Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఆర్థిక రంగం

చిన్న పరిశ్రమలే పెద్దదిక్కు

* దేశార్థికానికి ఆయువుపట్టు
* కష్టనష్టాలు పట్టని పాలకులు
* ఏళ్ల తరబడి ఉదాసీనవైఖరి
* కేంద్ర బడ్జెట్‌లో ఈసారైనా ప్రాధాన్యం దక్కేనా?

రెండో ప్రపంచ యుద్ధంలో తీవ్రంగా నష్టపోయిన దేశం జపాన్‌. అమెరికా విసిరిన అణు బాంబులతో ఆ దేశం సర్వనాశనమైంది. తరవాత మూడు దశాబ్దాలకే బలమైన ఆర్థిక శక్తిగా ఎదిగింది. జౌళి, ఎలక్ట్రానిక్స్‌, ఆటోమొబైల్‌ రంగాల్లో తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శించింది. చిన్న, మధ్య తరహా పరిశ్రమల రంగాల్లో రాణింపే అందుకు ప్రధాన కారణం. ఆసియా పులులుగా ప్రసిద్ధిగాంచిన కొరియా, తైవాన్‌, మలేసియా తదితర దేశాల ప్రగతిలోనూ చిన్న, మధ్యతరహా పరిశ్రమలదే ప్రధాన పాత్ర. పొరుగున చైనా మూడు దశాబ్దాల్లో అగ్రరాజ్యానికి సవాలు విసిరేలా సుసంపన్నంగా మారడంలోనూ చిన్న పరిశ్రమలదే క్రియాశీల భూమిక. సత్వర పారిశ్రామికాభివృద్ధి సాధన అన్నది కొన్ని భారీ పరిశ్రమలు, అగ్రశ్రేణి వ్యాపార సంస్థలతోనే సాధ్యం కాదు. అందుకు చిన్న, మధ్యతరహా పరిశ్రమల భాగస్వామ్యం ఎంతో ముఖ్యం. దురదృష్టవశాత్తూ మనదేశంలో ఇటువంటి సానుకూలత కనిపించడం లేదు. ప్రపంచంలో బలమైన ఆర్థిక శక్తిగా మారాలని, సత్వరం అయిదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని కలలు కంటున్న దేశం అందుకు దీటైన వ్యూహాలు అమలు చేయడం లేదు. ముఖ్యంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను (ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ) పునరుత్తేజితం చేసే ప్రయత్నాలు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. మనదేశంలో ఆర్థికవేత్తలు, విధాన నిర్ణేతలు చిన్న పరిశ్రమల ప్రాధాన్యాన్ని గుర్తించడం లేదని కాదు. కానీ, లోటుపాట్లు సరిదిద్ది ఆశించిన ప్రయోజనాలు రాబట్టడంలో వైఫల్యాలే ఆందోళనకరం. మలి దఫా ఎన్డీయే ప్రభుత్వంలో ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ వ్యవహారాల శాఖ నితిన్‌ గడ్కరీకి లభించింది. వ్యాపార నేపథ్యం ఉన్న ఆయన వెన్వెంటనే ఈ రంగం ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి సారించారు. చిన్న, పెద్ద పరిశ్రమల మధ్య పెద్ద అగాధం ఉన్నట్లు గుర్తించారు. రెండింటినీ అనుసంధానం చేస్తే కొంతమేర ప్రయోజనాలు రాబట్టవచ్చనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా ప్రయోజన కేంద్రాలు (ఫెసిలిటేషన్‌ సెంటర్స్‌) నెలకొల్పాలని నిర్ణయించారు. వీటిద్వారా ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ రంగం ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించడమే కాకుండా వాటిని బలోపేతం చేసేందుకు వీలుందని భావిస్తున్నారు. ఇది మంచి ప్రయత్నమే కానీ, ఎన్నో ఏళ్లుగా ఈ రంగాన్ని పట్టిపీడిస్తున్న ప్రాథమికమైన సమస్యలకు పరిష్కారం చూపగలిగితేనే శాశ్వత ప్రయోజనాలు లభిస్తాయి.

రుణ లభ్యత ప్రధాన సమస్య
తాజా లెక్కల ప్రకారం మనదేశంలో దాదాపు 6.5 కోట్ల సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఉన్నాయి. ఈ సంస్థల ద్వారా 12 కోట్లమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ రంగం వాటా స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 29 శాతం. కొన్నేళ్లుగా ఇది స్థిరంగా అక్కడే ఉండిపోయింది. రాష్ట్రాలవారీగా చూస్తే ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ సంస్థల సంఖ్య బిహార్‌, ఉత్తర్‌ ప్రదేశ్‌ రాష్ట్రాల్లో అధికంగా ఉంది. తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు తరవాతి స్థానాల్లో ఉన్నాయి. ఒకవైపు కొత్తగా ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ పరిశ్రమలు ఏర్పాటవుతున్నప్పటికీ, ఖాయిలా పడుతున్న సంస్థల సంఖ్యా అదే క్రమంలో అధికమవుతోంది. రిజర్వు బ్యాంకు గణాంకాల ప్రకారమే దేశవ్యాప్తంగా 4,86,291 సూక్ష్మ, చిన్న, మధ్యతరహా యూనిట్లు మూతపడ్డాయి. ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర, గుజరాత్‌, తమిళనాడు రాష్ట్రాల్లో ఇవి ఎక్కువగా ఉన్నాయి. అందువల్లే ఈ రంగంలో ఉద్యోగాల సంఖ్య, సంపద సృష్టి వంటివి ఆశించిన స్థాయిలో ఉండటం లేదు. 2013-14లో ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ రంగం 9.1 శాతం వార్షిక వృద్ధి సాధించింది. 2015-16 నాటికి అది 7.62 శాతానికి పడిపోయింది. ఆపై ఏటా ఆరు శాతానికి మించి వృద్ధి నమోదు కావడం లేదు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఆయా సంస్థలు తయారు చేసే ఉత్పత్తులకు తగిన గిరాకీ లేకపోవడం, విద్యుత్‌ కొరత, నిర్వహణ మూలధన లభ్యత కొరవడటం, ముడిపదార్థాల లేమి, కార్మిక సమస్యలు, యాజమాన్యపరమైన ఇబ్బందులు, యంత్రసామగ్రి లేకపోవటం కొన్ని కారణాలు. ప్రధానంగా మూలధనం, నిర్వహణ నిధుల లభ్యత లేకపోవడం ఈ రంగం పాలిట శాపమవుతోంది. స్టాక్‌మార్కెట్ల ద్వారా మూలధన సమీకరణకు అవకాశాలు దాదాపు లేవనే చెప్పాలి. మరోవైపు బ్యాంకుల నుంచి రుణ లభ్యతా అంతంతమాత్రంగానే ఉంది. బ్యాంకుల నుంచి ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ రంగానికి నిధుల లభ్యత వాటి అవసరాల్లో 16 శాతం వరకే ఉంటోంది. దాదాపు 80 శాతం పరిశ్రమలకు బ్యాంకు రుణాలు లభించడం లేదు. ముఖ్యంగా సూక్ష్మ పరిశ్రమలకు బ్యాంకు రుణాలు వచ్చే పరిస్థితే లేదు. ఇంటర్నేషనల్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (ఐఎఫ్‌సీ) ఇటీవల నిర్వహించిన అధ్యయనం ప్రకారం మనదేశంలో ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలకు రూ.16.66 లక్షల కోట్ల మేరకు రుణ అవసరాలు ఉన్నట్లు తేలింది. 2.60 లక్షల కోట్ల డాలర్ల జీడీపీ ఉన్న భారత్‌కు ఈ సొమ్ము ఎంతో ఎక్కువ మొత్తమేనని ఐఎఫ్‌సీ వర్గాలు తమ నివేదికలో విశ్లేషించాయి. 2012నాటి ఈ అధ్యయనంలో మనదేశంలో ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ రంగానికి ఉన్న రుణ అవసరాలు 20 వేలకోట్ల డాలర్లని తేలింది. అయిదేళ్ల తరవాత అది తీరకపోగా ఇంకా ఎక్కువ అప్పులు కావలసిన పరిస్థితి ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ రంగంలో కనిపిస్తోంది. ఈ రుణ అవసరాలు తీర్చడానికి ఉద్దేశించిన పథకాలు దేశంలో ఎన్నో ఉన్నాయి. ప్రధానమంత్రి ఉపాధి హామీ పథకం, ముద్ర, సంప్రదాయ పరిశ్రమల పునరుత్తేజిత నిధి (స్ఫూర్తి), కాయిర్‌ బోర్డు పథకాలు, సూక్ష్మ, చిన్న పరిశ్రమల రుణ హామీ పథకం (సీజీటీఎమ్‌ఎస్‌ఈ), రుణ ఆధారిత మూలధన సబ్సిడీ పథకం వంటివి ఇందులో ఉన్నాయి. ఈ పథకాలకు నిధుల కేటాయింపులు తగినంతగా లేకపోవడం పెద్దలోపం. కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వం వీటికి అధికంగా నిధులు కేటాయించాలని ఆలోచిస్తోంది. ఎన్నో రకాల కష్టాల్లో ఉన్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను పెద్దనోట్ల రద్దు, జీఎస్‌టీ అమలు నిర్ణయాలు మరింత దెబ్బతీశాయి. సూక్ష్మ, చిన్న పరిశ్రమలు తాత్కాలిక రుణ అవసరాలకు అసంఘటిత రంగం మీద, చేతి రుణాల మీద ఎక్కువగా ఆధారపడతాయి. పెద్ద నోట్ల రద్దుతో నగదు లభ్యత క్షీణించి, అప్పులు దొరక్క ఈ సంస్థలు బాగా ఇబ్బంది పడ్డాయి. ఈ నష్టాన్ని భర్తీ చేయడానికి రూ.5,000 కోట్లతో ‘స్ట్రెస్డ్‌ అస్సెట్‌ ఫండ్‌’ ఏర్పాటు చేయాలని సెబీ మాజీ ఛైర్మన్‌ యూకే సిన్హా సారథ్యంలోని ఆర్‌బీఐ కమిటీ సిఫార్సు చేసింది. ఎస్‌ఎమ్‌ఈ ఛాంబర్‌ ఆఫ్‌ ఇండియా పాలకవర్గాల కథనం ప్రకారం దేశంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల రంగాన్ని బలోపేతం చేయాలంటే రూ.20,000 కోట్ల నిధి అవసరం. అది కూడా చాలదని కొందరు నిపుణులు భావిస్తున్నారు. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోలేకపోవడం చిన్న పరిశ్రమలు ఎదుర్కొంటున్న మరొక ముఖ్యమైన సమస్య. తగినంత మార్కెటింగ్‌ సత్తా కొరవడటమూ సవాలుగా ఉంది. చిన్న సంస్థలు సొంతంగా పరిశోధనలు చేయలేవు. అందుకు అవసరమైన నిధులు, మానవ వనరులు వాటికి ఉండవు. మనదేశంలో ప్రభుత్వరంగంలో ఎన్నో పరిశోధన కేంద్రాలు ఉన్నాయి. అవి చేసే ప్రయోగాల ఫలితాలు ఈ సంస్థలకు అందడం లేదు. పరిశోధన సంస్థలను, ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలకు అనుసంధానం చేస్తూ నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేసే ఏర్పాటు మనదేశంలో కనిపించదు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్‌, వైద్య ఉపకరణాలు, సెల్‌ఫోన్ల తయారీలో చిన్న చిన్న విడిభాగాలు తయారు చేయడం సూక్ష్మ, చిన్న పరిశ్రమలకే అనుకూలం. ఈ రంగాల్లో వస్తున్న నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేసే దేశీయ తయారీని పెంచడానికి ఎంతో అవకాశం ఉంది. మరోపక్క మార్కెటింగ్‌ సదుపాయాన్ని పెంపొందించే చర్యలపై దృష్టి సారించాల్సి ఉంది. మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో సైతం ఇక్కడి చిన్న యూనిట్లు తమ వస్తు, సేవలను విక్రయించేందుకు వీలుకల్పించే వేదికను సృష్టించాలి. చైనాలో చిన్న, మధ్యతరహా సంస్థలు ఎన్నో ఉత్పత్తులను ఇదే తరహాలో ప్రపంచవ్యాప్తంగా విక్రయిస్తున్నాయి. ‘ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ ఈ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌’ను ఏర్పాటు చేయాలనే ఆలోచన ఇటీవల కేంద్ర ప్రభుత్వ అధికారవర్గాలకు వచ్చింది. ఇటువంటి కొత్త ఆలోచనలు చేస్తేనే ఈ రంగానికి ఊతం లభిస్తుంది.

చేయూతనిస్తే బహుళ లాభాలు
సత్వర ఆర్థికాభివృద్ధి, ఆర్థిక లోటును అధిగమించడం, మౌలిక సదుపాయాల కల్పనకు తగినంతమేరకు నిధులు కేటాయించడం, విద్య వైద్య రంగాలను బలోపేతం చేయడం, నిరుద్యోగ సమస్యను పరిష్కరించడం... వంటివి దేశం ముందున్న ప్రధాన సమస్యలు. సార్వత్రిక ఎన్నికల అనంతరం కేంద్రంలో రెండోసారి అధికారాన్ని చేపట్టిన ఎన్డీయే ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌ రూపకల్పనలో తలమునకలుగా ఉంది. దేశ నిర్మాణం, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ రంగానికి ఎంతో ప్రాధాన్యం ఉందని గుర్తించి దానికి బడ్జెట్‌లో పెద్దపీట వేయాలి. ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపగలిగే సత్తా ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ రంగానికి ఉందనడంలో అతిశయోక్తి లేదు. నిరుద్యోగిత ఇప్పుడు దేశం ముందున్న అతిపెద్ద సవాలు. దానికి పరిష్కారం చూపగల సామర్థ్యం ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ పరిశ్రమలకే ఉందన్నది నిర్వివాదం. ప్రస్తుతం ఈ రంగంలో ఉద్యోగాల సంఖ్య 12 కోట్లు. వీటిని 15 కోట్లకు పెంచుకోవచ్చని ప్రభుత్వ వర్గాలే చెబుతున్నాయి. ఆర్థికాభివృద్ధిలోనూ ఈ రంగానిది కీలకమైన పాత్ర అనేది తెలిసిన విషయమే. అందుకే 2025 నాటికి అయిదు లక్షల కోట్ల డాలర్ల భారత ఆర్థిక వ్యవస్థలో ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ రంగం వాటా 50 శాతం ఉండాలనే లక్ష్యాన్ని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ నిర్దేశించారు. ఇది సాధ్యం కావాలంటే సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఎదుర్కొంటున్న సమస్యలను సత్వరమే పరిష్కరించి, అన్ని రకాలుగా ప్రోత్సహించే కార్యక్రమాలను కట్టుదిట్టంగా అమలు చేయాలి.- సుబ్బారావు గన్నవరపు
Posted on 03-07-2019