచ్చిన సమాధానాన్నీ నివేదికలో పొందుపరచారు. పన్నుల్లో వాటా పెంచామనే పేరుతో కొన్ని పథకాలకు నిధులు నిలిపేయడం వల్ల తలెత్తే పరిణామాలను తన అసమ్మతి పత్రంలో అభిజిత్‌ ప్రస్తావించారు. అంటే, ఇప్పటి పరిస్థితిని ఆయన ముందుగానే పసిగట్టారన్న మాట.

ఉనికే ప్రశ్నార్థకం
ఆర్థిక సంఘం నిధుల్లో వాటాలు అంటూ లేనందువల్ల ఇతరత్రా తామూ ఇవ్వాల్సిన పైకాన్ని అయినా రాష్ట్ర ప్రభుత్వాలు సక్రమంగా అందజేయగలిగితే స్థానిక సంస్థలకు కొంత వూరట కలిగేది. తెలంగాణ విషయానికొస్తే, ఇక్కడ స్టోన్‌ క్రషర్లు, గ్రానైట్‌ క్వారీల నుంచి రాబట్టే సీనరేజి సెస్‌, రిజిస్ట్రేషన్‌ సమయంలో వసూలు చేసే బదిలీ సుంకం వంటివేవీ జిల్లా, మండల పరిషత్తులకు ప్రస్తుతం అందడం లేదు. బీఆర్‌జీఎఫ్‌ వంటి పథకాలూ నిలిచిపోయాయి. ఉభయ రాష్ట్రాలో అన్ని వైపుల నుంచి తలుపులు మూసుకుపోవడంవల్లే వాటికి ప్రస్తుతం వూపిరాడని పరిస్థితి నెలకొంది. అందువల్లే 15వ ఆర్థిక సంఘంపై జిల్లా, మండల పరిషత్తులు ఇప్పుడు గంపెడాశలు పెట్టుకొన్నాయి. నిధులు లేనప్పుడు జిల్లా, మండల పరిషత్తులను కొనసాగించడం దండగనే నైరాశ్య ధోరణీ ఆయా ప్రజాప్రతినిధుల్లో ఏర్పడుతోంది.
కేంద్ర సర్కారు 15వ ఆర్థిక సంఘానికి నిర్దేశించిన నియమనిబంధనలను పరిశీలిస్తే ఈసారి స్థానిక సంస్థల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలను బాధ్యులుగా చేసే సిఫార్సులను అది వెలువరించవచ్చని తెలుస్తోంది. వివిధ అంశాల్లో ప్రతిభ కనబరచిన రాష్ట్రాలకు ప్రోత్సాహక మొత్తాలు ఇచ్చేలా సిఫార్సులు చేయాల్సిందిగా నూతన ఆర్థిక సంఘానికి కేంద్రం సూచించింది. స్థానిక సంస్థలకు రాష్ట్ర సొంత ఖజానా నుంచి గ్రాంట్లు ఇవ్వడమూ ఇటువంటి కేంద్ర ప్రోత్సాహకాలకు అర్హమైన అంశాల్లో ఉంది. అంటే సీనరేజి సెస్‌, బదిలీ సుంకం వంటివాటిని, ప్రత్యేక సాయాలను ఇప్పటి మాదిరిగా ఏళ్లతరబడి అందజేయకుండా తాత్సారం చేస్తుంటే మాత్రం కేంద్ర ప్రోత్సాహకాలను వదులుకోవాల్సిందే. స్థానిక సంస్థల్లో మానవ వనరుల అభివృద్ధి, పౌరులకు మెరుగైన సేవలు అందుబాటులోకి తేవటం వంటివాటితో సహా వివిధ కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వాలు గ్రాంట్లు ఇవ్వాల్సి ఉంటుంది. అంతేకాకుండా, బహిరంగ మలవిసర్జన రహిత గ్రామాలుగా ప్రకటించినచోట ప్రజల ప్రవర్తనల్లో మార్పులు తేవటానికి రాష్ట్రాలు చేసిన కృషికీ ప్రోత్సాహకాలు ఉంటాయి. పంచాయతీల్లో రాబడి వనరులను పెంచే మార్గాలపైనా 15వ ఆర్థిక సంఘం సిఫార్సులు చేస్తుంది. పన్నుల ఆదాయంలో రాష్ట్రాలకు ఇచ్చే వాటాను 42 శాతానికి పెంచిన తరవాత ఒనగూడిన ప్రయోజనాలపై అది అధ్యయనం చేస్తుంది. వాటాలు లేనందువల్ల తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నామంటూ గ్రామీణ స్థానిక సంస్థల నుంచి, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వినతులు వెళ్తాయి కనుక, ఈ అంశంపైనా నూతన ఆర్థిక సంఘం దృష్టి సారించే అవకాశం ఉంది.

పాలక వర్గాలపై ఒత్తిడి
తెలుగు రాష్ట్రాల్లో మండల వ్యవస్థ మధ్యస్తంగా ఉంది. కాబట్టి, ఇక్కడి పరిస్థితులు ప్రత్యేకంగా ఉంటాయి. ప్రభుత్వ పాలనను ప్రజల చేరువకు తీసుకెళ్లాలనే ధ్యేయంతో అమలులోకి తెచ్చిన మండల వ్యవస్థకు తగినంత ఆర్థిక పరిపుష్టి ఉన్నప్పుడే అది సజావుగా పనిచేయగలుగుతుంది. తెలంగాణలో తొమ్మిది గ్రామీణ జిల్లాల సంఖ్య 30కి ఎగబాకినందున 2019లో ప్రస్తుత తొమ్మిది జిల్లా పరిషత్తులస్థానే 30 జిల్లా పరిషత్తులు ఏర్పాటవుతాయి. అప్పటికి ప్రస్తుత జిల్లా పరిషత్‌ పాలకవర్గాల పదవీ కాలం పూర్తవుతుంది. కనుక వీటిని విడగొట్టి 30 జడ్పీలు చేస్తారు. నిర్ణీత కాలవ్యవధి ప్రకారమైతే తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ 2019లో కొత్త పాలకవర్గాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. తెలంగాణలో కొత్త మండలాలు పెద్దసంఖ్యలో ఏర్పాటైనందువల్ల వాటికీ కొత్త పాలకవర్గాలు వస్తాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో జిల్లా, మండల పరిషత్తులు తమ విధులను సజావుగా నిర్వహించాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సాయం తప్పనిసరి. నిధులు కేంద్రమే ఇవ్వాలని రాష్ట్రం, తాను పన్నుల వాటా పెంచేసినందున రాష్ట్రమే నిధులు సమకూర్చుకోవాలన్న వితండ వాదనలకు కేంద్రం దిగితే మాత్రం స్థానిక సంస్థల పరిస్థితి మరింత దిగజారుతుంది. పర్యవసానంగా పల్లె సీమలు ఇబ్బందుల పాలవుతాయి. గ్రామాల్లోనూ పట్టణాల మాదిరిగా వసతుల కల్పనకంటూ కేంద్రం ‘రూర్బన్‌’ అనే ఒక పథకాన్ని తెచ్చి, ఎంపిక చేసిన కొన్ని జిల్లాల్లో దాన్ని అమలు చేస్తోంది. పథకాన్ని దశలవారీగా విస్తరించాలనేది కేంద్రం ఉద్దేశం. ఇటువంటి కార్యక్రమాలకు కేంద్రం ఇచ్చే మొత్తాలు చాలా తక్కువ. రాష్ట్ర ప్రభుత్వాలే అధిక వాటాను సమకూర్చాలి. నిధులకు కొరత ఉన్నప్పుడు ఇటువంటి కార్యక్రమాలు ఎన్ని చేపట్టినా ఫలితం ఉండదు. ఇప్పటికే ‘సన్సద్‌ ఆదర్శ గ్రామ యోజన’ నీరుగారింది. ఉభయ రాష్ట్రాల్లో పలువురు ఎంపీలు రెండో దశ గ్రామాలనైనా ఎంపిక చేయలేదు. నిధులు ఇవ్వకుండా అందుబాటులో ఉన్న కార్యక్రమాల నుంచే ఆదర్శ గ్రామాలకూ సొమ్ము ఖర్చుపెట్టాలంటే అన్ని చోట్లా సాధ్యంకాకపోవచ్చు. అందుకే ఆర్థిక సంఘం వంటివి సిఫార్సులు చేసేటప్పుడు, కేంద్రం వివిధ పథకాల రూపొందించే సందర్భంలో పర్యవసానాలనూ అంచనా వేయాలి. 15వ ఆర్థిక సంఘం అటువంటి పని చేస్తే తెలుగు రాష్ట్రాల్లో కొత్త పాలక వర్గాలైనా ప్రశాంతంగా పనిచేసుకోగలుగుతాయి!

- పిళ్లా సాయికుమార్‌
Posted on 04-01-2018