Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఆర్థిక రంగం

వ్యవస్థీకృత లోపాలే విస్తరణకు శాపాలు

* అడ్డంకులు తొలగిస్తేనే ‘డిజిటల్‌’ వేగంతో చెల్లింపులు

ఎలక్ట్రానిక్‌ చెల్లింపుల గురించి రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) ఇటీవల విడుదల చేసిన సమాచారం ఆశావాదులు ఎగిరి గంతేసేంత గొప్పగా లేదు, నిరాశావాదులు పెదవి విరవడానికి ఆస్కారమిచ్చేలానూ ఏమీ లేదు. ఒక్క మాటలో మిశ్రమ స్పందన రేపిందని చెప్పాలి. రద్దయిన పెద్ద నోట్లలో 99 శాతం బ్యాంకింగ్‌ వ్యవస్థకు తిరిగి వచ్చిన నేపథ్యంలో ఎలక్ట్రానిక్‌ చెల్లింపుల పద్ధతి ఎంతవరకు పురోగమించిందో సమీక్షించవలసి ఉంది. ఎలక్ట్రానిక్‌ చెల్లింపులు మొదట్లో విజృంభించినా 2016 నవంబరు నుంచి ప్రతి నెలా హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయని రిజర్వుబ్యాంకు సమాచారాన్ని బట్టి అవగతమవుతోంది. ఈ తరహా చెల్లింపులు పెరుగుతూనే ఉండాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు, వ్యాపార సంస్థలు... అన్నింటినీ మించి కుటుంబాలు గట్టి చేయూత ఇవ్వాల్సి ఉంటుంది. 2017 మార్చిలో గరిష్ఠ స్థాయికి పెరిగిన ఎలక్ట్రానిక్‌ చెల్లింపులు, కొత్త నోట్లు వ్యవస్థలోకి వచ్చిన తరవాత నుంచి తగ్గుముఖం పట్టసాగాయి.

నగదు లావాదేవీలే అధికం
ఎలక్ట్రానిక్‌ లేదా డిజిటల్‌ చెల్లింపులకు పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు ఏర్పడనంతవరకు అవి నగదుకు సంపూర్ణ ప్రత్యామ్నాయం కాలేవు. కుటుంబాలు నెమ్మదిగా డిజిటల్‌ చెల్లింపులకు అలవాటు పడుతున్నా, అవి ఇప్పటికీ నగదు చెల్లింపులకే ప్రాధాన్యమిస్తున్నట్లు సమాచార విశ్లేషణ బట్టి తెలుస్తోంది. వ్యాపార సంస్థలైతే రకరకాల కారణాల వల్ల ఎలక్ట్రానిక్‌ చెల్లింపులకు మళ్లుతున్నాయి. ఏటీఎమ్‌ల ద్వారా కాకుండా ఇతరత్రా 10 మార్గాల్లో ఈ తరహా చెల్లింపులు జరుగుతున్నాయని ఆర్‌బీఐ సమాచారం తెలుపుతోంది. వీటిలో ముందస్తు చెల్లింపు సాధనాలు, యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ ఫేస్‌ (యూపీఐ లేదా భీమ్‌), ఐఎమ్‌పీఎస్‌, ఆర్‌టీజీఎస్‌, నెఫ్ట్‌లు ముఖ్యమైనవి. సాధారణ చెక్కుల వాడకం తగ్గడమే కాదు- ఎలక్ట్రానిక్‌ చెక్కుల‌ పరిష్కారాలు(క్లియరెన్స్‌) కూడా 2017 మార్చి నుంచి తగ్గింది. ఈ నెలలో మొత్తం డిజిటల్‌ చెల్లింపులు గరిష్ఠంగా రూ.14.95 లక్షల కోట్లకు చేరాయి. ఐఎమ్‌పీఎస్‌ ద్వారా చెల్లింపులు పెద్దనోట్ల రద్దు తరవాత రెట్టింపై రూ.88,200 కోట్లకు చేరుకున్నాయి. కొత్తగా ప్రవేశపెట్టిన యూపీఐకీ క్రమంగా ఆదరణ పెరుగుతోంది. ఈ తరహా చెల్లింపులు రూ.15,610 కోట్లకు చేరుకున్నాయి. మొబైల్‌ చెల్లింపుల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ఈ తరహా చెల్లింపులు రూ.1,244 కోట్ల నుంచి 2017 అక్టోబరులో రూ.11,680 కోట్లకు పెరిగినా, 2018 ఫిబ్రవరి కల్లా రూ.10,250 కోట్లకు తగ్గాయి. ఏది ఏమైనా పెద్దనోట్ల రద్దు తరవాత ఆర్‌టీజీఎస్‌, నెఫ్ట్‌, యూపీఐ, మొబైల్‌ బ్యాంకింగ్‌లు ఊపందుకున్నాయని స్పష్టమవుతోంది. కుటుంబాలు మాత్రం ఇప్పటికీ డిజిటల్‌ చెల్లింపుల వైపు మొగ్గు చూపడం లేదనడానికి దుకాణాల్లోని పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ (స్వైపింగ్‌) యంత్రాల వద్ద క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల వినియోగం పెద్దగా పెరగకపోవడమే నిదర్శనం. ఈ తరహా కార్డు లావాదేవీలు 2017 జూన్‌లో గరిష్ఠంగా రూ.46,820 కోట్లకు చేరి 2018 ఫిబ్రవరిలో రూ.46,590 కోట్ల దగ్గర ఆగాయి. 2017 మార్చి నుంచి కార్డు లావాదేవీల పరిమాణం ఆరుశాతం మాత్రమే పెరిగింది. డిజిటల్‌ చెల్లింపుల వ్యవస్థలో కొన్ని లొసుగులు ఉండటంతో కుటుంబాల ఎలక్ట్రానిక్‌ చెల్లింపుల్లో ఆశించిన స్థాయి మెరుగుదల ఉండటంలేదు. ఈ చెల్లింపులకు రకరకాల సాధనాలు, మార్గాలు ఉన్నందువల్ల అన్నింటినీ ఒకే గాటన కట్టకూడదు. మొబైల్‌, యూపీఐ వంటి సాధనాలను గతంలో ఎరుగం. వాటిలో ఉన్నట్టుండి చెల్లింపులు జరుగుతున్నందువల్ల చాలా ఎక్కువ వృద్ధిరేటు సాధించినట్లు అనిపిస్తుంది. అన్నింటికన్నా కీలకమైన అంశం ఏమంటే- వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) వల్ల డిజిటల్‌ చెల్లింపులు పెరుగుతున్నాయని గుర్తించాలి. ఇవి ప్రధానంగా ఆర్‌టీజీఎస్‌, నెఫ్ట్‌ల ద్వారా సంభవిస్తున్నాయి. జీఎస్‌టీ రిటర్నులను విధిగా దాఖలు చేయాల్సిన రోజుల్లో ఎలక్ట్రానిక్‌ చెల్లింపులు 10 నుంచి 30 శాతం వరకు పెరగడమే దీనికి నిదర్శనం. వీటిలో త్రైమాసిక వృద్ధి కనిపిస్తుండటంబట్టి కుటుంబాలకన్నా వ్యాపార సంస్థలు, ప్రభుత్వ విభాగాలే ఈ తరహా చెల్లింపులను ఎక్కువగా చేపడుతున్నట్లు తేలుతోంది. త్రైమాసిక గడువుల చివరి నెలలైన మార్చి, జూన్‌, సెప్టెంబరు, డిసెంబర్లలో డిజిటల్‌ చెల్లింపులు అంతక్రితం నెలలకన్నా 10 శాతం అధికమవుతాయి. తదుపరి నెలల్లో అవి తగ్గిపోతాయి.
వినియోగదారులు జోరుగా డిజిటల్‌ చెల్లింపులకు మారకపోవడానికి మూడు కారణాలున్నాయి. అవి- డిజిటల్‌ చెల్లింపు వసతులు విస్తృతంగా అందుబాటులో లేకపోవడం, నగదు చెల్లింపులకన్నా డిజిటల్‌ చెల్లింపులకు ఎక్కువ ఖర్చవడం, సైబర్‌ భద్రత గురించి ప్రజలకు అనుమానం ఉండటం. వాటిని తొలగించి ఖాతాదారులకు డిజిటల్‌ చెల్లింపులపై నమ్మకం పెంచ‌డానికి బ్యాంకులు చొరవ తీసుకొనకపోవడం శోచనీయం. తరచూ సమాచార చౌర్యం జరుగుతున్నా అవి సమర్థంగా అరికట్టలేకపోతున్నాయి. నిరర్థక ఆస్తులతో సతమతమవుతున్న బ్యాంకులు డిజిటల్‌ లావాదేవీలకు కావలసిన మౌలిక వసతుల విస్తరణకు సరిగ్గా నిధులు వెచ్చించలేకపోతున్నాయి. దీనివల్ల గ్రామాలు, చిన్న పట్టణాలకు పూర్తిస్థాయిలో డిజిటల్‌ వ్యవస్థ విస్తరించలేదు. దేశం మారుమూలల్లోనూ బ్యాంకుల్లో ఖాతాలు తెరచేవారు ఎక్కువై, డిజిటల్‌ చెల్లింపులకు మళ్లాలని కుతూహలపడుతున్న సమయంలో- డిజిటల్‌ వసతులు విస్తరించకపోవడం నిజంగా పెద్ద అవరోధం. ఇలాంటి సమస్యలు ఏడాది కాలం నుంచి ఉన్నా బ్యాంకులు ఏ ఒక్కదాన్నీ పరిష్కరించలేకపోయాయి. ఇప్పుడు హడావుడిగా మేల్కొన్నా ఉన్న పళాన పరిష్కరించడం సాధ్యపడదు. దుకాణాల్లో కార్డుల సాయంతో చెల్లింపులు జరపడానికి వీలు కల్పించే పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ (పీఓఎస్‌) యంత్రాలు మన జనాభాకు తగిన సంఖ్యలో ఇప్పటికీ చాలాచోట్ల అందుబాటులో లేవు.

గ్రామాల్లో పుంజుకోని సాంకేతికత
గ్రామాలు, చిన్న పట్టణాల్లో డిజిటల్‌ లావాదేవీలు అవసరమైన మేర పెరగకపోవడానికి ప్రధాన కారణమిదే. నిజానికి 2016 మార్చిలో 11.28 లక్షలున్న పీఓఎస్‌ యంత్రాలు 2017 సెప్టెంబరుకల్లా 29 లక్షలకు పెరిగాయి. గత సంవత్సర కాలంలో అన్ని బ్యాంకులూ కలిసి ప్రతి 13,000 మంది జనాభాకు అదనంగా ఒక్క పీఓఎస్‌ యంత్రాన్ని మాత్రమే ఏర్పాటుచేయగలిగాయి. పైగా వీటిలో అత్యధికం పెద్ద నగరాల్లో మాత్రమే అందుబాటులోకి రావడంతో మారుమూల ప్రాంతాలకు డిజిటల్‌ చెల్లింపులు ఆశించిన స్థాయిలో విస్తరించలేదు. అనేక గ్రామాలు, చిన్న పట్టణాల్లో పీఓఎస్‌ యంత్రాలు అసలు లేకపోవడమో, ఉన్నా ఒకటీ అరా యంత్రాలతో సరిపెట్టుకోవడమో జరుగుతోంది. గత సంవత్సరం డెబిట్‌ కార్డుల జారీ 35 శాతం పెరిగినా, వాటి వినియోగంలో అదే స్థాయి వృద్ధి నమోదు కాలేదు. అంతమాత్రాన ఖాతాదారులు డెబిట్‌ కార్డులను వినియోగించడానికి ఇష్టపడటంలేదని కాదు. అందుకు కావలసిన వసతులు లేకనే ఈ పరిస్థితి ఏర్పడింది. బ్యాంకుల అశక్తతను ప్రైవేటు డిజిటల్‌ వ్యాలెట్లు భారీగా సొమ్ము చేసుకొంటున్నాయి. భవిష్యత్తులో అపార విస్తరణావకాశాలున్న డిజిటల్‌ లావాదేవీల విపణిని బ్యాంకులు చేతులారా వదులుకొంటున్నాయి. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ప్రజలు బ్యాంకులను నమ్మినంతగా ప్రైవేటు డిజిటల్‌ వ్యాలెట్లను నమ్మడం కష్టం కాబట్టి బ్యాంకింగ్‌ వ్యవస్థ ఇప్పటికైనా మేల్కొనాలి.

పరిజ్ఞానంపై ప్రచారం
అలవాటుగా డిజిటల్‌ చెల్లింపులు జరపాలంటే ఖాతాదారులకు కనీస విద్యాస్థాయి, టెక్నాలజీ వినియోగంపై ప్రాథమిక అవగాహన ఉండాలి. గ్రామీణ పేదలకు, వయోవృద్ధులకు ఇలాంటి అవగాహన ఉండదు కాబట్టి డిజిటల్‌ చెల్లింపులవ్యాప్తి నెమ్మ‌దిగా సాగుతోంది. నలభై ఏళ్లు, అంతకు తక్కువ వయసువారే ఎక్కువగా డిజిటల్‌ లావాదేవీలు జరుపుతున్నారని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లోని జిల్లా, మండల కేంద్రాల్లో జరిగిన అధ్యయనాలు తెలుపుతున్నాయి. సాధారణంగా అరవై ఏళ్లు పైబడినవారికి మొబైల్‌ బ్యాంకింగ్‌, ఎలక్ట్రానిక్‌ చెల్లింపులు కాదు కదా, కనీసం స్మార్ట్‌ ఫోన్‌ను ఉపయోగించడమూ తెలియదు. వీరందరికీ డిజిటల్‌ పరిజ్ఞానం అలవరచాలంటే దేశమంతటా విస్తృత అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలి. కానీ, ఆర్థిక సమస్యలతో కిందుమీదులవుతున్న బ్యాంకులకు ఇది తలకుమించిన భారమవుతోంది. ప్రభుత్వం బ్యాంకులకు సబ్సిడీలనో, పన్ను రాయితీలనో ఇచ్చి ఈ సమస్యను అధిగమించడానికి తోడ్పడాలి. ప్రజల్లోకి వెళ్లి డిజిటల్‌ అవగాహన పెంచే బ్యాంకులకు డిజిటల్‌ మౌలిక వసతుల విస్తరణకు సబ్సిడీ ఇస్తామని షరతు పెట్టాలి.
డిజిటల్‌ చెల్లింపులతో పోలిస్తే నగదు చెల్లింపులు చవక కావడం వల్ల గ్రామాలు డిజిటల్‌ వైపు మొగ్గడానికి ఆసక్తి చూపడంలేదు. డిజిటల్‌ చెల్లింపు జరిపినప్పుడు వ్యాపారి ముదరా రేటు రూపంలో ఖాతాదారులపై ఛార్జీ పడుతుంది. చిన్న చిన్న చెల్లింపులు జరిపేవారికి ఈ రుసుములు భారమవుతాయి. మరోవైపు పీఓఎస్‌ యంత్రాల నిర్వహణకు అధికంగా ఖర్చవుతుంది. కాబట్టి, గ్రామీణ వ్యాపారులు కూడా వాటిపై మొగ్గు చూపడంలేదు. చిన్న పట్టణాల్లోనూ కార్డుల వినియోగం తక్కువే కాబట్టి ఈ యంత్రాలపై పెట్టుబడి పెట్టడానికి వ్యాపారులు సుముఖంగా లేరు. వ్యాపారి ముదరా రేటును ఇటీవల రిజర్వు బ్యాంకు తగ్గించినా దానివల్ల వర్తకులకే తప్ప ఖాతాదారులకు ప్రయోజనం ఉండదు. మొత్తంమీద డిజిటల్‌ చెల్లింపుల రుసుములను ప్రభుత్వమే మూడు నాలుగేళ్లపాటు బ్యాంకులకు చెల్లించడం మంచిది. దానివల్ల ఖాతాదారులకు ఉచిత సేవలు అంది డిజిటల్‌ వైపు మళ్లుతారు. ఆ తరవాత నుంచి బ్యాంకులు రుసుములు వసూలు చేసుకునే అవకాశం పరిశీలించాలి. అంతేతప్ప బంగారు గుడ్లు పెట్టే బాతును ఒకేసారి కోసుకుతిన్నట్లు మొదటినుంచే రుసుముల వసూలుకు బ్యాంకులు తొందరపడకూడదు. 1969లో బ్యాంకులను జాతీయం చేసినప్పటినుంచి ప్రభుత్వం భారీ పెట్టుబడులు పెట్టడం వల్లనే బ్యాంకింగ్‌ వ్యవస్థ నేడు దేశం నలుమూలలకు విస్తరించింది. దీన్ని మరింత విస్తృతం చేయడానికి బ్యాంకులు తమవంతు కృషి చేసి ఖాతాదారులను ఆకట్టుకోవాలి. ఏతావతా ఎలక్ట్రానిక్‌ చెల్లింపుల వ్యవస్థ నేడు నెమ్మదిగా విస్తరిస్తోందంటే కారణం- ఈ తరహా చెల్లింపుల వ్యవస్థ దేశం నలుమూలలకూ విస్తరించకపోవడం, డిజిటల్‌ చెల్లింపుల ఖర్చు ఎక్కువగా ఉండటం, సైబర్‌ భద్రతకు పూచీ లేకపోవడం. ఈ మూడు లోపాలను సరిదిద్దినప్పుడు ఎలక్ట్రానిక్‌ చెల్లింపులు బహుముఖంగా విస్తరిస్తాయి. లేదంటే ఇంతవరకు సాధించిన కొద్ది పురోగతితోనే సంతృప్తిపడాల్సి ఉంటుంది!

Posted on 16-03-2018