Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఆర్థిక రంగం

నిరుద్యోగంపై రామబాణం!

దేశంలో వ్యవసాయ రంగం తరవాత అత్యధికంగా సుమారు 12 కోట్లమందికి బతుకు తెరువు కల్పిస్తున్న ఘనత లఘు పరిశ్రమలది. పేరుకు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ (ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ)లైనా పరిమిత పెట్టుబడులతో స్వయం ఉపాధికి రెక్కలు తొడగడంలో, వైవిధ్యభరిత వస్తూత్పాదనలతో దేశార్థికానికి ఊపిరులూదడంలో వాటి పాత్ర ఎన్నదగింది. అయినా దినదినగండంగా నెట్టుకొస్తున్న వాటి నెత్తిన- ‘సెబీ’ మాజీ సారథి యూకే సిన్హా నేతృత్వాన రిజర్వ్‌ బ్యాంక్‌ ఏర్పరచిన కమిటీ తాజాగా పాలుపోసింది. ఆర్థిక సుస్థిరతను లక్షించి దీర్ఘకాలిక చర్యలు చేపట్టే క్రమంలో, తాకట్టు లేని రుణాల పరిమితిని ప్రస్తుతమున్న రూ.10 లక్షల నుంచి రెండింతలు చేయాలన్న సిఫార్సు- ఆరు కోట్ల 30 లక్షలకు పైగా ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలకు తీపి కబురు. ఆర్థిక మాంద్యం ఉరుముతున్న వేళ, దేశీయంగా నిరుద్యోగ రేటు నాలుగు దశాబ్దాల గరిష్ఠానికి చేరి ఆందోళన పరుస్తున్న నేపథ్యంలో- లఘు పరిశ్రమలకు ఇటువంటి ఉపశమన చికిత్స అత్యావశ్యకం. రుణాల పరిమితి పెంపును ‘ముద్ర’ పథకం కింద అప్పు తీసుకున్నవారికి, స్వయం సహాయక బృందాలకు సైతం వర్తింపజేయగల వీలుందంటున్నారు. ఈ ఔదార్యం చేతల్లో ప్రతిఫలిస్తుందా అన్న సందేహాలూ వ్యక్తమవుతున్నాయి. నాలుగేళ్ల క్రితం ఆరంభమైన ‘ముద్ర’ రుణమేళాల పేరిట ఇంకో సంక్షోభం పురుడు పోసుకుంటోందని ఆర్‌బీఐ మాజీ గవర్నరు రఘురాం రాజన్‌ హెచ్చరించడం తెలిసిందే. దాన్ని తోసిపుచ్చి రిజర్వ్‌ బ్యాంక్‌ పచ్చజెండా ఊపినా కడకు వాస్తవిక కార్యాచరణ ఎలా నిగ్గుతేలుతుందో మరి! ఉదారంగా వ్యవహరించాలని కేంద్రీయ బ్యాంక్‌ సూచిస్తున్నా ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలకు బ్యాంకుల నుంచి రుణలభ్యతలో పెంపుదల అంతంత మాత్రమేనని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2017-18 ఆర్థిక సంవత్సరంలో లఘు పరిశ్రమలకు మంజూరైన బ్యాంకు రుణాలు రూ.14,731 కోట్లు; ఈ ఏడాది మార్చి నెలాఖరునాటికి రూ.15,491 కోట్లు. వృద్ధి సుమారు అయిదు శాతమేనన్న యథార్థం, తమ తలరాత ఎన్నటికి మారుతుందోనన్న నిర్వేదాన్ని చిన్న పరిశ్రమల్లో రగిలిస్తోంది!

భారత తయారీ రంగంలో 45 శాతం, ఎగుమతుల్లో 40 శాతం వాటా చిన్న పరిశ్రమలదే. ఉన్న స్థితి నుంచి ఉన్నత దశకు ఎదగనివ్వకుండా వాటిని కునారిల్లజేస్తున్న ప్రధాన సమస్య- సహేతుక వడ్డీరేట్లకు సకాలంలో తగినంత రుణవసతి కొరవడటమే. బ్యాంకులు విదుపుతున్న అరకొర రుణాలకు, వాస్తవిక అవసరాలకు మధ్య 230 బిలియన్‌ డాలర్ల (రమారమి రూ.16 లక్షల కోట్ల) మేర లోటు వెక్కిరిస్తున్నట్లు అంతర్జాతీయ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (ఐఎఫ్‌సీ) గతంలో మదింపు వేసింది. వ్యవస్థాగతంగా సరైన రుణవసతి కరవై సతమతమవుతున్న ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలకు ఇటీవలి కాలంలో దెబ్బమీద దెబ్బ తగిలిన పర్యవసానంగా వాటి కళాకాంతులు మరింత క్షీణించాయి. పెద్దనోట్ల రద్దు మూలాన చెల్లింపుల సంక్షోభం తలెత్తి లఘు పరిశ్రమలు విలవిల్లాడతాయన్న ‘మూడీస్‌’ సంస్థ జోస్యం అక్షరాలా నిజమైంది. జీఎస్‌టీ శకారంభం, సాంకేతికంగా సన్నద్ధంకాని చిన్న పరిశ్రమల్ని అవస్థలపాలు చేయడమే కాదు- రాయితీ పరిమితిని రూ.20 లక్షలకు కుదించడం, వాటికి పన్నుపోటు తాకిడినీ పెంచింది. మూలిగే నక్కమీద తాటిపండు పడిన చందంగా, చైనా నుంచి చౌక ఉత్పత్తుల వెల్లువ- అప్పులు దూసి తెచ్చి పంటిబిగువున రోజులు నెట్టుకొస్తున్న యూనిట్లను కోలుకోలేని దెబ్బతీసింది. లక్షల సంఖ్యలో ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలు రుజాగ్రస్తమయ్యాయి. ప్రత్యేక పోర్టల్‌ నెలకొల్పి, జీఎస్‌టీలో నమోదైన లఘు సంస్థలకు 59 నిమిషాల్లోనే కోటి రూపాయల దాకా రుణమంజూరుకు తోడ్పడతామన్న కేంద్ర ప్రకటన- నికరంగా ఎంత మేర లబ్ధి చేకూర్చిందో ఎక్కడా గణాంక వివరాలు అందుబాటులో లేవు. ఏటికి ఎదురీదుతున్న సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల బాగుసేతకు రేపటి కేంద్ర బడ్జెట్‌లో ఏపాటి సముచిత చొరవ ప్రదర్శితం కానుందో చూడాలి!

ఆరు నెలల క్రితం యూకే సిన్హా కమిటీని కొలువుతీరుస్తూ, అంతర్జాతీయంగా చిన్న పరిశ్రమలకు సంబంధించి అత్యుత్తమ ప్రమాణాల సమగ్ర అధ్యయనం చురుగ్గా సాగాలని ఆర్‌బీఐ అభిలషించింది. దేశంలో కమిటీలపై కమిటీల నియామకం, అరకొర చర్యలు ఆనవాయితీగా స్థిరపడి చిన్న పరిశ్రమల ముఖచిత్రం ఛిద్రమవుతుంటే- వెలుపల ఎన్నో స్ఫూర్తిమంతమైన ఉదాహరణలు కాంతులీనుతున్నాయి. లఘు, భారీ పరిశ్రమల మధ్య అర్థవంతమైన అనుసంధానంతో చైనా, జపాన్‌, జర్మనీ, కొరియా ప్రభృత దేశాలు ప్రపంచ విపణుల్ని కొల్లగొడుతున్నాయి. జర్మనీలో 60శాతం ఉపాధి అవకాశాల్ని స్థానిక సూక్ష్మ చిన్నతరహా పరిశ్రమలే కల్పిస్తున్నాయి. లఘు పరిశ్రమల నుంచి నిర్దిష్ట పరిమాణంలో సర్కారీ కొనుగోళ్లు నిర్విఘ్నంగా జరిగేలా థాయ్‌లాండ్‌, కెనడా, బ్రెజిల్‌, ఆస్ట్రేలియా వంటివి పకడ్బందీ చర్యలు చేపడుతున్నాయి. అందుకు విరుద్ధంగా ఇక్కడ రుణవసతి, నిపుణ కార్మికులు, మౌలిక సదుపాయాలు, నవీన పరిజ్ఞానం, వ్యవస్థాగత తోడ్పాటు... అన్నింటా అనేకానేక లోటుపాట్లు ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈల భవితకు తూట్లు పొడుస్తున్నాయి; ఉనికినే ప్రశ్నార్థకం చేస్తున్నాయి. చైనా నుంచి ఆటబొమ్మలు, జౌళి ఉత్పత్తులు, బల్క్‌ ఔషధాలు, సైకిళ్లు పెద్దయెత్తున దిగుమతి అవుతుండటం దేశీయంగా చిన్న పరిశ్రమల్ని ఛిన్నాభిన్నం చేస్తున్న తరుణంలో- ఇక్కడే వాటి తయారీ ఇనుమడించేలా నైపుణ్య శిక్షణ, ఇతరత్రా తోడ్పాటు సమకూర్చడంపై ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించాలి. సూక్ష్మ, చిన్నతరహా సంస్థల్లో 60 శాతం దాకా గ్రామీణ భారతంలో నెలకొన్న దృష్ట్యా- వాటికి రుణాలు, విపణి వసతులు ఇనుమడింపజేస్తే పల్లెలు తేరుకుని వలసలు తగ్గుముఖం పడతాయి. ‘మిటిల్‌ స్టాండ్‌’ (ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ) సంస్థలకు జర్మనీ ఇస్తున్న విశేష ప్రాధాన్యమే అక్కడ నిరుద్యోగాన్ని కనిష్ఠ స్థాయికి పరిమితం చేస్తోంది. ఇక్కడా అలా చిరుదివ్వెలు దేదీప్యమానమైతే కోట్లాది యువత జీవితాల్లో వెలుగులు ప్రసరిస్తాయి!


Posted on 22-06-2019