Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఆర్థిక రంగం

అవగాహనే అసలైన మందు

* నేడు ప్రపంచ జనాభా దినోత్సవం

ప్రపంచవ్యాప్తంగా జనాభా పెరుగుతోంది. ప్రతి దేశంలోనూ ఏటా జనసంఖ్యలో ఎంతో కొంత వృద్ధి నమోదవుతోంది. ఆసియా దేశాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా కనపడుతోంది. భారత్‌ ఇందుకు మినహాయింపేమీ కాదు. జనాభా నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నా పూర్తిస్థాయిలో వృద్ధిని నివారించలేకపోతున్నాయి. దక్షిణాది రాష్ట్రాల కన్నా ఉత్తరాది రాష్ట్రాల్లోనే జనాభా పెరుగుదల అధికంగా ఉంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వాలకు పెనుసవాల్‌గా మారింది. తాగునీరు, రహదారులు, విద్యుత్‌ వంటి సౌకర్యాల కల్పన కోసం పెద్దయెత్తున నిధులు వెచ్చించాల్సి వస్తోంది. ఇది ప్రభుత్వాలకు పెనుభారంగా మారుతోంది.

ప్రపంచ జనాభా 1987 జులై 11 నాటికి 500 కోట్లు దాటిందని ఐక్యరాజ్యసమితి అధ్యయనంలో తేలింది. దీనితో 1989 నుంచి జూలై 11వ తేదీని ప్రపంచ జనాభా దినోత్సవంగా పాటిస్తున్నారు. అప్పటి నుంచి పెరుగుతున్న జనాభా వల్ల కలిగే ఇబ్బందులు, ఇతర అంశాలపై ఐరాస దృష్టి సారించింది. జనాభాను తగ్గించడంతోపాటు, లైంగిక సమానత్వం, ప్రజనన (పునరుత్పత్తి) ఆరోగ్యం ధ్యేయంగా జనాభా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. కుటుంబ నియంత్రణ పద్ధతులు, వాటికి సంబంధించిన సమాచారం, సేవల అందుబాటు, సేవల్లో నాణ్యత, శాస్త్రీయత ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు లభించాలని ఐక్యరాజ్యసమితి పేర్కొంటోంది. అయిదు శతాబ్దాల క్రితం ప్రపంచ జనాభా సుమారు 50 కోట్లుగా ఉండేది. 1700 సంవత్సరానికి 70 కోట్లు, 1800 నాటికి 95 కోట్లు, 1900 నాటికి 160 కోట్లు, 2000 సంవత్సరానికి 600 కోట్లకు చేరుకుంది. నేడు అది 730 కోట్లయింది. అత్యధిక పెరుగుదల గత శతాబ్దంలోనే నమోదైంది. మున్ముందు వెయ్యికోట్లకు చేరుకునే అవకాశం ఉంది.భారత్‌లోనూ జనాభా పెరుగుతోంది. దేశంలో 1871 నుంచి జనాభా లెక్కల సేకరణ ప్రారంభమైంది. 1881లో లార్డ్‌ రిప్పన్‌ అధ్వర్యంలో జరిగిన గణన మేరకు భారత ఉపఖండ జనాభా 28.80 కోట్లు. నేడు 136 కోట్ల జనాభాతో భారత్‌ ప్రపంచంలో చైనా తరవాత రెండో స్థానంలో ఉంది. మరో దశాబ్దంలో చైనాను అధిగమించనుందని అంచనా.

దేశంలో శిశు మరణాల సంఖ్య రెండు దశాబ్దాల క్రితం వెయ్యికి 68 ఉండగా, నేడు అది 34కు తగ్గింది. జనాభా పెరుగుదల ప్రస్తుతం భారత్‌లో 1.13 శాతంగా ఉంది. ప్రతి వెయ్యిమందికి 18.7 మంది జన్మిస్తుండగా, 7.3 మంది మరణిస్తున్నారు. ఏటా లక్షన్నర మంది రోడ్డుప్రమాదాల్లో, మరో లక్షన్నర మంది ఆత్మహత్యలతో ఈ లోకాన్ని వీడుతున్నట్లు అంచనా. దాదాపు ఇంతే సంఖ్యలో హత్యల కారణంగా చనిపోతున్నారు.

ఆదర్శ జనాభా ఎంత అనే అంశంపై ఎన్నో ఏళ్లుగా పరిశోధనలు జరుగుతున్నాయి. లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనమిక్స్‌కు చెందిన ఎడ్విన్‌ కానన్‌, కార్స్‌ శాండర్స్‌ పరిశోధన ప్రకారం ఒక ప్రాంతంలోని వనరులు, వాటిని ఉపయోగించుకునే జనాభా, వారి సాంకేతిక సామర్థ్యాన్ని అంచనా వేసి, అక్కడ ఎంత జనాభా ఉండవచ్చో లెక్కగట్టారు. రెండువేల సంవత్సరాల క్రితం ప్రపంచ జనాభాను 30 కోట్లుగా చరిత్రకారులు లెక్కగట్టారు. ఇప్పుడు ప్రపంచ జనాభా 700 కోట్లు దాటింది. జనాభా పరిమితికి మించినదని చెప్పవచ్చు.

ఐక్యరాజ్యసమితి జనాభా అధ్యయన నిధి సంస్థ జనాభా లెక్కలను ఎప్పటికప్పుడు మదింపు చేస్తోంది. దీని గణాంకాల ప్రకారం పూరించగల పునరుత్పత్తి స్థాయి (రీప్లేస్‌మెంట్‌ లెవెల్‌ ఫర్టిలిటీ రేటు) 2.1 గా ఉంటే తరుగుదల, పెరుగుదల లేకుండా జనాభా స్థిరంగా ఉంటుంది. ఈ ప్రాతిపదికన ప్రతి మహిళ జీవితŸకాలంలో 2.1 చొప్పున బిడ్డలకు జన్మనివ్వవచ్చు. అయితే ప్రజనన స్థాయి (ఫర్టిలిటి రేట్‌) 2.3 గా ఉంది. అందువల్ల జనాభా పెరుగుతూనే ఉంది. ప్రజనన స్థాయి దేశంలో పెద్ద రాష్ట్రాలైన ఉత్తర్‌ప్రదేశ్‌, బిహార్‌లలో 3.3, 3.1, చిన్న రాష్ట్రాలైన సిక్కిం, మణిపూర్‌ల్లో 1.2, 1.4 శాతంగా ఉండటం గమనార్హం.

ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఆర్థిక సర్వే ప్రకారం దేశంలోని వివిధ రాష్ట్రాలలో జనాభా వృద్ధిరేటు తగ్గనుంది. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణాల్లోనూ ఈ పరిస్థితి కొనసాగనుంది. అదే సమయంలో ఈ రాష్ట్రాల్లో లింగ నిష్పత్తి మెరుగుపడింది. ప్రజల ఆయుః ప్రమాణాలు పెరగడంతోపాటు మరణ శాతాలు తగ్గుతున్నాయి. ఇవి సానుకూల పరిణామాలు. ఇదే పరిస్థితి దేశవ్యాప్తంగా కొనసాగితే జనాభా పెరుగదలను నియంత్రించడం కష్టమేమీ కాదు. 2050వ సంవత్సరానికి ప్రపంచ జనాభా స్థిరీకరణ సాధ్యమవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. జనాభా నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత పకడ్బందీ కార్యాచరణతో ముందుకు వెళ్లాల్సి ఉంది. అదే సమయంలో అధిక జనాభా వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించడం అవసరం. అప్పుడే సానుకూల ఫలితాలు సమకూరతాయి!


- డాక్టర్‌ పి.వి.రంగనాయకులు
(రచయిత- తిరుమల ఎస్వీ మ్యూజియం మాజీ సంచాలకులు)
Posted on 11-07-2019