Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఆర్థిక రంగం

పైన పటారం... లోనంతా లొసుగులమయం

* దిద్దుబాటు చర్యలపై బ్యాంకుల అనాసక్తతే శాపం

రుణాల ఎగవేత సమస్య బ్యాంకింగ్‌ వ్యవస్థను కొంతకాలంగా కుదిపివేస్తోంది. పారుబాకీలతోనే బ్యాంకులు సతమతమవుతున్నాయని ఇప్పటివరకు భావిస్తున్నారు. రుణగ్రస్తులు ఆ స్థాయినీ దాటి పూర్తి ఎగవేతకు సిద్ధపడుతున్నారని నీరవ్‌ మోదీ, విక్రమ్‌ కొఠారి ఉదంతాలు వెల్లడిస్తున్నాయి. బ్యాంకులకు సంబంధించి గడచిన సెప్టెంబరు నాటికి పారుబాకీలు లేదా నిరర్ధక ఆస్తుల మొత్తం తొమ్మిది లక్షల కోట్ల రూపాయలని తేలింది. ఇప్పటికి అది పది లక్షల కోట్ల రూపాయల స్థాయిని దాటి ఉండవచ్చు. రెండు వేల కోట్ల రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ బకాయిపడిన సంస్థలు 50 వరకు ఉన్నాయి. వాటి మొత్తం విలువ రూ.2.5 లక్షల కోట్లు ఉంటుందని అంచనా. అంటే కొద్దిమంది బడా ఖాతాదారులే బ్యాంకింగ్‌ వ్యవస్థ మొత్తాన్నీ ఛిన్నాభిన్నం చేసే గడ్డు పరిస్థితులున్నాయి. దీన్ని ఎదుర్కొనే క్రమంలో వివిధ బ్యాంకులు రిజర్వుబ్యాంకు నిబంధనల్ని తు.చ.తప్పక అనుసరిస్తున్నాయి. ప్రమాణాలు పాటిస్తున్నాయి. నిరుటి సెప్టెంబరులో ప్రభుత్వరంగ బ్యాంకులు మొత్తంగా రద్దుచేసిన పారుబాకీలు రూ.53,625 కోట్లు. అదే గత ఆర్థిక సంవత్సరంలో రద్దుపరచిన బాకీల మొత్తం రూ.81,683 కోట్లు. ఇందులో స్టేట్‌బ్యాంకుది అగ్రస్థానం. 2017-18 ఆర్థిక సంవత్సరం సెప్టెంబరు వరకు ఎస్‌బీఐ రద్దుపరచిన బాకీలు రూ.20,339 కోట్లు. బ్యాంకులు గత అయిదేళ్ల కాలంలో సుమారు రూ.2.50 లక్షల కోట్ల మొండిబాకీల్ని రద్దు చేసుకొన్నాయి. ఏ ప్రమాణాల ఆధారంగా విశ్లేషించినా ఇది ఎంతో పెద్దమొత్తం! రాని లేదా మొండి బాకీల పరిస్థితి ఈ విధంగా ఉంటే- మోసాలకు సంబంధించి, బ్యాంకులకు కొత్త తలనొప్పి ఏర్పడింది. వాటికి నకిలీ పత్రాలు సమర్పించి, భారీమొత్తాల్లో రుణాలు పొంది, ఎగవేయడం అనేది పలు బోగస్‌ కంపెనీలకు పరిపాటిగా మారింది. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు, ఇతర బ్యాంకులు నీరవ్‌, కొఠారి సంస్థల ద్వారా ఇటువంటి వంచనలకు గురయ్యాయి. అంతా కలిపి రూ.20,000 కోట్ల మేరకు మోసం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. గడచిన అయిదు ఆర్థిక సంవత్సరాల (2012-13 నుంచి 2016-17 వరకు) కాలంలో పీఎన్‌బీ మొత్తం రూ.8,999 కోట్లు ఇటువంటి కార్యకలాపాల వల్లనే నష్టపోయింది. ఆ తరవాతి స్థానాల్లో ఎస్‌బీఐ (రూ.6,228 కోట్లు), బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (రూ.4,412 కోట్లు), సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (రూ.3,944 కోట్లు), ఐఓబీ (రూ.3,339 కోట్లు) ఉన్నాయి. బ్యాంకులు భారీ నష్టాలు చవిచూడాల్సి వచ్చింది.

ఖాతాదారుల ఆందోళన
డిపాజిటర్ల పరంగా దేశం మొత్తంమీద ఒక విధమైన అనిశ్చిత వాతావరణం నెలకొంది. ఖాతాదారులందరూ బ్యాంకులనుంచి తమ ధనాన్ని ఉపసంహరించుకొనే ప్రయత్నం చేస్తున్నారు. డిపాజిట్ల ఉపసంహరణ కోసమే ఇటీవల పీఎన్‌బీ శాఖల వద్ద పెద్దపెద్ద బారులు కనిపించాయి. ఒక బ్యాంకు వైఫల్యం చెందితే ఆ ప్రభావం ఇతర బ్యాంకుల పైనా పడుతుంది. స్వాతంత్య్రానికి ముందు (1920 ప్రాంతాల్లో) బ్యాంకుల దివాలాలు ఎక్కువగా ఉండేవి. అవే స్థితిగతులు ఇకముందూ పునరావృతమవుతాయన్న ఆందోళన కనిపిస్తోంది. డిపాజిటర్ల రక్షణకు ఇంతవరకు అమలులోగల చట్టం ప్రకారం, ప్రతి ఖాతాదారుడికీ నిర్ణీత మొత్తంలో బీమా ఉంది. దీని స్థానంలో తెస్తారంటున్న ఆర్థిక తీర్మానం, డిపాజిట్‌ బీమా (ఫెనాన్షియల్‌ రిజల్యూషన్‌, డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌) అనే చట్ట ముసాయిదాలో బీమా మొత్తం ఎంతనేది అస్పష్టం. బిల్లులోని 29వ సెక్షన్‌ ప్రకారం, డిపాజిటర్‌కు ఎంతమేరకు రక్షణ కల్పించాలనే అంశాన్ని క్రమబద్ధీదారు (రెగ్యులేటర్‌) నిర్ణయిస్తాడు. అంటే ప్రస్తుతం ఉన్న భరోసా పోయినట్లే! అందుకే ప్రభుత్వం ఈ బిల్లును పూర్తిగా ఉపసంహరించుకోవాలని ప్రతిపక్షాలు డిమాండు చేస్తున్నాయి. ప్రస్తుత కుంభకోణం తీరుతెన్నులను పరిశీలిస్తే, మోసకారి ఖాతాదారులు తమ డొల్ల కంపెనీలు, వ్యక్తుల ద్వారా బ్యాంకుల్ని సులభంగా తప్పుదారి పట్టిస్తున్నారని విశదమవుతోంది. ప్రభుత్వం 1.75 లక్షల డొల్ల కంపెనీల్ని రద్దుపరచిందని గతంలోనే ప్రకటించారు. ఇప్పటివరకు రెండు లక్షల నకిలీ సంస్థల్ని మూసివేయించినట్లు కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వశాఖ వెల్లడించింది. అసలు అటువంటి సంస్థలు ఎన్ని ఉన్నాయన్నదే సామాన్యుడి ప్రశ్న. వాటిని కనిపెట్టేందుకు ప్రభుత్వం అనుసరిస్తున్న నియమ నిబంధనలు; ఆయా కంపెనీల ప్రమోటర్లు, డైరెక్టర్లపై తీసుకున్న లేదా తీసుకుంటున్న చర్యలు ఏమిటన్నవీ సందేహాలే! డొల్ల కంపెనీల నమోదుకు అవకాశం ఎందుకు ఏర్పడుతోందన్నది కీలకమైన విషయం. గతంలో కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వశాఖ ‘కనుమరుగవుతున్న (వానిషింగ్‌) కంపెనీల’పై సమగ్ర సర్వే జరిపింది. దాని ప్రకారం- డైరెక్టర్లుగా చూపే వ్యక్తుల చిరునామాలు సరైనవి కావు. ఆ చిరునామాలో కంపెనీ ఉండదు. గణనీయ సంఖ్యలో బోగస్‌ కంపెనీలు పుట్టుకొచ్చాయని చెబుతున్నా, అవి అసలు ఏ విధంగా నమోదుపత్రం పొందాయన్నది ఎవరూ పరిశోధించడం లేదు.

రుణ మంజూరులో మతలబులు
కీలకమైన ‘రుణ వితరణ’ విధానాన్ని కేంద్రప్రభుత్వం, రిజర్వుబ్యాంకు కూలంకషంగా అధ్యయనం చేయాలి. ఒక సాధారణ ఖాతాదారు బ్యాంకు నుంచి రుణం పొందాలంటే అనేక ప్రశ్నలు సంధిస్తారు. పెద్దయెత్తున రుణమొత్తాల్ని బడా పారిశ్రామిక వర్గాలకు మంజూరుచేయడంలో కనీస సంప్రదాయాలు, పద్ధతులనైనా పాటించరు. ఇది నిగ్గు తేలాల్సిన అంశం. ‘పెద్దనోట్ల రద్దు’ సందర్భంలోనే కొన్ని బ్యాంకుల పనితీరు సందేహాస్పదంగా మారింది. రెండువేల రూపాయలు తీసుకోవడానికి ప్రజలు పడిన బాధ వర్ణనాతీతం. అదే ఆదాయపు పన్ను దాడుల్లో దొరికిన ‘కొత్త పెద్దనోట్ల’ విలువ అపారం. పట్టుబడిన వ్యక్తులకు అంత మొత్తంలో నోట్లు బ్యాంకుల ద్వారా రావలసిందే తప్ప, రిజర్వుబ్యాంకు ప్రత్యక్షంగా వారికి బట్వాడా చేయదు. అప్పట్లో ఆయా బ్యాంకులు ఆ అపవాదును మూటకట్టుకొన్నాయి. మోసపూరిత సంస్థలకు రుణాలు మంజూరు అవుతుండటం బ్యాంకింగ్‌ వ్యవస్థ చిత్తశుద్ధినే ప్రశ్నార్థకం చేస్తున్నాయి. కొన్ని బ్యాంకులు ఎంతో ‘ఉదారం’గా పారిశ్రామిక వర్గాలకు రుణాలు మంజూరు చేస్తున్నాయి. రిజర్వుబ్యాంకు రుణ పంపిణీ విధానం ప్రకారం, బ్యాంకులు తమ మొత్తం రుణాల్లో కనీసం 40 శాతాన్ని ప్రాధాన్య రంగాలకు కేటాయించాలి. వ్యవసాయం, చిన్న పరిశ్రమలు, చిల్లర వర్తకం, ఎగుమతులు వంటి రంగాలకు ప్రాముఖ్యం ఇవ్వాలి. అనేక కారణాలను చూపిస్తూ, ఆయా రంగాలకు అందించాల్సిన ఆర్థిక సహాయాన్ని బ్యాంకులు నిర్లక్ష్యం చేస్తున్నాయి. రంగాలవారీగా విశ్లేషిస్తే, గత మూడేళ్లలో (2014 నుంచి 2017 వరకు) వ్యవసాయ రంగానికి మంజూరు చేసిన రుణాలు 18.79 శాతం నుంచి 4.0 శాతానికి పడిపోయింది. చిన్న పరిశ్రమల రుణాల్లోనూ స్వల్ప తరుగుదల నమోదైంది. ప్రతి ప్రాధాన్య రంగంలోనూ ఇదే తరహా మార్పు చోటుచేసుకొంది. ఒక అంచనా ప్రకారం దేశంలోని మొదటి పది పారిశ్రామిక గ్రూపు సంస్థలు- దాదాపు ఆరులక్షల కోట్ల రూపాయలు బ్యాంకులకు రుణపడి ఉన్నాయి. అందువల్లే బ్యాంకులు ఎప్పటికప్పుడు ఉద్దేశపూరిత ఎగవేతదారుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. వారి వివరాలను బహిర్గతం చేయాలి. అలా చేస్తున్న బ్యాంకులు తక్కువ. విక్రమ్‌ కొఠారి విషయంలో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా దెబ్బతిన్న తరవాత ఇతర బ్యాంకులు మేలుకొని చర్యలు చేపట్టవలసి ఉంటుంది. ఇటీవలి కాలంలో సంభవించిన ఈ రెండు పరిణామాలు డిపాజిట్‌దారులతో పాటు పర్యవేక్షణ సంస్థలు, రిజర్వుబ్యాంకు, ప్రభుత్వాలను మేలుకొలిపాయని భావించవచ్చు. దీన్ని ఓ ‘నీటిబుడగ’ వ్యవహారంగా పరిగణించకుండా, గట్టి పరిష్కార మార్గాలు కనుగొనాలి. తాను రూపొందించిన నియమ నిబంధనలు ఏమేరకు అమలు జరుగుతున్నాయనే అంశంపై రిజర్వుబ్యాంకు శ్రద్ధ వహించాలి. ద్రవ్యోల్బణాన్ని అరికట్టడం, పరపతిని నియంత్రించడం దాని ముఖ్యమైన బాధ్యతలు. కోట్లమంది తమ శ్రమ ఫలితాన్ని మదుపు చేసుకొంటున్న సంస్థల పట్ల నిర్లక్ష్యం పనికిరాదు.

వ్యవస్థల బిగింపులు అవసరం
డిపాజిట్‌దారుల విశ్వాసానికే పెనుముప్పు ఏర్పడిన సందర్భంలో, రిజర్వుబ్యాంకు తప్పక స్పందించాలి. దేశంలోని బ్యాంకులపై తన అజమాయిషీని ఎంతో కట్టుదిట్టం చేయాలి. దీనికి ప్రస్తుతం అమలులో ఉన్న ‘బ్యాంకింగ్‌ రెగ్యులేషన్‌ చట్టం- 1949’లోని నిబంధనలు సరిపోతాయి. దేశంలోని బ్యాంకుల మధ్య సమన్వయం ఉన్నట్లు గోచరించడం లేదు. రుణవితరణలో ముఖ్యమైనది- బ్యాంకుల మధ్య సమాచార మార్పిడి. ఒక వ్యక్తి లేదా సంస్థను ఒక బ్యాంకు ‘ఉద్దేశపూరిత ఎగవేతదారు’గా ప్రకటించినప్పటికీ, ఇతర బ్యాంకుల నుంచి సహాయం పొందగలుగుతున్నారు. నిశితంగా పరిశీలిస్తే అసలు విషయం తేటతెల్లమవుతుంది. ఇప్పటికైనా రిజర్వుబ్యాంకు ‘కేంద్ర సమాచార వ్యవస్థ’ను బ్యాంకుల మధ్య ఏర్పాటుచేయాలి. బ్యాంకులకు తగిన హెచ్చరికలు జారీచేసే వ్యవస్థగా అది రూపొందాలి. బ్యాంకు శాఖల అంతర్గత తనిఖీ వ్యవస్థ విస్తరించాలి. ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్న ‘నిరర్ధక ఆస్తుల’ గణాంకాల్ని పరిశీలిస్తే- బ్యాంకులు ముఖ్యంగా ప్రభుత్వరంగంలోనివి ఈ అంశంపై ఏమాత్రం శ్రద్ధ వహించినట్లు కనిపించదు. బ్యాంకు సిబ్బంది కార్యకలాపాలు, వ్యవహారశైలిపై ఆర్‌బీఐ దృష్టి సారించాలి. గడచిన రెండేళ్లలో ప్రభుత్వరంగ బ్యాంకులకు చెందిన 5,200 మంది ఉద్యోగులు తాము పనిచేస్తున్న సంస్థలనే మోసగించినట్లు వెల్లడైంది. వీటిపైన విచారణ మందకొడిగా సాగడం, కొన్ని సందర్భాల్లో బ్యాంకులే పరిశోధక సంస్థలకు తగిన సమాచారాన్ని ఇవ్వకపోవడం తీవ్రమైన విషయం. బ్యాంకుల డైరెక్టర్ల నియామక వ్యవస్థను సంస్కరించాలి. ఆయా కార్యకలాపాలపై నిర్ణయాధికారం డైరెక్టర్ల బోర్డుదేనని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌(ఆర్థిక) వ్యవస్థ ఇప్పటికే దాదాపు 70 శాతం కేంద్రప్రభుత్వ అధీనంలో ఉంది. అందువల్ల బ్యాంకుల తప్పిదాలకు ప్రభుత్వమూ బాధ్యత‌ వహించాలి.
సామర్థ్యం, నిజాయతీ గల వ్యక్తులను ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో నియమించేందుకు అనువుగా 2016లో మాజీ కంప్ట్రోలర్‌ ఆడిటర్‌ జనరల్‌ వినోద్‌రాయ్‌ ఆధ్వర్యాన బ్యాంక్స్‌ బోర్డు బ్యూరో (బీబీబీ) ఏర్పాటు చేశారు. నియామకాలు మాత్రం జరపడం లేదు. బ్యూరోను దృఢతరం చేయడం ద్వారా పరిస్థితిని కొంతవరకు చక్కదిద్దవచ్చు. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల కార్యకలాపాలపై ‘సామాజిక ఆడిటింగ్‌’ వ్యవస్థ ఏర్పాటుకావాలి. సంబంధిత రంగాల్లో విశేష అనుభవం గలవారితో ‘పర్యవేక్షక వ్యవస్థ’ రూపొందితే మరికొంత ఫలితం ఉండ‌వ‌చ్చు. ఇది చట్టప్రకారం అజమాయిషీ చేసే సంస్థలా మాత్రమే కాకుండా- పరిస్థితులు, పోకడల పరిశీలక వ్యవస్థలా పనిచేయాలి. వినూత్న నిర్ణయాలు, ప్రభుత్వం చేపట్టే గట్టి చర్యల కారణంగానే బ్యాంకులు తిరిగి ప్రజల విశ్వాసాన్ని చూరగొంటాయి!

Posted on 12-03-2018