Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఆర్థిక రంగం

అపసవ్య విధానాలతో అస్తవ్యస్తం

* ప్రభుత్వరంగ సంస్థలు - పనితీరు

‘ప్రభుత్వ రంగ సంస్థలు ప్రజాసేవల అవసరాల రీత్యా ఏర్పాటయ్యాయి. వాటి పరిధి క్రమేపీ విస్తరించాలి. లక్ష్యాలను సాధించే దిశగా అవి పనిచేయాలి. ప్రభుత్వాలు విశాల దృక్పథంతో వ్యవహరించాలి. దూరదృష్టితో వాటి అభ్యున్నతిని కాంక్షించాలి. లాభనష్టాలు కీలకమే. వాటివల్ల ప్రయోజనాలుండాలేగానీ అవి నిరర్ధకంగా మారకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి...’ దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థల (పబ్లిక్‌ సెక్టార్‌ యూనిట్లు)పై తాజా నివేదికలో ‘నీతి ఆయోగ్‌’ చేసిన వ్యాఖ్యలివి.

దేశవ్యాప్తంగా ప్రభుత్వరంగ సంస్థల పనితీరు, మనుగడపై విస్తృతస్థాయిలో చర్చ జరుగుతోంది. పెట్టుబడుల ఉపసంహరణ, మూసివేత, దివాలా సంస్థల పునరుద్ధరణ వంటి కోణాల్లో చర్చ కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఈ సంస్థలపై దృష్టి కేంద్రీకృతమైంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పునర్య్వవస్థీకరణ అనంతరం తొమ్మిది, పదో షెడ్యూలు కింద గల ఈ సంస్థల విభజన సంక్లిష్టంగా మారింది. పాలన వ్యవస్థలో అత్యంత కీలకమైన ప్రభుత్వ రంగ సంస్థల విభజనపై అయిదేళ్లుగా జాప్యం జరుగుతోంది. ఇది ఆయా సంస్థలతో పాటు ప్రభుత్వంపైనా ప్రభావం చూపింది. ప్రస్తుతం సామరస్య ధోరణిలో, ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేయడం ఆశాజనక పరిణామం. దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలను రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, రాష్ట్ర స్థాయి ప్రభుత్వ సంస్థలుగా వాటిని చూడాలి. పీఎస్‌యూగా మెజారిటీ వాటా (51శాతం అంతకంటే ఎక్కువ) ప్రభుత్వం యాజమాన్యంలో ఉండాలి. ఈ కోణంలో ఆలోచించి 1951లో భారతీయ టెలిఫోన్‌ సంస్థను మొదటగా స్థాపించారు. అదే సంవత్సరం మరో నాలుగింటిని ప్రారంభించారు. ఇప్పటి వరకు వాటి సంఖ్య 300కి చేరింది. రెండో పంచవర్ష ప్రణాళిక (1956-60), 1956 పారిశ్రామిక విధాన తీర్మానం ప్రభుత్వ రంగ సంస్థల అవసరాన్ని నొక్కి చెప్పాయి. కేంద్ర ప్రభుత్వ తరహాలోనే రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ రంగ సంస్థలను ఏర్పాటు చేశాయి.

ఆరంభంలో సత్ఫలితాలు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తొలి ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి కాలరీస్‌. తరవాత రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రారంభమైంది. 2014 వరకు 89 ప్రభుత్వ రంగ సంస్థలు, మరో 107 ప్రాధికార సంస్థలు, సంఘాలను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల ఏర్పాటు ఉన్నతాశయాలతో జరిగింది. ఆయా సంస్థలకు సమర్థులైన కార్యనిర్వాహక అధికారులను నియమించడం, అంకితభావం గల యంత్రాంగం అందుబాటులో ఉండటం వాటికి శుభారంభాన్ని ఇచ్చింది. ప్రభుత్వాల సంక్షేమ, అభివృద్ధి పథకాలు; ఉత్పత్తులు, క్రయవిక్రయాలు, ఒప్పందాల అమలు వీటి ద్వారానే జరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ కార్పొరేషన్‌, బీసీ, మైనారిటీ, దివ్యాంగుల కార్పొరేషన్‌ వంటివి ఆయా వర్గాల అభ్యున్నతికి కృషి చేశాయి. దళితులకు భూ పంపిణీ, ఉమ్మడి సేద్యం, కాలనీల నిర్మాణాల వంటివి నాలుగు దశాబ్దాల క్రితమే మొదలయ్యాయి. చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి సంస్థ, ఆగ్రోస్‌, జౌళి అభివృద్ధి సంస్థ వంటివి చిన్న తరహా ఉపాధికి సహాయం అందించాయి. బలహీన వర్గాల భూములకు నీటిపారుదల అభివృద్ధి సంస్థ నీటిపారుదల సౌకర్యాలను కల్పించింది. విత్తనాల పంపిణీలో విత్తనాభివృద్ధి సంస్థ సహకరించింది. సహకార నూనె గింజల ఉత్పత్తిదారుల సమాఖ్య విజయ బ్రాండ్‌ను విశ్వవ్యాప్తం చేసింది. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రజలకు ప్రయాణ సౌకర్యం కల్పిస్తోంది. పల్లెలకు, పట్టణాలకు ఇప్పటికీ ఇదే ప్రధాన రవాణా వనరుగా ఉంది. ఒడుదొడుకులను ఎదుర్కొంటూ బొగ్గు రంగంలో ముందుకు సాగి సింగరేణి కాలరీస్‌ చరిత్ర సృష్టించింది.

ఏయే లక్ష్యాలతో ప్రభుత్వరంగ సంస్థలను ప్రారంభించారో, అదే పంథాలో అవి సాగితే వందశాతం విజయవంతమయ్యేవి. కొన్ని అపసవ్య విధానాల వల్ల అవి దారి తప్పాయి. ప్రభుత్వాలు కొన్నింటికి ప్రాధాన్యం ఇచ్చి మిగిలిన వాటిని నిర్లక్ష్యం చేశాయి. ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రాధికార సంస్థలు రాజకీయ ప్రయోజనాలకు వేదికలయ్యాయి. తమ పార్టీ నేతలను ఈ సంస్థలకు ఛైర్మన్లుగా ప్రభుత్వాలు నియమించాయి. దానివల్ల రాజకీయ లక్ష్యాలను నెరవేర్చడానికి అవి సాధనాలుగా మారాయి. మొదట్లో ఐఏఎస్‌ అధికారుల నేతృత్వంలో ఇవి నడిచేవి. క్రమేపీ వాటిని రాష్ట్ర సర్వీసు అధికారులకు అప్పగించే విధానం మొదలయింది. రాజకీయ జోక్యాల వల్ల లబ్ధిదారుల ఎంపికలో పైరవీలు ప్రారంభమయ్యాయి. మరోవైపు ప్రభుత్వం వాటిని ఆదాయార్జన కోణంలో చూడటం ప్రమాదకరంగా పరిణమించింది. కొన్ని సంస్థల నుంచి ఆదాయం రావడం లేదని, సరైన పనులు లేవనే సాకుతో వాటిపై శ్రద్ధ పెట్టలేదు. నష్టాలను పరిగణనలోనికి తీసుకొని- కొన్ని సంస్థల మూసివేత దిశగా అడుగులు వేశారు. నిజాం సుగర్స్‌ సంస్థ ద్వారా తీవ్ర నష్టాలు వస్తున్నాయని, ఆ చక్కెర కర్మాగారాలను అతి తక్కువ ధరకు ప్రైవేటీకరించారు. రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి సంస్థ (ఐడీసీ), గృహ నిర్మాణ మండలి వంటి వాటిని నామమాత్రంగా మార్చారు. ఆర్టీసీపై అస్పష్ట ధోరణి కొనసాగుతోంది. విద్యుత్‌ సంస్థల నిర్వహణ నష్టాల్లో సాగుతున్నా అత్యవసర కేటగిరిలో ప్రాధాన్యం కోల్పోలేదు. పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (ఐఐసీ) వసతుల కల్పన కంటే భూముల క్రయవిక్రయాలు, కేటాయింపులకు కేంద్రంగా మారింది. కార్పొరేషన్ల పదవులు పొందిన నేతల్లో నిస్వార్థంగా సేవలందిస్తున్న నేతలు చాలా అరుదు. రాజకీయ, స్వప్రయోజనాల కోణంలోనే వారు పనిచేస్తున్నారు. పాలక మండళ్ల పరిస్థితీ ఇదే. రాజకీయాలకు తోడు పైరవీల కారణంగా పలు సంస్థల్లో అవినీతి తాండవిస్తోంది. రాష్ట్ర ఆర్థిక సంస్థ (ఎస్‌ఎఫ్‌సీ) ద్వారా మొదట్లో వివిధ సంస్థలకు అప్పులు ఇచ్చారు. సిఫార్సుల మేరకు ఇష్టారాజ్యంగా రుణ పంపిణీ జరిగింది. ఆ తరవాత చెల్లింపుల్లేవు. అప్పుల మాఫీ, ఆస్తుల జప్తులు, అమ్మకాల్లో అవినీతి తారస్థాయికి చేరాయి. మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో ఆ సంస్థ ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. నామమాత్రంగా మారింది.

పాలనపై ప్రభావం
ప్రభుత్వ విధానాలు ఆయా సంస్థల మనుగడకు ముప్పుగా మారాయి. ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల నియామకాలు ప్రమాణాల ప్రాతిపదికన జరగలేదనే కారణంతో తక్కువ వేతనాలు చెల్లిస్తున్నారు. వారికి పింఛను సౌకర్యం లేదు. ఉద్యోగులు పదవీ విరమణ చేస్తున్నా కొత్త నియామకాలు జరగడం లేదు. ప్రస్తుతం ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ రంగ సంస్థల్లో 60 శాతం మేరకు ఉద్యోగ ఖాళీలున్నాయి. బెవరేజెస్‌, ఖనిజాభివృద్ధి సంస్థ వంటి వాటిల్లో ముగ్గురి పనులను ఒక్కరే చేస్తున్నారు. ఆయా సంస్థల్లో కొత్త నియామకాల్లేవు. శాశ్వత ఉద్యోగులకు బదులు ఒప్పంద, పొరుగుసేవల సిబ్బందిని వాడుకుంటున్నారు. పరిపాలనపరమైన అవసరాల కోసం కొత్త కార్పొరేషన్లు ఏర్పాటవుతున్నా వాటికి అనుగుణంగా సిబ్బంది నియామకాలు లేవు. ప్రభుత్వరంగ సంస్థలకు సొంత భవనాలు, ఇతర మౌలిక వసతులను కల్పించడం లేదు. ఆ సంస్థలు 50 శాతం అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. ఏటా ‘కాగ్‌’ నివేదికల్లో ప్రభుత్వ రంగ సంస్థల దుస్థితిని ఎత్తి చూపుతున్నా- వాటిని ఆదుకునేందుకు ప్రభుత్వాలు అడుగు ముందుకు వేయకపోవడం ఆందోళన కలిగిస్తోంది.

ప్రభుత్వరంగ సంస్థల మూసివేత లేదా ప్రైవేటీకరణ వంటి ప్రతిపాదనలను ప్రభుత్వ వైఫల్యాలుగానే పరిగణించాలి. ఆయా సంస్థల్లోని ఉద్యోగులు, అధికారులు సైతం పోటీ పరిస్థితులను గుర్తించి, ఆ దిశగా పనితీరును మెరుగుపరచుకునేందుకు కృషి చేయాలి. ప్రభుత్వ రంగ సంస్థల్లో సంస్కరణలు వాటి ప్రగతికి దోహదపడాలి. ఇందుకు ప్రభుత్వాలే మార్గనిర్దేశం చేయాలి. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వస్థాయిలో ప్రభుత్వ రంగ సంస్థల నిర్వహణ అధ్వానంగా మారింది. అతి తక్కువ సంస్థలే మహారత్న, నవరత్న, మినీరత్న హోదాలు పొందాయి. కేంద్రంలో పరిస్థితులు ఎలా ఉన్నా- తెలుగు రాష్ట్రాల్లోని అన్ని సంస్థలను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లాలి. సేవ, సానుకూల దృక్పథమే ప్రామాణికంగా ముందుకు కదలాలి. సింగరేణి కాలరీస్‌ వంటి సంస్థలు కొంగుబంగారంగా మారడం వెనక కార్మికుల శ్రమశక్తి దాగి ఉంది. దీనికితోడు ప్రభుత్వాలు కనబరచిన కార్యనిర్వాహక నైపుణ్యాలు అక్కరకొచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను అత్యుత్తమ స్థాయికి తీసుకువచ్చేందుకు పాలకులు కంకణబద్ధం కావాలి!

తెలుగు రాష్ట్రాల్లో సంక్లిష్టం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం 2014లో రెండుగా విడిపోయిన తరవాత తొమ్మిది, పదో షెడ్యూలు పరిధిలోగల ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రాధికార సంస్థల విభజన సంక్లిష్టంగా మారింది. ఇందుకు ప్రభుత్వాలతో పాటు ఆయా సంస్థల పాలకమండళ్లు, అధికారుల ధోరణే కారణం. విభజన ప్రక్రియలో జాప్యం సైతం కొంత మేరకు అక్రమాలకు ఆస్కారం ఇచ్చింది. తమకు అనుకూలమైన చోట‌ ఉద్యోగాల్లో కొనసాగించాలని కొందరు ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. దాదాపు అయిదేళ్ల పాటు సంస్థల విభజన జరగకపోవడం వల్ల ఆయా సంస్థల్లో సమస్యలు పేరుకుపోయాయి. ఇప్పుడు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్‌, జగన్‌ స్నేహభావంతో ముందుకొచ్చారు. విభజన సానుకూలంగా జరగడం ఖాయమని తేలింది. విభజన జరిగితే సంస్థలకు సంబంధించిన ప్రధాన సమస్య తీరినట్లే. ఆ తరవాత వాటి పాలనపై పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించవచ్చు. ప్రభుత్వ రంగ సంస్థలను పటిష్ఠంగా మార్చాలి. మొత్తం సంస్థలను ముఖ్యమంత్రుల స్థాయిలో సమీక్షించడం వల్ల మెరుగైన ఫలితాలు సమకూరుతాయి. వాటికి కావాల్సిన మౌలిక వసతులు, ఉద్యోగ నియామకాలపై దృష్టి సారించాలి. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే వారికీ వేతన, భత్యాలు చెల్లించాలి. పింఛను సౌకర్యం కల్పించాలి. వాటిలో అవినీతిని పూర్తిగా నిర్మూలించడం తక్షణావసరం. రాజకీయ జోక్యం పరిహరించేందుకు చొరవ చూపాలి. పాలక మండళ్ల నియామకాలు అనివార్యమయితే నీతి, నిజాయతీ ప్రామాణికంగా ఎంపికలు చేయాలి.


- ఆకారపు మల్లేశం
Posted on 29-06-2019