Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఆర్థిక రంగం

సవాళ్ల పథంలో ఆర్థిక రథం

* కూలుతున్న మార్కెట్లు-కుంగుతున్న కరెన్సీ

కొంత కాలం నుంచి భారతీయ స్టాక్‌ మార్కెట్‌ పదేపదే కుదేలవడంతో మూడు లక్షల కోట్ల రూపాయలకు పైగా మదుపరుల సంపద ఆవిరైపోయింది. ఇది చాలదన్నట్లు డాలరుతో పోలిస్తే రూపాయి విలువ చరిత్రలో ఎన్నడూ లేనంత తక్కువ స్థాయికి పడిపోయింది. మన స్టాక్‌ మార్కెట్‌ పతనానికీ మూలాలు స్వదేశంలో లేవు. అంతర్జాతీయ పరిణామాలే దీనికి ప్రధాన కారణం. అమెరికా తుమ్మితే మిగతా ప్రపంచానికి జలుబు పట్టుకొంటుందన్న నానుడి మరొక్కసారి అనుభవానికి వస్తోంది. అందుకే భారత్‌తోపాటు అంతర్జాతీయ స్టాక్‌ మార్కెట్లూ గడచిన ఎనిమిది నెలలుగా నింగి నుంచి నేలకు పడిపోతున్నాయి. ఫేస్‌బుక్‌, ఆపిల్‌, అమెజాన్‌ వంటి దిగ్గజ సాంకేతిక కంపెనీల షేర్ల విలువ తగ్గనారంభించినప్పటి నుంచి ఈ ధోరణి మొదలైంది. అమెరికా-చైనాల మధ్య వేడెక్కుతున్న వాణిజ్య వైరం భవిష్యత్తుపై భయాలను రేపుతూ షేర్‌ ధరలను కిందకు తోస్తోంది. అన్నింటినీ మించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ దుందుడుకు చర్యలు, ప్రేలాపనలు ప్రపంచమంతటా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అమెరికాలో అయిదుసార్లు స్టాక్‌ మార్కెట్లు పతనమయ్యాయి. అమెరికా కేంద్ర బ్యాంకు అయిన ఫెడరల్‌ రిజర్వ్‌ ఈ ఏడాది మూడుసార్లు వడ్డీ రేట్లు పెంచడంతో వ్యక్తులకు, సంస్థలకు నిధుల లభ్యత తగ్గిపోయి షేర్‌ ధరలు నేలచూపులు చూస్తున్నాయి. వడ్డీరేట్ల పెంపు వల్ల అమెరికా ప్రభుత్వ బాండ్లపై రాబడి గత ఏడేళ్లలో ఎన్నడూ లేనంత ఎక్కువ స్థాయికి పెరిగింది. దాంతో మదుపరులు స్టాక్‌ మార్కెట్లలోకన్నా బాండ్లలో పెట్టుబడి ఎక్కువ లాభదాయకమని భావించసాగారు. పైగా అమెరికన్‌ బాండ్లు సురక్షితమనే నమ్మకం ఎటూ ఉంది. దాంతో షేర్ల నుంచి పెట్టుబడులు బాండ్లకు మరలి స్టాక్‌ మార్కెట్‌ పడిపోసాగింది. ఫెడరల్‌ రిజర్వ్‌ రానున్న పన్నెండు నెలల్లోనూ వడ్డీరేట్లను పెంచుతూనే ఉంటుందని తెలియడంతో షేర్ల నుంచి బాండ్లకు ధన ప్రవాహం పెరిగిపోతూనే ఉంది. భారత్‌ తదితర వర్ధమాన దేశాల స్టాక్‌ మార్కెట్ల నుంచీ అమెరికన్‌ పెట్టుబడులు స్వదేశానికి మరలిపోతూ షేర్ల ధరలూ పతనం కాసాగాయి.

అంతర్జాతీయ ప్రభావం
ప్రపంచీకరణ వల్ల నేడు వివిధ దేశాల మధ్య ప్రత్యక్ష పెట్టుబడులు, షేర్‌ మార్కెట్‌ పెట్టుబడులు సులువుగా ప్రవహిస్తున్నాయి. సాంకేతికత చలవతో అవి వేగంగా దేశాల ఎల్లలు దాటుతున్నాయి. నేడు భారతీయ షేర్ల ధరలు పడిపోవడానికి కారణాలివే. ఈ ఏడాది విదేశీ సంస్థాగత మదుపరులు భారతీయ ఈక్విటీ షేర్ల మార్కెట్‌ నుంచి 384 కోట్ల డాలర్లను, రుణ పత్రాల మార్కెట్‌ నుంచి 792 కోట్ల డాలర్లను వెనక్కు తీసుకోవడం షేర్‌ ధరల పతనానికి దారితీసింది. దీన్ని చూసి వ్యక్తిగత మదుపరులు కూడా తమ దగ్గరున్న షేర్లను అమ్మేయసాగారు. స్వదేశీ, విదేశీ మదుపరుల తాకిడికి షేర్‌ మార్కెట్‌ కుదేలైంది. మన మార్కెట్ల నుంచి డాలర్లు అమెరికాకు వాపసు పోయినప్పుడు ఇక్కడ డాలర్‌ నిల్వలు తగ్గిపోతాయి. దాంతో డాలర్ల సరఫరా కన్నా గిరాకీ ఎక్కువై డాలర్‌ విలువ పెరిగి రూపాయి విలువ తరిగిపోతుంది. ఈ అంతర్జాతీయ పరిణామాల వల్లనే కొన్ని రోజుల నుంచి భారతీయ షేర్‌ ధరలు పతనమవుతున్నాయి. దీనికి స్వదేశీ కారణాలూ తోడయ్యాయి. మౌలిక వసతుల ప్రాజెక్టులకు రుణాలిచ్చే ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ కంపెనీ అనేక రుణదాతలకు ఎగనామం పెట్టడం ఈక్విటీ షేర్ల ధరలను నేలకు లాగింది. మరోవైపు కరెంటు ఖాతా లోటు పెరిగి రూపాయి విలువను దెబ్బతీస్తోంది. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు జీడీపీలో 1.7 శాతంగా ఉన్న కరెంటు ఖాతా లోటు, ఆపైన అంతర్జాతీయ చమురు ధరలు తగ్గడంతో 2017 సంవత్సరంలో 0.7 శాతానికి దిగివచ్చింది. అంతర్జాతీయ విపణిలో చమురు ధరలు తగ్గడంతో దిగుమతుల బిల్లూ కిందకు దిగిరావడం దీనికి కారణం. కానీ, ఇటీవల చమురు ధరలు చుక్కలు తాకడం కరెంటు ఖాతా లోటును 2.4 శాతానికి ఎగదోసింది. 2019లో అది మూడు శాతానికి పెరగవచ్చు. మన ఎగుమతులు ఇనుమడించి ఉంటే దిగుమతుల బిల్లును తట్టుకోగలిగేవాళ్లం. కానీ, అలా జరగలేదు. ఈ పరిస్థితిలో రూపాయి విలువ పడిపోతోంది. దాన్ని నిలబెట్టడానికి రిజర్వు బ్యాంకు ఈ ఏడాది ఏప్రిల్‌-సెప్టెంబరుల మధ్య 2,500 కోట్ల డాలర్లు ఖర్చుచేసినా లాభంలేకపోయింది. ఈ ఏడాది చివరికి రూపాయి విలువ మరింత పడిపోయి ఒక డాలరు 75 రూపాయలు పలకవచ్చని బ్లూమ్‌ బర్గ్‌ అంచనా. ఈ ఏడాది సెప్టెంబరులో మన వాణిజ్య లోటు తగ్గిందని కేంద్ర వాణిజ్య శాఖ ప్రకటించడం కాస్త ఊరట కలిగించినా ఆ ధోరణి దీర్ఘకాలం కొనసాగితేనే నికరమైన ప్రభావం కనిపిస్తుంది.
అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం, అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ పాటించే ద్రవ్య విధానం, అంతర్జాతీయ విపణిలో చమురు ధరలు- ఇవేవీ దిల్లీ చేతుల్లో లేవు. కానీ, తన ఆర్థిక పునాదులు బలంగా ఉంటే ఈ ఇక్కట్లను సమర్థంగా ఎదుర్కోగలుగుతుంది. సొంత ఇల్లు చక్కదిద్దుకోవడానికి భారత్‌ మొదట రూపాయి పతనాన్ని అడ్డుకుని అది మళ్ళీ పుంజుకొనేలా చేయాలి. రూపాయిని నిలబెట్టడానికి భారత ప్రభుత్వం ఇప్పటికే 2,500 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. ప్రభుత్వ ఖజానాలో ఇంకా 40,000 కోట్ల డాలర్లు ఉన్నాయి. ఇంతవరకు చేసిన ఖర్చు రూపాయి విలువను పెంచలేకపోయింది కాబట్టి అదే పనిగా మన విదేశీ ద్రవ్య నిల్వలను కరిగించడం వల్ల ప్రయోజనం ఉండదు. దీనికన్నా చమురు బాండ్ల జారీ, చమురు వ్యాపారం కోసం ప్రత్యేక విదేశీ ద్రవ్య గవాక్షం ప్రారంభించడం మంచిది. చమురు బిల్లు తగ్గి రూపాయి మళ్ళీ పుంజుకోవడం మొదలుపెట్టగానే వాణిజ్య లోటు అదుపులోకి వస్తుంది. ద్రవ్యోల్బణం తగ్గి జనం గుక్కతిప్పుకొంటారు. దేశ ఆర్థికాభివృద్ధి తిరిగి గాడిన పడాలంటే ఎగుమతులు పెరగాలి. అంతర్జాతీయ విపణిలో ఇతర దేశాల ఉత్పత్తులతో పోటీ పడగలిగేలా ఉంటేనే మన ఎగుమతులు వృద్ధి చెందుతాయని గుర్తుంచుకోవాలి.

సానుకూల సంకేతాలు
ఇటీవలి కాలంలో షేర్‌ ధరలు గణనీయంగా పడిపోయినా మన స్టాక్‌ మార్కెట్‌ గత ఏడాదికన్నా బాగానే ఉంది. ఇప్పటికీ కొందరు విదేశీ సంస్థాగత మదుపరులు మన షేర్లలో పెట్టుబడులను కొనసాగించడం దీనికి కారణం. కానీ, భారత్‌లో రాజకీయ, ఆర్థిక పరిస్థితులపై వారిలో సందేహాలు పొడసూపుతున్నందున ఈ సంస్థాగత మదుపరులు కూడా నెమ్మదిగా నిష్క్రమించే అవకాశం ఉంది. ఈలోపు స్వదేశీ మ్యూచువల్‌ ఫండ్‌లు, బీమా సంస్థలు భారీగా షేర్లు కొనుగోలు చేయడంతో మన స్టాక్‌ మార్కెట్‌ ఒత్తిళ్లను తట్టుకోగలుగుతోంది. భారత ఆర్థిక వ్యవస్థ మూలాలపై స్వదేశీ మదుపరులకున్న నమ్మకమే స్టాక్‌ మార్కెట్‌ను నిలబెడుతోంది. ప్రస్తుత గడ్డు కాలం శాశ్వతం కాదు. పరిస్థితులు మెరుగుపడగానే పునాదులు బలంగా ఉన్న కంపెనీలు మళ్ళీ విజృంభిస్తాయి. మదుపరులు స్వల్పకాలిక హెచ్చుతగ్గులకు కంగారు పడిపోకుండా స్థిమితంగా ఉంటూ తమ పెట్టుబడుల విలువ మరీ తరిగిపోకుండా జాగ్రత్త పడుతూ దీర్ఘకాలిక వ్యూహంతో ముందడుగు వేయాలి. ప్రభుత్వమూ తన ముందున్న సవాళ్లను లాఘవంగా అధిగమించాలి.

చిన్నపరిశ్రమలకు ప్రోత్సాహం
ప్రస్తుతానికి రూపాయి విలువ తగ్గడం వల్ల మన వస్తుసేవలు విదేశాలకు ఆకర్షణీయ ధరలకు లభిస్తాయి. ధరతోపాటు నాణ్యత కూడా ఉన్నప్పుడు మాత్రమే అంతర్జాతీయ మార్కెట్లలో మనం నెగ్గుకురాగలుగుతాం. మన ఎగుమతులు పెరగాలంటే చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు తగినన్ని రుణాలిచ్చి ప్రోత్సహించాలి. ఆధునిక నైపుణ్యాలను అలవరచి, ఉత్పాదకతను పెంచే విధానాలను ప్రభుత్వం చేపట్టాలి. ఈ పరిశ్రమల ఎగుమతులు పెరిగినప్పుడు ఉపాధి అవకాశాలూ విజృంభిస్తాయి. కొత్త పెట్టుబడులు ప్రవహించి భారత్‌పై జాతీయ, అంతర్జాతీయ మదుపరులకు నమ్మకం ఇనుమడిస్తుంది. ఈ ఆశావహ చిత్రం వాస్తవం కావాలంటే మొదట 10 లక్షల కోట్ల రూపాయల పారు బాకీలతో సతమతమవుతున్న బ్యాంకులను ఒడ్డున పడేయాలి. అవి కష్టాల నుంచి గట్టెక్కితేనే కొత్త పరిశ్రమలకు, వ్యాపారాలకు రుణం ఇవ్వగలుగుతాయి. కానీ, పారు బాకీల బరువుతో కుంగిపోతున్న బ్యాంకులు కొత్త ప్రాజెక్టులకు పెట్టుబడులను సమకూర్చలేకపోతున్నాయి. మౌలిక వసతుల కల్పనకు పెట్టుబడులు సమకూర్చే ప్రభుత్వరంగ సంస్థ ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ కుప్పకూ లడం ఇక్కడ గమనించాలి. ఐసీఐసీఐ, యాక్సిస్‌ బ్యాంక్‌, యెస్‌ బ్యాంకులు కూడా అనిశ్చితిలో కూరుకుపోయాయి. బ్యాంకింగ్‌ రంగ లోటుపాట్లను సరిదిద్ది పారిశ్రామిక, మౌలిక వసతుల రంగాలు అభివృద్ధి బాటలో పరుగు తీయడానికి ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. అనేక సవాళ్ల మధ్య కూడా భారత జీడీపీ పెరగడం శుభ సంకేతం. భవిష్యత్తులో పీపా ముడిచమురు ధర 70-80 డాలర్ల మధ్య తిరుగుతుందని అంచనాలున్నాయి. అది భారత బడ్జెట్‌, ఆర్థికాభివృద్ధి మీద పెద్దగా ప్రతికూల ప్రభావం చూపకపోవచ్చు. రిజర్వు బ్యాంకు వడ్డీరేట్లను పెంచినందువల్ల భారత్‌ నుంచి పెట్టుబడులు బయటకు తరలిపోవడం నెమ్మదిస్తుంది. అది రూపాయి విలువ మరీ తరిగిపోకుండా అడ్డుకొంటుంది. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడానికి రిజర్వు బ్యాంకు రానున్న రెండేళ్లలో రెండు మూడుసార్లు వడ్డీరేట్లు పెంచవచ్చు. దానివల్ల పెట్టుబడులు బయటకు తరలిపోవడం ఆగి, రూపాయి విలువ మళ్ళీ పుంజుకోవచ్చు. 2020కల్లా డాలరుతో రూపాయి మారకం విలువ రూ.68 వద్ద స్థిరపడుతుందని కొందరు నిపుణుల అంచనా. ఫలితంగా భారత్‌పై మదుపరుల్లో నమ్మకం పెరిగి, ఆర్థికాభివృద్ధి ఊపందుకోనుంది.

Posted on 23-10-2018