Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఆర్థిక రంగం

లెక్క తేలని నల్లధనం

* ప్రభుత్వంపై బృహత్తర బాధ్యత

లెక్కాపత్రాల్లేని లక్షల కోట్ల రూపాయల సొమ్ము రెక్కలొచ్చి దేశంనుంచి ఎగిరిపోయిందన్న మాట గడచిన కొన్నేళ్లుగా వినిపిస్తూనే ఉంది. దేశ, విదేశాల్లో భారతీయులు దాచుకున్న డబ్బు ఎంత, దాన్ని బయటకు తీసుకురావడమెలా అన్నది గడచిన ఇరవయ్యేళ్లుగా పౌర, రాజకీయ వర్గాల్లో అత్యంత చర్చనీయమైన అంశం! దీనిపై విత్త పరిశోధన సంస్థలు, ఆర్థిక నిపుణులు చేసిన అంచనాలపై మొదటి నుంచి విశ్లేషకుల మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి. ఒకవైపు భారత స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)లో నల్లధనం వాటా 22.4 శాతంగా ఉందని 2010లో ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. మరోవంక దేశ జీడీపీలో నల్లధనం 75 శాతానికి పైగానే ఉందని ‘ఫిక్కీ’ అంచనాలు వినిపించింది. అక్రమ సొత్తుకు సంబంధించి వివిధ సంస్థలు, అనేక సమయాల్లో భిన్నమైన అంచనాలు సమర్పించాయి. ఆ అంచనాలపై సందేహాలు ఉండటంవల్ల దేశంలో నల్లధనం లెక్కలను నిర్దుష్టంగా నిగ్గుతేల్చాలని 2011లో నాటి కేంద్ర ప్రభుత్వం భావించింది. ఆ బాధ్యతను విఖ్యాత సంస్థలైన- నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అప్లైడ్‌ ఎకనమిక్‌ రీసెర్చ్‌ (ఎన్‌సీఏఈఆర్‌) నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ఫైనాన్స్‌ అండ్‌ పాలసీ (ఎన్‌ఐపీఎఫ్‌పీ), నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌ (ఎన్‌ఐఎఫ్‌ఎం) అనే మూడు ప్రభుత్వ పరిశోధన సంస్థలకు అప్పగించారు. అక్రమ సొత్తు తీరుతెన్నులపై ఈ మూడు సంస్థలు వేర్వేరుగా అధ్యయనాలు నిర్వహించి- 2014లో తమ నివేదికలను ప్రభుత్వానికి సమర్పించాయి. ఆ నివేదికలను పార్లమెంటరీ స్థాయీసంఘానికి ప్రభుత్వం పరిశీలన కోసం నివేదించింది. దాదాపు అయిదేళ్ల తరవాత 24 జూన్‌, 2019న వీరప్ప మొయిలీ సారథ్యంలోని ఆ ప్యానెల్‌ నివేదికాంశాలను పార్లమెంటుకు సమర్పించింది. విచిత్రంగా ఆ మూడు సంస్థల నివేదికలను పరిశీలిస్తే వాటికీ నల్లధనం విస్తృతిపై స్పష్టమైన అంచనా లేదని బోధపడుతోంది. ఎన్‌ఐపీఎఫ్‌పీ, ఎన్‌సీఏఈఆర్‌, ఎన్‌ఐఎఫ్‌ఎం సంస్థలు ప్రభుత్వానికి సమర్పించిన నివేదిక ప్రకారం 1980-2010 మధ్య దేశం గడపదాటించి భారతీయులు దాచిన సంపద విలువ- 21,648 కోట్ల డాలర్ల నుంచి 49,000 కోట్ల డాలర్ల మధ్యలో ఉంది. ఈ మూడు సంస్థలు సమర్పించిన లెక్కల్లో తీవ్రమైన వ్యత్యాసాలున్నాయి. నల్లధనంపై అంచనాలే స్పష్టంగా లేని పరిస్థితుల్లో, దాని కట్టడికి జరిపే పోరాటం ఏ మేరకు సత్ఫలితాలిస్తుందన్నది చర్చనీయాంశం!

అసంపూర్ణ అంచనాలు
భారత స్థూల దేశీయోత్పత్తి (2009-10, 2010-11)లో నల్లధనం వాటా ఏడు శాతంనుంచి 120 శాతం మధ్య ఉందని ఆ సంస్థలు అంచనా వేశాయి. ఆ సంస్థలు వెలువరించిన గణాంకాలు ఒక దానితో మరొకటి పొంతన లేకుండా ఉండటంతో- నిజానిజాలపై ఎప్పటి గందరగోళమే పునరావృతమైంది. ఇంకాస్త సమయం లభించి ఉంటే నల్లధనాన్ని నిర్దిష్టంగా లెక్కించడం అంత ‘కష్టమేమీ కాదు’ అని పార్లమెంటు ప్యానెల్‌ సారథిగా వీరప్ప మొయిలీ వెలిబుచ్చిన అభిప్రాయం వాస్తవాలకు దూరంగా ఉంది. దేశంలో నల్లడబ్బు ఎంతన్నదానిపై కచ్చితమైన లెక్క తేలకపోవడానికి ప్రధాన కారణం నల్లధనాన్ని సరిగ్గా నిర్వచించుకోలేకపోవడమే! నల్లధనాన్ని లెక్కించడానికి వివిధ సంస్థలు అనేక రకాల గణాంక శాస్త్ర పద్ధతులను ఉపయోగించడం అస్పష్టత కొనసాగడానికి రెండో కారణం. సాధారణ భాషలో నల్లధనం అంటే చట్టవిరుద్ధ మార్గాల ద్వారా, ఆదాయంపై పన్ను దాటవేయడం ద్వారా సమకూర్చుకున్న సంపద. నేరాలు, ఉగ్రవాద కార్యకలాపాలు వంటి చట్ట విరుద్ధ మార్గాల్లో సొమ్ము సమకూర్చుకునే వ్యక్తులు ఎలాగూ ఆ వివరాలను ప్రభుత్వ విభాగాలకు వెల్లడించరు. మరోవంక చట్టబద్ధంగా సంపాదించిన ఆదాయాలపై పన్ను ఎగవేయడం. ఉదాహరణకు, ఎవరైనా ఆర్థికవేత్త సదస్సులో ఒక విషయంపై ఉపన్యసించినందుకు నిర్వాహకులు ఆయనకు నగదు రూపంలో కొంత మొత్తం చెల్లించారనుకుందాం. ఆయన ఆ మొత్తాన్ని తన వార్షికాదాయ పన్ను చెల్లింపుల్లో ఆదాయంగా చూపకపోతే అది నల్ల ఆదాయం కిందికే వస్తుంది. ఇలాంటివన్నీ కలిస్తేనే నల్ల ఆర్థిక వ్యవస్థ (బ్లాక్‌ ఎకానమీ) తయారవుతుంది. నల్లధనాన్ని ఇక్కడ నిర్వచించిన తీరే దాన్ని లెక్కించడాన్ని కష్టతరం చేస్తుంది! తమ ఆర్థిక కార్యకలాపాలను పౌరులు ప్రభుత్వాలకు వెల్లడించకపోతే వాటి వివరాలను నిర్దిష్టంగా లెక్కించడం సర్కారుకు సాధ్యం కాదు. స్థిరాస్తి, మైనింగ్‌, ఫార్మాస్యూటికల్స్‌, పాన్‌ మసాలా, గుట్కా, పొగాకు పరిశ్రమ, బులియన్‌ మార్కెట్‌, చిత్ర పరిశ్రమ, విద్య వంటి రంగాల ద్వారా దేశంలో నల్లధనం పెద్దయెత్తున పోగడుతోందని పార్లమెంటు ప్యానల్‌ వెల్లడించిన నివేదికలు స్పష్టీకరిస్తున్నాయి. నకిలీ కరెన్సీ నోట్ల చలామణీని అరికట్టడం, డిజిటల్‌ లావాదేవీలకు ప్రోత్సాహం వంటి లక్ష్యాలతో ‘పెద్దనోట్ల రద్దు’ వంటి నిర్ణయం తీసుకుని అమలు జరిపినప్పటికీ- ఒనగూడిన ఫలితాలపై భిన్నాభిప్రాయాలున్నాయి.

దేశీయంగానే అధికం
2014నాటి సార్వత్రిక ఎన్నికల్లో భారతీయులు విదేశాల్లో దాచుకున్న నల్లధనం వెలికితీత అన్నదే ప్రధాన ప్రచారాంశంగా మారింది! మోదీ సర్కారు తొలి దశలో అధికారంలోకి వచ్చినప్పటినుంచి నల్లధనం వెలికితీతకు సంబంధించి అనేక చర్యలు ప్రారంభించింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అధ్యక్షతన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ఏర్పాటు, బ్లాక్‌ మనీ అండ్‌ ఇంపొజిషన్‌ ఆఫ్‌ టాక్స్‌ చట్టం (2015), బినామీ లావాదేవీల సవరణ బిల్లు (2015), వివిధ దేశాలతో ఆర్థిక లావాదేవీల సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకొనే ఒప్పందాలు, వస్తు సేవల పన్ను అమలు వంటివి ముఖ్యమైనవి. మూడున్నర లక్షల రూపాయల మేర లావాదేవీలు సాగించే అనుమానాస్పద సంస్థల (షెల్‌ కంపెనీలు) రిజిస్ట్రేషన్ల రద్దు వంటి చర్యలనూ ప్రభుత్వం తీసుకుంది. వాటికి తోడు ఆదాయ ప్రకటన పథకం (ఐడీఎస్‌)-2016 వంటి అమ్నెస్టీ పథకాన్నీ అమలు చేశారు. 1997లో అమలు చేసిన స్వచ్ఛంద ఆదాయ ప్రకటన పథకం (వీడీఐఎస్‌) రూ.33,000 కోట్ల నల్లధనం వెలికిరావడానికి కారణమైంది. తద్వారా పదివేల కోట్ల రూపాయల మేర పన్ను ఆదాయం ప్రభుత్వానికి దఖలు పడింది. 2016 ఐడీఎస్‌ద్వారా రూ.65,250 కోట్ల నల్లధనం బయటపెట్టారు. నిజానికి పెద్దయెత్తున మేటలు వేసిన నల్లధనంతో పోలిస్తే బయటపడిన మొత్తం చాలా స్వల్పం. ఏదో ఒక అంచనా పద్ధతిని ప్రాతిపదికగా తీసుకుని నల్లధనాన్ని వివిధ కాలావధుల్లో లెక్కించాలి. ఆ రకంగా గణించిన మొత్తం ఆయా కాలావధులు గడిచేకొద్దీ తగ్గుతుందా లేక పెరుగుతుందా అన్న విషయాన్ని లెక్కతేల్చాలి. దాని ఆధారంగా ప్రభుత్వం తన కార్యాచరణను అమలుచేయాలి. నల్లధనాన్ని అరికట్టేందుకు తొలుత పన్ను ఎగవేతకు సంబంధించిన లొసుగులను పూడ్చివేయాల్సి ఉంటుంది. 2001లో జీడీపీలో పన్నుల వాటా 8.7 శాతంగా ఉంది. అది 2008నాటికి 12.1శాతానికి చేరింది. ఆ తరవాత 2019నాటికి ఆ వాటా 10.9 శాతానికి పడిపోయింది. పన్ను ఆదాయం కోసుకుపోకుండా గట్టి చర్యలు తీసుకోవడం ఇప్పుడు చారిత్రక అవసరం. అప్పుడే నల్లధన వ్యాప్తిని అడ్డుకోవడం సాధ్యమవుతుంది. ఎన్‌ఐఎఫ్‌ఎం అంచనాల ప్రకారం మొత్తం నల్లధనంలో దేశం దాటింది కేవలం 10 శాతమే! అంటే హెచ్చు మొత్తంలో నల్లధనం దేశీయంగానే వివిధ రంగాల్లో, వివిధ రూపాల్లో పాతుకుపోయిందన్నమాట. ఈ డబ్బును వెలికితేవాలంటే పన్నుల రేట్లను తగ్గించి పౌరులకు నల్లడబ్బును బయటపెట్టే అవకాశాలు పెంచాలి. ప్రత్యక్ష పన్ను చట్టాలను సరళీకృతం చేసి, వాటిని మరింత హేతుబద్ధంగా తీర్చిదిద్దాలి. దేశంలో చోటుచేసుకునే వివిధ లావాదేవీలపై ఆకస్మిక తనిఖీలు జరగాలి. చెల్లింపుల్లో ఎలాంటి అక్రమాలు జరిగినా, జరిమానాలు విధించడంతోపాటు- ఆయా సంస్థల వ్యాపార రిజిస్ట్రేషన్లనూ రద్దుచేసే స్థాయిలో నిబంధనలను కఠినంగా అమలు చేయాలి. మరోవంక ప్రతి వ్యాపార లావాదేవీని డిజిటలీకరించి ఆర్థిక వ్యవస్థలో సాధ్యమైనంత మేర పారదర్శకత తీసుకురావాలి. అప్పుడే దారితప్పిన ఆర్థిక కార్యకలాపాలను గుర్తించే అవకాశాలు మెరుగుపడతాయి.

లొసుగులే శాపాలు
చట్టాల్లోని లోపాలను ఉపయోగించుకొని నల్లధనం విస్తరించింది. అది ఒకరకంగా దేశంలో సమాంతర ఆర్థిక వ్యవస్థనే సృష్టించింది. ప్రభుత్వాలూ, కేంద్ర బ్యాంకులూ తమ నిర్ణయాలను అమలు చేయడంలో నల్లధనం తీవ్ర ప్రతిబంధకంగా ఉంది. ఎనిమిదో దశకంనుంచి దేశంలో ప్రబలిన నల్లధనం కారణంగా భారతావని అయిదు శాతం ఆర్థిక వృద్ధిని కోల్పోతోందన్నది నిపుణుల అంచనా. నల్లధనం సమస్య లేకపోయినట్లయితే భారత్‌ ఈ సరికే అమెరికా తరవాత అత్యంత పెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెంది ఉండేది. భారత్‌ తలసరి ఆదాయం ప్రస్తుతం ఉన్న 2015.6 డాలర్ల (2018 మార్చి నాటికి) కంటే 11 రెట్లు గొప్ప స్థితిలో ఉండి మధ్య ఆదాయ దేశాల సరసన ఒకటిగా నిలిచేది. ఈ సమాంతర ఆర్థిక వ్యవస్థ కారణంగా భారతావని తన పూర్తి శక్తి సామర్థ్యాలతో వికసించలేకపోతోంది. దేశంలో రెండో దశ ఆర్థిక సంస్కరణల అమలు తరవాత నల్లధనంపై ప్రభుత్వాల వైఖరి కొంత కఠినతరంగానే మారిందని చెప్పాలి.


Posted on 05-07-2019