Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఆర్థిక రంగం

విదేశీ (దా)రుణాలు

అప్పును నిప్పులా భావిస్తూ, విత్తం కొద్దీ విభవం అన్న సూక్తిని పాటిస్తూ, ఉన్నంతలో నాలుగు రాళ్లు వెనకేసుకొనే పొదుపు జపం చేస్తూ నిశ్చింతగా జీవన యానం చేయడం భారతీయ సంస్కృతి. అంతర్జాతీయ రుణమార్కెట్లలో రేగే సంక్షోభాల సునామీలేవీ భారతావనిని కదలబార్చలేకపోవడానికి కారణమే అది! ‘కేంద్ర ప్రభుత్వ రుణాల్లో అత్యధికం దేశీయంగానే ఉన్నాయి... కొద్దిపాటి విదేశీ రుణమైనా అంతా రాయితీ రేట్లపై అధికారిక వ్యవస్థల నుంచే తీసుకోవడంతో అంతర్జాతీయ ఆర్థిక విపణుల ఆటుపోట్ల నుంచి దేశానికి రక్షణ లభిస్తోంది’ అని నిరుడు ఫిబ్రవరిలో ఆర్థిక మంత్రిత్వశాఖ వెలువరించిన స్థాయీపత్రంలో కేంద్రమంత్రిగా అరుణ్‌ జైట్లీయే పేర్కొన్నారు. దేశానికి ఆ ధీమాను దూరంచేసే కీలక ప్రతిపాదనను ఇటీవలి కేంద్ర బడ్జెట్లో విత్తమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. కీలక విదేశీ రుణ సూచికలు సానుకూలంగానే ఉన్నాయన్న ఆర్థిక సర్వే నివేదికాంశాలను అందిపుచ్చుకొని- విదేశీ విపణుల నుంచి నేరుగా ప్రభుత్వమే ఆయా కరెన్సీల్లో రుణాలు గ్రహించేలా బాండ్లను (సావరిన్‌ బాండ్స్‌) జారీ చేయనున్నామని విత్తమంత్రి వెల్లడించారు. స్థూల దేశీయోత్పత్తిలో విదేశీ రుణాల వాటా ప్రపంచ దేశాలతో పోలిస్తే అత్యల్పంగా అయిదు శాతం లోపే ఉండటం, అంతర్జాతీయ ఆర్థిక విపణులు స్థిరంగా కొనసాగడం, ఎటుపోయి ఎటొచ్చినా తాకిడిని తట్టుకొనేలా విదేశ మారక ద్రవ్య నిల్వలు పోగుపడటం- ఎన్‌డీఏ సర్కారు ఆలోచనా ధోరణిని ప్రభావితం చేసినట్లుంది. దేశీయంగా వడ్డీరేట్లతో పోలిస్తే, విదేశాల్లో రుణాలు చౌకగా లభ్యమవుతాయి కాబట్టి వడ్డీ భారం బాగా తగ్గుతుందని, ఇండియా వృద్ధిరేటు రేసుగుర్రాన్ని తలపిస్తున్నందువల్ల, మందగమనంతో సాగుతున్న దేశాల నుంచి రుణాలు దూసితెస్తే లాభదాయకంగా ఉంటుందని ప్రధాన ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రమణియన్‌ ఆ ప్రతిపాదనను గట్టిగా సమర్థిస్తున్నారు. ‘నేరుగా విదేశీ విపణుల నుంచి రుణాల సేకరణ’ అంశం దాదాపు మూడు దశాబ్దాలుగా చర్చల్లో నలుగుతున్నా ఇంతకాలం నేతలెవరూ సాహసించకపోవడంలోని ప్రాప్తకాలజ్ఞతను గుర్తెరిగి- ముందడుగు వెయ్యకపోవడమే ఉత్తమమంటున్న పలువురు ఆర్థికవేత్తల హెచ్చరికల్ని ఏ మాత్రం విస్మరించకూడదు!

ధనం- ఏ దేశ ప్రగతి రథానికైనా ప్రధాన ఇంధనం. 2024 నాటికి ఇండియాను అయిదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే క్రమంలో మౌలిక వసతుల రంగంలోనూ నూరు లక్షల కోట్ల రూపాయలు వ్యయీకరించాలన్నది మోదీ సర్కారు ఘనతర సంకల్పం. వృద్ధిరేటు కుంగి రెవిన్యూ రాబడులు కోసుకుపోతున్న దశలో అంతంత మొత్తాల్ని దేశీయంగా సమకూర్చుకోవడం సాధ్యంకాని పని కాబట్టి, చౌక రుణాలిచ్చే విదేశీ మార్కెట్లే కామధేనువులని కేంద్రం భావిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మార్కెట్‌ నుంచి సేకరించదలచిన స్థూల రుణాలు ఏడు లక్షల 10 వేలకోట్ల రూపాయలు; నికర అప్పులు నాలుగు లక్షల 23 వేలకోట్ల రూపాయలుగా ప్రకటించిన కేంద్రం- నిరుటితో పోలిస్తే అవి 24.3 శాతం అధికమని స్పష్టీకరిస్తోంది. అందులో 10-15 శాతాన్ని అంతర్జాతీయ విపణుల నుంచి రాబట్టాలన్నది కేంద్రసర్కారు అభిమతం. పదేళ్ల కాలావధి సార్వభౌమ రుణపత్రాలపై రాబడులు 77 శాతం లావాదేవీల్లో రెండు శాతం లోపే ఉంటున్నాయని జపాన్, జర్మనీ, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్‌ లాంటి దేశాల విషయంలో సున్నా శాతం కంటే తక్కువనీ చెబుతున్నవారు- మొన్న మార్చిలో విదేశీ బాండ్లను ఒడిసిపట్టిన శ్రీలంక మరోసారీ అదే ప్రయత్నం చేయనుందనడం గమనార్హం. వాణిజ్య యుద్ధాలతో అభివృద్ధి మందగించడంతో ప్రపంచవ్యాప్తంగా కేంద్రీయ బ్యాంకులు రుణసేవల్ని ఆకర్షణీయంగా మలచడం ఇండియా లాంటి దేశాలకు అచ్చివచ్చేదే అయినా, 2008లో లేమ్యాన్‌ బ్రదర్స్‌ కుప్పకూలి సృష్టించిన సంక్షోభం లాంటిది మళ్ళీ తలెత్తితే, ఆ రుణాల ఊబిలో దిగబడి ఉక్కిరి బిక్కిరి కావడం తథ్యమన్న ముందస్తు హెచ్చరికలే భీతి గొలుపుతున్నాయి.

ప్రధానమంత్రిగా చంద్రశేఖర్‌ జమానాలో దాదాపు 47 టన్నుల బంగారాన్ని బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్, బ్యాంక్‌ ఆఫ్‌ జపాన్లలో కుదువపెట్టి 40 కోట్ల డాలర్ల మొత్తాన్ని సేకరించిన దశ- ఆర్థిక రంగంలో ఇండియా ఎదుర్కొన్న అతిపెద్ద సంకట స్థితి. అలాంటప్పుడు కూడా విదేశీ మార్కెట్ల నుంచి నేరుగా రుణసేకరణకు ఇండియా వెనకాడింది! డెబ్భయ్యో దశకంలో మెక్సికో, బ్రెజిల్‌ లాంటి దేశాలు విదేశీ విత్త విపణుల నుంచి భూరిమొత్తాలు సేకరించాయి. పదేళ్ల తరవాత వాటి కరెన్సీ మారక విలువ దారుణంగా కోసుకుపోవడంతో అప్పులు తీర్చలేక నానా అవస్థలూ పడ్డాయి. మన కరెన్సీ (రూపాయి) వడ్డీరేట్లతో పోలిస్తే డాలరు, యెన్‌లలో వడ్డీరేట్లు చౌక అన్న వాదన సైతం బూటకమేనంటున్న రిజర్వ్‌బ్యాంక్‌ మాజీ సారథి రఘురామ్‌ రాజన్‌- తమ దేశ కరెన్సీలో రుణపత్రాలు ఇవ్వలేని సందర్భాల్లోనే మెజారిటీ దేశాలు విదేశీ కరెన్సీలో ఇస్తుంటాయని స్పష్టీకరిస్తున్నారు. ఆయా దేశాల కరెన్సీలో బాండ్లను ఇవ్వడం మొదలుపెడితే, ఇండియాలో పరిస్థితులు ఆశావహంగా ఉన్నప్పుడు ఉరకలెత్తి, లేనప్పుడు జారిపోయే మదుపరులతో తలెత్తే దురవస్థలు- తోకే కుక్కను ఊపే చందంగా విపరిణమిస్తాయన్న హెచ్చరికల్ని ఏ మాత్రం తోసిపుచ్చే వీల్లేదు. భారత మార్కెట్లు పటిష్ఠంగా ఉండాలన్నా విదేశీ నిధులు పుష్కలంగా ప్రవహించాలన్నా ప్రభుత్వం జారీచేసే రూపీ బాండ్లలో విదేశీ మదుపరులకున్న పెట్టుబడుల పరిమితిని పెంచితే సరిపోయేటప్పుడు- సావరిన్‌ బాండ్ల ప్రతిపాదనలెందుకన్న ప్రశ్న పూర్తిగా అర్థవంతమైనది. ప్రస్తుతం 10 బిలియన్‌ డాలర్ల (రూ.70 వేలకోట్ల) మొత్తానికే విదేశీ కరెన్సీ బాండ్లను పరిమితం చేస్తామంటున్నా, చీమలు దూరే కంతల్ని క్రమంగా ఏనుగులు వెళ్లే దారులుగా మార్చగల నేతాగణాల చాణక్యం జాతి ఆర్థిక భద్రతనే బలిపీఠం మీదకు నెట్టే ప్రమాదం తోసిపుచ్చలేనిది!Posted on 15-07-2019