Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఆర్థిక రంగం

గ్రామీణంపై దృష్టితోనే వృద్ధిరేట్లకు పుష్టి

* ఆశావహంగా ఆర్థికవ్యవస్థ

భారతదేశ త్రైమాసిక ఆర్థికాభివృద్ధిపై కేంద్ర గణాంక కార్యాలయం (సీఎస్‌ఓ) ఇటీవల విడుదల చేసిన అంచనాలు ప్రభుత్వ వర్గాల్లో ఆనందం నింపాయి. ఈ ఏడాది రెండో త్రైమాసికంలో భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 6.3 శాతం పెరిగినట్లు సీఎస్‌ఓ అంచనా. మొదటి త్రైమాసికంలో ఇది 5.7 శాతం మాత్రమే. గత మూడేళ్లలో అదే అతి తక్కువరేటు. రెండో త్రైమాసికం వచ్చేసరికి వృద్ధిరేటు మెరుగుపడటంపై పత్రికలు, టీవీ ఛానెళ్లు హర్షం వ్యక్తీకరించాయి. దేశ ఆర్థిక వ్యవస్థ మళ్ళీ కోలుకుంటోందని సంబరపడ్డాయి. అయితే వృద్ధిరేటు అసలు ఎందుకు మందగించింది, గడచిన అయిదు త్రైమాసికాల్లో వరసగా తగ్గుతూ వచ్చి ఉన్నట్టుండి మెరుగుపడటానికి కారణాలేమిటి, దీన్ని స్థిరపరచి అంతకంతకూ మరింత వృద్ధి సాధించడమెలా అనే మూడు ప్రశ్నలు ఇప్పుడు నిపుణుల మదిలో మెదులుతున్నాయి. వీటిలో మొదటి ప్రశ్నకు పెద్దనోట్ల రద్దు అని ఠక్కున జవాబు వస్తుంది. దీనికితోడు వస్తుసేవల పన్ను (జీఎస్‌టీ) అమలులో అవరోధాలు కూడా వృద్ధిరేటును తగ్గించాయని విమర్శలు వెల్లువెత్తాయి. ఆర్థిక మందగమనం ఇంకా ముందు నుంచే ప్రారంభమైందని- పెద్ద నోట్ల రద్దు, జీఎస్‌టీలు ఈ మందగతిని తీవ్రతరం చేశాయని ఇక్కడ గుర్తుంచుకోవాలి.

స్థిరీకరణ అవసరం
ఆర్థిక మందగమనానికి మూలాలు గ్రామీణ భారతంలో ఉన్నాయి. 2004-2012 మధ్యకాలంలో గ్రామీణ ఆర్థికవ్యవస్థ సాపేక్షంగా ఎక్కువ అభివృద్ధి సాధించి జాతీయ వృద్ధిరేటు పెరగడానికి దన్ను ఇచ్చింది. పైన తెలిపిన కాలంలో వ్యవసాయ ఉత్పత్తి మూడు శాతం పెరగడంతో వ్యవసాయ ఆదాయాలు 7.5 శాతం వృద్ధిని నమోదు చేశాయి. దీంతో అనేక వస్తుసేవలకు గ్రామాల నుంచి గిరాకీ ఇనుమడించి స్థూల జాతీయోత్పత్తి వృద్ధి చెందింది. కానీ, 2013-14 నుంచి పరిస్థితులు ప్రతికూలించసాగాయి. 2004-12 మధ్య కొన్ని పంటల కనీస మద్దతు ధరలు సగటున ఎనిమిది శాతం పెరగ్గా, 2013-14 నుంచి కేవలం మూడు శాతం చొప్పున అధికమయ్యాయి. అంతర్జాతీయంగా ఆహార ధరలు తగ్గడంతో వ్యవసాయ ఎగుమతులూ మందగించాయి. ఇదంతా గ్రామీణ ప్రగతిని వెనక్కులాగింది. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్లక్ష్యం చేయడం; 2014-15, 2015-16 సంవత్సరాల్లో సంభవించిన దుర్భిక్షం గ్రామాల్లో కొనుగోలు శక్తిని తగ్గించాయి. పల్లెల నుంచి వస్తుసేవలకు గిరాకీ తగ్గిపోవడం దేశ జీడీపీ జోరుకు పగ్గాలు వేసింది. కాబట్టి జీడీపీ మందగతికి జీఎస్‌టీ, పెద్ద నోట్ల రద్దు మూల కారణాలు కావు. డిజిటల్‌ ఆర్థికవ్యవస్థ గాడిన పడి, జీఎస్‌టీ అమలులోని లోపాలను సరిదిద్దిన తరవాత జీడీపీ వృద్ధి ఇనుమడించడం ఖాయం!

ఇప్పుడు రెండో ప్రశ్న- ఈ ఏడాది రెండో త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి కారణమేమిటి? మొదటి త్రైమాసికంలో 5.6 శాతం స్థూల విలువ, రెండో త్రైమాసికంలో 5.7 శాతానికి పెరిగింది. ఈ పెరుగుదల పారిశ్రామిక ఉత్పత్తి రంగం నుంచే వచ్చింది. ఈ రంగం ఏడు శాతం వృద్ధిని నమోదు చేసిందని గమనించాలి. ఇది మొదటి త్రైమాసికంకన్నా 5.6 శాతం ఎక్కువ. ప్రైవేటు రంగ వ్యయం పెరగడమూ ఈ వృద్ధికి తోడ్పడింది. మొదటి త్రైమాసికంలో జీఎస్‌టీ అమలులోకి వస్తుందనగా వర్తకులు తమవద్ద ఉన్న పాత సరకులను పెద్దయెత్తున విక్రయించారు. కొత్త నిల్వలను ఇంకా సమకూర్చుకోకపోవడంతో వృద్ధిరేటు తగ్గింది. రెండో త్రైమాసికానికి వచ్చేసరికి వర్తకులు మళ్ళీ కొత్తగా సరకులు కొనడం, పారిశ్రామికోత్పత్తి పెరగడానికి దోహదం చేసింది. జీడీపీని మళ్ళీ వృద్ధి బాట పట్టించింది పారిశ్రామిక రంగమేనని నిగ్గు తేలుతోంది. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో పారిశ్రామికోత్పత్తిరంగ నిర్వహణ లాభాలు 17.6 శాతం తగ్గిపోగా, రెండో త్రైమాసికంలో 10.45 శాతం పెరిగాయని భారత ఆర్థిక వ్యవస్థ పర్యవేక్షణ సంస్థ సీఎంఐఈ తెలిపింది. నిర్మాణ రంగ వృద్ధిరేటు తొలి త్రైమాసికంలో రెండు శాతం. రెండో త్రైమాసికంలో అది 2.6 శాతానికి చేరింది. స్థూల స్థిర పెట్టుబడి సంచయవృద్ధి 4.7 శాతానికి పెరిగింది. 2017-18 మూడో త్రైమాసికంలోనూ అమ్మకాలు, లాభదాయకత పెరిగి జీడీపీ హెచ్చు శాతం వృద్ధిని నమోదు చేస్తుందని వ్యాపార రంగం ధీమా కనబరుస్తోంది. భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) నిర్వహించిన సర్వేలోనూ ఇది స్పష్టమైంది. మొత్తంమీద భారత ఆర్థిక వ్యవస్థ మళ్ళీ పట్టాలపై పరుగు ప్రారంభించింది. అలాగని అంతా సవ్యంగా ఉందని, వ్యవస్థాపరమైన లోటుపాట్లు అన్నీ తొలగిపోయాయని భావించలేం. వ్యవసాయ రంగం ఇప్పటికీ కోలుకోలేదు. 2016 రెండో త్రైమాసికంలో 4.1 శాతంగా ఉన్న వ్యవసాయాభివృద్ధి రేటు 2017లో అదే కాలంలో 1.7 శాతానికి తగ్గిపోయింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఇంకా కోలుకోలేదని, ఫలితంగా గ్రామాల్లో వస్తుసేవలకు గిరాకీ పుంజుకోలేదని స్పష్టమవుతోంది. గ్రామీణుల కొనుగోలు శక్తి పెరిగినప్పుడు మాత్రమే పారిశ్రామికోత్పత్తి వృద్ధిబాట పట్టి జీడీపీ అధికమవుతుందనడంలో మరోమాట లేదు. వ్యవసాయంతోపాటు అనుబంధ రంగాలకు కొత్త ఉత్తేజం తీసుకురావడం ద్వారా గ్రామీణుల ఆదాయాలను పెంచవచ్చునని కేంద్రం గ్రహించింది. తదనుగుణంగా 2017-18 నుంచి 2028-29 వరకు రూ.10,881 కోట్ల వ్యయంతో పాడి ఉత్పత్తుల శుద్ధి, మౌలిక వసతుల అభివృద్ధి నిధి (డీఐడీఎఫ్‌) ఏర్పాటుకు కేంద్రం అనుమతించింది.

2017-18 రెండో త్రైమాసికంలో ప్రభుత్వ వ్యయం తక్కువగానే ఉన్నా ప్రైవేటు రంగ చొరవ వల్ల ఎక్కువ వృద్ధిరేటు నమోదైంది. ఇదేకాలంలో ఎగుమతులు 1.2 శాతం మేర తగ్గడం నిరుత్సాహకరమే. జీఎస్‌టీ, పెద్ద నోట్ల రద్దు వల్ల ఈ పరిస్థితి దాపురించిందని విమర్శించేవాళ్లు, ఒకసారి క్రిసిల్‌ నివేదిక చూడాలి. కార్మికుల అవసరం ఎక్కువగా ఉండే ఉత్పత్తుల ఎగుమతులకు గత పదేళ్ల నుంచి గిరాకీ తగ్గిపోతూ వచ్చింది. ఇలాంటి ఉత్పత్తులను భారత్‌కన్నా చౌకగా తయారుచేయగల దేశాల నుంచి పోటీ తీవ్రం కావడంవల్ల మన ఎగుమతులు తగ్గిపోతున్నాయని క్రిసిల్‌ తెలిపింది. జీఎస్‌టీ, పెద్దనోట్ల రద్దు తాత్కాలిక ప్రభావం చూపాయే తప్ప, అసలు సిసలు సమస్య వ్యవస్థాగతమైనదని క్రిసిల్‌ స్పష్టీకరించింది. ఎగుమతులు చేసే సంస్థల్లోని కార్మికుల ఉత్పాదక శక్తిని పెంచడం ద్వారా మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావడమే సరైన పరిష్కారం.

సానుకూల సూచనలు
2016 ఆరంభంలో ద్రవ్యోల్బణం తక్కువగానే ఉన్నా, ఈ మధ్య ముడిచమురు ధరలు పెరగడం వల్ల ద్రవ్యోల్బణం మళ్ళీ పైచూపులు చూస్తోంది. దీన్ని అదుపులోకి తీసుకురావడానికి రిజర్వు బ్యాంకు వడ్డీరేట్లు పెంచాల్సి రావచ్చు. ఫలితంగా పెట్టుబడి వ్యయం అధికమై ఎగుమతి సంస్థల ఉత్సాహం నీరుగారిపోవచ్చు. ఇది ఆర్థిక రథాన్ని మళ్ళీ నీరసింపజేసే ప్రమాదం ఉంది. దీన్ని ఎదుర్కోవడానికి కేంద్రప్రభుత్వం అప్పులు చేసైనా వ్యయాన్ని పెంచకతప్పదు. దీనివల్ల ఇప్పటికే పెరిగిపోయిన ద్రవ్యలోటు మరింత హెచ్చవచ్చు. 2017-18లో కేంద్రం నిర్దేశించుకున్న ద్రవ్యలోటులో ఇప్పటికే 96 శాతాన్ని చేరుకున్న దరిమిలా మరింతగా అప్పులుచేసి వ్యయీకరించే సత్తా క్షీణించింది. అందుకే ఈ ఏడాది రెండో త్రైమాసికంలో ప్రభుత్వ వ్యయం పెరగలేదు. వివిధ ప్రాజెక్టులపై నిధులు వెచ్చించాలని కేంద్రం తలపోసినా, అందుకు కావలసిన నిధులు దానివద్ద లేవు. అలాగని నిరుత్సాహపడిపోనక్కర్లేదు. మధ్యకాలికంగా భారత్‌ వృద్ధి అవకాశాలు బాగా ఉన్నాయి. ప్రభుత్వరంగ బ్యాంకులకు రూ.2.11 లక్షల కోట్ల అదనపు మూలధనాన్ని సమకూర్చడానికి ప్రభుత్వం సన్నాహాలు చేయడం నిస్సంశయంగా శుభసూచన. ఇందుకోసం ఈ ఏడాది ఆగస్టులో కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లు త్వరలో పార్లమెంటు ఆమోదం పొందనుంది. ఈ బిల్లు బ్యాంకులను పటిష్ఠపరచి రుణ వితరణకు బాటవేస్తుంది. సంపన్న దేశాల్లో వృద్ధి చిగురిస్తున్నందువల్ల భారతదేశ ఎగుమతులు మళ్ళీ పుంజుకోనున్నాయి. కాబట్టి 2018లో దేశంలో పెట్టుబడులు, వాటితోపాటే ఉపాధి అవకాశాలు పెరుగుతాయని గట్టిగా ఆశించవచ్చు!

- డాక్టర్‌ మహేంద్రబాబు కురువ
Posted on 04-01-2018