Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఆర్థిక రంగం

హామీల అమలు సేద్యం సాగాలిక...

* వ్యవసాయరంగంలో అధిగమించాల్సిన సవాళ్లు

దేశంలో వ్యవసాయ సంక్షోభం విస్తరిస్తోంది. ఈ తరుణంలో సార్వత్రిక ఎన్నికల్లో అద్భుత ఫలితాలు సాధించి కేంద్రంలో మోదీ ప్రభుత్వం తిరిగి పగ్గాలు చేపట్టడం రైతాంగంలో కొత్త ఆశలు నింపింది. లోక్‌సభ ఎన్నికలకు కొన్ని నెలల ముందు మోదీ ప్రభుత్వం ‘పీఎం-కిసాన్‌’ పథకానికి శ్రీకారం చుట్టింది. దాని ప్రకారం దేశంలోని చిన్న రైతుల ఖాతాల్లో కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు జమచేస్తుంది. ఎన్నికల అనంతరం ఈ పథకాన్ని రైతులందరికీ వర్తింపజేస్తున్నట్లు మోదీ సర్కారు ప్రకటించింది. ప్రభుత్వ తొలి మూడేళ్ల కాలావధిలో అర్హులైన అయిదు కోట్ల రైతులకు ప్రత్యేక పింఛను పథకాన్ని వర్తింపజేయాలని మంత్రివర్గ మొదటి సమావేశంలోనే నిర్ణయించారు. ప్రధాన మంత్రి కిసాన్‌ పింఛను యోజన కింద నెలవారీ పెన్షను కోసం రైతులు మాసానికి వంద రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది. జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ) సారథ్యంలో కొనసాగే ఈ పథకంలో రైతులు చెల్లించిన మొత్తానికి సమానమైన డబ్బును ప్రభుత్వమూ జమచేస్తుంది. ఇందువల్ల కేంద్ర ప్రభుత్వానికి రూ.10,774.50 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఈ కార్యక్రమాన్ని లోపరహితంగా అమలు చేయగలిగితే రైతులోకానికి ఎనలేని సాంత్వన దక్కుతుందనడంలో సందేహం లేదు.

కార్యాచరణే కావాలిప్పుడు...
ఆందోళనకర స్థాయికి చేరిన సేద్య సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకూ వంద రోజుల్లోగా తక్షణ కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఇప్పటికే వ్యవసాయ మంత్రిత్వశాఖకు మోదీ ఆదేశాలు జారీ చేశారు. రైతన్నల ఆదాయాలు పెంచడమే సేద్య రంగంలో అలుముకున్న అనేక సమస్యలకు పరిష్కారమనడంలో మరో మాట లేదు. దేశంలో వ్యవసాయ ఉత్పత్తుల ప్రవాహం పెరిగి, పంటల ధరలు పాతాళాన్ని తాకడానికి కారణం ప్రభుత్వానికి ఎగుమతులపై సహేతుక దృష్టి కొరవడటమే! 2022నాటికల్లా రైతుల ఆదాయాల రెట్టింపుతోపాటు, వ్యవసాయ ఎగుమతులను ప్రస్తుతం ఉన్న మూడు వేల కోట్ల డాలర్లనుంచి ఆరువేల కోట్ల డాలర్లకు ఇనుమడింపజేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం జాతీయ ఎగుమతి విధానాన్ని రూపొందించింది. రైతుల దీర్ఘకాలిక అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఎగుమతులకు చురుకు పుట్టించడంతోపాటు భవిష్యత్‌ విపణుల విస్తరణకూ సర్కారు దన్నుగా నిలవాలి. పళ్లు, కూరగాయల శుద్ధి చాలా పరిమిత స్థాయిలోనే జరుగుతోంది. అపారమైన ఎగుమతి అవకాశాలున్న ఉత్పత్తులివి. కాబట్టి ప్రభుత్వం పెద్దయెత్తున ఆహార శుద్ధి పరిశ్రమల విస్తరణపై దృష్టి సారించాలి.

సేద్యానికి అదనపు విలువ కల్పించే విషయంలో తొలి అయిదేళ్ల మోదీ జమానా విఫలమైందనే చెప్పాలి. మరోవంక వ్యవసాయేతర రంగాలకు అదనపు విలువ కల్పించే విషయంలో మాత్రం గడచిన నాలుగేళ్లుగా చెప్పుకోదగిన వృద్ధి కనిపిస్తోంది. ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకున్న తరవాత అయిదేళ్ల కాలంలో రైతుల సగటు ఆదాయాన్ని విశ్లేషిస్తే 0.44 శాతం వృద్ధి మాత్రమే నమోదైనట్లు 2017 మార్చిలో నీతి ఆయోగ్‌ సమర్పించిన విధానపత్రం స్పష్టం చేసింది. 1993-94 నుంచి చూస్తే 2015-16నాటికి ఈ ఆదాయ వృద్ధి 108.5శాతంగా ఉంది. అంటే రూ.44,027కు ఇనుమడించింది. కార్పొరేట్‌ విత్తన సంస్థలు తొమ్మిదో దశకం తొలినాళ్లనుంచి విత్తన ధరలను 500 శాతం నుంచి 700 శాతం మేర పెంచాయి. దేశంలో 27 రకాల పంటలు సాగుచేసుకుంటున్న రైతన్నలు పంటనష్టం వల్లగాని లేదా విపణిలో ధరల పతనం వల్లగాని తీవ్రంగా నష్టపోయారు. పంట నష్టాల బారినపడి కిందటేడు సెనగ రైతులు సుమారు రూ.6,087 కోట్లు నష్టపోయినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రభుత్వం నిర్దేశించిన కనీస మద్దతు ధరకన్నా అతితక్కువ రేటుకే వ్యాపారులు, దళారులు సెనగ పంటను రైతుల వద్దనుంచి కొనుగోలు చేశారు. కంది, మినప పంటలను కనీస మద్దతు ధరకంటే వెెయ్యి రూపాయల తక్కువ రేటుకు రైతుల వద్దనుంచి దళారులు కొనుగోలు చేయడం గమనార్హం.

పంట దిగుబడుల పెంపుపై కనబరచిన శ్రద్ధలో కొంచెమైనా రైతు ఆదాయాల వృద్ధిపై పెట్టకపోవడంవల్లే సమస్యలు ముమ్మరించాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం పప్పు ధాన్యాలు, నూనె గింజలపై దిగుమతి సుంకాలు ఇబ్బడిముబ్బడిగా పెంచింది. దేశంలో వీటి ఉత్పత్తి చాలినంతగా ఉన్నందువల్ల దిగుమతులను నియంత్రించాలన్న ప్రభుత్వ ఆలోచనే అందుకు కారణం. అయితే అప్పటికే ఆయా పంటల రైతులకు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కనీస మద్దతు ధరను ఒకటిన్నర రెట్లు పెంచుతామని, మొత్తం ఉత్పత్తిని ప్రభుత్వమే సమీకరిస్తుందని గతంలోనే కేంద్ర ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. మద్దతు ధర పరిధిలోకి వచ్చే ఖరీఫ్‌ పంటలన్నింటికి ఉత్పత్తి వ్యయానికి యాభై శాతం అదనపు మొత్తాన్ని జతకూర్చి కొనుగోలు చేస్తామని 2018నాటి బడ్జెట్‌ ప్రసంగంలోనే నాటి ఆర్థిక మంత్రి చెప్పారు. కానీ, పంట ఉత్పత్తి వ్యయాన్ని మదింపు వేేసే క్రమంలో రైతుల శ్రమకు విలువ కట్టకపోవడం అతిపెద్ద లోపం. ఈ పద్ధతి కొనసాగితే మద్దతు ధరల ద్వారా రైతులకు సరైన న్యాయం జరగదు. ఈ నేపథ్యంలోనే పంట మద్దతు ధరల రూపేణా రైతుకు సంపూర్ణ ప్రయోజనం చేకూర్చేందుకు తాజాగా కేంద్ర ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తపరచింది. వ్యవసాయ మార్కెట్లలో పంటలకు చెల్లించే ధరలు మద్దతు ధరకన్నా తక్కువ ఉన్న పక్షంలో తానే పూనుకొని ఆ పంటకు మద్దతు ధర చెల్లించడమో లేక స్వయంగా ఆ ఉత్పత్తిని కొనడమో చేయనున్నట్లు ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. కొంతకాలంగా మద్దతు ధర అమలు బాధ్యత మీదంటే మీదంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యతలను దులపరించేసుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో నీతి ఆయోగ్‌ కేంద్ర, రాష్ట్రాలతో నిరంతరం సంప్రతింపులు జరుపుతూ, లోపరహిత మద్దతు ధరల విధానం దిశగా కసరత్తు చేస్తోంది.

కౌలు రైతులపై చిన్నచూపు
రుణమాఫీ రాజకీయాలు జోరుగా సాగుతున్న కాలమిది. అయితే రుణమాఫీ అన్నది బ్యాంకులనుంచి రైతులు తీసుకున్న అప్పులకే వర్తిస్తుంది. దేశంలో మెజారిటీ రైతులు అసంఘటిత రంగంనుంచే అప్పులు తీసుకుంటున్నారు. ప్రభుత్వాల రుణమాఫీ వల్ల ఇలాంటివారికి ఎలాంటి ప్రయోజనమూ ఉండటం లేదు. నిజానికి ఈ మాఫీ అన్నది తాత్కాలిక ఊరట మాత్రమే. కౌలు రైతులకు చట్టబద్ధత లేకపోవడం తక్షణం దృష్టి సారించాల్సిన ప్రాథమిక సమస్య. కౌలు చట్టంలో ఆ మేరకు మార్పు తీసుకువస్తే తప్ప కోట్లాది కౌలు రైతులకు ఊరట దక్కదు. కానీ ఆ ప్రయత్నాలు జరుగుతున్న జాడలే లేవు. రుణమాఫీ వంటి చర్యలతో వ్యవసాయాన్ని పట్టిపీడిస్తున్న దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం సాధ్యం కాదు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో, సేద్య విధానంలో వ్యవస్థీకృత సంస్కరణల ద్వారానే సమస్యల పరిష్కారం సాధ్యపడుతుంది. కనీస మద్దతు ధరల నిర్ధారణ ప్రాతిపదికలను సహేతుకంగా మార్చాల్సి ఉంది. దేశ సేద్య స్థూలోత్పత్తి విలువతో పోలిస్తే ఎమ్‌ఎస్‌పీ (కనీస మద్దతు ధర) ప్రాతిపదికన సమీకరిస్తున్న ధాన్యాల విలువ చాలా తక్కువగా ఉంటోంది. ప్రభుత్వం క్రమక్రమంగా ప్రజా పంపిణీ వ్యవస్థల ద్వారా ప్రత్యక్ష నగదు బదిలీ వైపు మొగ్గుచూపుతోంది. కాబట్టి, కనీస మద్దతు ధర చెల్లించి రైతులనుంచి ప్రభుత్వం నేరుగా సమీకరించే ధాన్యాల పరిమాణమూ మున్ముందు తగ్గే అవకాశం ఉంది. ఇది రైతు లోకానికి ఆందోళన కలిగించే విషయం. అందుకే ప్రభుత్వం కనీస మద్దతు ధరలపై మాత్రమే కాకుండా, ఏ పంటను ఎంత పరిమాణంలో కొనుగోలు చేయదలిచామన్న విషయంలోనూ సముచిత నిర్ణయాలు ప్రకటించాలి. దళారుల పాలబడి ప్రజా పంపిణీ వ్యవస్థల ద్వారా పేదలకు చేరాల్సిన ధాన్యాలు పక్కదోవ పడుతున్నాయన్న కారణంతో ఎన్డీయే ప్రభుత్వం నగదు బదిలీ పద్ధతిని నెత్తికెత్తుకుంటోంది. ఈ క్రమంలో ఎమ్‌ఎస్‌పీ ప్రాధాన్యం ఏ మాత్రం తగ్గినా అది రైతులోకంలో గందరగోళానికి కారణమవుతుందని గుర్తించాలి. ఇప్పటివరకూ కనీస మద్దతు ధరకు పంటను అమ్ముకున్న రైతన్నలు ఆ సౌకర్యం కనుమరుగైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. అదే జరిగితే దేశవ్యాప్తంగా పంటల సరళిలో అనూహ్య మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. బ్రహ్మాండమైన మెజారిటీతో అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వంపై రైతాంగం ఎన్నో ఆశలు పెట్టుకొంది. సుస్థిర సేద్యానికి, వ్యవసాయ పురోగతికి అవసరమైన నిర్మాణాత్మక విధానాలను అమలు చేయాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వంపై ఉంది.

ఆదుకునే ఆరు మార్గాలు
1) సంస్థాగత సంస్కరణలపై దృష్టి సారించడం (ఉదాహరణకు- వ్యవసాయ మార్కెట్‌ కమిటీలకు ప్రతినిధుల ఎంపికలో రైతన్నలకు సంపూర్ణ స్వేచ్ఛ ప్రసాదించడం. 2) గ్రామీణ రహదారులను వ్యవసాయ విపణులతో అనుసంధానించడం, గిడ్డంగుల ఆధునికీకరణ, విత్తన శుద్ధి, కమతాలను నేల స్వభావాన్ని బట్టి భిన్న శ్రేణులుగా వర్గీకరించగల ప్రయోగశాలల ఏర్పాటు వంటివాటి ద్వారా మౌలిక సదుపాయాల కొరతతో సతమతమవుతున్న వ్యవసాయానికి కొత్త ఊపిరులూదడం. 3) పంట కాలనీల ఏర్పాటు. 4) దేశంలో సగటు భూ కమతాల పరిమాణం క్రమంగా కోసుకుపోవడం రైతుల సమస్యలకు ఒక కారణం. 1970-71లో 2.3 హెక్టార్లుగా ఉన్న రైతుల సగటు వ్యవసాయ భూమి, 2015-16 నాటికి 1.08 హెక్టార్లకు తగ్గిపోయింది. వ్యవసాయంలో సన్న, చిన్నకారు రైతుల వాటా 1980-81లో 70 శాతం. 2015-16 కల్లా అది 86 శాతానికి పెరిగింది. 5) రైతులకు మరింత అనుకూలమైన బీమా విధానాలను అందుబాటులోకి తీసుకురావాలి. దాంతోపాటు నగరాల్లోని బహుళ వాణిజ్య మాల్స్‌, సూపర్‌ బజార్లు వంటి అత్యాధునిక వ్యవస్థలతో రైతులోకానికి అనుసంధానం కల్పించాలి. 6) వ్యవసాయ ఎగుమతులకు దన్నుగా సృజనాత్మక విధానాలకు రూపుదిద్దాలి. సేద్య ఎగుమతులపై ఏ స్థాయిలో నిషేధం విధించినా దానివల్ల రైతులకు నష్టం వాటిల్లుతుందని గుర్తించాలి.

Posted on 20-06-2019