Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఆర్థిక రంగం

లౌక్యంగా వడ్డన

నవీన భారత రూపకల్పనకు ప్రణాళికలు రచిస్తున్నామంటూ తెలుగింటి కోడలు నిర్మలా సీతారామన్‌- ఎన్డీయే రెండో ప్రభుత్వ తొలి బడ్జెట్‌ సమర్పణలో తనదైన ముద్ర వేశారు. సార్వత్రిక ఎన్నికల దరిమిలా ఆర్థిక మంత్రిత్వ శాఖ పగ్గాలు చేతులు మారాక సమయాభావం దృష్ట్యా మొన్న ఫిబ్రవరినాటి అనామతు ప్రతిపాదనల బాణీలోనే ఈసారి బడ్జెట్‌ వంటకం కొనసాగుతుందన్న అంచనాల్ని ఆమె చెల్లాచెదురు చేశారు. అప్పట్లో వెలుగుచూసిన ఎన్నికల పద్దుకు భిన్నంగా ఈసారి మహిళా ఆర్థికమంత్రి బడ్జెట్‌ కూర్పు విధివిధానాలనే మార్చేశారు! 2024నాటికి భారత్‌ అయిదు లక్షల కోట్ల డాలర్ల భూరి ఆర్థిక వ్యవస్థగా అవతరించడానికి కనీసం ఎనిమిది శాతం వృద్ధిరేటు అత్యావశ్యకమన్న తాజా సర్వే ఉద్బోధ నేపథ్యంలో- ఆ స్వప్న సాకారమే లక్ష్యమంటూ మంత్రి దశసూత్ర అజెండా వల్లెవేశారు. మౌలిక రంగానికి నవోత్తేజం మొదలు నదుల శుద్ధి వరకు, సేంద్రియ పద్ధతిలో ఆహారోత్పత్తి నుంచి ప్రజారోగ్య భద్రత దాకా విస్తృత కార్యాచరణను లక్షిస్తున్న బడ్జెట్‌ పరిమాణం 27 లక్షల 86 వేలకోట్ల రూపాయలకు ఎగబాకింది. నిరుటి బడ్జెట్‌ ప్రతిపాదనలకన్నా ఈ రాశి మూడు లక్షల 44 వేలకోట్ల రూపాయలు అధికం! తమ ప్రభుత్వ ప్రతి పథకానికి, కార్యక్రమానికి ‘గావ్‌, గరీబ్‌, కిసాన్‌’ కేంద్ర బిందువులని ఘనంగా చాటిన ఆర్థిక మంత్రి వ్యవసాయ, అనుబంధ కార్యకలాపాలకు ప్రత్యేకించింది మొత్తం బడ్జెట్‌లో సుమారు అయిదు శాతమే! పెట్టుబడి లేని వ్యవసాయంపై దృష్టి సారించామని, రైతుల రాబడి రెండింతలయ్యేందుకు అది దోహదపడుతుందన్న హామీ ఉత్తచేతులతో మూరలేసిన చందమే. ‘కిసాన్‌ సమ్మాన్‌’ అల్పసంతోషులను కొంత ఊరడిస్తున్నా, రైతుకు జీవన భద్రత కల్పించగల విశేష చొరవ ఈ బడ్జెట్‌ కసరత్తులోనూ కొరవడింది. రైతాంగంలో కేవలం ఆరు శాతానికే దక్కుతున్న కనీస మద్దతు మదింపు విధానంపై విమర్శల్ని గాలికొదిలేసిన ప్రభుత్వం, కొత్తగా గ్రామీణ వ్యవసాయాధారిత పరిశ్రమలకు విస్తృత ప్రాధాన్యం ఇస్తామంటోంది. పొలాల్లో సంతోషం విరబూయనిదే గ్రామీణ భారత సముద్ధరణ కోసమంటూ ఎవరేం చర్యలు తలపెట్టినా, ఆ యత్నం అసంపూర్ణంగా అరకొరగానే మిగులుతుంది!

మోదీ ప్రభుత్వం మూడేళ్ల క్రితమే ‘సాగరమాల’ పేరిట రేవుల్ని నవీకరించి, నూతనంగా విశ్వశ్రేణి నౌకాశ్రయాలు నిర్మించి, వాటన్నింటినీ అనుసంధానిస్తూ కోస్తా ఆర్థిక మండళ్లు నెలకొల్పుతామన్నా- జలసిరుల మార్గావతరణ చురుకందుకోలేదు. ఇప్పుడు హైవేల గ్రిడ్‌ ఏర్పరచి జాతీయ రహదారుల పునర్నిర్మాణాన్ని కదం తొక్కిస్తామంటున్న కేంద్రం- రోడ్లు, రైల్వేలపై విపరీత తాకిడిని తగ్గించేందుకు నదీరవాణా విధానానికి ఓటేయడం వినసొంపుగా ఉంది. అంతే ఉత్సాహంతో ‘గ్రామీణ సడక్‌ యోజన’ను ఉరకలెత్తిస్తామంటున్నా- నిరుటి కేటాయింపుల్ని పూర్తిగా ఖర్చు చేయకుండా, ఈసారి మళ్ళీ అంతే మొత్తం ప్రత్యేకించడం శంకలు రేకెత్తిస్తోంది. నిన్నటి బడ్జెట్‌ ప్రసంగంలో విస్తారంగా ప్రస్తావించిన ప్రధానమంత్రి ఆవాస్‌ యోజనకు కేటాయింపులు నిరుటికన్నా తెగ్గోసుకుపోయాయి. సాంకేతికత మప్పి కొత్తపుంతలు తొక్కిస్తామంటున్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి, 2018-19 సవరించిన అంచనాలతో పోలిస్తే కేటాయింపులు తరుగుపడ్డాయి. అటువంటి ఉపాధి హామీ పథకాలపై ఆధారపడే పరిస్థితే ఉత్పన్నం కాకుండా సేద్యాన్ని కుదుటపరచి గ్రామీణులు సొంతకాళ్లపై నిలదొక్కుకునేలా చేసే గట్టి కృషి కొన్నేళ్లుగా కొరవడుతోంది. ఈసారి బడ్జెట్లో సృజనాత్మక కళాకారులకు తోడ్పాటు ప్రకటించడం, భారత్‌నెట్‌ ద్వారా ప్రతి పంచాయతీని అనుసంధానిస్తామనడం- కొంతలో కొంత గుణాత్మక మార్పును సూచిస్తోంది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, అంకుర సంస్థల బాగుసేతకు ఇప్పటిదాకా చేసింది తక్కువ, చేయాల్సింది మరెంతో ఉంది. ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలలో 60 శాతం దాకా గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నందువల్ల వాటికి రుణాలు, విపణి సదుపాయాలను ఇనుమడింపజేస్తే- అటు వలసలూ తగ్గుతాయి, ఇటు నిరుద్యోగ సమస్యా ఉపశమిస్తుంది! విద్యుత్‌ వాహనాలు, డిజిటల్‌ చెల్లింపులపై ప్రత్యేక శ్రద్ధ కనబరచిన బడ్జెట్‌- కనిష్ఠ కార్పొరేట్‌ పన్ను పరిధిలోకి రూ.400 కోట్ల వార్షిక టర్నోవరు కలిగిన కంపెనీలన్నింటినీ చేర్చడం ఎందరికో తీపి కబురు. ఒక్క రైల్వే మౌలిక సదుపాయాల నిమిత్తమే 2030 సంవత్సరంలోగా రూ.50 లక్షల కోట్లు కావాల్సి ఉండగా, వచ్చే అయిదేళ్ల అవసరాలకు నిధుల సమీకరణ నిమిత్తం కమిటీనొకదాన్ని నెలకొల్పుతామంటున్నారు. క్రితంసారి ద్రవ్యలోటు హద్దుల్లోనే ఉన్నట్లు చూపడానికి ఎకాయెకి లక్షా 45 వేలకోట్ల రూపాయల మేర బడ్జెట్‌ కేటాయింపులకు అంటకత్తెర వేశారన్న విశ్లేషణల నేపథ్యంలో- కార్యాచరణ ఒక కొలిక్కి వస్తేగాని ఏ పథకాన్నీ విశ్వసించే పరిస్థితి లేకుండాపోయింది.

ప్రధాని మోదీ మానస పుత్రికలనదగ్గ కిసాన్‌ సమ్మాన్‌ నిధి, జనారోగ్య యోజన, ఉజ్జ్వల యోజన, స్మార్ట్‌ నగరాలు, స్వచ్ఛభారత్‌ సహా ముఖ్యపద్దులు వేటికీ ఎంతెంత కేటాయించారో చెప్పకుండానే బడ్జెట్‌ ప్రసంగం ముగించిన నిర్మల- పన్నుల వడ్డన రూపేణా చేకూరే రాబడి విషయంలోనూ గోప్యత పాటించారు. బడ్జెట్‌ పత్రాల్ని తరచి చూస్తే బయటపడ్డ లోగుట్టు ఆమె గణిత చాణక్యానికి రుజువు. గత ఏడాది బడ్జెట్‌ ప్రతిపాదనలతో పోలిస్తే కార్పొరేట్‌ పన్ను కింద రూ.1,45,000 కోట్లు, దిగుమతి సుంకం రూపేణా సుమారు రూ.43 వేలకోట్లు అదనంగా జమపడనున్నాయన్నది తాజా అంచనా. అత్యంత సంపన్నులు త్యాగాలకు సిద్ధపడాలంటూ మూడు శాతం, ఏడు శాతం చొప్పున రెండు శ్రేణుల్లో సర్‌ఛార్జీల బాదుడు ద్వారా రాబోయే ఆదాయం దాదాపు రూ.12 వేలకోట్లు. ప్రభుత్వానికి జమ పడే ప్రతి రూపాయిలోనూ 18 పైసలు వడ్డీ చెల్లింపులుగా తరలిపోతున్న దశలో ప్రభుత్వరంగ సంస్థల నుంచి లక్షా అయిదు వేల కోట్ల రూపాయల మేర పెట్టుబడుల ఉపసంహరణను లక్షిస్తున్నారు. ఈ సంవత్సరం అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గుముఖం పట్టే సూచనలున్నాయంటూనే పెట్రోలు, డీజిలుపై లీటరుకు రూపాయి ప్రత్యేక సుంకం వడ్డించిన అమాత్యులు, బంగారంపై కస్టమ్స్‌ సుంకాన్ని 12.5 శాతానికి పెంచేశారు. భూరి మౌలిక అజెండాను పట్టాలకు ఎక్కించడానికి ఈ వసూళ్లు అక్కరకు రావన్న స్పృహతోనే ప్రభుత్వం ప్రైవేటు భాగస్వామ్యాన్ని అభిలషిస్తోంది. వెలుపలి పెట్టుబడుల్నీ స్వాగతిస్తామంటోంది. మాటలు ఒకెత్తు, చేతలు మరొకెత్తు. సత్వర అనుమతులు, పారదర్శక నిబంధనలకు మారుపేరైన స్విట్జర్లాండ్‌, సింగపూర్‌ వంటివి విశ్వపోటీతత్వ సూచీలో తొలివరస ర్యాంకుల్ని ధీమాగా ఒడిసిపడుతున్నాయి. శ్రామిక శక్తి నైపుణ్యాలకు పదును పెట్టి, మౌలిక వసతుల రంగానా కాంతులీనడమే వాటి విజయరహస్యం. కోట్లాది భారతీయుల జీవన ప్రమాణాల మెరుగుదలకు, దీర్ఘకాలిక ప్రణాళికతో సమతులాభివృద్ధికి దోహదపడాలి బడ్జెట్లు. ‘కనిష్ఠ ప్రభుత్వం- గరిష్ఠ పాలన’తో దశాబ్దకాలంలో అభివృద్ధి భారతాన్ని కళ్లకు కట్టే సత్తా ప్రస్ఫుటమైతేనే నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ పరీక్షలో నెగ్గినట్లు!


Posted on 06-07-2019