Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఆర్థిక రంగం

సుసంపన్న భారత స్వప్నం

* అయిదేళ్లలో అయిదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ
* ప్రధాని మోదీ సరికొత్త లక్ష్యం
* అధిగమించాల్సిన అడ్డంకులు అనేకం
* రంగాలవారీగా సంస్కరణలు ఆవశ్యకం

స్థూల‌ దేశీయోత్పత్తి (జీడీపీ) 2024 నాటికి అయిదు లక్షల కోట్ల డాలర్లకు చేరుకోవడమే లక్ష్యమని ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఇది సవాళ్లతో కూడిన లక్ష్యమే అయినప్పటికీ సాధించగలమన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తీకరించారు. ఆర్థికవేత్తలంతా దీని సాధ్యాసాధ్యాలను విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం దేశ జీడీపీ సుమారు 190 లక్షల కోట్ల రూపాయలు (సుమారు 2.7 లక్షల కోట్ల డాలర్లు)గా ఉంది. వచ్చే అయిదేళ్లలో దీన్ని 350 లక్షల కోట్ల రూపాయల (దాదాపు అయిదు లక్షల కోట్ల డాలర్ల) ఆర్థిక వ్యవస్థగా మార్చాలి. భారత్‌ లాంటి ప్రజాస్వామ్య దేశంలో ఈ లక్ష్యసాధన అంత తేలికేమీ కాదు. ప్రస్తుతం మన సగటు వ్యక్తిగత ఆదాయం సుమారు 2,000 డాలర్లుగా ఉంది. అదే స్థాయిలో 1983లో ఉన్న దక్షిణ కొరియా కేవల అయిదు సంవత్సరాల్లో 4,500 డాలర్లకు పైగా సాధించగలిగింది. ఇందుకు చైనాకు ఆరు, ఇండొనేసియాకు పన్నెండేళ్లు పట్టింది.

అసమానతలే అసలు సమస్య
దేశ సగటు వ్యక్తిగత ఆదాయం తీసుకుంటే ఒక ప్రాంతానికి మరో ప్రాంతానికి వ్యత్యాసం ఉంది. దక్షిణాదిలో వ్యక్తిగత ఆదాయం దేశ సగటుకంటే మెరుగ్గా ఉంది. తూర్పు ప్రాంతం అత్యంత వెనకబడి ఉంది. తెలంగాణలో ఒక వ్యక్తి సగటు వ్యక్తిగత ఆదాయం సుమారు రెండు లక్షల ఆరువేల రూపాయలు ఉండగా, బిహార్‌ నలభై వేల రూపాయలతో బాగా వెనకబడి ఉంది. ప్రాంతాల మధ్య ఇంతగా అసమానతలు ఉంటే మోదీ కలలు కంటున్న అయిదు లషల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యసాధన కష్టమేనన్న వాదన వినబడుతోంది. ‘ఒక దేశం, ఒక ఎన్నిక’ గురించి మాట్లాడుకుంటున్నాం గాని- ‘ఒక దేశం సమాన అభివృద్ధి’ గురించి చర్చ జరగడం లేదు. ఆర్థిక సంఘం దీనిపై దృష్టి సారించాల్సి ఉంది. ప్రపంచంలో సగటు వ్యక్తిగత ఆదాయ పరంగా చూస్తే భారత్‌ 142వ స్థానంలో ఉంది. శ్రీలంక మనకన్నా మెరుగైన స్థితిలో ఉంది. మొత్తం ప్రపంచ సంపదలో 31 శాతం అమెరికాలోనే ఉంది. చైనా 16 శాతంతో రెండో స్థానంలో ఉంది. భారత్‌ 1.9 శాతంతో 12వ స్థానంలో ఉంది. ప్రపంచ స్థూల జాతీయోత్పత్తిలో భారత్‌ అయిదో స్థానానికి ఎగబాకినా, సగటు జీవన ప్రమాణం విషయంలో వెనకబడి ఉంది. అందువల్ల దేశం అయిదు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారినా, సగటు జీవన ప్రమాణంలో మిగతా అభివృద్ధి చెందిన దేశాల స్థాయికి రావడానికి ఇంకా కొంత సమయం పడుతుంది. దీనికి ప్రధాన కారణం 1991 వరకు రక్షణాత్మక ఆర్థిక పంథాను అనుసరించడమే. ప్రైవేటు రంగం పాత్రను విస్మరించి కమ్యూనిస్ట్‌ రష్యా పద్ధతిలో ప్రభుత్వరంగం పైనే ఆధారపడటం వల్ల అభివృద్ధి నత్తనడకన సాగింది. కమ్యూనిస్టు చైనా మనకన్నా రెండు దశాబ్దాల ముందు మేల్కొని ప్రపంచ పెట్టుబడుల్ని సాధించి, అభివృద్ధి దిశగా ముందుకు సాగింది. 1991లో భారత్‌ సరళీకృత విధానం వైపు మొగ్గు చూపినా దాన్ని వేగవంతం చేయడంలో మీనమేషాలు లెక్కిస్తూ కాలం గడిపింది.

అభివృద్ధి రేటు ఎంతో కీలకమైంది. గత అయిదేళ్ల సగటు తీసుకుంటే ఏడు శాతం వృద్ధిరేటు నమోదైంది. ఇది ఏ విధంగానూ సరిపోదు. చైనా 1980 నుంచి రెండంకెల వృద్ధిరేటు సాధించింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ దేశమూ ఆ వృద్ధిరేటు సాధించలేదు. కనీసం ఎనిమిది శాతం వృద్ధిరేటుతో ఆర్థిక పురోగతిని సాధించగలిగితేనే అయిదు సంవత్సరాల్లో అయిదు ట్రిలియన్‌ డాలర్ల లక్ష్యాన్ని సాధించగలం. పరిస్థితులు ఆ దిశగా లేవు. గత త్రైమాసిక ఫలితాలు పూర్తి నిరాశాజనకంగా ఉన్నాయి. 2019-20 ఆర్థిక సంవత్సరం వృద్ధిరేటును ఆర్థిక సంస్థలు కుదించి ఏడు శాతంకన్నా దిగువకు సూచిస్తున్నాయి. లక్ష్యాలను సాధించాలంటే ప్రధాని మోదీ సాహసోపేత నిర్ణయాలు తీసుకోవాలి. ముందుగా ప్రపంచ పెట్టుబడుల్ని ఆకర్షించే దిశగా చర్యలు చేపట్టాలి. జీఎస్టీ, దివాలా చట్టంలో ఉన్న లోపాలను సరిచేయాలి. జీఎస్టీని మరింత సరళతరం చేయాలి. దివాలా చట్టాన్ని పటిష్ఠపరచాలి. పరిష్కారాలు వేగవంతం అయ్యేలా చూడాలి. సులభతర వ్యాపారం ఇంకా మెరుగుపడాలి. భారత అధికార యంత్రాంగంపై అంతర్జాతీయంగా సదభిప్రాయం లేదు. అవినీతి, అలసత్వం పేరుకుపోయిందన్న అభిప్రాయం ఉంది. ఇప్పటికీ దేశంలో వడ్డీరేట్లు ఎక్కువగా ఉన్నాయి. నిపుణుల నివేదికల ఆధారంగా సంస్కరణలు తీసుకురావాలి. ప్రభుత్వ విధానాలు, చర్యల వల్ల వివిధ రంగాల్లో పరిశ్రమలు దెబ్బతిన్నాయి. బ్యాంకులు రుణాలిచ్చిన తరవాత వచ్చిన మార్పుల వల్ల విద్యుత్‌ పరిశ్రమలు దెబ్బతిన్నాయి. బ్యాంకింగ్‌ రంగం పనితీరుతో పాటు మిగతా అనేక కారణాలు నిరర్థక ఆస్తులు పెరగడానికి కారణమవుతున్నాయి. భూ, కార్మిక చట్టాలు కీలకమైనవి. చైనాకు పెట్టుబడులు రావడానికి ఇవి ప్రధాన కారణాలు. అన్నింటికన్నా ముఖ్యమైనది రాష్ట్రాల్ని ఈ దిశగా సన్నద్ధపరచడం. ఇది ఓ పెద్ద సమస్యగా మారింది. కొన్ని రాష్ట్రాలు అభ్యుదయ పంథాలో, క్రియాశీలంగా పనిచేస్తుంటే- మరికొన్ని పూర్తిగా పాత విధానాలకు పరిమితమవుతున్నాయి.

ఆర్థికాభివృద్ధిలో వ్యవసాయ రంగం పాత్ర ఎనలేనిది. అధిక శాతం ప్రజానీకానికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న రంగమిది. ఇక్కడ స్థూల జాతీయోత్పత్తిలో వాటా బహు తక్కువ. ఈ వాటా పెంచే మార్గాలు అన్వేషించాలి. ఇప్పుడిప్పుడే ఈ రంగం నుంచి ఎగుమతులు ఊపందుకుంటున్నాయి. ఇవి మరింత పెరగడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ రంగంలో చిన్న, సన్నకారు కమతాల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. రైతులు, రైతు ఉత్పత్తిదారుల సంఘాల్లో చేరి ఆధునిక వ్యవసాయ పద్ధతులు, మార్కెటింగ్‌ అవకాశాలను ఉపయోగించుకోగలిగితే వ్యవసాయం లాభసాటిగా మారుతుంది. వారు అనుబంధ రంగాలపై దృష్టి సారించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.

న్యాయవ్యవస్థ పనితీరు సైతం ఆర్థిక రంగంపై ప్రభావం చూపుతుంది. న్యాయవ్యవస్థలో సంస్కరణలు ఊపందుకోవడం లేదు. వ్యాజ్యాలు లక్షల్లో పేరుకు పోతున్నాయి. దీని ప్రభావం సులభతర వ్యాపారంపైనా పడుతోంది. స్థూల జాతీయోత్పత్తి వృద్ధికి అవకాశమున్నది రక్షణ రంగం. ఈ రంగంలో ఇటీవలే సంస్కరణలు మొదలయ్యాయి. విస్తారమైన అవకాశాలున్న రంగమిది. వాస్తవానికి దేశ అవసరాలకు ప్రస్తుత పెట్టుబడులు సరిపోవు. ఉదాహరణకు మనకు విమాన వాహక నౌక ఒక్కటే ఉంది. అదే అమెరికాలో డజన్లకొద్దీ ఉన్నాయి. చైనా చాలా వేగంగా విమాన వాహక నౌకలు నిర్మించుకుంటోంది. మున్ముందు ఇవి రక్షణలో కీలకం కాబోతున్నాయి. మనకున్న సమస్యల్లా వనరులు. అందుకే ఇటీవల వైమానిక రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అవకాశం కల్పించారు. ఈ రంగంలో ఎగుమతికి సైతం పుష్కలంగా అవకాశాలున్నాయి. గత సంవత్సరమే ఎగుమతుల్లో గణనీయమైన పురోగతి కనిపించింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే అవి రెట్టింపయ్యాయి.

అభివృద్ధికే ప్రథమ ప్రాధాన్యం
విద్యారంగంపైనా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. దీన్ని భవిష్యత్తు సంపదగా పరిగణించాలి. ఇటీవలే నూతన విద్యావిధానం ముసాయిదాను విడుదల చేశారు. స్థూలంగా ఇది బాగానే ఉంది. లక్ష్య సాధనలో కీలకమైనది వనరుల సమీకరణ. వనరులు సమకూర్చుకోగలిగితేనే ఏదైనా సాధించగలం. ప్రజాకర్షక విధానాలకు లభించినంత ప్రాధాన్యం అభివృద్ధికి లభించడం లేదు. ప్రభుత్వాలు ఇటీవలి కాలంలో అదనపు వనరులు సమీకరించలేక బడ్జెటేతర విధానం వైపు మొగ్గుచూపుతున్నాయి. ఇవి రకరకాలుగా ఉంటున్నాయి. గతంలో ఆయిల్‌ బాండ్లు, ఎరువుల బాండ్లు, ఎఫ్‌సీఐ బాండ్ల రూపేణా ఉండేవి. తరవాత చిన్న పొదుపు పథకాలపై రుణాలతో వనరులు సమీకరిస్తున్నారు. ద్రవ్యలోటు లక్ష్యాలు నెరవేరడం కోసం ప్రభుత్వ రంగానికి ఇవ్వాల్సిన నిధులు వాయిదా వేస్తున్నారు. ఇలా చెప్పుకొంటూపోతే బడ్జెటేతర పద్ధతుల్ని ఉపయోగించి ప్రభుత్వాలు మసిపూసి మారేడు చేస్తున్నాయి. వాస్తవ పరిస్థితిని మరుగు పరుస్తున్నాయి. అదనపు వనరుల్ని సమీకరించకుండా లక్ష్యాలను ఏ విధంగా చేరుకుంటారో అర్థం కావడం లేదు. కేంద్ర బడ్జెట్‌లో నాలుగోవంతు మొత్తం, తీసుకున్న రుణాలు చెల్లించడానికే సరిపోతోంది. ఈ పరిస్థితి మారాలి. ఇప్పటికైనా ఈ బడ్జెట్‌ నుంచే అదనపు వనరులు సమీకరించే చర్యలు చేపట్టాలి. అప్పుడే అభివృద్ధికి నిధులు అందుబాటులోకి వస్తాయి. ప్రజాకర్షక, సంక్షేమ పథకాలకు మాత్రమే వనరులు వినియోగిస్తే అభివృద్ధి సాధ్యం కాదు. ప్రభుత్వం ప్రకటిత లక్ష్యాలకు అనుగుణంగా సాహసోపేత నిర్ణయాలు తీసుకోగలిగితే- వచ్చే అయిదేళ్లలో అయిదు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు చేరుకోగలడం సాధ్యం కాగలదు. ఎన్ని సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నా ఒక్కోసారి పరిస్థితులు అనుకూలించవు. ఉదాహరణకు ఇప్పుడున్న డాలరు, రూపాయి మారకపు రేటులో బాగా మార్పులొచ్చి రూపాయి విలువ పడిపోతే ఎనిమిది శాతం వృద్ధిరేటూ సరిపోదు. అదే రూపాయి విలువ పెరిగితే మన వృద్ధిరేటు ఎనిమిది శాతానికి తగ్గినా అయిదు ట్రిలియన్‌ డాలర్ల జీడీపీ సాధన సాధ్యమవుతుంది. ముడిచమురు ధర ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. దీని ధరవరల్లో మార్పులు వృద్ధిరేటుపై ప్రభావం చూపుతాయి. ఇలాంటి సవాళ్లను అధిగమిస్తేనే నిర్దేశిత లక్ష్యాలను సాధించగలం!


Posted on 23-06-2019