Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఆర్థిక రంగం

డాలరు-రూపాయి మధ్య అగాధం...

మొన్న, కొత్త సంవత్సరం రోజున డాలరుతో రూపాయి మారకం విలువ రూ.63.32. సరిగ్గా సంవత్సరం క్రితం అది రూ.61.93. అమెరికాలోని నాలుగో అతిపెద్ద మదుపు బ్యాంకు లెహ్‌మన్‌ బ్రదర్స్‌ కుప్పకూలి అమెరికా ఆర్థిక సంక్షోభాన్ని ప్రపంచమంతా వ్యాపింపజేసిన 2008 సెప్టెంబరు 15న అది రూ.45.94. గతేడాది ఆగస్టు 28న భారతదేశ చరిత్రలోనే రికార్డుస్థాయిలో దిగజారి రూ.68.36గా నమోదైంది. అసలు, డాలరు- రూపాయి మధ్య ఇంత వ్యత్యాసం ఎందుకు? ఒక్క డాలరుతోనే కాకుండా యూరో, పౌండ్‌ స్టెర్లింగ్‌లతోనూ చాలా వ్యత్యాసం ఉంది. ఇంత పెద్ద మొత్తంలో ఎందుకు చెల్లిస్తున్నాం? ఒక డాలరుకు ఒక రూపాయి ఎందుకు చెల్లించకూడదు?

రెండో ప్రపంచ యుద్ధానంతరం అమెరికా అద్భుతమైన ఉత్పాదకతతో చాలా దేశాలను తన ఉత్పత్తులమీద ఆధారపడేలా చేసుకొంది. అదే సమయంలో బ్రెటన్‌ వూడ్స్‌ లేదా సమాన విలువ వ్యవస్థను ఏర్పాటు చేశారు. దాని ప్రకారం సభ్య దేశాలు అంతర్జాతీయ మార్కెట్లో తమ కరెన్సీల విలువను డాలరుతో ముడిపెట్టి నిర్ణయించాలి. అంటే, డాలరు విలువ మారితే వాటి విలువా మారుతుందన్నమాట. అమెరికాతో వ్యాపారం చేసే అన్ని దేశాలూ ఆ దారిలోనే నడిచాయి.

ఫలితంగా వాటి కరెన్సీలపై డాలరు విపరీత ప్రభావం చూపడం ప్రారంభించింది. తెల్లదొరల పాలన సాగుతున్నప్పుడు భారత్‌ది భిన్న పంథా. అప్పట్లో రూపాయిని బ్రిటిష్‌ పౌండు స్టెర్లింగ్‌తో ముడిపెట్టారు. 1971 సెప్టెంబరులో బ్రెటన్‌ వూడ్స్‌ వ్యవస్థ కుప్పకూలింది. దాంతో ఆ వ్యవస్థ నుంచి డాలర్‌ బయటకొచ్చింది. ఫలితంగా పౌండు స్టెర్లింగుతో ఉన్న బంధాన్ని, విడగొట్టి రూపాయిని డాలరుతో ముడిపెట్టారు. అదే సంవత్సరం అమెరికాలో తీవ్ర ఆర్థిక సంక్షోభం తలెత్తింది. అమెరికా తన డాలరు విలువను మూల్య న్యూనీకరణ చేసింది. అంటే తగ్గించింది. డాలరుతో ముడివేసుకున్న అన్ని కరెన్సీలపైనా దాని ప్రభావం పడింది. దరిమిలా భారత ప్రభుత్వం డాలరుతో రూపాయి ముడిని విడగొట్టి, మళ్ళీ పౌండు స్టెర్లింగ్‌తో అనుసంధానించింది. పౌండు స్టెర్లింగ్‌కు డాలరుతో ముడి ఉన్నప్పటికీ, దాని విలువ స్థిరంగా ఉన్నందువల్ల డాలరుతో రూపాయి విలువలో పెద్ద మార్పు రాలేదు.

రూపు మారిన రూపాయి

అది 1927. భారత్‌లో వలస పాలన కొనసాగుతున్న కాలం. మన రూపాయిని బ్రిటిష్‌ పౌండు స్టెర్లింగ్‌కు అనుసంధానించిన సంవత్సరమది.ఆ కాలంలో మారకపు విలువ 18 పెన్సుల(బ్రిటిష్‌ పైసలు)కు ఒక రూపాయి. 240 పెన్సులకు ఒక పౌండు. ఆ లెక్కన పౌండుతో రూపాయి మారకం విలువ రూ.13.33. అదే సమయంలో- డాలరు, పౌండు విలువలు సమానంగా ఉండేవి. 1947లో డాలరుతో రూపాయి మారకం విలువ 3.30. అంటే, దాదాపు ఏడు దశాబ్దాల కాలంలో డాలరుతో పోలిస్తే మన రూపాయి 20రెట్ల విలువను కోల్పోయిందా? ఆర్థిక పరిభాషలో అది పూర్తి వాస్తవం కాకపోయినా, ద్రవ్యనిర్వహణ విధానంలో లోపాల వల్ల రూపాయి విలువ దారుణంగా దిగజారిన మాట నిజం!

రూపాయిని ఒకటే కరెన్సీకి ముడిపెట్టడంలో ఉండే లోపాలను అధిగమించడానికి, రూపాయి విలువలో నిలకడ సాధించడానికి 1975 సెప్టెంబరులో కొన్ని కరెన్సీలను కలిపి బాస్కెట్‌ (బుట్ట) ఏర్పాటు చేశారు. ఆ బుట్టవిలువతో రూపాయి మారక విలువను ముడిపెట్టారు. అతి లాభాపేక్ష ఉన్న అంచనా వ్యాపారుల(స్పెక్యులేటర్స్‌)ను నియంత్రించదలచుకొన్న రిజర్వు బ్యాంకు- ఆ బుట్టలో ఏయే కరెన్సీలను చేర్చారు. ఒక్కొక్క కరెన్సీకి ఎంత సాపేక్ష తూకం (రిలేటివ్‌ వెయిట్‌) ఇచ్చారన్న దాన్ని గోప్యంగా ఉంచింది. అప్పట్లో డాలరుతో రూపాయి మారకం విలువ రూ.8.39. తరవాత, 1980లనుంచి పరిస్థితులు మారాయి. ఆర్థిక, వ్యవస్థీకృత కారణాలు విదేశీ చెల్లింపుల విషయంలో సంక్షోభం సృష్టించాయి. దరిమిలా 1985లో రూపాయి మూల్య న్యూనీకరణ చేశారు. డాలరుతో రూపాయి మారక విలువ రూ.12 అయింది. 1991నాటికి స్థితిగతులు పూర్తిగా దిగజారాయి. దశాబ్దాలుగా అమలు జరిపిన 'లైసెన్స్‌రాజ్‌', దేశ పారిశ్రామిక రంగాన్ని చావుదెబ్బతీసింది. పారిశ్రామికోత్పత్తి బాగా తగ్గిపోయింది.

పంచవర్ష ప్రణాళికల అమలుకు ప్రభుత్వ రుణాలే ఆధారమయ్యాయి. ప్రతి వార్షిక బడ్జెట్లో మూలధనేతర వ్యయం పెరగడంవల్ల, దాన్ని పూడ్చడానికి లోటు బడ్జెట్లపై విపరీతంగా ఆధారపడాల్సి వచ్చింది. దాంతో ద్రవ్య సరఫరా పెరిగింది. వర్షాభావ పరిస్థితుల కారణంగా వ్యవసాయ రంగమూ కుదేలైంది. ద్రవ్యోల్బణం కట్టుతప్పింది. ఎగుమతులు దిగనాసిల్లి, దిగుమతులు బాగా పెరిగిపోయాయి. 1990-'91 ఆర్థిక సంవత్సరంలో వర్తమాన ఖాతాలోటు, స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)లో 3.0శాతానికి చేరింది. 1991 జులైనాటికి కేవలం మూడువారాల దిగుమతులకు మాత్రం సరిపోయే విదేశ మారక ద్రవ్య నిల్వలు ఉండేవి. ఇలాంటి పరిస్థితులే ఆర్థిక సంస్కరణలకు బాటవేశాయి. విదేశ మారక ద్రవ్య నిల్వల తరుగుదలను అరికట్టి, మదుపుదారుల్లో ఆత్మవిశ్వాసాన్ని, స్వదేశంలో పోటీతత్వాన్ని నింపడానికి ప్రభుత్వం రెండుమెట్ల సర్దుబాటు చర్యలు చేపట్టింది. దాన్ని అనుసరించి 1991 జులై ఒకటిన తొమ్మిదిశాతం, జులై మూడున మరో 11శాతం రూపాయి విలువ తగ్గించారు. దరిమిలా, మారక విలువను ప్రభుత్వం అజమాయిషీ చేసే కాలం ముగిసింది. డాలరుతో రూపాయి మారక విలువ రూ.17.90కు చేరింది.

దారిచూపుతున్న చైనా

చైనాను చూసి అగ్రరాజ్యమైన అమెరికాయే కలవరపడుతోందిప్పుడు. అందుకు ప్రధాన కారణం- దాని సైనిక శక్తి కాదు, ఆర్థిక సంపన్నతే. ఆ దేశం అంతర్గత ఉత్పాదకత పెంచుకొంది. ఉత్పత్తి ఖర్చు తగ్గించుకొంది. ఎగుమతులు భారీగా పెంచింది. చెల్లింపుల్లో మిగులు సాధించి, విదేశ మారక ద్రవ్యాన్ని పెద్దయెత్తున నిల్వ చేసుకొంది. తన కరెన్సీ (యువాన్‌) విలువను తనే నిర్ణయిస్తోంది. అది ఆ విలువను ఒక్క శాతం తగ్గించినా, ఆ దేశ వస్తువులు మరింత చవకై, అమెరికా మార్కెట్లను ముంచెత్తుతాయి. అమెరికా వాణిజ్య ఖాతాలోటు పెరుగుతుంది. డాలరు విలువ అంతర్జాతీయ మార్కెట్లో అమాంతం పడిపోతుంది. ఆ స్థాయి స్వయం సమృద్ధి సాధిస్తేనే, భారత్‌ గొప్ప ఆర్థిక శక్తిగా ఎదగగలుగుతుంది.

ముందున్న మార్గాలు

డాలరుతో రూపాయి విలువను పెంచి, ఒక డాలరుకు ఒక రూపాయి చెల్లించడం సాధ్యమా అన్నది కీలక ప్రశ్న. ఈ దిశలో రెండు విధాలుగా ముందుకు సాగవచ్చు.
మొదటిది: ప్రభుత్వం జోక్యం చేసుకొని, ఒక డాలరుకు ఇన్ని రూపాయలు అని ప్రకటించి, రాత్రికి రాత్రే వాటి విలువను తలకిందులు చేయడం. భారత రూపాయల్లో కన్నా అమెరికా డాలర్లలో జీతభత్యాలు చాలా తక్కువగా ఉండటంతో ఉద్యోగాలు దేశం దాటిపోతాయి. ఇక్కడ నిరుద్యోగం తాండవిస్తుంది. అంతర్జాతీయ వేతనాలతో సమానంగా ఇక్కడ జీతాలు చెల్లిస్తే, దేనికీ సరిపోక బతుకు దుర్భరమవుతుంది. ఉత్పత్తులకు గిరాకీ తగ్గి, మార్కెట్లు కుప్పకూలుతాయి. మూలధన ప్రవాహం ఆగిపోతుంది. బయటి ప్రపంచంలో లావాదేవీలు స్తంభించిపోయి, ఆర్థిక వ్యవస్థ ధ్వంసమవుతుంది.

రెండోది: ఒక స్పష్టమైన ప్రణాళికతో, నిర్దిష్టమైన లక్ష్యంతో ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవింపజేసి స్వయం సమృద్ధివైపు సాగడం. ఇందుకోసం- వస్తూత్పత్తి, సేవల రంగంలో అంతర్జాతీయ స్థాయికి ఎదగాల్సి ఉంటుంది. విదేశీ చెల్లింపుల విషయంలో మిగులు సాధించాలి. దిగుమతులపై ఆధారపడటాన్ని సాధ్యమైనంతవరకు తగ్గించుకోవాలి. ద్రవ్యోల్బణాన్ని కనిష్ఠ స్థాయిలో కట్టడి చేయాలి. నిరుద్యోగాన్ని తగ్గించాలి. విదేశ మారకద్రవ్యాన్ని పెద్దమొత్తంలో నిల్వ చేసుకోవాలి. ఆర్థిక వ్యవస్థను అన్నివిధాలుగా బలోపేతం చేయాలి. ఉత్తమమైన మార్గం ఇదే!

రూపాయి మారక విలువను మార్కెట్‌ శక్తులే, అంటే రూపాయి గిరాకీ-సరఫరాల ఆధారంగానే నిర్ణయించే విధానాన్ని 1993 మార్చిలో ప్రవేశపెట్టారు. రూపాయి విలువ స్థిరత్వాన్ని కాపాడేందుకు అవసరమైతే మార్కెట్లో జోక్యం చేసుకొనే అవకాశాన్ని రిజర్వు బ్యాంకుకు కల్పించారు. ప్రభుత్వ నియంత్రణలనుంచి విముక్తమైన రూపాయి, విదేశీ మార్కెట్లో స్వేచ్ఛగా విహరించసాగింది. రూపాయల్లో కొనుగోలు, అమ్మకాలు, వ్యాపారాలకు అనుమతించడంతో అది తన వాస్తవ విలువను ప్రతిబింబించడం మొదలుపెట్టింది. ఫలితంగా రూపాయి మారకం విలువ డాలరుతో పోలిస్తే రూ.31.37కు చేరింది. అప్పటినుంచి ఇప్పటివరకు విదేశీ మార్కెట్లో రూపాయి విలువను మార్కెట్‌ శక్తులే నిర్ణయిస్తున్నాయి. చైనాకు భిన్నంగా భారత్‌ 1991నుంచి ప్రపంచీకరణలో భాగం కావడంవల్ల ఎక్కడ ఎలాంటి రాజకీయ పరిణామం చోటుచేసుకొన్నా, ఆర్థిక విధి విధానాల్లో ఎలాంటి మార్పు వచ్చినా రూపాయిపై ప్రభావం పడుతోంది. 1997లో సంభవించిన ఆసియా కరెన్సీ సంక్షోభం, 2008లో అమెరికాలో మొదలైన ద్వితీయ తరగతి గృహరుణ సంక్షోభం (సబ్‌ప్రైమ్‌ క్రైసిస్‌), 2010లో ఐరోపాను కుదిపేసిన రాజ్య రుణ సంక్షోభం(సావరిన్‌ డెట్‌ క్రైసిస్‌)లాంటివి ఈ మధ్యకాలంలో ప్రపంచ ఆర్థిక రంగాన్ని అతలాకుతలం చేశాయి.

2007లో ప్రపంచ వాణిజ్య కేంద్రంపై ఉగ్రవాద దాడి, రష్యాపై పాశ్చాత్య దేశాల ఆంక్షలు, చమురు ధరల్లో మార్పులవంటి ఎన్నో పరిణామాలు రూపాయి విలువపై ప్రభావం చూపుతున్నాయి. రాజకీయ అనిశ్చితి, కుంభకోణాలు, సైనికదాడులు, ద్రవ్యోల్బణం వడ్డీరేట్లు, అంతర్జాతీయ వాణిజ్యం, ప్రభుత్వ విధానాలవంటి దేశీయ, అంతర్జాతీయ అంశాలూ మార్కెట్లో రూపాయి విలువమీద ప్రభావం కనపరుస్తున్నాయి. డాలరుకు, రూపాయికి మధ్య అగాధాన్ని తగ్గించలేమా అన్నది ప్రస్తుతం దూసుకొస్తున్న ప్రశ్న. అది అంత సునాయాసం కాకపోగా, దానివల్ల విపరీత పరిణామాలూ చవిచూడాల్సి రావచ్చు. అవి మరింత సంక్షోభానికే అంటుకట్టవచ్చు. ఈ దృష్ట్యా, ప్రస్తుతానికి డాలరుతో రూపాయి విలువ తక్కువలో ఉండటమే సురక్షితం, ప్రయోజనదాయకం. అలాగని అంతరం భారీగా పెరగడమూ మంచిది కాదు. పరిస్థితి చేయిదాటకుండా చూడటం ముఖ్యం. రూపాయి విలువ పెంచినంతమాత్రాన లాభం చేకూరదు. సకల ఆర్థిక శక్తియుక్తులు కూడదీసుకొని, సామర్థ్యాలు పెంపొందించుకోవడం ద్వారానే డాలరును ఢీకొట్టగలం. అప్పుడే అమెరికాను ఎదిరించే స్థాయికి ఎదిగే అవకాశమూ ఉంటుంది. ప్రతి విషయంలో చైనాతో పోల్చడం అనివార్యమైన ప్రస్తుత పరిస్థితుల్లో- దీనిపైనా బీజింగ్‌ను ఆదర్శంగా తీసుకొని భారత్‌ ముందడుగు వేయవచ్చు. చైనా ప్రధానంగా ఆర్థిక శక్తితోనే అగ్రరాజ్యాన్ని కట్టడి చేయగలుగుతున్న తీరు... భారత్‌కూ స్ఫూర్తిదాయకమే!

(రచయిత - డాక్టర్‌ కల్లూరు శివారెడ్డి )
(ఆర్థిక నిపుణులు)
Posted on 27-01-2015