Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఆర్థిక రంగం

నష్టాల ఊబిలో డిస్కమ్‌లు

* రుణభారంతో సతమతం

ఒకప్పుడు దేశంలో విద్యుత్‌ కొరతతో కటకటలాడిన పలు ప్రాంతాలు నేడు మిగులు స్థాయికి చేరుకున్నాయి. తరచూ విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలగడం తగ్గిపోయింది. 2014-19 మధ్య కాలంలో సరఫరా కన్నా గిరాకీ ఎక్కువగానే ఉన్నా, చివరకు ఈ వ్యత్యాసాన్ని సగటున 1.54 శాతానికి పరిమితం చేయగలిగారు. 2018-19లో గిరాకీ-సరఫరాల మధ్య వ్యత్యాసాన్ని 0.6 శాతానికి కుదించారు. 2014 తరవాత ఉత్పాదన సామర్థ్యాన్ని 235 గిగావాట్ల నుంచి 344 గిగావాట్లకు పెంచారు. ఈ ఘనత విద్యుత్కేంద్రాలకు, ప్రభుత్వ యాజమాన్యంలోని విద్యుత్‌ పంపిణీ సంస్థలకు (డిస్కమ్‌లకు) దక్కుతుంది.

పేరుకుపోతున్న బకాయిలు
ఈ విజయం వెనుక కొన్ని చేదు వాస్తవాలు దాగిఉన్నాయి. విద్యుదుత్పాదన కేంద్రాలు, డిస్కమ్‌లు భారీ రుణభారంతో సతమతమవుతూ, నిర్వహణ ఖర్చులను సైతం రాబట్టలేని స్థితికి చేరుకుంటున్నాయి. కొన్ని సంస్థలు బ్యాంకుల వద్ద తీసుకున్న రుణాలను తిరిగి కట్టలేక ఎగవేతదారులుగా మారాయి. ఒక అధ్యయనం ప్రకారం దేశంలో 34 విద్యుదుత్పాదన కేంద్రాలు రూ.1.8 లక్షల కోట్ల రుణ భారం మోస్తున్నాయి. వీటి నుంచి విద్యుత్తు కొని వినియోగదారులకు పంపిణీ చేసే డిస్కమ్‌లు బిల్లులను సకాలంలో చెల్లించకపోవడం, ఆలస్యంగా చెల్లించడం, చాలా సందర్భాల్లో ఎగవేయడం వల్ల విద్యుత్కేంద్రాల నష్టాలు కొండలా పెరిగిపోయాయి.

దేశం మొత్తం మీద డిస్కమ్‌లపై ఆర్థిక భారం గణనీయంగా తగ్గిందనే కారణాన్ని చూపి, కేంద్రం ఉదయ్‌ పథకం విజయవంతమైందని చెప్పుకొంటోంది. అయితే విద్యుత్‌ పంపిణీ సంస్థలపై ఆర్థికేతర ఒత్తిళ్లు ఉన్నాయనే సంగతిని విస్మరించింది. రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత విద్యుత్‌ వంటి పథకాలతో డిస్కమ్‌లను విషమ స్థితిలోకి నెట్టేస్తున్నాయి. ఉదయ్‌ పథకాన్ని ప్రారంభించడానికి ముందు డిస్కమ్‌ల స్థూల సాంకేతిక, వాణిజ్య (ఏటీఅండ్‌సీ) నష్టాలు 22 శాతం ఉండగా, గత ఆర్థిక సంవత్సరాంతానికి అవి 19.72 శాతానికి తగ్గాయి. ఇంతా చేసి ఈ తగ్గుదల కేవలం 2.3 శాతమే. ఈ తరహా నష్టాలను గణనీయంగా తగ్గించడంలో ఉదయ్‌ విజయవంతం కాలేదు. ప్రసార లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, మీటర్లలో లోపాల వల్ల సాంకేతిక నష్టాలు సంభవిస్తాయి. వీటిని 15 శాతానికి పరిమితం చేయాలని ఉజ్వల పథకం లక్షించినా వాస్తవంలో అంతకన్నా ఎక్కువ నష్టం వస్తోంది. గత పదేళ్లలో ఏటీఅండ్‌సీ (సాంకేతిక, వాణిజ్య) నష్టాలు సగటున 20-30 శాతంగా లెక్కతేలతాయి. వీటిని తగ్గించాలని ఎన్నో పథకాలు వేసినా అవన్నీ కాగితాల మీదే మిగిలిపోయాయి.

రాజకీయ అనివార్యతలు, జనాకర్షణ పథకాలు డిస్కమ్‌లకు శాపంగా మారుతున్నాయి. రాయితీపై విద్యుత్‌ సరఫరా, ఉచిత విద్యుత్‌ సరఫరా వంటి జనాకర్షక విధానాలు డిస్కమ్‌ల ఆర్థిక స్తోమతను దెబ్బతీస్తున్నాయి. తెలంగాణలో ఉచిత విద్యుత్‌ సరఫరా వల్ల డిస్కమ్‌లకు సుమారు రూ.7,100 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు రూ.6,000 కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనా. నష్టాల బారి నుంచి డిస్కమ్‌లను ఒడ్డెక్కించాలని ఉజ్వల్‌ పథకం ఆశించింది. డిస్కమ్‌లు సాంకేతిక, వాణిజ్య నష్టాలను తగ్గించుకోవడంతోపాటు సబ్సిడీలను 20 శాతానికి పరిమితం చేయాలని అది సిఫార్సు చేసింది. అంతకు మించి ఛార్జీలను పెంచితే తప్ప డిస్కమ్‌లు ఆర్థికంగా కుదుటపడవని తేల్చింది. కానీ, ఛార్జీలు పెంచినంత మాత్రాన అవి ఒడ్డున పడబోవని మహారాష్ట్ర, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల అనుభవం చెబుతోంది. మహారాష్ట్రలో అధికంగా ఛార్జీలు వసూలు చేస్తున్నా, అక్కడి డిస్కమ్‌లు మరే రాష్ట్రంలోనూ లేనంత ఎక్కువ నష్టాలను మూటగట్టుకున్నాయి. ఆంధ్ర, తెలంగాణలలో గరిష్ట వినియోగానికి ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తున్నా, సాంకేతిక, వాణిజ్య నష్టాలూ తక్కువగానే ఉన్నా డిస్కమ్‌లు నష్టాల పాలయ్యాయి. ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్‌ కొనుగోలుకు ఎక్కువ ఛార్జీలు చెల్లించడం ఇందుకు కారణం. గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లో ఛార్జీలు తక్కువే అయినా డిస్కమ్‌లు లాభాల్లో ఉన్నాయి. గుజరాత్‌లో గ్రామాలకు ప్రత్యేక ఫీడర్‌ లైన్లు వేయడం, వ్యవసాయంలో విద్యుత్‌ చౌర్యాన్ని అరికట్టడం, గ్రామాలకు మీటర్లపై సరఫరా చేయడం, డిస్కమ్‌లను విభజించి స్వయంప్రతిపత్తి కల్పించడం, రాజకీయ జోక్యాన్ని నివారించడం వల్ల అవి లాభాలు పొందుతున్నాయి.

నిరంతర సరఫరాతో నష్టాలు తగ్గుదల
విద్యుదుత్పాదనలో దేశం క్రమంగా స్వయం సమృద్ధమై మిగులు సాధించబోతోంది. గిరాకీ-సరఫరాల మధ్య వ్యత్యాసం క్రమంగా తగ్గిపోవడం దీనికి నిదర్శనం. మిగులును సమర్థంగా వినియోగించుకుంటే డిస్కమ్‌ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ప్రస్తుతం గృహ, పారిశ్రామిక వినియోగదారులకు విద్యుత్‌ నిరాటంకంగా సరఫరా కావడం లేదు. ఇలా అరకొరగా సరఫరా చేయడం వల్ల డిస్కమ్‌లు నష్టాల బారిన పడుతున్నాయి. ఇటీవలి కాలంలో విద్యుదుత్పాదన, స్థాపిత సామర్థ్యం మెరుగుపడినందున గిరాకీ-సరఫరాల మధ్య తేడా తగ్గుతోంది. పెద్దగా అంతరాయాలు లేకుండా సరఫరా చేయగలుగుతున్నారు. నిరంతరాయ సరఫరా చేసినప్పుడల్లా డిస్కమ్‌ల నష్టాలూ తగ్గాయి. గడచిన రెండేళ్లలో ఉజ్వల్‌ పథకం డిస్కమ్‌ల వార్షిక నష్టాలను 70 శాతం (రూ.17,350 కోట్ల) మేరకు తగ్గించింది. నిరాటంక సరఫరా వల్ల గృహ, పారిశ్రామిక వినియోగదారుల నుంచి ఎక్కువ ఆదాయం రావడం దీనికి ప్రధాన కారణం. విద్యుదుత్పాదన సంస్థలు ఉత్పత్తి పెంచుకోవడం వల్ల నిరంతరాయ సరఫరా సాధ్యపడింది. ఇందుకు వాటిని అభినందించాల్సిందే. ఇప్పుడు పరిస్థితి అనుకూలంగా ఉన్నందున విద్యుదుత్పాదన సంస్థలు, డిస్కమ్‌లు ఆర్థికంగా బలోపేతం కావడానికి తగు వ్యూహాలను రూపొందించి, అమలు చేయాలి. సాంకేతిక, వాణిజ్య నష్టాలను తగ్గించుకోవాలి. విద్యుదుత్పాదన, సరఫరా పరిస్థితి ఏమాత్రం దెబ్బతిన్నా విద్యుత్‌ రంగం మళ్లీ సంక్షోభంలో కూరుకుపోతుంది. భారత్‌లో తయారీ (మేకిన్‌ ఇండియా) పథకం పురోగమిస్తున్న కొద్దీ విద్యుత్తుకు గిరాకీ పెరుగుతుంది. దేశం పారిశ్రామికంగా పురోగతి సాధించాలంటే గిట్టుబాటు ధరలకు నిరాటంకంగా విద్యుత్‌ సరఫరా జరగాలి!

ఉపయోగపడని ‘ఉదయ్‌’
నష్టాల సమస్యను పరిష్కరించడానికి కేంద్ర సర్కారు 2015లో చేపట్టిన ఉజ్వల్‌ డిస్కమ్‌ భరోసా పథకం (ఉదయ్‌) వల్ల ఇంకా ఆశించిన ఫలితాలు రాలేదు. 2018 జనవరి నుంచి డిసెంబరు వరకు డిస్కమ్‌లు ప్రభుత్వ, స్వతంత్ర విద్యుదుత్పత్తిదారులకు రూ. 26,306 కోట్ల మేరకు బకాయి పడ్డాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్‌ డిస్కమ్‌లు చెల్లించాల్సిన బిల్లులు రూ.3,239 కోట్లు కాగా, తెలంగాణలో రూ.3,999 కోట్ల బకాయిలు ఉన్నాయి.


- సత్యపాల్‌ మెనన్‌
Posted on 08-07-2019