Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఆర్థిక రంగం

భూతద్దంలో... భవిష్యత్తు!

జనాకర్షణ మంత్రమా, సంస్క'రణ' తంత్రమా అన్నదానిపై తీవ్ర సంఘర్షణ దరిమిలా నిన్న కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ పార్లమెంటుకు సమర్పించిన ఎన్‌డీఏ ప్రభుత్వ మొట్టమొదటి పూర్తిస్థాయి బడ్జెట్‌- చివరకు అటు ఇటూ కాకుండా మధ్యమ పంథాలో సాగిపోయింది. పన్నుల్లో రాయితీలవంటి తక్షణ ప్రయోజనాల మీద ఎన్నో ఆశలు పెట్టుకొన్న వేతన జీవులు, మధ్య తరగతి ప్రజానీకం మోముపై చిరునవ్వులు పూయించలేకపోయిన ఈ బడ్జెట్‌, దాదాపు ఏ వర్గానికీ పూర్తిగా సంతృప్తి కలిగించలేదు. దీర్ఘకాలంలో ఎన్నో ప్రయోజనాలు చేకూరతాయంటూ హామీలు, భరోసాలకు అంతులేకపోయినా, అవన్నీ ఎడారిలో ఒయాసిస్సు మాదిరిగా వూరటనిస్తాయా లేక ఎండమావులుగా మారి ఉసూరుమనిపిస్తాయా... వేచి చూడాల్సిందే!

ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ పార్లమెంటుకు సమర్పించిన కేంద్ర బడ్జెట్‌ ఇదివరకటికన్నా భిన్నమైన రీతిలో ఉంది. విధానపరమైన స్పష్టీకరణలు, సవివరమైన ప్రకటనలతో ఈ బడ్జెట్‌ ఒక దృక్పథ పత్రాన్ని తలపించింది. వ్యవస్థలను చక్కదిద్ది, విధానాలను మరింత సరళీకరించడం ద్వారా వ్యాపారానుకూలతలను పెంపొందించదలచినబడ్జెట్‌ ఇది. కానీ, 'మంచి రోజులు' వస్తాయని ఆశలు పెట్టుకొన్న పేద, మధ్యతరగతి వర్గానికి మాత్రం జైట్లీ బడ్జెట్‌ ఏ విధంగానూ సాంత్వన చేకూర్చలేకపోయింది. ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒత్తిళ్ల మధ్య ప్రస్థానం సాగిస్తోంది. ఇలాంటప్పుడు సబ్సిడీల హేతుబద్ధీకరణ, పన్నుల ద్వారా ప్రభుత్వానికి ఆదాయాలను పెంచే దిశలో సాగుతున్నామని; దేశాన్ని ప్రగతి పథంలో నడిపేందుకు ఒక దీర్ఘకాలిక వ్యూహంతో ముందుకు వస్తున్నామని ఈ బడ్జెట్‌ ద్వారా అరుణ్‌జైట్లీ సంకేతం ఇవ్వాలనుకున్నారు. ప్రభుత్వ ఆదాయాలు ఇనుమడిస్తే కొన్ని సంక్షేమ కార్యక్రమాలపై వ్యయాలూ పెంచుతామని ఆర్థికమంత్రి హామీ ఇచ్చారు. ఇది కొత్తగా ఉంది. ప్రభుత్వ ఆదాయాల్లో పెరుగుదలతో వ్యయాల్ని ముడిపెట్టడం ద్వారా ఆయన భిన్నమైన సంప్రదాయానికి తెరదీశారు. భారతీయుల మనో ప్రవృత్తిని, పెట్టుబడులకు సంబంధించి వారి ఆలోచన ధోరణిని మార్చేందుకు ఆర్థికమంత్రి ప్రయత్నించినట్లు కనిపించింది. ఈ ప్రయత్నాలు సఫలమైతే, ప్రస్తుత బడ్జెట్‌ మున్ముందు తన ప్రభావం చూపుతుంది. దీర్ఘకాలంలో మేళ్లు జరగాలని కోరుకునేవారికి ఈ బడ్జెట్‌ నచ్చుతుంది. తక్షణ ప్రయోజనాలను ఆశించినవారికి నిరాశ కలిగిస్తుంది.

దీర్ఘకాల వ్యూహాలు

ఆర్థిక వ్యవస్థలో ప్రస్తుతం సానుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చింది. అందుకు అనుగుణంగా మొత్తం ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించుకోవాలని ఆర్థిక మంత్రి నిర్ణయించినట్టు సూక్ష్మస్థాయిలో చూస్తే అర్థమవుతుంది. వస్తు సేవల పన్నును వచ్చే ఏడాదినుంచి అమలు చేయనున్నట్టు సంకేతాలిచ్చిన ఆర్థికమంత్రి, పన్నుల వ్యవస్థలో భారీ మార్పులకు పూనుకోలేదు. పేదలకు, వ్యవసాయ రంగానికి, మౌలిక రంగంలో పెట్టుబడులకు విఘాతం కలుగకుండా; ఆరోగ్యం, విద్య తదితర సంక్షేమ చర్యలకు పెట్టుబడుల విషయంలో రాజీపడకుండా ద్రవ్య స్థిరీకరణ సాధించాలని ఆయన లక్ష్యంగా పెట్టుకొన్నట్టు స్పష్టమవుతోంది. సబ్సిడీలను హేతుబద్ధం చేయాలని, జన్‌ధన్‌ యోజన, ఆధార్‌, మొబైల్‌ నంబర్‌(జేఏఎమ్‌)ల ద్వారా ప్రత్యక్ష ప్రయోజనాలు బదిలీ(డీబీటీ) చేయాలని ప్రభుత్వం యోచిస్తున్న నేపథ్యంలో సామాజిక రంగాలకు వ్యయాల్ని తగ్గించరాదన్న ఆర్థికమంత్రి నిర్ణయం సరైనదే. జన్‌ధన్‌ యోజనద్వారా ప్రతి కుటుంబానికి రూ.5000 'ఓవర్‌ డ్రాఫ్టు' ఇవ్వబోతున్నారు. అంటే ఆ కుటుంబానికి చెందిన బ్యాంకు ఖాతాలో ప్రభుత్వం అంత మొత్తం జమచేస్తుందన్న మాట. ఈ లెక్కన దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారికి బ్యాంకులు కొత్తగా దాదాపు రూ.60,000కోట్లు రుణం మంజూరు చేయబోతున్నాయి. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారికి పింఛన్ల పెంపుద్వారా సామాజిక భద్రత ఛత్రాన్ని విస్తరించదలచిన నేపథ్యంలో ఇది చెప్పుకోదగిన చర్యే. ఒక పేద వ్యక్తి తన జన్‌ధన్‌ బ్యాంకు ఖాతాలో దాదాపు రూ.400 జమచేస్తే ఏటా రెండు లక్షల రూపాయల దాకా ఆరోగ్య, ప్రమాద, వ్యక్తిగత, జీవిత బీమా సదుపాయం పొందవచ్చు.

కుటుంబాల పొదుపు మొత్తాల్లో తగ్గుదలను అరికట్టేందుకు ఆర్థికమంత్రి కొన్ని దీర్ఘకాలిక చర్యలు ప్రకటించారు. కుటుంబాల పొదుపు మొత్తాలు 2009-'10లో 12శాతంనుంచి 2013-'14లో అసాధారణంగా 7.2శాతానికి దిగజారినట్టు ఆర్థిక సర్వేలో వెల్లడికావడంతో, ఆ ధోరణికి అడ్డుకట్టవేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆదాయ పన్ను రేట్లలో ఎలాంటి మార్పులు ప్రతిపాదించకపోవడం, కొత్తగా చెప్పుకోదగ్గ మినహాయింపులేవీ ప్రకటించకపోవడం వేతనజీవులను, మధ్యతరగతిని ఉసూరుమనిపించింది. కానీ, పొదుపు మొత్తాలను పెంపొందించేందుకు దీర్ఘకాలిక దృక్పథాన్ని మాత్రం ఆవిష్కరించారు. ఫలితంగా ప్రభుత్వం ప్రతిపాదించిన అన్ని విభాగాల్లో పొదుపు చేసుకోగలిగితే- రూ.4.4లక్షల వరకు ఆదాయం ఉన్నవారిపైనా పన్ను భారం పడదు. ఈ విధంగా కనుక పొదుపు పెరిగితే దానివల్ల దీర్ఘకాలంలో కీలకమైన మౌలిక రంగంలో పెట్టుబడుల సమీకరణకు మార్గం సుగమమయ్యే అవకాశం ఉంది. కానీ, ఈ పొదుపు మార్గాలన్నింటినీ వినియోగించుకుని ఆ మేరకు పన్ను రాయితీలు పొందడం సామాన్యులకు సాధ్యమేనా అన్నది సందేహాస్పదం!సంపద పన్నును రద్దుచేసిన జైట్లీ కోటి రూపాయలకుపైగా వ్యక్తిగత ఆదాయం కలిగినవారిపై, పదికోట్ల రూపాయలకుపైగా వార్షికాదాయం పొందుతున్న సంస్థలపై సర్‌ఛార్జీని 12శాతానికి పెంచారు. సంపద పన్ను ద్వారా ఇప్పటివరకూ లభించిన ఆదాయమే అంతంతమాత్రం, పైగా దాని వసూలుకే తడిసిమోపెడయ్యే పరిస్థితి! పైపెచ్చు న్యాయవివాదాలూ చుట్టుకుంటున్నాయి. ప్రస్తుత చర్యవల్ల ప్రభుత్వానికి సమయమూ, డబ్బూ ఆదా అవుతాయి. న్యాయస్థానాల్లో కొండలా పేరుకొంటున్న అపరిష్కృత కేసుల సంఖ్య తగ్గుతుంది.

అసంఘటిత రంగాన్ని పరిపుష్టం చేయడానికి ఆర్థికమంత్రి కొన్ని చర్యలు చేపట్టారు. దాదాపు 90శాతం ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న కీలక రంగమిది. గడచిన ఇరవై ఏళ్లలో ఉద్యోగాల కల్పనలో విఫలం కావడంవల్లే భారత ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతింది. 1992-'93నుంచి ఇప్పటిదాకా కేవలం 10కోట్ల ఉద్యోగాలే ఇవ్వగలిగినట్లు ఆర్థిక సర్వే వెల్లడించింది. ఈ పరిస్థితుల్లో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ)రంగానికి పలు ప్రోత్సాహకాలు, ప్రయోజనాలు ప్రకటించడం ద్వారా ఆర్థిక వ్యవస్థలోని అట్టడుగు స్థాయిలో భారీగా ఉద్యోగ కల్పనకు ఆయన చర్యలు తీసుకొన్నారు. సూక్ష్మ, అసంఘటిత రంగాలకు నిధులు సమకూర్చేందుకు రూ.20,000కోట్లతో మూల ధననిధి ఏర్పాటు చేయనున్నారు. ఈ సంస్థలకు రుణ హామీకోసం మరో రూ.3000కోట్లు ఇవ్వనున్నారు. ఆర్థికమంత్రి తన బడ్జెట్లో మౌలిక రంగానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య(పీపీపీ) పద్ధతిలో ఈ రంగంలో పెట్టుబడులు పెట్టే విధానాన్ని పునరుద్ధరించేందుకు పూనుకొన్నారు. రహదారులు, రైల్వేలకు కేటాయింపులు పెంచారు. కొత్తగా దాదాపు లక్ష కిలోమీటర్ల మేరకు రోడ్లు నిర్మిస్తామన్నారు. పారదర్శక వేలం ప్రక్రియ ద్వారా అయిదు అత్యాధునిక విద్యుత్‌ ప్రాజెక్టులు చేపట్టేందుకు అనుమతి ఇచ్చారు. సాగునీటి ప్రాజెక్టులు, రేవుల కార్పొరేటీకరణకూ పచ్చజెండా వూపారు. 2020నాటికి దేశంలోని అన్ని గ్రామాలను విద్యుదీకరిస్తామన్న ఆర్థికమంత్రి, 2022నాటికి పట్టణ ప్రాంతాల్లో రెండుకోట్లు, గ్రామీణ ప్రాంతాల్లో నాలుగు కోట్ల గృహాలు నిర్మిస్తామని, దాదాపు 80,000 మాధ్యమిక పాఠశాలల స్థాయిని పెంచుతామని హామీ ఇచ్చారు. దివాలాస్మృతి (బ్యాంక్రప్టసీ కోడ్‌) ప్రవేశపెడతామన్న ఆర్థికమంత్రి వాగ్దానం- దీర్ఘకాలంలో వ్యాపార సముదాయానికి వరం వంటిదే. ఒక వ్యాపారాన్ని ప్రారంభించడం లేదా మూసివేయడం సులభతరంగా జరగాలి. అప్పుడే పెట్టుబడుల ప్రవాహానికి అవకాశం ఉంటుంది. ఈ మేరకు నిబంధనలు సరళంగా ఉండాల్సిందే. ఈ దృష్ట్యా వ్యాపార సంస్థల్ని స్థాపించేవారికి, వాటిలో పెట్టుబడులు పెట్టేవారికి, బ్యాంకులకూ దివాలాస్మృతి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

ధరలకు ఆజ్యం!

బడ్జెట్లో వ్యవసాయ రంగానికీ ప్రాధాన్యం ఇచ్చారు. ఈ రంగానికి ఎనిమిది లక్షల కోట్ల రూపాయలవరకు రుణాలు సమకూర్చాలన్నది నిరుటి లక్ష్యం. ఇప్పుడు దాన్ని ఎనిమిదిన్నర లక్షల కోట్ల రూపాయలకు పెంచారు. వివిధ రూపాల్లో అదనంగా దాదాపు రూ.70,000కోట్ల మేరకు వ్యవసాయ రుణ సదుపాయం కల్పిస్తామన్నారు. ఏకీకృత జాతీయ వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్‌ను త్వరలో ఏర్పాటు చేస్తామని, వ్యవసాయ పరిశోధనకు మద్దతు ఇస్తామనీ హామీ ఇచ్చారు. వ్యవసాయ యాంత్రీకరణకు పెట్టుబడులు పెట్టేవారికి; సేద్య విస్తరణ సేవలు అందజేసే ప్రభుత్వ, ప్రైవేటు రంగాలవారికి; గిడ్డంగుల నిర్మాణానికి వెన్నుదన్నుగా నిలిచేందుకు బడ్జెట్లో మరిన్ని ప్రోత్సాహకాలు ప్రకటించి ఉండాల్సింది. ఈ రీత్యా చూసినప్పుడు ఎంతో కీలకమైన వ్యవసాయ రంగానికి బడ్జెట్లో కావలసినంత ప్రాధాన్యం దక్కలేదనే భావించాల్సి వస్తోంది.

ప్రభుత్వం ఆచితూచి అడుగు ముందుకు వేయాల్సిన అంశాలు, రంగాలు ఎన్నో ఉన్నాయి. ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చిందని సంబరపడాల్సిన పనిలేదు. ఆహార ధరోల్బణాన్ని కట్టడి చేయడం కష్టమైపోతోందని మరవరాదు. పరిస్థితి ఈ ఏడాది ఆఖరువరకూ మారే సూచనలు కనిపించడం లేదు. గిడ్డంగుల విషయంలోనూ వ్యవహారం నిరాశాజనకంగా ఉంది. మొత్తం ఆహార, కూరగాయల ఉత్పత్తిలో 10శాతానికి మాత్రమే గిడ్డంగులు అందుబాటులో ఉన్నాయి. ఆహార వృథాను అరికట్టాలంటే అదనంగా 1.6కోట్ల టన్నుల మేరకు ఆహార పదార్థాల నిల్వకు శీతల గిడ్డంగులు అవసరం. ఆహార, కూరగాయల ధరలు పెరగడంవల్లే ఆహార ధరోల్బణం కట్టుతప్పుతోందనడంలో మరో మాట లేదు. పెట్రోలు, డీజిలు, ఆహార పదార్థాల ధరలు మళ్ళీ కట్టుతప్పే సూచనలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. తాజాగా చమురు ధరల పెరుగుదలే ఇందుకు నిదర్శనం. ధరల కట్టడికి ఎలాంటి నిర్దిష్ట చర్యలు చేపట్టబోతున్నారో, సామాన్యులకు ఏ రకంగా ఉపశమనం కలిగించబోతున్నారో బడ్జెట్లో ఆర్థికమంత్రి వివరించనేలేదు.

పొదుపునకు బాసట

ఆర్థికమంత్రి తన బడ్జెట్లో కొన్ని ఆసక్తిదాయకమైన, సంక్లిష్టమైన చర్యలనూ ప్రతిపాదించారు. అవి విజయవంతమైతే మున్ముందు ప్రయోజనాలు చేకూరవచ్చు. ముఖ్యంగా ఆర్థికమంత్రి చేసిన రెండు ప్రతిపాదనలు కీలకమైనవి. భారతీయుల వద్ద అపారంగా బంగారం పోగుబడి ఉంది. గోల్డ్‌ బాండ్లు, గోల్డ్‌ మెటల్‌ పథకాల ద్వారా బంగారాన్ని డబ్బు చేసుకునే వెసులుబాటు కల్పించారాయన. భారతీయులకు పసిడిమీద ఉన్న మక్కువ అంతా ఇంతా కాదు. శతాబ్దాలుగా వారు బంగారం మీద పెట్టుబడి పెడుతున్నారు. అంతర్జాతీయ స్వర్ణమండలి అంచనా ప్రకారం- ప్రపంచంలోని మొత్తం బంగారంలో దాదాపు 10శాతం భారతీయుల వద్దే ఉంది. ఏటా వందలకోట్ల డాలర్లు విలువచేసే టన్నుల కొద్దీ బంగారం దేశంలోకి దిగుమతి అవుతోంది. ప్రభుత్వం వద్ద బంగారాన్ని పెట్టి, దానిపై వడ్డీ తీసుకొనేలా భారతీయుల్ని ఒప్పించడానికి ఆర్థికమంత్రి ప్రయత్నించారు. తాతలు, తండ్రులకాలంనుంచి వారసత్వంగా పొందుతున్న బంగారాన్ని ప్రభుత్వానికి అప్పగించేందుకు సిద్ధపడే భారతీయులు- తద్వారా పన్నుల విషయంలో ఇబ్బందులు ఎదురుకారాదని ఆశిస్తున్నారు. ఈ విషయంలో వారికి ఆర్థికమంత్రి భరోసా ఇవ్వగలిగితే, ఈ పథకం సఫలమవుతుంది.

డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల విస్తృత వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా నగదురహిత సమాజం దిశగా దేశాన్ని నడిపించాలని ఆర్థికమంత్రి యోచిస్తున్నారు. దీనివల్ల పలు ప్రయోజనాలు చేకూరతాయి. నల్లడబ్బు చలామణి తగ్గుతుంది. నగదు లావాదేవీల కారణంగా భారత రిజర్వు బ్యాంకు మీద పడుతున్న వ్యయభారం తగ్గుతుంది. నగదును ముద్రించి, బట్వాడా చేయడానికి జీడీపీలో దాదాపు 0.5శాతానికి సమానమైన డబ్బును రిజర్వు బ్యాంకు ఖర్చు పెడుతోంది. నగదు రూపేణా లావాదేవీలు జరపడమన్నది భారతీయులకు శతాబ్దాలుగా అలవాటైంది. బ్యాంకింగ్‌ తదితర రంగాలు ప్రజలకు పెద్దగా అందుబాటులో లేకపోవడంవల్ల ఈ సమస్య తీవ్రతరమైంది. ఇతరేతర మార్గాల మీద ప్రజలకు అంతగా నమ్మకం లేకపోవడమూ ఇందుకొక కారణం. ఎలక్ట్రానిక్‌ చౌర్యానికి, మోసాలకు పాల్పడేవారిని ప్రభుత్వం, ఆర్‌బీఐ, ఇతర భద్రత సంస్థలు కఠినంగా శిక్షించగలిగితేనే వారిలో విశ్వాసం ఏర్పడుతుంది. ఇలాంటి చర్యలవల్ల దీర్ఘకాలంలో ప్రయోజనాలు చేకూరతాయి.

ఆచితూచి ముందడుగు

విదేశీ బ్యాంకుల్లో భారతీయులు దాచిపెట్టుకొన్న నల్లడబ్బును వెనక్కి రప్పించేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపడతామని ఆర్థికమంత్రి హామీ ఇచ్చారు. బడ్జెట్లో ఇదో కీలకాంశం. అక్రమాస్తుల గురించి లేదా విదేశాల్లో దాచిపెట్టుకొన్న డబ్బు వివరాలను వెల్లడించకపోవడాన్ని జైలు శిక్ష విధించదగ్గ నేరంగా పరిగణిస్తూ విధానపరమైన మార్పులు తీసుకువస్తామన్నారు. ఆమేరకు తేనున్న బిల్లు ముఖ్యాంశాలను వెల్లడించారు. పన్నులు ఎగ్గొట్టడం సాధ్యంకాని విధంగా పటిష్ఠమైన బిగింపులు చేస్తామన్నారు. దేశీయ నల్లధనాన్ని కట్టడి చేయడానికి బినామీ ఆస్తుల చట్టసవరణ బిల్లూ తీసుకువస్తామన్నారు. ఏదిఏమైనా ఆరోపణలు వచ్చిన వారిమీద విచారణ సత్వరం ముగిసేలా చూడటం ముఖ్యం. కేసుల విచారణకు కాలావధిని నిర్దిష్టంగా నిర్దేశించాలి. వివిధ కుంభకోణాలు ఇప్పటికే చేదు అనుభవాలు మిగిల్చాయి. భవిష్యత్తులో అలా జరగకుండా నియంత్రణ వ్యవస్థను సంపూర్ణంగా ప్రక్షాళించాలి. ఈ విషయంలో ఆర్థికమంత్రి జాగ్రత్తగా ముందడుగు వేయాల్సి ఉంటుంది. కాస్త నెమ్మదిగా అయినా, పకడ్బందీ చర్యలు అవసరమవుతాయి. ప్రస్తుత ఆర్‌బీఐ స్వరూప స్వభావాల్లో మార్పునకు ఉద్దేశించిన ద్రవ్య విధాన కమిటీ ఏర్పాటు విషయంలోనూ ఇదే జాగరూకత అవసరం. మొత్తమ్మీద జైట్లీ బడ్జెట్‌- విస్తృతవర్గాలకు తక్షణ ప్రయోజనం కలిగించకపోయినా, దీర్ఘకాలంలో ఉపయోగపడే అవకాశమైతే ఉంది.

(రచయిత - డాక్టర్ ఎస్.అనంత్)
Posted on 01-03-2015