Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఆర్థిక రంగం

వృద్ధి మంత్రం

ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఘనత మనదేనన్న తాజా ఆర్థిక సర్వే 2019-20 సంవత్సరంలో భారత వృద్ధిరేటు ఏడు శాతానికి తగ్గబోదని అంచనా వేస్తోంది. వేరే మాటల్లో, మూడు నెలలనాటి అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్‌) భవిష్యద్దర్శనానికిది ప్రతిధ్వని! ఏడాదిన్నర క్రితం పార్లమెంటుకు సమర్పించిన సర్వే 2018-19లో వృద్ధిరేటు ఏడునుంచి ఏడున్నర శాతందాకా ఉండనుందన్నా, వాస్తవంలో అది 6.8శాతానికే పరిమితమైంది. 1950-73 మధ్య జపాన్‌ జీడీపీలో 10శాతానికి మించి వృద్ధి నమోదు చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయంటున్న తాజా ఆర్థిక సర్వే- భారీ మెజారిటీతో పునరధికారం సాధించిన ఎన్డీయే రెండో జమానాలో వ్యయీకరణ, ప్రైవేటు పెట్టుబడులు విస్తరించి స్థూల దేశీయోత్పత్తి కొత్త రెక్కలు తొడుక్కోవడం తథ్యమంటోంది. 2024 నాటికి అయిదు లక్షల కోట్ల డాలర్ల (సుమారు రూ. 350 లక్షల కోట్ల) భూరి ఆర్థిక వ్యవస్థగా అవతరించడానికి అధమపక్షం ఎనిమిది శాతం వృద్ధిరేటు ఆవశ్యకమనడంలోనే విధాన సంస్కరణలది కీలక భూమికన్న సందేశం ప్రస్ఫుటమవుతోంది. అన్నదాతలు ఈసురోమంటున్న వ్యవసాయ ప్రధాన దేశంలో నాటకీయ వృద్ధిరేటు ఆకాశంలోంచి ఊడిపడదు. రైతుల రాబడిని రెండింతలు చేసేందుకు 14.5శాతం మేర ఉండాల్సిన వ్యవసాయాభివృద్ధి రేటు రెండేళ్ల క్రితం సంతృప్తికర స్థాయిలో వానలు కురిసినప్పుడే రెండు శాతానికి పరిమితమైనప్పుడు, లోటు వర్షపాతం వెక్కిరిస్తున్న ఈ ఏడాది ఎలా పుంజుకోగలదో ఆర్థికవేత్తలే వివరించాలి! పెట్టుబడులు, పొదుపు, ఎగుమతులు, వృద్ధి, ఉపాధి అవకాశాలు ఇతోధికమైతే భారత ఆర్థిక స్వస్థతకు తిరుగుండదని కృష్ణమూర్తి సుబ్రమణియన్‌ చేతుల మీదుగా రూపొందిన సర్వే నమ్మకంగా చెబుతోంది. తక్కిన ప్రపంచ దేశాలు వృద్ధిపరమైన సవాళ్లను ఎదుర్కొంటుండగా, మరోవైపు వాణిజ్య యుద్ధమేఘాలు కలవరపరుస్తుండగా- స్వీయ వృద్ధి ప్రస్థానం మందగించకుండా భారత్‌ ఎలా కాచుకుంటుందన్న ప్రశ్నకు నేటి బడ్జెటే బదులివ్వాలి!

పొరుగున జన చైనా మధ్యతరగతి ప్రజానీకం ఆదాయ ప్రయోజనాలకు గొడుగుపట్టే విధాన సంస్కరణలకు పెద్దపీట వేయగా, దేశంలో దశాబ్దాల తరబడి ఆ కీలక పార్శ్వం దారుణ నిర్లక్ష్యానికి గురైంది. వృద్ధి, ఉపాధి చెట్టపట్టాలు కట్టి సాగితేనేగాని సమతుల ప్రగతి దుర్లభమన్న స్పృహ మునుపటి ప్రభుత్వాల్లో కొరవడ్డ పర్యవసానంగా జాతి ఇప్పటికీ భారీ మూల్యం చెల్లించుకుంటోంది. రిజర్వ్‌బ్యాంక్‌ సారథ్య బాధ్యతలు చేపట్టకముందు ఏడేళ్లనాటి ఆర్థిక సర్వేలో రఘురాం రాజన్‌ ఉపాధి కల్పన ప్రభుత్వ తక్షణ కర్తవ్యమని ఉద్బోధించారు. రెండేళ్ల క్రితం తనవంతుగా ముఖ్య ఆర్థిక సలహాదారు హోదాలో అరవింద్‌ సుబ్రమణియన్‌ ‘ఉపాధి రహిత వృద్ధి’పై ఆందోళన చెందినా- కార్యాచరణ తేటపడలేదు. దేశంలో ఉపాధి అవకాశాల విస్తరణకు నూతన సాంకేతిక పరిజ్ఞాన వినియోగం దోహదపడగలదంటున్న నిన్నటి సర్వే- ముఖ్యంగా సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమ (ఎస్‌ఎమ్‌ఎస్‌ఈ)లను ప్రభుత్వం అక్కున చేర్చుకోవాలని సిఫార్సు చేసింది. ఉపాధి కల్పన, ఎగుమతుల పెంపుదల, ఆర్థికాభివృద్ధి తదితరాలు పరస్పరం ముడివడిన అంశాలంటున్న సర్వే ఉద్బోధ గతానికి భిన్నమైన భావజాలాన్ని ఆవిష్కరిస్తోంది. ఈ ఏడాది గ్రామీణ ప్రాంతాల్లో రాబడి పెంపొందే అవకాశాలు ఉంటాయన్న సర్వే ఆశావహ అంచనాలే విస్మయపరుస్తున్నాయి. వాతావరణ మార్పుల దుష్ప్రభావాల కారణంగా సేద్య రాబడి 20-25 శాతం మేర క్షీణిస్తుందన్న గత సర్వే మదింపుల్ని తోసిరాజనే స్థితిగతులు నేడు ఎక్కడున్నాయి? గ్రామీణ ప్రాంతాల నుంచి నిరంతర వలసలను నిరోధించేలా స్థానికంగా ఖాదీ, కుటీర పరిశ్రమలకు ఊపిరులూదాలన్న కమిటీల సూచనలు; రైతు జీవన భద్రతను లక్షిస్తూ స్వామినాథన్‌ చేసిన సహేతుక సిఫార్సులు ఎన్నింటినో పేరబెట్టినన్నాళ్లు- కలతబారిన కుగ్రామాలు కుదుటపడవు!

గడచిన అయిదేళ్లూ స్థిర ప్రగతి సాధ్యపడిందని కితాబిచ్చే క్రమంలో కొన్ని అంశాలకు మసిపూసి మారేడు చేసే యత్నం ఆర్థిక సర్వే నిష్పాక్షికతను బోనులో నిలబెట్టేదే. కేంద్రపన్నుల విభాజ్య నిధిలో రాష్ట్రాల వాటా 32 నుంచి 42 శాతానికి పెంపొందడం ద్రవ్య సమాఖ్య స్ఫూర్తికి దర్పణమనడం అతిశయోక్తే. ఈ నాలుగేళ్లలో రాష్ట్రాలకు నికర కేటాయింపులు ఏ దశలోనూ 35 శాతానికి మించలేదన్న అధ్యయనాలు కేంద్రప్రభుత్వ చిత్తశుద్ధిని ప్రశ్నిస్తున్నాయి! దేశంలో పారిశుద్ధ్య సేవలు అంతంతమాత్రమేనని తూర్పారపట్టిన పార్లమెంటరీ స్థాయీసంఘం, వివిధ రాష్ట్రాల్లో రూ.14 వేలకోట్లకు పైగా స్వచ్ఛ నిధులు మురిగిపోతున్నాయని నిరుడీ రోజుల్లో లెక్కచెప్పింది. ఆ ఊసెత్తని ఆర్థిక సర్వే స్వచ్ఛభారత్‌ నుంచి స్వస్థ భారత్‌ మీదుగా సుందర భారత్‌కు ప్రస్థానిద్దామని పిలుపిస్తోంది! సాంకేతికతతో ఉపాధి హామీ పథకాన్ని పరిపుష్టీకరించడం మొదలు పరిమిత సంఖ్యలో ఖాళీల భర్తీ ద్వారా జిల్లా, సబార్డినేట్‌ కోర్టుల్లో పెండింగ్‌ కేసులకు మోక్షం ప్రసాదించడం వరకు భిన్న పార్శ్వాల్ని ఈ సర్వే స్పృశించింది. సత్వర న్యాయపాలన సహా అనేకాంశాలపై నిర్ణయరాహిత్యం, అనిశ్చితి అయిదు దశాబ్దాలుగా వెలుపలి పెట్టుబడిదారుల్ని బెంబేలెత్తించాయన్నది చేదు నిజం. తాజా ఆర్థిక సర్వే సూటిగా హెచ్చరించకపోయినా- దేశీయ తయారీ రంగం మందభాగ్యంతో కునారిల్లుతోంది. విద్యుత్‌, స్థిరాస్తి, టెలికాం, బొగ్గు, విమానయానం వంటి మౌలిక రంగాలు తరతమ భేదాలతో ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. ఆరోగ్యం, విద్య, తలసరి ఆదాయాల ప్రాతిపదికన భారత్‌ది మధ్యస్థ ప్రగతేనని సమితి నివేదిక ఇటీవలే నిర్ధారించింది. పేదరిక నిర్మూలన కార్యక్రమాలకు అవినీతి, అవకతవకల చీడపట్టి జనాభాలో పదిశాతం (13.6 కోట్లమంది) అత్యంత నిరుపేదలు అప్పుల ఊబిలో కూరుకుపోయిన దేశం మనది. దుర్భర దారిద్య్రాన్ని దునుమాడటంతోపాటు అపార మానవ వనరుల్ని సద్వినియోగపరచుకునేలా సేద్యం, పరిశ్రమలు, సేవారంగాల్లో దీటైన విధాన క్షాళనే దేశాన్ని పురోగమింపజేయగలిగేది. ఈ సమగ్ర చిత్రాన్ని కళ్లకు కట్టడంలో నిన్నటి సర్వే విఫలమైందనే చెప్పాలి!

Posted on 05-07-2019