Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఆర్థిక రంగం

ఆర్థిక రంగం మందగమనం... భవిష్యత్‌ ఆశాజనకం

* క్రమేపీ తగ్గుతున్న జీడీపీ వృద్ధిరేటు
* సేద్యం సహా కీలక రంగాల్లో క్షీణత
* మరింత వేగంగా సంస్కరణలు
* మోదీ సర్కారు ముందు బృహత్తర సవాలు

స్థూల దేశీయోత్పత్తి వృద్ధిరేటు క్రమంగా మందగిస్తోంది. గడచిన ఆర్థిక సంవత్సరం (2018-19) నాలుగో త్రైమాసిక స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు గత అయిదేళ్ల కనిష్ఠ స్థాయికి (5.8 శాతం) దిగజారడం ఒకింత ఆందోళన కలిగిస్తోంది. గత ఆర్థిక సంవత్సర తొలి త్రైమాసికంలో ఎనిమిది శాతం వృద్ధిరేటు నమోదైంది. రెండో త్రైమాసికంలో ఏడు శాతానికి, మూడో త్రైమాసికంలో 6.6 శాతానికి, నాలుగో త్రైమాసికంలో 5.8 శాతానికి క్షీణించింది. మొత్తంమీద గత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధిరేటు 6.8 శాతానికి తగ్గింది. భారత జీడీపీ వృద్ధిరేటుపై గతంలో పలు అంతర్జాతీయ సంస్థలు రూపొందించిన అంచనాలకు ఇది విరుద్ధంగా ఉంది. గతంలో అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎమ్‌ఎఫ్‌), ఆసియా అభివృద్ధి బ్యాంక్‌ (ఏడీబీ), ప్రపంచ బ్యాంకు 2018-19 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధిరేటు 7.3 శాతంగా ఉంటుందని అంచనా వేశాయి. వృద్ధిరేటు 6.8 శాతానికి పడిపోవడంతో 2019-20 ఆర్థిక సంవత్సరాంతానికి భారత్‌ ప్రపంచంలో అయిదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందన్న బ్యాంక్‌ ఆఫ్‌ మెరిల్‌ లించ్‌ అంచనా తారుమారయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. నీతి ఆయోగ్‌ నివేదిక ప్రకారం భారత్‌ను 2022 నాటికి నాలుగు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనే లక్ష్యం నెరవేరడం ప్రశ్నార్థకమే. వ్యవసాయ, తయారీ రంగాలతోపాటు పలు కీలక రంగాల్లో వృద్ధిరేటు క్షీణించింది. మరోవైపు నిరుద్యోగం 45 ఏళ్ల గరిష్ఠానికి చేరడం, ప్రైవేటు పెట్టుబడులు తగ్గడం వంటివాటితోపాటు బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ(ఎన్‌బీఎఫ్‌సీ)ల వరస వైఫల్యాలు, ప్రభుత్వ రంగ బ్యాంకు(పీఎస్‌బీ)ల మొండి బకాయిల సమస్యలు- రెండోసారి పగ్గాలు చేపట్టిన మోదీకి స్వాగతం పలుకుతున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ 2022 నాటికి నాలుగు లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేరాలంటే జీడీపీ వృద్ధిరేటు కనీసం ఎనిమిది శాతమైనా ఉండాలి. ప్రస్తుత పరిస్థితులు అందుకు అనుకూలంగా లేవు. దాదాపు అన్ని కీలక రంగాలూ కుదేలై వృద్ధికి ఆమడదూరంలో ఉన్న కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధిరేటు ఏడు శాతానికి మించి ఉండే అవకాశం లేదు. జీడీపీ గణాంకాలను 2011-12 నుంచి 2016-17 మధ్యకాలంలో రెండు నుంచి అయిదు శాతం ఎక్కువ చేసి చూపారని మాజీ ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్‌ సుబ్రమణియన్‌ చేసిన వ్యాఖ్యలు మరోసారి దుమారాన్ని రేపాయి. క్షీణిస్తున్న జీడీపీ వృద్ధిరేటును గాడినపెట్టి, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కనీసం ఏడు శాతం వృద్ధిరేటు సాధించడమే మోదీ ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాలు. వృద్ధికి ఊతమిచ్చే దిశగా రిజర్వుబ్యాంకు ఈ ఏడాది ఇప్పటిదాకా మూడు దఫాలుగా పరపతి విధాన సమీక్షల్లో రెపోరేటును 5.75 శాతానికి తగ్గించడంతోపాటు, భవిష్యత్తులోనూ మరిన్ని కీలకరేట్ల తగ్గింపు ఉంటుందన్న సంకేతాల్నిచ్చింది. తక్కువ వడ్డీరేట్లు, ఆర్‌బీఐ అంచనా వేసిన నాలుగు శాతంకన్నా తక్కువ స్థాయి (3.05 శాతం)లో ఉన్న ద్రవ్యోల్బణం, అదుపులో (జీడీపీలో 3.39 శాతం) ఉన్న ద్రవ్యలోటు ఇవన్నీ జీడీపీ వృద్ధికి దోహదం చేసేవే. ప్రైవేటు పెట్టుబడుల తగ్గుదల, ఎఫ్‌డీఐ(విదేశీ ప్రత్యక్ష పెట్టుబడు)ల కుంగుదల జీడీపీ వృద్ధికి విఘాతం కలిగిస్తున్నాయి.

బయటపడని బ్యాంకింగ్‌ రంగం
దేశానికి జీవనాడి అయిన వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో ఉంది. జీడీపీలో దాదాపు 17 శాతం వాటా కలిగిన వ్యవసాయ రంగం కోలుకోవడానికి మోదీ ప్రభుత్వం పలు చర్యలు చేపట్టినప్పటికీ, మందగమనం కొనసాగుతునే ఉంది. కీలకమైన తయారీ, విద్యుత్‌ రంగాలదీ అదే పరిస్థితి. దేశ బ్యాంకింగ్‌ రంగం నిరర్థక ఆస్తుల భారంతో తల్లడిల్లుతోంది. ముఖ్యంగా ప్రభుత్వరంగ బ్యాంకు (పీఎస్‌బీ)ల ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉంది. ఈ బ్యాంకుల మొండి బాకీలు గత ఆర్థిక సంవత్సరంలో స్వల్పంగా తగ్గినప్పటికీ, చాలా బ్యాంకులు నేటికీ సంక్షోభంలోనే ఉన్నాయి. ఇటీవల ఆరు బ్యాంకులు సత్వర దిద్దుబాటు చర్య (పీసీఏ) పరిధి నుంచి బయటపడటం కొంత ఊరట కలిగించినప్పటికీ, ఇంకా అయిదు బ్యాంకులు పీసీఏ పరిధిలోనే కొనసాగడం ఆందోళనకరమే. పీఎస్‌బీలను బాసెల్‌-3 నిబంధనలకు అనుగుణంగా తీర్చిదిద్ది, వాటి రుణవితరణ సామర్థ్యాన్ని పెంచే క్రమంలో ప్రభుత్వం ఈ బ్యాంకులకు ఎప్పటికప్పుడు అవసరమైన మూలధనాన్ని సమకూరుస్తోంది. గడచిన ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం పీఎస్‌బీలకు రూ.1,06,000 కోట్ల మేర మూలధనాన్ని అందించింది. అయినా, కొన్ని బ్యాంకులు వాటి రుణవితరణ సామర్థ్యాన్ని పెంచుకోలేక, మొండి బకాయిల భారాన్ని తగ్గించుకోలేక నష్టాలపాలవుతున్నాయి. మరోవైపు బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ(ఎన్‌బీఎఫ్‌సీ)లు ఒక్కొక్కటిగా సంక్షోభంలో చిక్కుకొని మదుపరుల విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నాయి. కార్పొరేట్‌ రంగంలో కలకలం సృష్టిస్తున్నాయి. ప్రభుత్వానికి, రిజర్వు బ్యాంకుకు కొత్త సవాళ్లను విసరుతున్నాయి. గత ఏడాది ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ సంస్థ వైఫల్యంతో మొదలైన సంక్షోభం తీవ్రరూపం దాల్చింది. అదే బాటలో ఇటీవల దీవాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ (డీహెచ్‌ఎఫ్‌ఎల్‌) సంస్థా చెల్లింపులు చేయలేక సంక్షోభంలో చిక్కుకొంది. దేశంలో ఎన్‌బీఎఫ్‌సీల సంక్షోభం మరింత విస్తరించి, మార్కెట్లలో మరో ఆర్థిక ఉత్పాతం సంభవించే ప్రమాదం పొంచి ఉంది. ఈ పరిణామాలన్నీ దేశ ఆర్థికవ్యవస్థపై, వృద్ధిరేటుపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. కొన్ని అంతర్జాతీయ పరిణామాలు సైతం ప్రభావం కనబరచనున్నాయి. అమెరికా, చైనాల వాణిజ్య యుద్ధం- ప్రపంచంలో పలు దేశాల ఆర్థిక వ్యవస్థలకు చేటుచేసే స్థాయికి చేరింది. ఈ పరిణామాలను తక్కువగా అంచనా వేయడం సరికాదు. అమెరికా-భారత్‌ మధ్య కొంతకాలంగా కొనసాగుతున్న సుంకాల యుద్ధం భవిష్యత్తులో ఏ రూపం దాలుస్తుందోనన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. చైనా-అమెరికా వాణిజ్య యుద్ధం ద్వారా అందివచ్చిన అవకాశాన్ని భారత్‌ సద్వినియోగం చేసుకోవాలి. ఇరాన్‌పై కయ్యానికి కాలుదువ్వుతూ గల్ఫ్‌లో యుద్ధవాతావరణాన్ని సృష్టించిన అగ్రరాజ్యం మరింత దూకుడుగా వెళ్ళే ప్రమాదం ఉంది. అదే జరిగితే ముడిచమురు ధరలు మళ్ళీ భగ్గుమంటాయి. ప్రస్తుతం ఉన్న 62 డాలర్ల నుంచి అది ఏ మాత్రం పెరిగినా, ఆ ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై పడుతుంది. వృద్ధిరేటు అంచనాలు వాస్తవరూపం దాల్చాలంటే వరుణుడు కూడా కరుణించాలి. లేకుంటే వ్యవసాయ రంగం మరింత సంక్షోభంలోకి జారిపోతుంది.

రావాల్సిన మార్పులెన్నో...
అద్భుత విజయాలతో వరసగా రెండోసారి అధికారం చేపట్టిన మోదీ ప్రభుత్వం దేశీయంగా, అంతర్జాతీయంగా వస్తున్న సవాళ్లను సమర్థంగా ఎదుర్కొంటూ వృద్ధిరేటును పెంచాలంటే, పెద్దయెత్తున ఆర్థిక సంస్కరణలను కొనసాగించాల్సిన అవసరం ఉంది. గత అయిదేళ్లలో పలురంగాల్లో చేపట్టిన సంస్కరణలు కొంతమేర సత్ఫలితాలు ఇచ్చినప్పటికీ, కొన్ని రంగాల్లో మరింత వేగవంతంగా వాటిని అమలు చేయాలి. ముఖ్యంగా కీలక సంస్కరణలు చేపట్టి, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలి. 2022 నాటికి అన్నదాత ఆదాయం రెట్టింపు కావాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరాలంటే వ్యవసాయ రంగంలో సమూల మార్పులు తీసుకురావలసిన అవసరం ఉంది. మౌలికరంగంలో పెట్టుబడులు పెరిగే దిశగా తక్షణ చర్యలు చేపట్టాలి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడు(ఎఫ్‌డీఏ)లను ఆకర్షించే రీతిలో ప్రభుత్వం మరిన్ని విధానపరమైన సంస్కరణలు చేపట్టాలి. ఎఫ్‌డీఏలను ఆకర్షించడంలో సుస్థిర ప్రభుత్వం, సరళీకృత పన్నుల విధానం, మౌలిక వసతులు, అనుకూలమైన కార్మిక చట్టాలు కీలక పాత్రపోషిస్తాయి. పన్నుల విధానాన్ని మరింత సరళీకృతం చేసే దిశగా అడుగులు పడాలి. వృద్ధిరేటు పెరగాలంటే ప్రైవేటు పెట్టుబడులు ఎంతో కీలకం. కొంతకాలంగా దేశంలో ప్రైవేటు పెట్టుబడులు ఆశించినంతగా రాకపోవడం కలవరపెడుతోంది. సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (సీఎమ్‌ఐఈ) గణాంకాల ప్రకారం గడచిన త్రైమాసికం (2019 జనవరి-మార్చి)లో ప్రైవేటు రంగంలో కొత్త ప్రాజెక్టుల స్థాపనలో 25 శాతం తగ్గుదల నమోదైంది. ఈ రంగంలో పలు కారణాలవల్ల అసంపూర్ణంగా మిగిలిపోయిన భారీ ప్రాజెక్టులు 25 శాతానికిపైగా పెరిగాయి. 2014లో నరేంద్ర మోదీ తలపెట్టిన ‘భారత్‌లో తయారీ’ కార్యక్రమంలో భాగంగా విదేశీ పెట్టుబడులను ఆకర్షించే దిశగా చర్యలు చేపట్టాలి. ఆర్థికరంగంలోనూ సంస్కరణలను వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది. పీఎస్‌బీల మొండిబకాయిలను తగ్గించేందుకు, ఆ బ్యాంకుల్లో ‘కార్పొరేట్‌ గవర్నెన్స్‌’ మెరుగుపడేందుకు చర్యలు తీసుకోవాలి. పీఎస్‌బీల మధ్య రెండో విడత విలీన ప్రక్రియను వేగవంతం చేయడంతోపాటు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అవసరమైన దాదాపు రూ.40 వేలకోట్ల మూలధనాన్ని సమకూర్చాలి. ఎన్‌బీఎఫ్‌సీల సంక్షోభాన్ని నిలువరించేందుకు అవసరమైన చర్యలను అటు ప్రభుత్వం, ఇటు ఆర్‌బీఐ సమష్టిగా చేపట్టాలి. దేశ ఆర్థికవ్యవస్థను తిరిగి వృద్ధిబాట పట్టించేందుకు సంస్కరణలను వేగవంతం చేయడమే- అఖండ విజయంతో రెండోసారి అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాలు!


Posted on 26-06-2019