Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఆర్థిక రంగం

ముళ్ల కిరీటం

వచ్చే మూడు దశాబ్దాల్లో విశ్వమానవాళి సంఖ్య రెండు వందలకోట్ల మేర విస్తరించి 970 కోట్లకు చేరనుందంటున్న ఐక్యరాజ్య సమితి తాజా నివేదిక- 2027 సంవత్సరంనాటికి ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశమన్న హోదా భారత్‌కు దఖలు పడుతుందంటోంది. ప్రస్తుతం 143 కోట్లమందితో కిటకిటలాడుతున్న చైనా జనరాశిని ఇంకో ఎనిమిదేళ్లలో అదిగమించనున్న ఇండియాలో 2050నాటికి 164 కోట్లమంది పోగుపడతారని సమితి భవిష్యద్దర్శనం చేస్తోంది. ఇదే ఐరాస మునుపటి అంచనాలకు, సరికొత్త నివేదికాంశాలకు మధ్య ప్రధాన భేదమొకటి ప్రస్ఫుటమవుతోంది. 2015లో వెలుగు చూసిన నివేదిక 2022నాటికి, రెండేళ్లక్రితం వెలువడ్డ అధ్యయనం 2024నాటికి జనాభా ప్రాతిపదికన చైనాను భారత్‌ తలదన్నుతుందని మదింపు వేశాయి. దేశీయంగా కుటుంబ నియంత్రణ ప్రణాళికలు కొంతైనా అక్కరకొచ్చి గతంలోకన్నా జనవిస్ఫోట రేటు మందగించిందనడానికి, ఐరాస అంచనాల్లో చోటుచేసుకున్న మార్పే ప్రబల నిదర్శనం. 2050 సంవత్సరందాకా ప్రపంచ జనాభా వృద్ధిలో సగానికిపైగా ఇండియా, నైజీరియా, పాక్‌ సహా తొమ్మిది దేశాల్లోనే నమోదుకానుందన్న జోస్యం- వ్యూహాలు మరింత పదునెక్కాల్సిన ఆవశ్యకతను చాటుతోంది. గడచిన తొమ్మిదేళ్ల గణాంకాలు విశ్లేషిస్తే జనసంఖ్య ఒకశాతం వరకు తగ్గిన దేశాల సంఖ్య 27గా లెక్కతేలుతోంది. 2050 సంవత్సరం నాటికి చైనా జనాభా తగ్గుముఖం పట్టనుండగా, భారతీయుల సంఖ్య 27 కోట్లకుపైగా విస్తరించనుందనడం- బహుముఖ సమస్యలు పొంచి ఉన్నాయని హెచ్చరించడమే. జనాభా పెరుగుదలకు అనుగుణంగా ఆహార నిల్వలు, రవాణా సదుపాయాలు, విద్య, వైద్యం, ఇంధనం, ఇతరత్రా మౌలిక వసతులను అందుబాటులోకి తేవడం గడ్డుసవాలు. పల్లెప్రాంతాల నుంచి వలసల నియంత్రణ, ప్రణాళికాబద్ధంగా పట్టణీకరణ, మానవ వనరుల గరిష్ఠ సద్వినియోగం సాధ్యపడేలా ఉపాధి కల్పన... చురుకందుకోవాలన్నదే మహాజన విస్ఫోటాన్ని కళ్లకు కడుతున్న లెక్కల్లో అంతర్లీన సందేశం!

జనాభా ఇంతలంతలయ్యే కొద్దీ పట్టణాలు, నగర ప్రాంతాలపై తీవ్ర ఒత్తిళ్లు పెరుగుతాయి. 2050 సంవత్సరానికల్లా ప్రపంచ జనాభాలో 68 శాతం పట్టణాల్లో నివసిస్తారని, 2028 నాటికి అత్యధిక జనసంఖ్య కలిగిన నగరంగా దేశరాజధాని దిల్లీ ఆవిర్భవిస్తుందన్న అంచనాలు నిరుడే వెల్లడయ్యాయి. ప్రస్తుతం రమారమి మూడు కోట్ల నివాసితులకు నెలవైన దిల్లీ నగర జనాభా ఇంకో తొమ్మిదేళ్లలో 3.72 కోట్లకు ఎగబాకనుంది. దిల్లీతోపాటు ముంబయి, కోల్‌కతా తదితర మహానగరాల అలవిమాలిన ఇక్కట్ల దృష్ట్యా రేపటి అవసరాలకు తగ్గట్లు శివారు ప్రాంతాల్లో శాటిలైట్‌ సిటీల నిర్మాణం ఉపయుక్తమన్నది కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ సూచన. నగరాల ముఖచిత్రంలో విశేష అనివార్య మార్పులకు సంబంధించి సంకేతాలు కొన్నేళ్లుగా వెలువడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా గృహవసతి, రహదారుల పరికల్పన, సంఖ్యాధిక యువతకు తగిన బతుకుతెరువు చూపించాల్సిన బృహత్తర కర్తవ్య సాధన- ఏ ప్రభుత్వానికైనా కత్తి మీద సామే. జనాభా పెరుగుదలకు దీటుగా తాగునీరు, విద్యుచ్ఛక్తి, స్వాస్థ్య రక్షణ సమకూర్చడమన్నది ఆషామాషీ వ్యవహారం కాదు. పారిశుద్ధ్యం కొరవడితే అంటురోగాలు రెచ్చిపోతాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న జీవనశైలి వ్యాధులు వైద్యబడ్జెట్లకు తూట్లు పొడుస్తున్నాయి. నగరాల వెలుపల శాటిలైట్‌ సిటీల నిర్మాణ ప్రతిపాదనలకు- ఈ కీలకాంశాలన్నింటి పట్లా సదవగాహనతో కూడిన దీర్ఘకాలిక ప్రణాళిక రచన వెన్నుదన్ను కావాలి. ఆకర్షణీయ నగరాల ప్రణాళికతో తొలిదఫా పాలనలో ముందుకొచ్చిన మోదీ ప్రభుత్వం, పునరధికారం సాధించిన దరిమిలా- పట్టణ నవీకరణ పథకాల కార్యాచరణను ఇనుమడించిన ఉత్సాహంతో కదం తొక్కించాలి!

భారత దేశ భౌగోళిక విస్తీర్ణం సుమారు 32లక్షల 87వేల చదరపు కిలోమీటర్లతో పోలిస్తే వైశాల్యంలో అమెరికా ఇంచుమించు మూడింతలు. అక్కడి జనాభా రమారమి 33 కోట్లు, ఇక్కడ 137 కోట్లు! భూవిస్తీర్ణంలో ఇండియాకు రెండింతలు పైబడిన ఆస్ట్రేలియా జనసంఖ్య కేవలం రెండున్నర కోట్లు!! ఇంతటి భారీ వ్యత్యాసం, దేశీయంగా విపరీత జనసాంద్రత- సహజంగానే ఎన్నో సంక్లిష్టభరిత సమస్యల్ని సంక్షోభాలుగా ప్రజ్వరిల్లజేస్తున్నాయి. నీరు, కలప, ఇనుము, రాగి వంటి ప్రకృతి వనరుల లభ్యత తరిగిపోతుండగా- కాలుష్యం, భూసార క్షీణత, అడవుల నరికివేత పెచ్చరిల్లుతున్నాయి. జనాభాలో వృద్ధికి అనుగుణంగా ఆహార ధాన్యోత్పత్తి ఇనుమడించాల్సిన తరుణంలో, వాతావరణంలో పెనుమార్పుల మూలాన అసలుకే ఎసరొచ్చే ముప్పు దాపురించనుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో వరి దిగుబడులు తెగ్గోసుకుపోనున్నందువల్ల జొన్న, మొక్కజొన్న, రాగులు, సజ్జ వంటి పంటల సాగును విస్తరించడమే సరైన ప్రత్యామ్నాయం కాగలదంటున్నారు. తిండి ఒక్కటే దేశాన్ని, జాతిని సజీవ చైతన్య స్రవంతిగా తీర్చిదిద్దలేదు. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా నిలవబోతున్న ఇండియాకు ఆరోగ్య, విద్యారంగాల్లో సమధిక పెట్టుబడులు, మహిళా సాధికారతకై విశేష కృషే ప్రాణాధారాలవుతాయి. జనాభా పెరుగుదలను మందగింపజేయడానికి, అభివృద్ధిని ఉరకలెత్తించడానికి అంతకన్నా వేరే మార్గం లేదన్న భారత ప్రజారోగ్య ఫౌండేషన్‌ (పీహెచ్‌ఎఫ్‌ఐ) సిఫార్సు ప్రభుత్వాలకు శిరోధార్యం. తక్కిన దేశాలకు భిన్నంగా యువత అధికంగా కలిగిన భారతావనిలో వృత్తి నైపుణ్యాల పెంపుదలకు, పల్లెల్లో వ్యవసాయ అనుబంధ రంగాల పునరుత్తేజీకరణకు అగ్రప్రాధాన్యం దక్కితేనే- పోటెత్తే జనసంద్ర సవాళ్లను జాతి సమర్థంగా అధిగమించగలిగేది!

Posted on 20-06-2019