Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఆర్థిక రంగం

వృద్ధి-ఉద్యోగితలే రెండు కళ్లు

* కేంద్ర బడ్జెట్‌ - సర్కారు ముందున్న సవాళ్లు
* ఆశల పల్లకీలో అనేక వర్గాలు
* కష్టకాలంలో ఆర్థిక సంస్థలు
* తక్కువ వడ్డీకి రుణాల కోసం ఎదురు చూపులు
* ఉపాధి, ఉద్యోగాల కోసం యువత నిరీక్షణ
* పట్టాలకెక్కని గ్రామీణాభివృద్ధి

జాతీయంగా, అంతర్జాతీయంగా ప్రతికూల ఆర్థిక పవనాలు వీస్తున్న సమయంలో నరేంద్ర మోదీ నాయకత్వంలో ఎన్డీయే ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చింది. ఎన్డీయే ఆర్థిక సవాళ్లను అధిగమిస్తుందనే ఆశతో, అధిగమించాలనే ఆకాంక్షతో ఓటర్లు స్పష్టమైన మెజారిటీ కట్టబెట్టారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ రేపు పార్లమెంటుకు సమర్పించే బడ్జెట్‌ ఓటర్ల నమ్మకాన్ని నిలబెట్టాలంటే స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)ని, ఉపాధి అవకాశాలను పెంచడానికి సమర్థ చర్యలు ప్రతిపాదించాలి. 2016-17లో 8.2 శాతంగా ఉన్న జీడీపీ వృద్ధి రేటు 2017-18లో 7.2 శాతానికి, 2018-19లో 6.8 శాతానికి పడిపోయింది. నిజానికి గతేడాది చివరి త్రైమాసికంలో ఈ రేటు కేవలం 5.8 శాతం. గడచిన అయిదేళ్లలో ఇంత కనిష్ఠ రేటు ఎన్నడూ లేదు. ఇతరత్రా కూడా పరిస్థితి బాగా లేదు. కేంద్ర, రాష్ట్రాల ఆర్థిక లోటు జీడీపీలో ఏడు శాతానికి చేరుకోగా, వాణిజ్య లోటు (కరెంటు ఖాతా లోటు) 2.1 శాతమైంది. కార్పొరేట్‌, బ్యాంకింగ్‌ రంగాలూ తీవ్ర ఒడుదొడుకుల్లో ఉన్నాయి. అంతర్జాతీయంగానూ వృద్ధి మందగించడం వల్ల మన ఆర్థిక వ్యవస్థకు బయటి నుంచి ఊతం లభించడం కష్టమైపోతోంది. జీడీపీ వృద్ధిని మళ్ళీ పట్టాలకెక్కించడానికి, ఉపాధి అవకాశాలు విస్తరింపజేయడానికి అయిదేళ్ల ప్రణాళికతో ముందుకెళ్లాల్సి ఉంది. తాజా బడ్జెట్‌లో ఆర్థిక లోటును జీడీపీలో 3.4 శాతానికి పట్టి నిలపాలని ప్రభుత్వం ఆశిస్తున్నా, నిరుడు పన్నుల రాబడి తగ్గడం, ప్రభుత్వ రుణభారం పెరగడం అడ్డంకులుగా చూపవచ్చు. పన్ను వసూళ్లను పెంచి, మౌలిక వసతుల కల్పనపై పెట్టుబడులు పెంచడం ద్వారా ఆర్థిక లోటును అధిగమించాలి. లేదా రిజర్వు బ్యాంకు నిల్వల్లో కొంత భాగాన్ని ఇందుకు ఉపయోగించాలి. అదీకాకుంటే ప్రభుత్వరంగ వాటాల ప్రైవేటీకరణ ద్వారా వచ్చే సొమ్ముతో ఆర్థిక లోటును కొంతైనా భర్తీ చేయాలి. ఇటీవలి కాలంలో పొదుపులు, పెట్టుబడులు తగ్గిపోగా వినియోగం మాత్రం పెరిగింది. అదే వృద్ధిరేటును కొంతైనా పెంచింది. కొత్త బడ్జెట్‌లో కుటుంబాల పొదుపు, కంపెనీల పెట్టుబడులను పెంచడానికి శ్రద్ధ చూపాలి.

పన్ను రేట్ల తగ్గింపు ఆశలు
బడ్జెట్‌లో పన్ను రేట్లను తగ్గిస్తారని మధ్యతరగతి వర్గం, కార్పొరేట్‌ రంగం ఆశగా ఎదురుచూస్తున్నాయి. కార్పొరేట్‌ పన్నును 25 శాతానికి తగ్గించాలని కంపెనీలు కోరుతుంటే, పన్ను మినహాయింపు పరిమితిని పెంచుతారని మధ్యతరగతి వర్గం ఆకాంక్షిస్తోంది. ఈ రెండు పనులు చేస్తే జనం చేతిలో డబ్బు ఆడి వినియోగం ఎక్కువవుతుంది. కంపెనీల చేతిలో డబ్బు మిగిలి కొత్త పెట్టుబడులు పెడతాయి. ద్రవ్యవిధానానికి వస్తే ఈ ఏడాది రిజర్వు బ్యాంకు వడ్డీ రేటును 0.75 శాతం పాయింట్లు తగ్గించినా బ్యాంకులు, ఫైనాన్స్‌ విపణులు ఈ ప్రయోజనాన్ని ఖాతాదారులకు బదిలీ చేయలేదు. రుణాలపై వడ్డీ రేట్లను ఇంకా తగ్గించలేదు. మరోవైపు ప్రభుత్వ రంగ బ్యాంకుల నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏలు) ఇప్పటికీ చాలా ఎక్కువగా ఉన్నాయి. బ్యాంకింగేతర ఫైనాన్స్‌ సంస్థల (ఎన్‌బీఎఫ్‌సీ) పరిస్థితీ ఏమీ బాగాలేదు. ప్రభుత్వరంగ బ్యాంకులకు అదనపు మూలధనాన్ని సమకూరిస్తే అవి తిరిగి కోలుకొంటాయి. ఎన్‌బీఎఫ్‌సీలను ఆదుకోవడానికీ చర్యలు తీసుకోవాలి. వినియోగదారుల నుంచి గిరాకీ పెరిగి, తక్కువ వడ్డీకి రుణాలు దొరికినట్లయితే కంపెనీలు మళ్ళీ లాభాల బాట పట్టగలుగుతాయి. ఎన్నికల ముందు అనిశ్చితి ఇప్పుడు తొలగిపోయి, జీఎస్టీ పన్నులపై గందరగోళమూ నెమ్మదించింది. పరిశ్రమలు తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింత మెరుగ్గా ఉపయోగించుకుని, పారుబాకీల భారం తగ్గి, బ్యాంకులకు అదనపు మూలధనం సమకూర్చినట్లయితే ఆర్థిక పరిస్థితి క్రమంగా పుంజుకోవచ్చు.

ఉపాధి అవకాశాలు తగ్గిపోవడం నేడు దేశం ముందున్న ప్రధాన సమస్య. పెరుగుతున్న యువ జనాభాకు ఉద్యోగాలు కల్పించే స్థాయిలో మనం ఆర్థిక వృద్ధి సాధించలేకపోతున్నాం. యువతకు, విద్యావంతులకు, మహిళలకు ఉద్యోగాలు కల్పించడంలో అనేక ఇతర దేశాలకన్నా భారత్‌ వెనకబడిపోయిందని 2017-18 జాతీయ నమూనా సర్వే వెల్లడించింది. దేశంలోని కార్మికశక్తిలో 85 నుంచి 90 శాతం అసంఘటిత రంగంలోనే పనిచేస్తున్నారు. వారి పని పరిస్థితులు, వేతనాలు తీసికట్టుగా ఉంటున్నాయి. ఏటా 80 లక్షల నాణ్యమైన కొత్త ఉద్యోగాలు సృష్టించడానికి తగు విధానాలను రూపొందించి అమలు చేయాలి. నైపుణ్య వృద్ధికి ప్రాధాన్యమివ్వాలి. దక్షిణ కొరియాలో 96 శాతం, జర్మనీలో 95 శాతం, జపాన్‌లో 80 శాతం, బ్రిటన్‌లో 68 శాతం, అమెరికాలో 52 శాతం కార్మికులకు నైపుణ్య శిక్షణ లభిస్తోంది. భారతీయ కార్మిక బలగంలో కేవలం 2.3 శాతమే అటువంటి శిక్షణ పొందుతున్నారు. నాణ్యమైన ఉపాధి అవకాశాలు సృష్టించాలంటే పారిశ్రామిక ఉత్పత్తి రంగమే శరణ్యం. 2022కల్లా 10 కోట్ల ఉద్యోగాలు సృష్టించడానికి మోదీ సర్కారు ‘భారత్‌లో తయారీ’ విధానాన్ని చేపట్టింది. ఈ బడ్జెట్‌లో ‘భారత్‌లో తయారీ’ కోసం కొన్ని కీలక ప్రతిపాదనలు చేసే అవకాశం ఉంది. పారిశ్రామిక రంగానికి ఎదురవుతున్న అవరోధాలను అధిగమించడానికి కేంద్ర రాష్ట్రాలు చేయీచేయీ కలిపాలి. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు గట్టి ఊతమిస్తే ఇబ్బడిముబ్బడిగా ఉద్యోగాలు లభిస్తాయి.

జౌళి, దుస్తులు, పాదరక్షలు, బొమ్మల తయారీ రంగాలు లక్షలాది ఉద్యోగాలను సృష్టించగలవు. వీటి ఎగుమతి వల్ల దేశానికి పెద్దయెత్తున ఆదాయమూ లభిస్తుంది. ఈ రంగాలకు మరీ ఉన్నతమైన నైపుణ్యాలూ అవసరం లేదు. భారీగా కార్మికులు అవసరమైన రంగాలివి. ప్రస్తుతం అసంఘటిత రంగంలో పనిచేస్తున్నవారు తేలిగ్గా ఈ రంగాల్లో పనిచేయగలరు. విదేశాల నుంచి కీలక విడి భాగాలను దిగుమతి చేసుకుని భారత్‌లో కూర్పు చేసినా భారీగా ఉద్యోగాలు పుట్టుకొస్తాయి. ఎలక్ట్రానిక్‌, ఎలక్ట్రిక్‌ వస్తువులను ఇక్కడ ఉదాహరించాలి. బహుళజాతి సంస్థల కోసం ఈ పరికరాలను భారత్‌లో కూర్పు చేయవచ్చు. అలాగే మన వనరులు, మానవ నైపుణ్యాలను ఉపయోగించి సొంతంగా విడిభాగాలు తయారుచేసి విదేశాలకు ఎగుమతి చేయవచ్చు. కోస్తా ఆర్థిక మండలాల్లో ఈ తరహా ఎగుమతి యూనిట్లను నెలకొల్పి వియత్నాం, బంగ్లాదేశ్‌లు బాగా లబ్ధి పొందుతున్నాయి. ముఖ్యంగా జౌళి రంగంలో అవి భారత్‌ను మించి ఎగుమతులు చేస్తున్నాయి. కార్మికుల అవసరం ఎక్కువగా ఉండే పరిశ్రమలను కోస్తా ఆర్థిక మండలాల్లో ఏర్పాటు చేయడానికి కొత్త బడ్జెట్‌ ప్రోత్సాహకాలు ఇవ్వాలి. ఈ పరిశ్రమలతోపాటు ‘భారత్‌లో తయారీ’ కింద ఏర్పాటయ్యే పరిశ్రమలకూ విస్తృతంగా రవాణా సౌకర్యాలు, ప్యాకేజింగ్‌ వసతులు, బట్వాడా, మరమ్మతు సేవలు అవసరమవుతాయి. ఈ తరహా సేవల వల్ల ఉపాధి అవకాశాలు విస్తరిస్తాయి.

పారిశ్రామిక ఉత్పత్తిని, తద్వారా ఆర్థిక వృద్ధి రేటును పెంచాలంటే భూ, కార్మిక సంస్కరణలు తీసుకురావలసి ఉంటుంది. వీటిని ఆర్థికవేత్తలు వ్యవస్థాగత సంస్కరణలుగా వ్యవహరిస్తారు. పరిశ్రమలకు కావలసిన భూమి సులువుగా అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్రం, రాష్ట్రాలు కలిసి పనిచేయాలి. ఎలాంటి భూసేకరణలోనైనా రైతులను భాగస్వాముల్ని చేయాలి. కార్మిక సంస్కరణలకొస్తే ఇప్పటికే ఒప్పంద కార్మికులను తీసుకునే వెసులుబాటు కల్పించారు. కార్మికులకు మెరుగైన పనిపరిస్థితులు, జీతభత్యాలు అందించడానికీ సంస్కరణల్లో ప్రాధాన్యమివ్వాలి. బడ్జెట్‌లో సామాజిక సంక్షేమానికి హెచ్చు నిధులు కేటాయించాలి. ప్రజలకు నాణ్యమైన విద్యవైద్య సేవలు అందించాలి.

విపణి సంస్కరణలు కీలకం
వ్యవసాయం, గ్రామీణ రంగాల్లో గిరాకీని, ఆదాయాలను పెంచడానికి బడ్జెట్‌ దృష్టి పెట్టాలి. ఎన్నికలకు ముందు రైతులకు రుణ మాఫీలు, నగదు బదిలీలపై రాజకీయ పార్టీలు హామీల మీద హామీలు గుప్పించాయి. వాటిని చాలావరకు అమలుచేశాయి కూడా. వీటి వల్ల రైతులకు కొంత లబ్ధి చేకూరిఉండవచ్చు. అంతమాత్రాన వ్యవసాయ రంగ పునరుజ్జీవం జరగదు. వ్యవసాయ మార్కెటింగ్‌ సంస్కరణలకు బడ్జెట్‌ ప్రత్యేకంగా చొరవ తీసుకోవాలి. పంట పండించడం, టోకు వర్తకం, గిడ్డంగుల్లో భద్రపరచడం, బట్వాడా సేవలు, ఆహార శుద్ధి, చిల్లర వ్యాపారం- వీటన్నింటినీ ఒకే సరఫరా గొలుసుగా వృద్ధి చేయడానికి బడ్జెట్‌లో తగిన కేటాయింపులు, పథకాలను పొందుపరచాలి. వ్యవసాయ ఎగుమతులకు పెద్ద ఊతమివ్వాలి. విత్తనాలు, రుణాలు, ఎరువులు, భూ సదుపాయం, నీటి నిర్వహణలో లోపాల వల్ల భారతీయ వ్యవసాయ రంగం ఉత్పాదకతను పెంచుకోలేకపోతోంది. ఈ లొసుగులను అధిగమించడానికి బడ్జెట్‌ శ్రద్ధ వహించాలి. బ్రెజిల్‌, చైనా, అమెరికాలలో పంటలకు వాడుతున్నదానికి రెండు నుంచి మూడు రెట్లు ఎక్కువ నీటిని భారతీయ వ్యవసాయం ఉపయోగిస్తున్నా- ఉత్పాదకతలో దిగదుడుపుగానే ఉంది. బిందు, తుంపర సేద్యం, ఇతర వ్యవసాయ సాంకేతికతలతో ఉత్పాదకతను పెంచాలి. భారీ మెజారిటీతో గెలిచిన ఎన్డీయే ప్రభుత్వం దేశాభివృద్ధికి దీర్ఘకాలిక వ్యూహాలను చేపట్టాలి. అవి ఈ ఏటి బడ్జెట్‌లో ప్రతిఫలించాలి. కొత్త ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టే కొత్త బడ్జెట్‌ అభివృద్ధి, ఉపాధి విస్తరణకు సాహసోపేత చర్యలు ప్రకటించాలి.


Posted on 04-07-2019