Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఆర్థిక రంగం

భారత్‌లో తయారీకి భారీ ఊతం

* బహుళజాతి సంస్థలకు ప్రోత్సాహకాలు

భారతదేశం ఈ ఏడాది చివరికల్లా మూడు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగి, మరి అయిదేళ్లలో అయిదు లక్షల కోట్ల డాలర్ల స్థాయిని అందుకొంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తన తొలి బడ్జెట్‌లో ధీమా కనబరచారు. ఆమె నమ్మకం నిజం కావాలంటే కృత్రిమ మేధ (ఏఐ), బిగ్‌ డేటా, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐఓటీ), 3డీ ప్రింటింగ్, రోబోటిక్స్‌ వంటి నవీన సాంకేతికతలతో నాలుగో పారిశ్రామిక విప్లవాన్ని సాధించాలి. ఈ సాంకేతికతలపై బడ్జెట్‌లో సంచలనాత్మక ప్రతిపాదనలు ఉంటాయని ఆశలు వ్యక్తమైనా, బడ్జెట్‌ వాటిని నెరవేర్చిందని చెప్పలేం. ఆ దిశగా కొన్ని ముఖ్యమైన అడుగులు మాత్రం వేసింది.


నైపుణ్యాలకు సాన
నవతరం శాస్త్రసాంకేతిక రంగాల్లో ప్రపంచస్థాయి ఉన్నత విద్యావ్యవస్థను సిద్ధం చేసుకోవడానికి బడ్జెట్‌లో రూ.400 కోట్లు కేటాయించారు. కౌశల్‌ భారత్‌ పేరిట నిపుణ మానవ వనరులను తయారుచేసుకొంటామని ఎన్డీయే 2014 నుంచే ఆర్భాటం చేస్తున్నా- అది ఇంతవరకు నెరవేరలేదు. కొత్త బడ్జెట్‌లో ఈ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి కోటిమందికి అధునాతన నైపుణ్యాలు అబ్బించి, ప్రపంచంలో ఎక్కడైనా సరే ఉపాధి సాధించే సత్తా చేకూరుస్తామని ఆర్థిక మంత్రి సీతారామన్‌ గంభీరంగా ప్రకటించారు. ఎన్డీయే ప్రభుత్వం మొదటి నుంచీ ‘భారత్‌లో తయారీ’ జపం చేస్తున్నా అది ముందుకు కదలిన దాఖలా లేదు. ఆ లోటును భర్తీ చేసుకోవాలనే సంకల్పం ఎన్డీయే సర్కారు కొత్త బడ్జెట్‌లో వ్యక్తమైంది. ఎలక్ట్రానిక్స్‌ దిగుమతులపై అతిగా ఆధారపడకుండా స్వదేశంలోనే వాటిని ఉత్పత్తి చేయాలని, కేవలం ఐటీ సేవల ఎగుమతిదారుగా మిగిలిపోకుండా ఉత్పత్తుల సృష్టికర్తగా ఆవిర్భవించాలని, ఎల్‌ఈడీ బల్బుల ఉత్పత్తి, వాడకాలను భారీగా ప్రోత్సహించాలని ఆర్థిక మంత్రి ఆకాంక్షిస్తున్నారు. భవిష్యత్తులో బృహత్తర పరిశ్రమగా ఆవిర్భవించే విద్యుత్‌ వాహనాల తయారీని ప్రోత్సహించడానికి జీఎస్టీని 12 నుంచి అయిదు శాతానికి తగ్గించాలని ప్రతిపాదించారు. విద్యుత్‌ వాహనాలను రుణంపై కొన్నవారికి వడ్డీలో లక్షన్నర రూపాయల మేరకు ఆదాయ పన్ను తగ్గింపు ఇవ్వబోతున్నారు. రుణాన్ని పూర్తిగా చెల్లించేసరికి మొత్తం రూ.2.5 లక్షల ఆదాయ పన్ను తగ్గింపు చేకూరుతుంది. ఈ రాయితీలతో విద్యుత్‌ వాహనాల అమ్మకాలు పెరిగితే, వాటి తయారీకి స్వదేశీ విదేశీ సంస్థలు ఉత్సాహంగా ముందుకువస్తాయని ఆర్థిక మంత్రి అంచనా. వాటితోపాటు భారత గడ్డపై సెమీ కండక్టర్లు, సౌర ఘటాలు, లిథియం స్టోరేజి బ్యాటరీలు, సౌర విద్యుత్‌ ఛార్జింగ్‌ వసతులు, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్‌ సర్వర్ల తయారీకి అంతర్జాతీయ కంపెనీలను ఆహ్వానిస్తామని సీతారామన్‌ ప్రకటించారు. ఇక్కడ బృహత్తర కర్మాగారాలను నెలకొల్పే సంస్థలకు ఆదాయ పన్నులోను, పరోక్ష పన్నుల్లోను రాయితీలిస్తామన్నారు. చైనాలో మాదిరిగా 24 గంటలూ ఉత్పత్తి సాగించే భారీ కర్మాగారాలను భారత్‌కు ఆకర్షించాలని ఎన్డీయే ప్రభుత్వం లక్షిస్తున్నా, కమ్యూనిస్టు చైనాలో వీలుపడింది ఇక్కడ సాధ్యమవుతుందా అన్నది ప్రశ్న. చైనాలోని భారీ కర్మాగారాల్లో పనిచేసే కార్మికులకు నిద్రాహారాలు అక్కడే గడచిపోతాయి. వ్యాపారం సరిగ్గా నడవకపోతే వారిని తక్షణం పనుల్లోంచి తొలగిస్తారు. అంతర్జాతీయ కంపెనీలు భారత్‌లోనూ పెట్టుబడులు పెట్టాలంటే ఇలాంటి ‘సానుకూల’ వాతావరణం కావాలంటాయి. నాణానికి రెండో వైపూ ఉంది. బహుళజాతి సంస్థల వల్ల పారిశ్రామికాభివృద్ధి విజృంభిస్తే, కార్మికులకు ఒకచోట ఉద్యోగం పోయినా వేరే చోట సులువుగా ఉపాధి లభిస్తుంది. నిరుద్యోగ సమస్యకు ఇది ఎంతో కొంత పరిష్కారమనే భావనతో ఎన్డీయే ప్రభుత్వం ఇప్పటికే కొన్ని కీలక కార్మిక సంస్కరణలు తీసుకొచ్చింది. 44 కార్మిక చట్టాలను నాలుగు కార్మిక స్మృతు(కోడ్‌)ల కింద క్రమబద్ధీకరిస్తోంది.


నేడు ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నది భారతదేశమే. ప్రపంచ బ్యాంకు అంచనా ప్రకారం 2019-20లో భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు 7.5 శాతంగా ఉండబోతోంది. 2018లోనూ భారత్‌ ఇతర ప్రధాన దేశాలకన్నా హెచ్చు వృద్ధి (7.3 శాతం) నమోదు చేసింది. ఆ సంవత్సరం చైనా వృద్ధిరేటు 6.6 శాతమే. చైనాలో కార్మికుల జీతభత్యాలు పెరుగుతున్నందువల్ల అక్కడి నుంచి విదేశీ కంపెనీలే కాదు చైనా సంస్థలూ వియత్నాం, మలేసియా, మియన్మార్‌ తదితర దేశాలకు తరలిపోతున్నాయి. ఆ ప్రవాహంలో ఒక పాయను భారత్‌ కూడా ఆకర్షించింది. గత అయిదేళ్లలో చైనా నుంచి 1,200 కోట్ల డాలర్ల ప్రత్యక్ష పెట్టుబడులు భారత్‌కు ప్రవహించాయి. ఇప్పటికే 700 చైనా కంపెనీలు భారత్‌లో వ్యాపారం చేస్తున్నాయి. భారత్‌లో అమెరికన్‌ సంస్థలు ఐటీ తదితర సేవా రంగాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. డొనాల్డ్‌ ట్రంప్‌ చైనా వస్తువులపై దిగుమతి సుంకాలు పెంచినప్పటి నుంచి, అమెరికన్‌ సంస్థలు తమ ఉత్పత్తి కార్యకలాపాలను చైనా నుంచి ఇతర దేశాలకు తరలించాలని చూస్తున్నాయి. కొన్ని నెలల క్రితం అమెరికన్‌ ప్రతినిధుల బృందమొకటి భారత్‌లో అవకాశాలను పరిశీలించి వెళ్లింది. గతంలో చైనాలో తక్కువ జీతాలకు కార్మికులు లభించడం వల్ల అమెరికన్‌ కంపెనీలు అక్కడ కర్మాగారాలు స్థాపించి అమెరికాకు, ఇతర దేశాలకు ఉత్పత్తులు ఎగుమతి చేసేవి. అధిక నైపుణ్యం అవసరమైన కంప్యూటర్లు, స్మార్ట్‌ ఫోన్లు, కార్లు, భారీ యంత్ర తయారీ పరిశ్రమలను సైతం అమెరికా, జర్మనీ, జపాన్, తైవాన్, దక్షిణ కొరియాలు చైనాలోనే నెలకొల్పాయి. కొన్ని విడిభాగాలను, సాఫ్ట్‌వేర్‌ను వేర్వేరు దేశాల నుంచి తీసుకొచ్చి చైనాలో కూర్పు చేసి ఎగుమతి చేసేవారు. దీన్నే అంతర్జాతీయ సరఫరా గొలుసు అంటారు. చైనాపై అమెరికా సుంకాల దాడి ప్రారంభించినప్పటి నుంచి ఈ కంపెనీలు తమ ఉత్పత్తిని నెమ్మదిగా ఇతర దేశాలకు తరలిస్తున్నాయి. పెద్దగా నైపుణ్యాలు అక్కర్లేని జౌళి, దుస్తులు, పాదరక్షలు, ఫర్నిచర్‌ తయారీ సంస్థలు ఇప్పటికే వియత్నామ్‌కు తరలిపోయాయి. అమెరికన్‌ సంస్థ నైకీ తన ఉత్పత్తిని చైనా నుంచి వియత్నామ్‌కు తరలించడంతో 2010లో వియత్నాం నైకీ పాదరక్షల తయారీలో చైనాను మించిపోయింది. దక్షిణ కొరియా కంపెనీ శాంసంగ్, జపాన్‌ కంపెనీ ఒలింపస్‌లు చైనాలోని తమ కర్మాగారాలను వియత్నామ్‌కు తరలించాయి. మైక్రోసాఫ్ట్‌ నోకియా ఫోన్ల తయారీని తరలిస్తే- ఇంటెల్, ష్నైడర్‌ కంపెనీలు వియత్నామ్‌లో భారీ పెట్టుబడులు పెట్టాయి. ఈ ఏడాది మొదటి అయిదు నెలల్లోనే వియత్నామ్‌లో చైనా ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) 4.6 రెట్లు పెరిగాయి. 2017తో పోలిస్తే 2018లో భారత్‌లో చైనా పెట్టుబడి 137 శాతం పెరిగింది. చైనీస్‌ కేబుల్‌ అసెంబ్లీ కంపెనీ లక్స్‌ షేర్‌ భారత్, వియత్నామ్‌లు రెండింటిలో ఉత్పత్తి చేపట్టింది. తైవాన్‌కు చెందిన హాన్‌ హై భారత్‌లో ఉత్పత్తి, బట్వాడా, విక్రయాలు, మార్కెటింగ్‌ సేవల కోసం 14 అనుబంధ సంస్థలను నెలకొల్పింది.


పారదర్శకంగా అనుమతులు
పన్నులు తగ్గిస్తే మరిన్ని విదేశీ సంస్థలు భారత్‌కు తరలివస్తాయని నిపుణులు అంటున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తన మొట్టమొదటి బడ్జెట్‌లో ఈ మేరకు చొరవ తీసుకున్నారు. భారత్‌లో తయారీ కింద హైటెక్‌ రంగాల్లో బృహత్తర కర్మాగారాలను ఏర్పరచడానికి ముందుకొచ్చే అంతర్జాతీయ సంస్థలకు పారదర్శక వేలం పద్ధతిలో అనుమతి ఇస్తామన్నారు. అలాంటి సంస్థలకు ఆదాయపన్ను చట్టంలోని 35 ఏడీ సెక్షన్‌ కింద పెట్టుబడుల పరిమాణంతో ముడివడిన పన్ను మినహాయింపులతోపాటు పరోక్ష పన్నులపరంగానూ రాయితీలిస్తామన్నారు. విద్యుత్‌ వాహనాల బ్యాటరీల ఉత్పత్తికి భారత్‌ను మహా కేంద్రంగా అభివృద్ధి చేయదలచామన్నారు. భారతదేశంలో ప్రతి ఫ్యాక్టరీ కార్మికుడు గంటకు కేవలం 1.72 డాలర్ల వేతనానికి పనిచేస్తుంటే, చైనా కార్మికులకు ఇంతకన్నా రెండు రెట్లు ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది. అమెరికా కార్మికుడికైతే గంటకు ఏకంగా 37.96 డాలర్లు చెల్లించాలి. జర్మనీలో రోబోలతో కలిసి పనిచేసే కార్మికులకూ గంటకు నాలుగు డాలర్లు చెల్లించాల్సిందే. ఈ వేతన వ్యత్యాసాలు ఆటొమొబైల్‌ పరిశ్రమను భారత్‌ వైపు ఆకర్షిస్తున్నాయి. కృత్రిమ మేధ, ఐఓటీ, త్రీడీ ప్రింటింగ్‌ వంటి అధునాతన పరిశ్రమల్లో కేవలం తక్కువ జీతాలకు దొరికే సిబ్బందితో పని నడవదు. ఇతర దేశాలకన్నా తక్కువ జీతాలకు ఎక్కువ నైపుణ్యం కనబరచే సిబ్బంది కావాలి. అందుకోసం విద్యావ్యవస్థ ఆధునికీకరణకు బడ్జెట్‌లో నిధులు కేటాయించడం శుభపరిణామం. మున్ముందు పారిశ్రామిక ఉత్పత్తి డిజిటల్‌ పంథాలో సాగనుంది. త్రీడీ ప్రింటింగ్, రియల్‌ టైమ్‌ ఉత్పత్తి ప్రక్రియలు పారిశ్రామికోత్పత్తి వ్యయాన్ని మరింత తగ్గించేస్తాయి. ఇలా నవీన సాంకేతికతలను మేళవించే అంతర్జాతీయ సంస్థలకు బ్రిటన్, ఆస్ట్రేలియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ దేశాలు ఇప్పటికే భారీ పన్ను రాయితీలు, ప్రోత్సాహకాలు ఇస్తున్నాయి. ఈ రంగాల్లో అధునాతన పరిశోధనలకు గ్రాంట్లు అందిస్తున్నాయి. నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ఈ దిశగా అడుగులు వేయడం ఆహ్వానించదగిన పరిణామం.


ఇండియావైపు సంస్థల చూపు
నెహ్రూ సోషలిస్టు పంథా నుంచి స్వేచ్ఛావిపణి దిశగా కదిలే క్రమంలో బీమా, డిజిటల్‌ మీడియా, ఒప్పంద పారిశ్రామికోత్పత్తి వంటి రంగాల్లోకి భారీగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐలను) ఆహ్వానిస్తోంది. ప్రస్తుతం చైనాపై అమెరికా సాగిస్తున్న వాణిజ్య యుద్ధం పుణ్యమా అని ప్రపంచమంతటా స్వీయ వాణిజ్య రక్షణ ధోరణులు పెచ్చరిల్లుతున్నాయి. ఈ ప్రతికూల పరిస్థితుల్లో భారత్‌లో పెట్టుబడులు గుమ్మరించడానికి బహుళజాతి సంస్థలు ముందుకొస్తాయా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో ప్రతికూలతలను సానుకూలతలుగా మలచుకొనే అవకాశమూ ఉంది. దాదాపు 200 అమెరికన్‌ బహుళజాతి సంస్థలు తమ ఉత్పత్తి కార్యకలాపాలను చైనా నుంచి భారత్‌కు తరలించడానికి సిద్ధంగా ఉన్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఇలాంటి అంతర్జాతీయ సంస్థలను ఆకర్షించడానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం సులభంగా వ్యాపారం చేసుకునే పరిస్థితులు కల్పిస్తోంది. పరిశ్రమలకు భూ సేకరణలో ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించాలని చూస్తోంది. ఏళ్ల తరబడి పీడిస్తున్న విద్యుత్‌ కొరతలను అధిగమించి ఈ ఏడాది మిగులు విద్యుత్తు సాధించబోతోంది. అన్నింటినీ మించి ఇక్కడ జీడీపీ వృద్ధిరేటు, దాంతోపాటు మధ్యతరగతి ప్రజల కొనుగోలు శక్తి పెరగడం వల్ల తమకు విశాలమైన మార్కెట్‌ లభిస్తుందని బహుళజాతి సంస్థలు గ్రహిస్తున్నాయి.

- వరప్రసాద్‌
Posted on 16-07-2019