Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఆర్థిక రంగం

ఉపాధి పట్టుకొమ్మకు ఊతమేదీ?

* చిన్న పరిశ్రమలకు దక్కని సాంత్వన

అఖండ మెజారిటీతో రెండోసారి అధికార పగ్గాలు చేపట్టిన మోదీ ప్రభుత్వంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ తొలి బడ్జెట్‌ కూర్పుపై కొన్ని రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. స్థూల దేశీయోత్పత్తి అయిదేళ్ళ కనిష్ఠానికి చేరడం; తయారీ, వ్యవసాయం సహా అన్ని కీలక రంగాల వృద్ధి క్షీణించడం, ఎగుమతులు తగ్గడం, నిరుద్యోగం గరిష్ఠ స్థాయికి చేరడం వంటి పలు ప్రతికూలతల మధ్య ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో ఏ ఒక్కరంగంపైనా వరాల జల్లులు కురిపించలేదు. రాబోయే అయిదేళ్లలో అద్భుత లక్ష్యాలను నిర్దేశించిన ఆర్థికమంత్రి వాటిని సాకారం చేసుకోడానికి నిర్దిష్ట కార్యాచరణనూ సూచించలేదు. గ్రామీణ భారతానికి మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేయడంతోపాటు ఆ రంగానికి వచ్చే అయిదేళ్లలో వంద లక్షలకోట్ల రూపాయల పెట్టుబడుల లక్ష్యాన్ని ఆర్థికమంత్రి నిర్దేశించారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా (ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ) రంగాన్ని ఆదుకొనే దిశలో బడ్జెట్‌లో కొన్ని ప్రతిపాదనలు చేయడం అభినందనీయం. ఈ రంగానికి రాయితీలు కల్పించేందుకు రూ.350 కోట్ల నిధులు మంజారు చేయడంతోపాటు, ఈ రంగాన్ని ఆర్థికంగా ఆదుకొనేందుకు ఓ ప్రత్యేక పథకాన్ని ప్రవేశ పెట్టేందుకు బడ్జెట్‌లో ప్రతిపాదించారు. ఈ రంగం తీవ్ర సంక్షోభంలో ఉన్నందువల్ల బడ్జెట్‌లో ప్రతిపాదించిన నిధులు ఈ రంగానికి ఏ మాత్రం ఆదుకుంటాయన్నది ప్రశ్నార్థకం!

సమస్యల సుడిగుండం
దేశంలో వ్యవసాయం తరవాత సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థ (ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ)ల రంగం ఎంతో ప్రాధాన్యం సంతరించుకొంది. వృద్ధిరేటు పెంచే చోదకశక్తిగా, ఉద్యోగాల కల్పనలో అగ్రగామిగా నిలిచిన ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ రంగం కొన్నేళ్లుగా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ప్రపంచవ్యాప్తంగా తయారీరంగంలో పెరుగుతున్న పోటీ, నూతన ఆవిష్కరణలు, ప్రభుత్వ విధానాలవల్ల ఈ రంగం పలు సమస్యలను ఎదుర్కొంటోంది. సకాలంలో బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్‌బీఎఫ్‌సీ)ల ద్వారా రుణాలు అందకపోవడం, మౌలిక సదుపాయాల కొరత, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోలేకపోవడం వంటి సమస్యలతోనూ ఈ రంగం సతమతమవుతోంది. పెద్దనోట్ల రద్దు, జీఎస్‌టీ అమలు ప్రభావం తీవ్రంగా పడటంతో సంక్షోభం మరింత ముదిరింది. దీంతో నాలుగైదేళ్లుగా అటు ప్రభుత్వం, ఇటు రిజర్వు బ్యాంకు అనేక చర్యలు చేపట్టాయి. పలు పథకాలు ప్రవేశపెట్టాయి. ఈ రంగాన్ని ఆర్థికంగా ఆదుకొని సత్వర రుణసదుపాయం కల్పించే దిశలో ఆర్‌బీఐ రుణ పునర్‌ వ్యవస్థీకరణను వర్తింపజేసింది. అయినా ఆశించిన ఫలితాలు రాకపోగా, సంక్షోభం తీవ్రమై కొన్ని యూనిట్లు ఖాయిలా దిశగా అడుగులేస్తున్నాయి.

బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూపు (బీసీజీ) నివేదిక ప్రకారం, దాదాపు 40 శాతం ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలు వాటి రుణావసరాలను అనధికారిక మార్గాల (వడ్డీవ్యాపారులు, స్నేహితులు, బంధువులు) ద్వారానే తీర్చుకుంటున్నాయి. కేవలం 60 శాతం రుణాలనే బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు, ఇతరత్రా ఆర్థిక సంస్థల ద్వారా పొందుతున్నాయి. అనధికారిక రుణాలపై అధిక వడ్డీవల్ల ఆయా సంస్థలు రుణ చెల్లింపులు చేయలేక ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. మరో నివేదిక ప్రకారం దేశంలో ఉన్న ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలకు దాదాపు రూ.37 లక్షలకోట్ల మేర రుణసదుపాయం కావాల్సిఉండగా, కేవలం రూ.17 లక్షల కోట్లు మాత్రమే అందుతున్నాయి. మిగిలిన రూ.20 లక్షల కోట్ల రుణావసరాలకు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుంటున్నాయి. కొన్నేళ్ళుగా పీఎస్‌బీలు మొండి బకాయిల సమస్యతో సతమతమవుతుండటం, కొన్ని బ్యాంకులు ఇంకా సత్వర దిద్దుబాటు (పీసీఏ) పరిధిలోనే ఉండటంతోపాటు ఇటీవల ఎన్‌బీఎఫ్‌సీలు తీవ్ర చెల్లింపుల సంక్షోభాన్ని ఎదుర్కోవడంవల్ల- చిన్న పరిశ్రమలకు కొత్తరుణాలు సకాలంలో అందడంలేదు. ఇక ఈ రంగంలో నిరర్ధక ఆస్తుల పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. అందువల్ల ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈల సమస్యలకు పరిష్కారం చూపి, ఈ రంగాన్ని పునరుత్తేజపరచే లక్ష్యంతో రిజర్వుబ్యాంకు జనవరిలో ‘సెబి’ మాజీ ఛైర్మన్‌ యూకే సిన్హా ఆధ్వర్యంలో కమిటీని నియమించింది. సమగ్ర అధ్యయనం అనంతరం కమిటీ నివేదిక సమర్పించింది.

చిన్న పరిశ్రమలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి ఈ రంగానికి చేయూత ఇచ్చేందుకు కేంద్రంలో వివిధ మంత్రిత్వ శాఖలు దాదాపు 140 పథకాలను అమలు చేస్తున్నాయి. ఆర్‌బీఐ ఈ రంగానికి అవసరమైన రుణసాయాన్ని అందించే దిశలో ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతూ ఈ రంగంలో నిరర్ధక ఆస్తుల భారాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తోంది. ప్రభుత్వం ఈ రంగానికి అవసరమైన రుణసదుపాయాన్ని సకాలంలో అందించేందుకు పీఎస్‌బీలు తక్షణ చర్యలు చేపట్టాలని ఇందుకోసం ప్రతి బ్యాంకులోను ఒక జనరల్‌ మేనేజర్‌ స్థాయి ఉన్నతాధికారి ఆధ్వర్యంలో పూర్తి పర్యవేక్షణ జరగాలని ఆదేశాలు జారీచేసింది. ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈల నుంచి అందుకొన్న వస్తు సేవల తాలూకు బిల్లుల్ని నెలన్నర రోజులకు మించి పెండింగులో పెట్టినట్లయితే ఆ సంగతిని అన్ని ప్రైవేటు కంపెనీలూ అర్ధ సంవత్సర ఆదాయ పన్ను పత్రాల్లో తప్పనిసరిగా వెల్లడించాలంటూ నిరుడు మోదీ ప్రభుత్వం ఆదేశించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వరంగ సంస్థలకూ ఈ నిబంధనను వర్తింపచేయాలని, ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈల బిల్లులకు సత్వరం మోక్షం దక్కేలా చూడాలని బడ్జెటుకు ముందస్తు సంప్రతింపుల్లో విజ్ఞాపనలు వెలుగుచూశాయి. ఆయా సంస్థలకు ప్రభుత్వాల నుంచి రావాల్సిన ఇన్‌పుట్‌ టాక్స్‌ క్రెడిట్‌ (ఐటీసీ) రిఫండుల్లోనూ తీవ్రజాప్యం జరుగుతుండటం- మూలిగే నక్కమీద తాటిపండు పడ్డ చందమవుతోంది. అన్ని ప్రభుత్వ విభాగాలూ తమ మొత్తం సేకరణల్లో 20 శాతాన్ని అంకుర సంస్థల నుంచే తీసుకోవాలన్న నిబంధనలకు మన్నన దక్కకపోవడం వంటి సమస్యలు ఉండనే ఉన్నాయి. ఇక్కడి ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలు విదేశీ మార్కెట్లనూ ఒడిసిపట్టేలా ‘మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌ సెల్‌’ ఏర్పాటు చేసి వాటికి తగు సమాచారం, శిక్షణలు అందిస్తే- గోరంత దీపాల కాంతి సరిహద్దులు దాటగలదన్న ఆకాంక్షలూ వెలుగుచూశాయి. చిన్న సంస్థలకు చెల్లింపుల సమస్యలు తలెత్తకుండా ఓ వేదిక ఏర్పాటును ప్రస్తావించడానికే విత్తమంత్రి చొరవ పరిమితమైంది!

ఆదుకోవాల్సిన తీరిది...
మొన్నీమధ్య సిన్హా కమిటీ కొన్ని కీలక సిఫార్సులు చేసింది. పలు విధానపరమైన మార్పులు, పర్యావరణానికి హాని కలిగించే కొన్ని ఉత్పత్తుల తయారీపై నిషేధం, విదేశాలనుంచి ఇబ్బడిముబ్బడిగా చవకగా దిగుమతులు చేసుకోవడం (డంపింగ్‌) వంటి వాటివల్ల దేశంలో పెద్దయెత్తున ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలు సంక్షోభంలో పడ్డాయి. కొన్ని పాక్షికంగా మూతపడ్డాయి. ఫలితంగా ఈ తయారీ యూనిట్లకిచ్చిన రుణాలు మొండిబకాయిలుగా మారాయి. బాహ్య పరిస్థితుల ప్రాబల్యంతో సంక్షోభంలో ఉన్న క్లస్టర్‌ యూనిట్లను ఆదుకొనే దిశలో సిన్హాకమిటీ రూ.5,000 కోట్లతో ఓ నిధిని (డిస్ట్రెస్డ్‌ అసెట్‌ఫండ్‌) ప్రభుత్వం ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది. ఈ రంగంలో నిరర్ధక ఆస్తులను తగ్గించేందుకు గతంలో ఆర్‌బీఐ ప్రవేశపెట్టిన ‘రుణ పునర్‌ వ్యవస్థీకరణ’ పథకం (రూ.25 కోట్ల వరకు ఉన్న రుణాలకు) అమలుతోపాటు ప్రతిపాదిత నిధినీ సమకూర్చాలని సూచించింది. ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలో పెట్టుబడులు పెట్టే వెంచర్‌ క్యాపిటల్‌ (విసీ), ప్రైవేటు ఈక్విటీ (పీఈ) సంస్థలకు మద్దతుగా మరో రూ.10 వేలకోట్లతో ప్రభుత్వ ప్రాయోజిత నిధి ఏర్పాటుచేయాలని కమిటీ సూచించింది. ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలను బలోపేతం చేసే దిశలో సిడ్బి (స్మాల్‌ ఇండస్ట్రీస్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా) క్రియాశీల పాత్ర పోషించాలని సూచించింది. ఈ రంగానికి ఆర్థిక సాయం అందించేందుకు బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు, సూక్ష్మరుణ (మైక్రో ఫైనాన్స్‌) సంస్థల సమన్వయంతో కొత్త రుణ, మూలధన సమీకరణ విధానాలను రూపొందించేందుకు తోడ్పడాలని సూచించింది. ప్రభుత్వరంగ బ్యాంకులు 59 నిమిషాల్లో ఇచ్చే ముద్రా రుణలను మరింత సరళీకృతం చేయాలని, సూత్రప్రాయ అంగీకారం తెలిపిన తరవాత కేవలం ఏడు నుంచి పది రోజుల్లోనే రుణవితరణ ప్రక్రియ పూర్తిచేయాలని సిఫార్సు చేసింది. ప్రస్తుతం చాలా సందర్భాల్లో 59 నిమిషాల్లో సూత్రపాయ అంగీకారం తెలిపిన తరవాతా రుణవితరణకు చాలా సమయం పడుతోందని అభిప్రాయపడింది. ప్రస్తుతం ఈ పథకం కింద ఉన్న రుణపరిమితిని కోటి రూపాయల నుంచి అయిదు కోట్ల రూపాయలకు పెంచాలని సిఫార్సు చేసింది. ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలకు బ్యాంకులు ఎటువంటి తనఖా, హామీలు వంటివి లేకుండా రూ.10 లక్షల దాకా రుణాలనందిస్తున్నాయి. ఈ పరిమితిని రూ.20 లక్షలకు పెంచాలని; ఈ సౌకర్యాన్ని ముద్రా రుణాలకు, స్వయం సహాయక బృంద రుణాలకూ వర్తింపజేయాలని కమిటీ సిఫార్సు చేసింది.

దేశార్థికాభివృద్ధికి చేయూతనిస్తూ, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను ఆశించిన స్థాయిలో సృష్టించడంలో ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈల పాత్ర ఎంతో కీలకం. అదే విధంగా ఎగుమతులు వృద్ధి చెందాలన్నా, ‘భారత్‌లో తయారీ’ సంకల్పం నెరవేరాలన్నా చిన్నపరిశ్రమలు ఎదుర్కొంటున్న సంక్షోభాలను నివారించి వాటిని బలోపేతం చేసే దిశలో ప్రభుత్వం సత్వర చర్యలు చేపట్టాలి. బడ్జెట్‌లో ప్రతిపాదించిన పథకంతోపాటు సిన్హా కమిటీ సిఫార్సుల అమలుకు సత్వరం నడుంబిగించాలి. ఈ రంగం కోలుకొని వృద్ధి బాటపట్టకపోతే ఆర్థికవ్యవస్థ గాడి తప్పినట్లే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏడు శాతం వృద్ధి రేటు సాధించాలన్నా, భవిష్యత్తులో (2025 మార్చినాటికి) భారత్‌ అయిదు లక్షలకోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్నా ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ రంగానికి పెద్దయెత్తున సాయం అందించాల్సిన అవసరం ఉంది. లేకుంటే వృద్ధి అంచనాలు తారుమారవుతాయి.

ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ రంగ ముఖచిత్రం
* స్థూల దేశీయోత్పత్తిలో ఈ రంగం వాటా 28 శాతం.
* దేశ ఎగుమతుల్లో ఈ రంగం తయారుచేసిన ఉత్పత్తులు 40 శాతం పైగా ఉన్నాయి.
* దేశ తయారీరంగంలో ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈల వాటా 45 శాతం పైనే ఉంది.
* దేశంలో దాదాపు 6.3 కోట్ల ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ యూనిట్లు ఉన్నాయి. అందులో 31 శాతం తయారీరంగంలో, 36 శాతం వ్యాపార రంగంలో, మిగిలిన 33 శాతం సేవల రంగంలో ఉన్నాయి.
* 12 కోట్లమందికి పైగా ఈ రంగంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందుతున్నారు.
* 2019 మార్చినాటికి ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ రంగ రుణాలు రూ.17.4 లక్షల కోట్లకు చేరాయి.


Posted on 06-07-2019