Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఆర్థిక రంగం

ఆలోచనే అసలు పెట్టుబడి

* అంకుర పరిశ్రమలు- ప్రోత్సాహక మార్గాలు

ప్రస్తుతం ఉద్యోగార్థుల అడ్డాగా ఉన్న భారత్‌ను ఉద్యోగ సృష్టికర్తల గడ్డగా మార్చడానికని 2016లో ఎన్డీయే ప్రభుత్వం అట్టహాసంగా స్టార్టప్‌ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించింది. భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రణాళిక అయితే ఏకంగా 50,000 అంకుర (స్టార్టప్‌) పరిశ్రమలను, వాటికి వెన్నుదన్నుగా 500 కొత్త ఇంక్యుబేటర్లు, ఫెసిలిటేటర్లను నెలకొల్పుతామని, 100 నవీకరణ మండలాలను స్థాపిస్తామని వాగ్దానం చేసింది. ఈ ఏటి బడ్జెట్‌లో అంకుర పరిశ్రమలకు ఊతమిచ్చే ప్రతిపాదనలు కొన్ని ఉన్నాయి. దూరదర్శన్‌ ఛత్రం కింద అంకుర పరిశ్రమలకు కావలసిన సమాచారాన్ని అందించడానికి ప్రత్యేక ఛానల్‌ ప్రారంభిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. కిరాణా సరకులు, ఈ-కామర్స్‌, ఆహార పదార్థాల బట్వాడా విభాగాల్లో అంకుర పరిశ్రమల స్థాపనకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలను సడలించారు. ఎలక్ట్రిక్‌ వాహనాల పరిశ్రమలో అంకుర పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహకాలు కల్పించారు. ఫైనాన్స్‌ టెక్నాలజీ రంగంలో అంకుర పరిశ్రమల విస్తరణకు వీలు కల్పించే విధంగా డిజిటల్‌ చెల్లింపుల విధానానికి తగు మార్పుచేర్పులు చేశారు. ఆదాయ పన్ను విభాగం నుంచి ఏంజెల్‌ పన్ను విషయంలో చిక్కులు చికాకులను నివారించే చర్యలు తీసుకున్నారు. బడ్జెట్‌కు ముందు పరిస్థితిని చూస్తే పారిశ్రామిక విధానం-ప్రోత్సాహక విభాగం (డీఐపీపీ) 2018 వరకు 14,036 అంకుర పరిశ్రమల దరఖాస్తులను ఆమోదించిందని ప్రభుత్వ నివేదిక తెలిపింది. స్టార్టప్‌ ఇండియా కేంద్రం 660 అంకుర పరిశ్రమల స్థాపనకు సలహాసహకారాలు అందజేసింది. అంకుర పరిశ్రమలకు నిధులు అందించడానికి ప్రభుత్వం చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు (సిడ్బి)కి రూ.10,000 కోట్ల మహానిధిని సమకూర్చింది. మరో 32 ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధులకు రూ.1,611 కోట్లు అందించింది. ఈ సంస్థలు 170 అంకుర పరిశ్రమల ఆవిర్భావానికి నిధులు ఇచ్చాయి. కొత్త కొత్త ఆలోచనలు చేసే పాఠశాల విద్యార్థుల కోసం ప్రయోగశాలలను నెలకొల్పడానికి ప్రభుత్వం నిధులిచ్చింది. ఈ పథకం కింద 5,441 పాఠశాలల్లో 5,000 ప్రయోగశాలలను నెలకొల్పి, వాటికి తలా రూ.12 లక్షల చొప్పున గ్రాంట్లు మంజూరు చేసింది. ఇంతా చేసినా, దేశంలో అంకుర పరిశ్రమల విప్లవం సంభవించిందని చెప్పలేం.

ఆశయం ఆచరణల మధ్య అగాధం
దేశంలో వ్యవస్థాపక సామర్థ్యానికి కొదవ లేదు. దానికి కార్యరూపం ఇవ్వడంలో మాత్రం చాలావరకు విఫలమవుతున్నాం. అంకుర పరిశ్రమలను విజయవంతంగా నడిపే కార్యశూరుల వల్ల ఇతరులకు ఉపాధి అవకాశాలు, దేశానికి పన్నుల వసూళ్లూ పెరుగుతాయి. వారికి తగు అండదండలిచ్చే బాధ్యత మాత్రం ప్రభుత్వం తీసుకోవాలి. ప్రాథమిక రంగమైన వ్యవసాయం, గనులు, ద్వితీయ రంగమైన పరిశ్రమలు, నిర్మాణ కార్యక్రమాలకన్నా తృతీయ రంగమైన సేవారంగమే అంకుర సంస్థలకు అత్యంత అనువైనది. నేడు దేశంలో ఉన్న 5.85 కోట్ల వ్యాపార, పారిశ్రామిక సంస్థల్లో 57.68 శాతం సేవారంగంలోనే ఉన్నాయి. వాటిలో అంకుర పరిశ్రమల శాతం ఇప్పటికీ స్వల్పమే. సమర్థంగా నడిచే అంకుర సంస్థలు భారీయెత్తున ఉద్యోగాలు కల్పించగలవు. ఓలా, ఫ్లిప్‌కార్ట్‌ సంస్థలు దీనికి విశిష్ట ఉదాహరణలు. నేడు ఈ రెండు సంస్థలు చిన్న పట్టణాలు మొదలు, మహా నగరాల వరకు వేలాది ఉపాధి అవకాశాలను కల్పించాయి. ఏదైనా అంకుర పరిశ్రమ 100 కోట్ల డాలర్ల (రూ.7,000 కోట్ల) విలువను అందుకొంటే, దాన్ని యూనికార్న్‌ అంటారు. 2024కల్లా 100 యూనికార్న్‌లను స్థాపించాలని భారత్‌ లక్షిస్తోంది. అది నెరవేరడానికి తగిన వాతావరణం దేశంలో నెలకొన్నప్పుడు పెట్టుబడులు పెద్దయెత్తున ప్రవహించి వ్యవస్థాపకులను వెన్నుతట్టి ముందుకు నడిపిస్తాయి. అందుకు తగిన విధానాలను ప్రభుత్వం రూపొందించి అమలు చేయాలి. వాస్తవంలో అలా జరగడం లేదు. అంకుర పరిశ్రమలను ప్రోత్సహించడానికి రూ.10,000 కోట్లతో నెలకొల్పిన మహా నిధి నిర్వహణ బాధ్యతను సిడ్బికి అప్పగించడం పొరపాటు. సిడ్బి అనేది కేవలం రుణాలిచ్చే సంస్థ తప్ప, నష్టాలకు వెరవకుండా అంకుర సంస్థలకు నిధులు సమకూర్చే సాహసిక స్వభావం దానికి లేదు. ఇంతవరకు చిన్న పరిశ్రమలకు, మైక్రో ఫైనాన్స్‌ కంపెనీలకు, ఇతర చిన్న వ్యాపారాలకు మాత్రమే నిధులిచ్చిన చరిత్ర సిడ్బిది. నవీకరణ సారథులైన అంకుర పరిశ్రమలకు నిధులిచ్చి ముందుకు నడపడానికి అది సరైన సంస్థ కాదు. కొత్త ఆలోచనలకు పాదు చేసి, వాటిని ఆచరణలోకి తీసుకురావడంలో కష్టనష్టాలను బేరీజు వేసి, విజయావకాశాలను అంచనా వేయగల ప్రత్యేక సంస్థకు అంకుర పరిశ్రమల బాధ్యతను అప్పగించి ఉండాల్సింది. ఒక అంకుర సంస్థ విజయానికి పెట్టుబడులే కీలకం కావు. అవి చివరి మెట్టు మాత్రమే. మొదట ఒక ఆలోచన మెదలాలి, అది ఆచరణీయమైనదై ఉండాలి, విపణిలో నెగ్గగలిగేదై ఉండాలి. అప్పుడు పెట్టుబడులు సమకూర్చుకుని పకడ్బందీగా అమలు చేయాలి. అది విజయవంతం కాగానే మలి అంచెకు వ్యాపారాన్ని విస్తరించగలగాలి. ఈ లక్షణాలన్నీ ఉన్న సంస్థను ప్రోత్సహించడానికి ప్రత్యేక సంస్థను నెలకొల్పడమే ఉత్తమం. కానీ, భారత్‌లో ఈ ప్రక్రియ సక్రమంగా సాగడం లేదు. అంతర్జాతీయంగా మూడు విభాగాలు (విశ్వవిద్యాలయాలు, సైన్యం, ప్రభుత్వ-ప్రైవేటు రంగ సంస్థలు, వ్యక్తులు) ఆర్థికంగా, పరిశోధనల పరంగా ఇచ్చే అండదండలే అంకుర సంస్థల విజయానికి కీలకమవుతున్నాయి. అన్నింటినీ మించి విద్యా వ్యవస్థ పటిష్ఠంగా ఉండాలి. సొంతంగా, సృజనాత్మకంగా ఆలోచించే మెరికల్లాంటి యువతను విద్యావిధానం తయారు చేయగలగాలి. అంటే మన విశ్వవిద్యాలయాలు, కళాశాలలు నిజమైన విజ్ఞాన సముపార్జన కేంద్రాలుగా, ప్రతిభావంతులను ప్రోత్సహించే ప్రయోగశాలలుగా ఎదగాలి. సృజనశీలురు తమ భావాలను ఆచరణలో పెట్టగల వాతావరణాన్ని విద్యాసంస్థలు, ప్రభుత్వం కల్పించాలి. భారతదేశంలో సరిగ్గా ఇదే కొరవడింది. మన విద్యావ్యవస్థ కులం, మతం, ప్రాంతీయ భేదాల్లో కూరుకుపోయి కొత్త భావాలను వికసించనివ్వడం లేదు. బట్టీ చదువులకు, మార్కులకు పెద్ద పీట వేస్తూ సృజనాత్మకంగా, విమర్శనాత్మకంగా ఆలోచించే సత్తాను ఎదగనివ్వడం లేదు.

అనుకరణలతో చేటు
విద్యకు కేవలం ఎక్కువ నిధులిస్తే చాలదు. పైన చెప్పుకొన్న లోపాలను తొలగించడం చాలా ముఖ్యం. విదేశాల్లో అంకురాల వ్యవస్థాపకులు స్థానిక సామాజిక, ఆర్థిక అవసరాలను తీర్చగల వ్యాపారాలను, పరిశ్రమలను స్థాపించి నెగ్గుకొచ్చారు. స్థానిక పరిస్థితులను సునిశితంగా విశ్లేషించే సామర్థ్యాన్ని వారికి అలవరచింది విద్యారంగమే. ఈ సత్తా మన దేశంలో కనిపించడం లేదు. పాశ్చాత్య దేశాల్లో, ముఖ్యంగా అమెరికాలో విజయవంతమైన నమూనాలనే మనవాళ్లు అనుకరించి అంకురాలు స్థాపిస్తున్నారు. కానీ, అమెరికా నమూనాల అనుకరణకన్నా వాటి విజయానికి దోహదపడిన అంశాలను అలవరచుకోవడం చాలా చాలా ముఖ్యం. మొదట- విద్యార్థులను వ్యవస్థాపకులుగా తీర్చిదిద్దడమెలా అన్నది అమెరికాలోని స్టాన్‌ఫర్డ్‌, ఎమ్‌ఐటీ, హార్వర్డ్‌, క్యాలిఫోర్నియా విశ్వవిద్యాలయాల నుంచి నేర్చుకోవాలి. ఈ నాలుగు విశ్వవిద్యాలయాలు కలిసి 2006-2018 మధ్యకాలంలో 9,621 కోట్ల డాలర్ల మూలధనాన్ని సేకరించి 3,770 కంపెనీల స్థాపనకు తోడ్పడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా 25 అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలు ఇదే కాలంలో 28,800 కోట్ల డాలర్లకు పైగా మూలధనాన్ని సమీకరించి 11,481 కంపెనీల ఆవిర్భావానికి ఊతమిచ్చాయి. ఈ 25 విశ్వవిద్యాలయాల్లో రెండు ఇజ్రాయెల్‌లో ఉంటే, మిగతావన్నీ అమెరికాలోనే ఉన్నాయి. ప్రపంచంలో అత్యధిక అంకుర సంస్థలను స్థాపించిన ఘనత స్టాన్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయ విద్యార్థులకే దక్కుతుంది. ఒక్క 2018లోనే 1,178 మంది స్టాన్‌ఫర్డ్‌ వ్యవస్థాపకులు 1,015 అంకుర సంస్థలను స్థాపించారు.

అమెరికా, ఇజ్రాయెల్‌, రష్యా, చైనాలతోపాటు పలు పాశ్చాత్య దేశాల్లో సైన్యం నూతన ఆవిష్కరణలను, వాటిని ఆచరణలోకి తీసుకొచ్చే అంకుర సంస్థలను ప్రోత్సహిస్తాయి. అమెరికా సైన్యం, జాతీయ భద్రతా సంస్థ (ఎన్‌ఎస్‌ఏ)లు ఈ విషయంలో అగ్రగణ్యులు. భావి యుద్ధాల్లో గెలిపించే అస్త్రశస్త్రాల కోసం అవి పరిశోధనలకు, అంకురాలకు నిధులు, ఇతర విధాలైన అండదండలనిస్తున్నాయి. నేడు ప్రపంచంలో మేటి సంస్థలుగా నిలుస్తున్న ఫేస్‌బుక్‌ తదితర సంస్థలకు ఈ అండదండలే ఊతమిచ్చాయి. చైనా, రష్యా, ఇజ్రాయెల్‌ దేశాలు కృత్రిమ మేధ, సైబర్‌ భద్రత, బయోమెట్రిక్స్‌ వంటి అధునాతన సాంకేతికతల సృష్టి, అన్వయాల కోసం పరిశోధకులను, అంకురాలను ప్రోత్సహిస్తున్నాయి. ఇజ్రాయెల్‌ సైన్యం దీనికి ఏకంగా ‘యూనిట్‌ 8,200’ అనే ప్రత్యేక విభాగాన్ని నెలకొల్పింది. అది విశ్వవిద్యాలయాలతో, పరిశోధక సంస్థలతో కలిసి నవతరం ఆయుధ వ్యవస్థల రూపకల్పనకు కృషి చేస్తుంది. చిన్న విషయానికి, పెద్ద విషయానికి పాశ్చాత్య దేశాలను అనుకరించే భారతదేశం అంకుర సంస్థల విషయంలోనూ ఉత్తమ గుణాలను అలవరచుకోవలసిన సమయమిది.

వనరులు పరిమితం
దేశ ప్రజానీకంలో వ్యవస్థాపక సామర్థ్యం దండిగా ఉన్నా అంకుర పరిశ్రమలు ఊపందుకోవడం లేదు. అవి వికసించే వాతావరణం ఇక్కడ లేకపోవడం ప్రధాన లోపం. ఇతర దేశాల్లో అంకురాలు ఎలా విజయవంతమవుతున్నాయో తెలుసుకోవడం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా అమెరికా, ఇజ్రాయెల్‌ దేశాల విజయాలు ఎంతో స్ఫూర్తిదాయకం. చైనాలోనూ అనేక అంకురాలు భారీ సంస్థలుగా విస్తరించినా, ప్రభుత్వం ఆర్థికంగా, సాంకేతికంగా, ఇతరత్రా అందించిన భూరి సహాయంతోనే అది సాధ్యపడింది. అంకుర సంస్థలకు చైనా అడుగడుగునా అండదండలిస్తోంది. భారత్‌ వంటి వర్ధమాన దేశాలు అంత సహాయం అందించలేకపోవచ్చు. తన దగ్గర ఉన్న పరిమిత వనరులను వివిధ రంగాలకు కేటాయించవలసి ఉన్నందున చైనా మాదిరిగా భారత్‌ అంకురాలకు మరీ పెద్ద మొత్తాలను మంజూరు చేయలేకపోవచ్చు.


Posted on 09-07-2019