Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఆర్థిక రంగం

స్వావలంబన బాటలో కొత్త సంకేతాలు

పూర్వ యూపీఏ ప్రభుత్వాలు శత్రువుపై మెతక వైఖరి అవలంబించాయంటూ గతంలో నిప్పులు చెరిగిన భారతీయ జనతా పార్టీ- అధికార పగ్గాలు చేతికి రాగానే కరకు పంథాకు శ్రీకారం చుట్టింది. తడాఖా చూపండంటూ సాయుధ బలగాలను ఉరకలెత్తించడంతో మన దళాలు సరిహద్దు దాటి మియన్మార్‌, పాకిస్థాన్‌ భూభాగాల్లోని ఉగ్రవాద మూకలపై విజయవంతంగా లక్షిత దాడులు నిర్వహించాయి. సరిహద్దుల్లో పాక్‌ సేనల కాల్పులకు దీటుగా బదులిస్తూ, డోక్లామ్‌లో చైనా చొరబాటును గట్టిగా నిలువరించాయి. హిందూ మహాసముద్రంలో చైనా యుద్ధనౌకలు, జలాంతర్గాముల సంచారం పెరుగుతున్న దృష్ట్యా- అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియాలతో కలిసి ఉమ్మడి గస్తీకి భారత నౌకాదళం సన్నద్ధమవుతోంది. అవసరమైతే ఏక కాలంలో ఇద్దరు శత్రువులతో తలపడటానికి భారత్‌ తయారుగా ఉండాలని ఈ పరిణామాలు హెచ్చరిస్తున్నాయి. ఇది చాలదన్నట్లు ఇండో-పసిఫిక్‌ జలాల్లో చైనా దూకుడును ఎదుర్కోవడానికి భారత్‌ సిద్ధపడాలని అమెరికా ఆశిస్తోంది. రక్షణపరంగా పెరుగుతున్న బరువు బాధ్యతలను సమర్థంగా నిర్వహించాలంటే భారత్‌ తన త్రివిధ సాయుధ బలగాలను పెద్దయెత్తున ఆధునికీకరించాలి. ఇందుకు స్వదేశంలో హైటెక్‌ ఆయుధాలను తయారుచేసుకోవడంతోపాటు, విదేశాల నుంచీ దిగుమతి చేసుకోక తప్పదు. ఈ వ్యయప్రయాసలను తట్టుకోవడానికి భారత్‌ ఆర్థికంగా సిద్ధమేనా అన్నది ప్రశ్న. దీనికి 2018-19 బడ్జెట్‌లో రక్షణ రంగ కేటాయింపులను చూస్తే అంత సంతృప్తికరమైన సమాధానం లభించదు.

పెరుగుదల స్వల్పమే
బడ్జెట్‌ కేటాయింపులు పైచూపులకు ఎక్కువే అనిపించినా ద్రవ్యోల్బణాన్ని, ఇతర దేశాల రక్షణ వ్యయాలను పరిగణనలోకి తీసుకుంటే అవి మన అవసరాలకు చాలవని తేలుతుంది. తాజా బడ్జెట్‌లో రక్షణ రంగానికి రూ.2.95 లక్షల కోట్లు కేటాయించారు. 2017-18 బడ్జెట్‌ కేటాయింపు రూ. 2.74 లక్షల కోట్లకన్నా ఇది 7.81 శాతం ఎక్కువ. 2017-18 బడ్జెట్‌ అంతకు క్రితం బడ్జెట్‌ కన్నా ఆరు శాతం ఎక్కువ నిధులు కేటాయించింది. కొత్త బడ్జెట్‌ ఎక్కువ నిధులు కేటాయించినట్లు కనిపిస్తున్నా అంతర్జాతీయ ప్రమాణాలతో పోలిస్తే ఇప్పటికీ అవి తక్కువే. నిజానికి గడచిన 50 ఏళ్లలో ఎన్నడూ లేనంత తక్కువ నిధులతో ఈసారి సరిపెట్టారు. ప్రపంచంలో ప్రముఖ దేశాలు తమ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో సగటున రెండు నుంచి 2.25 శాతం నిధులను రక్షణ రంగానికి కేటాయిస్తుంటే, భారత్‌ ఈ ఏడాదీ కేవలం 1.58 శాతమే కేటాయించింది. పాకిస్థాన్‌ 2016లోనే తన జీడీపీలో 3.6 శాతాన్ని రక్షణ రంగానికి కేటాయించినట్లు ప్రపంచ బ్యాంకు లెక్కగట్టింది. ఇక చైనా జీడీపీ చాలా ఎక్కువ కాబట్టి అందులో 1.9 శాతాన్నే రక్షణ రంగానికి కేటాయించినా, 2017లోనే ఆ నిధులు (రూ.10 లక్షల కోట్లు) మనకన్నా మూడు రెట్లు ఎక్కువగా లెక్కతేలాయి. భారత్‌ తన రక్షణ అవసరాల కోసం పూర్తిగా ప్రభుత్వ నిధుల మీదే ఆధారపడకుండా ప్రైవేటు పెట్టుబడులు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులనూ ప్రోత్సహించాలని నిశ్చయించింది.
దేశంలో రెండు రక్షణ పారిశ్రామిక ఉత్పత్తి నడవాలను అభివృద్ధి చేయనున్నట్లు ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ బడ్జెట్‌ ప్రసంగంలో ప్రకటించారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల రంగ (ఎంఎస్‌ఎంఈ) భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి 2018 రక్షణోత్పత్తి విధానాన్ని ప్రకటిస్తామనీ ఆయన వెల్లడించారు. సరిహద్దుల్లో, జమ్మూకశ్మీర్‌, ఈశాన్య భారతాల్లో దేశ భద్రతను కాపాడటానికి త్రివిధ సాయుధ బలాల కృషిని, త్యాగాలను జైట్లీ ప్రశంసించినా- రక్షణ వ్యయాన్ని చెప్పుకోదగిన రీతిలో పెంచకపోవడం నిరాశ కలిగించింది. స్వదేశంలో చాలినన్ని సంప్రదాయ, ఆధునిక ఆయుధాలను తయారుచేసుకొనే ప్రయత్నాలు ఊపందుకోకపోవడంతో, విదేశాల నుంచి వాటిని కొనవలసి వస్తోంది. ఫలితంగా నేడు భారత్‌ ప్రపంచంలో అతిపెద్ద ఆయుధ దిగుమతిదారుగా నిలిచింది. ఇది చాలదన్నట్లు రక్షణ బడ్జెట్‌లో సింహభాగం సిబ్బంది జీతభత్యాలకే సరిపోతోంది. ముఖ్యంగా ఏడో వేతన సంఘ సిఫార్సులు, ఒకే హోదాకు ఒకే పింఛన్‌ (ఒరాప్‌) విధానం అమలుతో ఈ వ్యయం బాగా పెరిగింది. దీంతో కొత్త ఆయుధాల సేకరణ, ఉత్పత్తికి నిధులు చాలకుండా పోతున్నాయి. 2018-19 బడ్జెట్‌లో రక్షణకు రూ.2.95 లక్షల కోట్లు కేటాయించినా జీతభత్యాలు, రోజువారీ పాలనపరమైన ఖర్చులకే రూ.1.96 లక్షల కోట్లు ఖర్చవనున్నాయి. ఇక కొత్త ఆయుధ ప్రాజెక్టులకు మిగిలే మొత్తం రూ.99,947 కోట్లు మాత్రమే. పింఛన్ల చెల్లింపులకు వెచ్చించే రూ.1,08,853 కోట్లు బడ్జెట్‌ కేటాయింపులకు అదనం. ఈ లెక్కన భారత్‌ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 25,000 కోట్ల డాలర్ల (రూ.16 లక్షల కోట్ల) సైనిక ఆధునికీకరణ ప్రాజెక్టు ఎలా ముందుకు ఉరుకుతుందనే అనుమానం పీడించక మానదు. ‘భారత్‌లో తయారీ’ కింద సొంత గడ్డమీదే ఆయుధాలు తయారుచేస్తే యువతకు ఉపాధి లభించడంతోపాటు దిగుమతి బిల్లునూ తగ్గించుకోవచ్చునని మోదీ ప్రభుత్వం ఆశిస్తోంది. కానీ, స్వదేశీ పరిశ్రమలు, ముఖ్యంగా ప్రభుత్వరంగ రక్షణ పరిశ్రమలు చౌక ఆయుధాల మీదనే దృష్టిపెడుతున్నాయి తప్ప ఆధునిక ఆయుధాల రూపకల్పనకు, పరిశోధన-అభివృద్ధికి ప్రాధాన్యమివ్వడం లేదన్న విమర్శ ఉంది. అందుకే భారత్‌లో తయారైన రైఫిల్‌ను స్వీకరించడానికి మన సైన్యం వరసగా రెండేళ్ల నుంచి నిరాకరిస్తూ వస్తోంది. మన గడ్డపై తయారైన అర్జున్‌ ట్యాంకులను, తేజస్‌ ఫైటర్‌ విమానాలను, చివరకు తూటా రక్షక కవచాలను సైతం చైనా, పాక్‌ సరిహద్దుల్లో వాడలేని దుస్థితి నెలకొని ఉంది. తేజస్‌ రూపకల్పనకు మూడు దశాబ్దాల కాలం వెచ్చించిన భారతదేశం చివరకు ఫ్రాన్స్‌ నుంచి 16 రఫేల్‌ ఫైటర్‌ విమానాలను దిగుమతి చేసుకోనుంది. ఇవి 2019 నుంచి మన వాయుసేనకు అందుతాయి.

కనీస నిల్వలూ కరవు
రక్షణ బడ్జెట్‌లలో ఆధునికీకరణకు ఉద్దేశించిన పెట్టుబడి వ్యయంలో 80 శాతం గతంలో కుదుర్చుకున్న ప్రాజెక్టులకు వాయిదాలు కట్టడానికే ఖర్చయిపోతూ కొత్త ప్రాజెక్టులకు నిధులు తరిగిపోతున్నాయి. దానితో మన సైన్యం, నౌకా, వాయు సేనలకు సరికొత్త తుపాకులు, శతఘ్నులు, ఫైటర్‌ విమానాలు, యుద్ధ నౌకలు అందకుండా పోతున్నాయి. అంతేకాదు- రోజుల తరబడి యుద్ధం చేయడానికి కావలసిన మందుగుండుకూ తీవ్రకొరతే. మన సైన్యం దగ్గర కనీసం 10 రోజులపాటు యుద్ధం చేయడానికైనా మందుగుండు లేదని కంప్ట్రోలర్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) గత ఏడాది మార్చి నివేదికలో తెలిపింది. మొత్తం 152 రకాల మందుగుండులో 61 రకాలకు 40 శాతం కొరత ఉంది. పశ్చిమ సరిహద్దుల్లో పాకిస్థాన్‌ పదేపదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ఉద్రిక్తతలను పెంచుతున్న నేపథ్యంలో మందుగుండు కొరత ఏమాత్రం క్షంతవ్యం కాదు. 2017లో పాక్‌ 860 సార్లు కాల్పులకు తెగబడింది. అంతకుముందు రెండేళ్లకన్నా ఇది రెట్టింపు. 2018 జనవరి 21వ తేదీ వరకు 124 సార్లు పాక్‌ దళాలు కాల్పులు జరిపాయి. జమ్మూకశ్మీర్‌లో 2016లో ఉగ్రవాదుల హింసలో 267 మంది మరణిస్తే 2017లో 347 మంది హతమయ్యారు. ఇక చైనా సరిహద్దుల్లో పరిస్థితి సవ్యంగా లేదనడానికి డోక్లాం ఘటనే నిదర్శనం. ఈ సరిహద్దులో రహదారులు, వంతెనలను వేగంగా నిర్మిస్తున్నామని జైట్లీ చెప్పుకొచ్చారు. ‘అన్ని రుతువుల్లో లడఖ్‌కు చేరడానికి వీలు కల్పించే రోహతాంగ్‌ సొరంగం పూర్తయింది. 14 కిలోమీటర్ల జోజిలా సొరంగ నిర్మాణం వేగంగా సాగుతోంది. అరుణాచల్‌ప్రదేశ్‌లో సెలా కనుమ కింద కూడా సొరంగాన్ని నిర్మించదలచాం’ అని ఆయన చెప్పారు. మొత్తంమీద భారత్‌, చైనాల నడుమ 3,488 కిలోమీటర్ల పొడవైన వాస్తవాధీన రేఖ వెంబడి రహదారులు, సొరంగాలు, వంతెనల వంటి మౌలిక వసతుల నిర్మాణ ఆవశక్యతను ప్రభుత్వం గుర్తించిందనడంలో సందేహం లేదు. సరిహద్దుకు అవతల చైనా ఇలాంటి నిర్మాణాలను జోరుగా చేపడుతోందనడానికి డోక్లాం ఘటన నిదర్శనం. చైనా సరిహద్దుల్లో వ్యూహపరంగా కీలకమైన 73 రహదారులను భారత ప్రభుత్వం గుర్తించినట్లు ‘కాగ్‌’ తెలిపింది. వీటిలో 61 రోడ్లను 2012 కల్లా పూర్తిచేసే బాధ్యతను సరిహద్దు రహదారుల నిర్మాణ సంస్థకు అప్పగించినా, 2016 మార్చినాటికి కేవలం 22 రహదారులే పూర్తయ్యాయి. ఇవి కాకుండా ‘కాగ్‌’ తనిఖీ చేసిన 24 రోడ్లలో కేవలం ఆరు మాత్రమే ప్రత్యేక సైనిక వాహనాలు తిరగడానికి అనువుగా ఉన్నాయి.

ప్రైవేటుకు భాగస్వామ్యం
సరిహద్దుల్లో మౌలిక వసతుల విస్తరణను వేగవంతం చేస్తూనే మోదీ ప్రభుత్వం రక్షణ దళాల ఆధునికీకరణను ఉద్ధృతం చేయాల్సి ఉంది. కానీ, బడ్జెట్‌ ఇబ్బందుల రీత్యా ప్రభుత్వం రక్షణ రంగంలో ప్రైవేటురంగ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించదలచింది. రక్షణ రంగం కోసం ‘భారత్‌లో తయారీ’లో రెండో అంచె కింద ఆయుధోత్పత్తికి ప్రభుత్వం ఇటీవల కొత్త నిబంధనలను ప్రకటించింది. ఈ సరళీకృత విధానం ప్రకారం ఇకనుంచి ప్రైవేటు పరిశ్రమలు తాము తయారుచేయదలచిన ఆయుధాలు, విడిభాగాలను తామే స్వయంగా రక్షణ శాఖకు తెలపవచ్చు. ఇంతవరకు రక్షణ శాఖ సూచించిన వస్తువులనే ప్రైవేటు రంగం తయారుచేయవలసి ఉండేది. ఇకపై వారు సొంత ఆలోచనలతో ముందుకు రావడానికి ‘భారత్‌లో తయారీ’ విధానం వీలు కల్పిస్తోంది. ప్రైవేటు రంగం రూపొందించిన ఆయుధ నమూనాలను రక్షణ విభాగాలు ఒకసారి కనుక ఆమోదించాయంటే వాటిని తప్పక కొనుగోలు చేస్తాయి. గతంలో తాము ఎంతో వ్యయప్రయాసలతో రూపొందించిన ఆయుధాలను, విడిభాగాలను రక్షణ శాఖ కొనుగోలు చేస్తుందా అని ప్రైవేటు పరిశ్రమలు సందేహించేవి. దాన్ని తొలగించడానికి తాజా నిబంధనలు రూపొందించారు. ప్రస్తుతం దిగుమతి చేసుకుంటున్న ఆయుధ వ్యవస్థలు, విడిభాగాల నమూనాల తయారీలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా (ఎంఎస్‌ఎంఈ) రంగ, అంకుర పరిశ్రమలను ప్రోత్సహిస్తారు. ఈ విభాగంలో రూ. 3 కోట్ల ప్రాజెక్టులకు రక్షణ శాఖ తోడ్పాటు లభిస్తుంది. మొత్తం 50 నమూనాల తయారీకి ఈ పరిశ్రమలకు అవకాశమిస్తారు. భారత్‌ ఏటా రూ.1.25 లక్షల కోట్ల విలువైన ఆయుధాలను సేకరిస్తోంది. వీటిలో దాదాపు రూ. 55,000 కోట్ల విలువైన ఆయుధాలను ప్రభుత్వ రంగ సంస్థలు తయారుచేస్తుంటే, ఎంఎస్‌ఎంఈ రంగం రూ.5,000 కోట్ల విలువైన ఆయుధాలు, ఆయుధ వ్యవస్థలను ఉత్పత్తి చేస్తోంది. మిగతా ఆయుధాలకు దిగుమతులే శరణ్యం. 2020 కల్లా ఎంఎస్‌ఎంఈ రంగం నుంచి రూ.10,000 కోట్ల ఆయుధాలు, విడిభాగాల సేకరణ సాధ్యమే. రక్షణ రంగంలో స్వావలంబనకు ప్రభుత్వ, ప్రైవేటు, ఎంఎస్‌ఎంఈ సంస్థలు తాజా బడ్జెట్‌లో ప్రతిపాదించిన రక్షణ పారిశ్రామిక నడవాలు భాగస్వాములు కావాలి.

- ఏఏవీ ప్రసాద్‌
Posted on 02-02-2018