Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఆర్థిక రంగం

సంస్కరణలకు చోటేది?

* నిరాశపరచిన కేంద్రబడ్జెట్‌

సార్వత్రిక ఎన్నికల్లో గణనీయమైన మెజారిటీ సాధించి మలిదఫా అధికారం చేపట్టిన ఎన్డీయే ప్రభుత్వం సమర్పించే మొట్టమొదటి బడ్జెట్‌ సాంతం సంస్కరణలతో కళకళలాడుతుందని ఆశించినవారికి నిరాశే మిగిలింది. కార్పొరేట్‌ పన్నులకు భారీగా కోతపెట్టడం, పన్నుల వ్యవస్థలో సమూల మార్పులకు చోటుపెట్టడం, భూ సంస్కరణలకు లాకులెత్తడం వంటి చర్యలేవీ కేంద్ర బడ్జెట్లో కనిపించలేదు. కార్మిక చట్టాలను నాలుగు భాగాల కింద వర్గీకరించడాన్ని మినహాయిస్తే- బడ్జెట్‌ సమర్పణలో ఎప్పటిలాగే కేంద్ర ప్రభుత్వం క్రమానుగత మార్పుల విధానానికి కట్టుబడి వ్యవహరించిందనే చెప్పవచ్చు. నాలుగు నెలల క్రితం ఎన్నికలకు ముందు సమర్పించిన అనామతు పద్దులో ఆదాయ పన్ను విషయంలో మధ్యతరగతి జీవులకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చింది. ఈసారి బడ్జెట్లో మాత్రం పెట్రోలు, డీజిల్‌ ధరల రూపంలో సగటుజీవులపై కేంద్ర ప్రభుత్వం అదనపు భారం మోపింది. ముఖ్యంగా డీజిల్‌ ధరలు పెరిగితే ఆ ప్రభావం అన్ని వస్తు సేవలపైనా పడుతుంది. మరోవంక వర్షాభావ పరిస్థితులు కలవరపెడుతున్నాయి. దీనివల్ల వ్యవసాయ దిగుబడులు తగ్గి, సేద్య ఉత్పత్తుల ధరలు పెరిగితే సమస్యలు మరింత ముమ్మరిస్తాయి. బంగారంపై రెండున్నర శాతం దిగుమతి సుంకం పెంచడం సగటు జీవిని ఏదోస్థాయిలో నిరాశపరచింది. మరోవంక 2020 మార్చి వరకు తీసుకునే గృహరుణాలపై వడ్డీల తగ్గింపు ద్వారా మధ్యతరగతి జీవులకు పరిమితంగానైనా ఊరట లభించిందని చెప్పవచ్చు.

పన్ను రిటర్నుల దాఖలు విషయంలో పాన్‌ స్థానే ‘ఆధార్‌’నూ అనుమతించడం లక్షల సంఖ్యలోని వేతన జీవులకు సంతోషం కలిగించిన పరిణామం. పన్ను వివరాల తనిఖీ వ్యవహారాన్ని పూర్తిగా డిజిటలీకరించే దిశగా ఈ బడ్జెట్లో అడుగులు పడ్డాయి. ‘ఓటాన్‌ అకౌంట్‌’ పద్దులో విత్త లోటును జీడీపీలో 3.4శాతానికి పరిమితం చేయాలని నిర్ణయించుకోగా- ప్రస్తుత బడ్జెట్లో ఆ లక్ష్యాన్ని నిర్మలా సీతారామన్‌ 3.3శాతానికి కుదించడం హర్షించదగిన విషయమే. పన్ను ఆదాయం పెరగని పక్షంలో విత్తలోటు లక్ష్యాలను చేరుకోవడం సాధ్యమయ్యే పనికాదు. మరోవంక అందుకోసం వ్యయ నియంత్రణపైనా ప్రభుత్వం గట్టిగా దృష్టి సారించాల్సి ఉంటుంది. రోడ్లు, జాతీయ రహదారుల నిర్మాణానికి కేటాయింపులు కొంతమేర తగ్గినప్పటికీ- పెట్రోలు, డీజిల్‌లపై లీటరుకు ఒక రూపాయి సుంకం పెంచడం ద్వారా రహదారి రంగంపై ఆ మేరకు పడే లోటును పూరించే ప్రయత్నాలు చేశారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో సాగుతున్న తరుణమిది. అమెరికా, చైనాల వాణిజ్య యుద్ధం ప్రమాద సంకేతాలను పంపిస్తున్నాయి. ఎంతకూ తెగని ‘బ్రెగ్జిట్‌’ వ్యవహారం ఐరోపా ఆర్థికాన్ని డోలాయమానంలో ఉంచింది. పశ్చిమాసియాపై యుద్ధమేఘాలు ముసురుకుంటున్నాయి. అంతర్జాతీయ పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు- మనం స్వావలంబనపైనే ప్రధానంగా దృష్టి పెట్టాలి. దేశీయ ఉత్పత్తి రంగానికి సానపట్టి, వృద్ధికి చురుకుపుట్టిస్తే- ఎగుమతులు కొత్తపుంతలు తొక్కుతాయి. ఇనుమడిస్తున్న పెట్టుబడి వ్యయాలు, విస్తరిస్తున్న అస్థిరత కారణంగా పెట్టుబడిదారులు పెద్దయెత్తున చైనాను వదిలి సురక్షిత మార్కెట్లకు తరలిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాల్సి ఉంది. ప్రపంచస్థాయి ‘బ్రాండ్‌’లను భారత్‌ బాటపట్టించేందుకు ఈ బడ్జెట్లో కొంతమేరకు రాయితీలను ప్రకటించారు. మౌలిక సౌకర్యాలను భారీగా విస్తరించడంతోపాటు విదేశీ పెట్టుబడిదారులకు అనువైన వాతావరణాన్ని కల్పించకుండా- ఏవో చిన్నపాటి రాయితీలను ప్రకటించినంత మాత్రాన దేశంలోకి పెట్టుబడులు ప్రవహిస్తాయనుకోవడం పొరపాటు. బహుళజాతి వాణిజ్య కంపెనీల (ఎమ్‌ఎన్‌సీల)కు అనుకూల వాతావరణం కల్పించే విషయంలో చైనా ప్రభుత్వం అద్భుతమైన విధానాలను రూపొందించి, అమలుపరుస్తోంది. ‘బీజింగ్‌’ అనుభవాలనుంచి పాఠాలు నేర్చుకొని విదేశీ పెట్టుబడులను ఆహ్వానించడంలో భారత్‌ సైతం కొత్త పుంతలు తొక్కాలి.

కార్పొరేట్‌ కంపెనీల్లో పబ్లిక్‌ షేర్‌ హోల్డింగ్‌ పరిమితిని 25శాతం నుంచి 35శాతానికి పెంచడం దేశంలోని అన్ని రంగాలకు చెందిన సుమారు వెయ్యి కంపెనీలను ప్రభావితం చేసే నిర్ణయం. దీంతో ఇకమీదట అన్ని లిస్టెడ్‌ కంపెనీలూ కనీసం 35శాతం షేర్లను ఔత్సాహికుల కోసం అందుబాటులో ఉంచాలి. దీనివల్ల ఆయా కంపెనీల్లో ‘ప్రమోటర్ల’ వాటా తగ్గిపోతుంది. దేశంలోని అనేక కార్పొరేట్లకు నిరాశ కలిగించే పరిణామమిది. పాతిక శాతం కనిష్ఠ కార్పొరేట్‌ పన్ను పరిధిలోకి 400 కోట్ల రూపాయల వార్షిక టర్నోవరు కలిగిన కంపెనీలను చేర్చడం హర్షించదగిన నిర్ణయమనే చెప్పాలి. దీంతో గతంలో ఉన్న 30శాతం పన్ను చెల్లింపు పరిధిలోకి కేవలం 0.7శాతం కంపెనీలు మాత్రమే వస్తాయి. శిలాజ ఇంధన వినియోగాన్ని తగ్గించడంకోసం ఎలక్ట్రిక్‌ వాహనాల కొనుగోలుకు ప్రోత్సాహకాలు అందించడం ఆహ్వాదించదగిన చర్య. 2022నాటికి దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్‌ వాహనాలను విస్తరించే లక్ష్యంతో ప్రభుత్వం చెప్పుకోదగ్గ ప్రయత్నాలే చేస్తోంది. మరోవంక ప్రభుత్వ రంగ సంస్థలనుంచి లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులను ఉపసంహరించుకోవాలన్న ప్రభుత్వ లక్ష్యమూ అసాధ్యం కాదనే అనిపిస్తోంది. మొత్తంగా ఆర్థిక సంస్కరణల కోణంలో చూస్తే ఇవన్నీ చిన్నపాటి ముందడుగులు గానే కనిపిస్తాయి. ఈ వేగంతో ముందుకువెళ్తే 2022నాటికి అయిదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని చేరుకోవడం సాధ్యమయ్యే పనికాదు!


- వీరేంద్రకపూర్‌
Posted on 10-07-2019