Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఆర్థిక రంగం

సమతుల ప్రగతికి కట్టాలి పట్టం

* అసమానతలు తొలగే మార్గం

మానవుల పుట్టుక చావులు ప్రకృతి సృష్టి. జీవన విధానాలు మాత్రం మానవ నిర్మితం. మనుషులు ఏర్పాటు చేసుకున్న వ్యవస్థలు, సమాజంలో వారి మధ్య, సమూహాల మధ్య, ప్రాంతాల మధ్య, దేశాల మధ్య, సామాజిక, ఆర్థిక, రాజకీయ జీవన సమాన అసమానతల స్థాయుల్ని నిర్ణయిస్తాయి. అందరికీ సమాన సంపద పంచే వ్యవస్థలు సమాన స్థాయుల్ని కల్పిస్తాయి. కనీసం అలాంటి అవకాశాలనైనా అందిస్తాయి. అసమానతలను అదుపులో పెట్టగలుగుతాయి. స్వాతంత్య్రానంతరం ఆధునిక భారతం ప్రతి ఒక్క పౌరుడికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ అవకాశాల్లో సమానత్వం కల్పించాలని రాజ్యాంగబద్ధంగా సంకల్పించింది. ఇప్పటికీ అది సామాన్యులకు అందని ద్రాక్షే! విద్య, వైద్య, ఆహార భద్రతల్లో సమానత్వం- రాజకీయ ఆర్థిక సమానత్వానికి పునాది. అలాంటి పునాదుల్లోనే లోపాలుంటే వ్యవస్థలు కూలిపోతాయి. ఇది చారిత్రక సత్యం!

అంతరాల్లో అగ్రస్థానం
ఆర్థిక స్థితికి, ఆకలి బాధకు అవినాభావ సంబంధం ఉంది. కాబట్టి, ఆర్థిక అసమానతలు మిగతా వాటన్నింటికన్నా కష్టదాయకమైనవి. నోబెల్‌ బహుమతి గ్రహీత ప్రొఫెసర్‌ మహమ్మద్‌ యూనిస్‌ పేర్కొన్నట్లు, ప్రస్తుత ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పుట్టగొడుగు ఆకారాన్ని పోలి ఉంది. వ్యవస్థలో దిగువస్థాయిలో అత్యధిక ప్రజలు సృష్టిస్తున్న సంపద ఎగువ స్థాయిలో అత్యల్ప వ్యక్తుల వద్ద కేంద్రీకృతమవుతోంది. మొన్నటికి మొన్న విడుదలైన ప్రపంచ అసమానతల నివేదిక (2018) గణాంకాలే దీనికి నిదర్శనం. ఈ నివేదిక ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో మూడున్నర దశాబ్దాలుగా విపరీతంగా పెరిగిపోతున్న ఆర్థిక అసమానతలను బట్టబయలు చేసింది. 1980-2014 మధ్యకాలంలో ప్రపంచ జనాభాలో ఎగువ ఒక్క శాతం ప్రజల ఆదాయ వాటా, మొత్తం ప్రపంచ ఆదాయంలో 16 శాతం నుంచి 22 శాతానికి పెరిగింది. దిగువ 50 శాతం ప్రజల ఆదాయ వాటా కేవలం ఆరు శాతం నుంచి తొమ్మిది శాతానికి మాత్రమే పరిమితమైంది. ఇదే కాలంలో ఎగువ ఒక్క శాతం ప్రజలు, దిగువ 50 శాతం ప్రజల మొత్తం ఆదాయం కన్నా రెండు రెట్ల కంటే అధిక ఆదాయం గడించారు. ఈ గణాంకాల ప్రకారం, ఆర్థిక అసమానతల పోకడల్లో భారత్‌, ప్రపంచ దేశాలన్నింటికన్నా ముందువరసలో ఉంది. 2014లో దేశ జనాభాలో పైస్థాయిలోని 10 శాతం ప్రజలు, 55 శాతం సంపదను అనుభవిస్తున్నారు. మిగిలిన 90 శాతం ప్రజలు 45 శాతం ఆదాయాన్ని మాత్రమే పొందుతున్నారు. ఎగువ 10 శాతం ప్రజల ఆదాయ వాటా చైనాలో 41 శాతం. ఆఫ్రికాలో 54 శాతం. అమెరికా, కెనడాల్లో 47 శాతం, ఐరోపా దేశాల్లో 37 శాతంగా ఉంది. 1980ల నుంచి ఆర్థిక అసమానతల అంతరం మన దేశంలోనే అధికం. 1951-2014 మధ్యకాలంలో, జనాభాలో ఎగువ ఒక్క శాతం ప్రజల ఆదాయ వాటా మొత్తం ఆదాయంలో 12 శాతం నుంచి 22 శాతానికి పెరిగింది. దిగువ 50శాతం ప్రజల వాటా 22 శాతం నుంచి 15 శాతానికి తగ్గింది. ఇది ప్రపంచ పోకడకు వ్యతిరేకం. అక్కడ దిగువ స్థాయి ప్రజల ఆదాయాలూ స్వల్పంగా పెరిగాయి.

మన దేశంలో ఆర్థిక అసమానతల పెరుగుదల 1980ల్లో మొదలైన సంస్కరణల నుంచి ప్రారంభమైంది. 1980-2014 మధ్య కాలంలో మొత్తం జాతీయ ఆదాయంలో, జనాభాలో ఎగువ 10 శాతం ప్రజల ఆదాయ వాటా అత్యధికంగా పెరగ్గా, మధ్య శ్రేణిలో 40 శాతం, దిగువన 50 శాతం ప్రజల వాటాలు తగ్గాయి. ఇదే మూడున్నర దశాబ్దాల కాలంలో పైవర్గం నికర ఆదాయం సుమారు నాలుగింతలు పెరగ్గా, కింది రెండు వర్గాల ఆదాయం రెట్టింపైనా కాలేదు. దీన్నిబట్టి మూడున్నర దశాబ్దాల కాలంలో దేశంలో నమోదైన ఆర్థికవృద్ధి పేదలకన్నా, ధనికులకే ఎక్కువ లాభించింది. బలవంతులకే మరింత బలం చేకూర్చింది. అసమానంగా నిర్మితమై, అస్తవ్యస్తంగా కొనసాగుతున్న సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్య, వైద్య వ్యవస్థలే అసమానతలు పెచ్చరిల్లడానికి కారణమవుతున్నాయి. కుల వ్యవస్థ సమాజంలో మనుషులను నిలువుగా చీలుస్తోంది. భూమి ఇతర సంపదలపై కొన్ని కులాల అధిపత్యం నెలకొని ఉంది. దీనివల్ల బడుగు బలహీన వర్గాలకు చెందినవారు అధికంగా పేదలుగానే మిగిలిపోతున్నారు. ప్రస్తుత సమాజ పోకడల దృష్ట్యా, కులపరమైన అసమానతలతోపాటు మతపరమైన అసమానతలూ అధికమవుతున్నాయి. రాజ్యాంగం సాక్షిగా దేశంలో రాజకీయ సమానత్వం కల్పించినప్పటికీ, వాస్తవంలో అది నేతి బీరలో నెయ్యి చందం. నేటికీ దేశంలో రాజకీయ సమానత్వం అనేది వారసత్వం, కుల, ధన బలాల గోడలు దాటి సామాన్యుడికి చేరువ కావడంలేదు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా భవిష్యత్తులోనైనా పరిస్థితి మారగలదన్న ఆశా సన్నగిల్లుతోంది. ఈ విధమైన తెరచాటు రాజకీయ అసమానత్వం ఇతర అసమానతలకు ముఖ్యంగా ఆర్థిక అసమానతలకు దారి తీస్తోంది. అధిక ఉపాధి కల్పిస్తున్న వ్యవసాయ రంగం అసమానతలతో కునారిల్లుతోంది. భూమి, సాగునీరు, వ్యవస్థాగత పరపతి, పంట బీమా, విత్తన సదుపాయం, విస్తరణ సేవలు వంటి కీలక అంశాల్లో విపరీతమైన అసమానతలున్నాయి. భూసంస్కరణలు జరిగిప్పటికీ అధిక శాతం సాగుభూమి కొద్దిమంది చేతుల్లోనే ఉంది. మొత్తం రైతుల్లో 85 శాతం సన్న, చిన్నకారు రైతులు (అయిదు ఎకరాల లోపు) కేవలం 45 శాతం భూమి కలిగి ఉన్నారు. 15 శాతం పెద్దరైతులు 55 శాతం భూమిని అనుభవిస్తున్నారు. ఇప్పటికీ దేశంలో 60 శాతం సాగుభూమికి నీటి సౌకర్యం లేదు. అనేక ప్రాంతాలు వ్యవసాయాభివృద్ధిలో పాలుపంచుకోలేక పోతున్నాయి. ఫలితంగా వ్యవసాయ ఉత్పత్తిలో అధిక సాగునీటి సదుపాయం కలిగిన పంజాబ్‌, హరియాణా వంటి ప్రాంతాలే ముందంజలో ఉన్నాయి. అధిక భాగం వ్యవస్థాగత పరపతి, పంట బీమా, నాణ్యమైన విత్తనాల అందుబాటు, విస్తరణ సేవల వంటి ప్రభుత్వ సదుపాయాలు సన్న చిన్న కౌలు రైతులకు చేరువలో లేవు. ఫలితంగా సేద్యం పేద రైతులపాలిట శాపంగా మారింది. దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన పారిశ్రామిక రంగంలో సైతం అనేక రకాల అసమానతలు రాజ్యమేలుతున్నాయి. దేశ పారిశ్రామిక ఉత్పత్తిలో మూడు రాష్ట్రాలు మహారాష్ట్ర, గుజరాత్‌, తమిళనాడులే 50 శాతం వాటా కలిగి ఉన్నాయి. ప్రైవేటు పారిశ్రామిక రంగం అతి కొద్ది మంది చేతుల్లోనే ఉంది. ఆర్థిక సంస్కరణల కాలంలో పారిశ్రామిక రంగం అత్యధిక వృద్ధి సాధించినప్పటికీ, అది అధిక యాంత్రీకరణతో కూడిన ఉద్యోగ రహిత వృద్ధి కావడం వల్ల, సృష్టించిన సంపద కొద్దిమంది బడా పారిశ్రామికవేత్తల చేతుల్లో పోగుపడుతోంది. అతిపెద్ద కార్పొరేట్‌ సంస్థల పోటీకి తట్టుకోలేక అధిక ఉద్యోగ సాంద్రత గల చిన్న మధ్య తరహా పరిశ్రమల రంగం రోజురోజుకూ క్షీణించిపోతోంది. సరళీకరణ విధానంలో భాగంగా ఈ రంగానికి ప్రభుత్వాల ఆదరణా కరవవుతోంది. వీటన్నింటివల్ల పారిశ్రామికరంగ వృద్ధి సమానతలను పెంచే బదులు తీవ్ర అసమానతలకు మూలకారణమవుతోంది. విద్యలోనూ ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత స్థాయి అదే పోకడ ప్రతిబింబిస్తోంది. అందరికీ ఒకే రకమైన నాణ్యమైన విద్య కలగానే ఉంటోంది. సంపన్నులకు కార్పొరేట్‌ విద్య, పేదలకు ప్రభుత్వ చదువులు అన్నట్లు పరిస్థితులు ఉన్నాయి. వైద్య ఆరోగ్య సేవల్లో, సంపన్నులు అత్యున్నత సౌకర్యాలు, నాణ్యత గల ఖరీదైన ప్రైవేటు కార్పొరేట్‌ వైద్యం పొందుతున్నారు. మధ్యతరగతివారు ప్రైవేటు ఆసుపత్రుల ఖరీదైన వైద్యంతో నలిగిపోతున్నారు, పేదలు ప్రభుత్వ ఆస్పత్రుల అరకొర వైద్యంతో, కొన్నిసార్లు అదీ అందక, చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు.

త్రిముఖ‌ వ్యూహంతో ముందుకు...
సామాజిక, రాజకీయ, ఆర్థిక సమానత్వాలు ఒకదానితో ఇంకొకటి బలంగా ముడివడి ఉంటాయి. వీటిలో ఏ ఒక్కదాన్ని నిర్లక్ష్యం చేసినా కథ మళ్ళీ మొదటికొస్తుంది. అందువల్ల మూడింటి అభివృద్ధికి సమానంగా, ఏకధాటిగా కృషి జరగాలి. అందుకు సరైన వ్యవస్థలు నిర్మించి, సరైన పంథాలో నడిపించగలగాలి. ప్రభుత్వాలు పెద్దన్న బాధ్యతలు నిర్వహించాలి. ఆర్థిక వ్యవస్థ నిర్మాణమన్నది వికాసంలో అందరినీ భాగస్వామ్యులను చేసేదిగా ఉండాలి. అందరూ కనీస జీవన వ్యయానికై సరిపడా ఆదాయాన్ని సంపాదించుకొనే వీలుండాలి. ఇందుకోసం అన్ని కీలక రంగాల్లో ప్రభుత్వ ప్రైవేటు సంస్థలు పోటాపోటీగా పనిచేసే మిశ్రమ ఆర్థిక వ్యవస్థను పటిష్ఠపరచాలి. వ్యవసాయ రంగంలో సన్న చిన్నకారు రైతులకు, పారిశ్రామిక రంగంలో చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు చేయూతను ప్రభుత్వం అధికం చెయ్యాలి. సంపద పన్నును పురోగామి పద్ధతిలో, పైస్థాయిలో అధికంగా పెంచాలి. వారసత్వ ఆస్తి సంక్రమణపై పన్ను విధించాలి. వీటన్నింటితోపాటు, అతి ముఖ్యంగా విద్య, వైద్య, ఆరోగ్య వ్యవస్థను పునర్నిర్మించాలి. రేపటి పౌరులకు ఈ వ్యవస్థల నుంచే సమానత్వం కల్పించాలి. ఈ విధానాలే ఐరోపా దేశాల్లో తక్కువ స్థాయి అసమానతల సమాజానికి కారణం. దీనికోసం పాఠశాల స్థాయిలో దేశంలోని పిల్లలందరికీ ఒకే రకమైన నాణ్యమైన విద్యను ఉచితంగా అందించగలగాలి. పాఠశాల విద్య పూర్తయ్యేనాటికి, ప్రతి విద్యార్థికీ బతుకుతెరువు కల్పించగలిగే ఏదో ఒక వృత్తి నైపుణాన్ని తప్పక నేర్పించాలి. అందరికీ ఉచిత ప్రాథమిక వైద్య, ఆరోగ్య సేవలను మాటలకు పరిమితం చేయకుండా చిత్తశుద్ధితో కార్యాచరణలోకి తీసుకురావాలి. అప్పుడే దేశ యువత సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో అవకాశాలను సమానంగా అందిపుచ్చుకోవడానికి పునాదులు ఏర్పడతాయి. పెచ్చరిల్లుతున్న అసమానతలకు అడ్డుకట్ట పడుతుంది. సమసమాజ నిర్మాణ స్వప్నం సాకారమవుతుంది!

- డాక్టర్‌ చీరాల శంకర్‌రావు
(రచయిత- సహాయ ఆచార్యులు, సామాజిక అభివృద్ధి సంస్థ (సీఎస్‌డీ) హైదరాబాద్‌)
Posted on 11-01-2018