Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఆర్థిక రంగం

నాలుగో తరం నైపుణ్యభరితం

* సరికొత్త పారిశ్రామిక విప్లవం
* భారత్‌ ఎంతవరకు సిద్ధం?

ఒకప్పుడు ఏ వస్తువైనా చేతులతోనే తయారయ్యేది. ఆవిరి యంత్రం కనిపెట్టినప్పటి నుంచి యంత్రాలతో వస్తుతయారీని చేపట్టి మొదటి పారిశ్రామిక విప్లవానికి తెర తీశారు. విద్యుచ్ఛక్తిని కనిపెట్టడం, వస్తువుల కూర్పు ప్రక్రియ విధానాలు కలిసి రెండో పారిశ్రామిక విప్లవాన్ని ప్రారంభించాయి. కంప్యూటర్లు మూడో పారిశ్రామిక విప్లవానికి నాంది పలకగా, ఇప్పుడు అంతర్జాలం, కమ్యూనికేషన్‌ సాంకేతికతలు, పరిశ్రమలు కలిసికట్టుగా నాలుగో పారిశ్రామిక విప్లవానికి శంఖం పూరిస్తున్నాయి. ఈ సరికొత్త విప్లవం స్మార్ట్‌ (తెలివైన)ఫ్యాక్టరీలను సృష్టించనుంది. రహదారులు, కార్యాలయాలు, పరిశ్రమలు, ఆస్పత్రులు, విద్యాలయాలు, గృహాలను స్మార్ట్‌ (తెలివైనవి)గా మార్చి మన జీవనశైలిని సమూలంగా మార్చేయబోతోంది. అంతర్జాలం, అధునాతన 5జీ కమ్యూనికేషన్‌ సాంకేతికతలు, కృత్రిమ మేధ, క్వాంటమ్‌ కంప్యూటింగ్‌, రోబోటిక్స్‌, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌, త్రీడీ ప్రింటింగ్‌, స్వయంచాలిత మోటారు వాహనాల వల్ల మానవ జీవితం గుణాత్మకంగా రూపాంతరం చెందడం ఖాయం.

తొలి అడుగులు
మన పరిశ్రమల్లో యంత్రాలను స్వయంచాలితం చేసే ప్రక్రియ ఇప్పుడిప్పుడే మొదలవుతోంది. వస్తు తయారీ, కూర్పు విభాగాలను అనుసంధానించి తెలివైన కర్మాగారాలను సాకారం చేసే పనిని కొన్ని రంగాల్లో ప్రయోగాత్మకంగా చేపట్టారు. ముఖ్యంగా నిపుణ కార్మికులతో నడిచే మోటారు వాహనాలపరిశ్రమ నాలుగో పారిశ్రామిక విప్లవానికి దీపధారిగా నిలుస్తోంది. జౌళి, ప్యాకేజింగ్‌ పరిశ్రమలు కూడా ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐఓటీ) ద్వారా ఉత్పత్తి ప్రక్రియను ప్రయోగాత్మకంగా చేపట్టాయి. ఇటువంటి నాలుగో పారిశ్రామిక విప్లవ సంవిధానాల వల్ల పరిశ్రమల్లో వృథా చాలావరకు తగ్గింది. భారత దేశంలో అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ త్రిమితీయ ముద్రణ (త్రీడీ ప్రింటింగ్‌) పద్ధతిలో వస్తూత్పత్తి (యాడిటివ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌)ని చేపట్టడం పెద్ద విశేషం. వాహన రూపకల్పన, విడిభాగాల కూర్పు, ఉత్పత్తిని పరీక్షించడం లాంటివన్నీ స్వయంచాలితంగా జరగడానికి యాడిటివ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ దోహదం చేస్తోంది. దీనివల్ల వస్తు తయారీ ఊపందుకుని త్వరత్వరగా మార్కెటింగ్‌ చేపట్టగలుగుతోంది. ఎంతో సమయం ఆదా అయ్యి లాభాలు పెరుగుతున్నాయి. 2016నుంచి భారత్‌కు రోబోల దిగుమతీ పెరుగుతోంది. ఇవన్నీ నాలుగో పారిశ్రామిక విప్లవ వీచికలే. ఈ విప్లవాన్ని వేగంగా అందిపుచ్చుకొనే దేశం నేరుగా అమెరికా, జర్మనీ వంటి అభివృద్ధి చెందిన దేశాలతోనే పోటీపడగలుగుతుంది. కొంత ముందో వెనకో ప్రపంచ దేశాలన్నీ స్వయంచాలిత పరిశ్రమల వైపు మొగ్గక తప్పదు. స్వయంచాలనం వల్ల వస్తూత్పత్తిలో పొరపాట్లు, లోపాలను పరిహరించవచ్చు. రోబోల రంగప్రవేశంతో ఉత్పత్తి వేగం పుంజుకొంటుంది. వ్యవసాయమూ సమూల మార్పులకు లోనవుతుంది. ప్రపంచ జీడీపీ ఎన్నో రెట్లు పెరిగిపోతుంది. అయితే వ్యక్తిగత స్థాయిలో మాత్రం నాలుగో పారిశ్రామిక విప్లవం దుష్ప్రభావం చూపవచ్చు. రాబోయే స్వయంచాలిత యుగంలో ధనికులు మరింత ధనవంతులైతే, దిగువ వర్గాలవారు పదేపదే ఆర్థిక మాంద్యానికి, నిరుద్యోగానికి ఎర అవుతుంటారు. ఆధునిక యంత్రాలు, రోబోలు, నూతన సాంకేతికతల వల్ల సాధారణ కార్మికులకు, ఉద్యోగులకు ఎసరు వస్తే ఉన్నత నైపుణ్యాలు గలవారికి విపరీతంగా గిరాకీ పెరిగిపోతుంది. వీరి ఆదాయాలు అంతకంతకూ పెరిగిపోతుంటే, సాధారణ కార్మికులు అతి తక్కువ వేతనాలతో సరిపెట్టుకోవలసి వస్తుంది. వీరంతా నిరక్షరాస్యులో, తక్కువ విద్యార్హతలు గలవారో అయి ఉంటారు. నాలుగో పారిశ్రామిక విప్లవానికి కావలసిన నైపుణ్యాలు వీరిలో లోపించి ఉంటాయి. మున్ముందు ధనికులు, పేదల మధ్య అంతరం ప్రధానంగా నైపుణ్యాల లేమి వల్ల వచ్చినదే అవుతుంది. ఎంతటి ఆధునిక రోబోలైనా మానవ ప్రతిభ, సృజనాత్మకతలను ఎన్నటికీ అధిగమించలేవు. విమర్శనాత్మకంగా ఆలోచించడం, నవీకరణ సాధించడం, సామాజిక-భావోద్వేగ సంబంధ, కళాత్మక ప్రజ్ఞను ఎన్నటికీ అందుకోలేవు. మానవుడు నేర్పిన, ఆదేశించిన పనులను మాత్రం ఎంతో సమర్థంగా చేయగలుగుతాయి. రోబోలు, తెలివైన యంత్రాలతో పనిచేయించే నైపుణ్యం ఉన్నవారికి భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది. నాలుగో పారిశ్రామిక విప్లవం ఖాతాదారుల కోర్కెలకు అనువైన వస్తువులను తయారు చేసే సౌకర్యాన్ని అందిస్తుంది. ఉదాహరణకు ఒకే రకం కార్లను భారీయెత్తున తయారుచేసే పద్ధతి పోయి ఖాతాదారులు కోరిన విధంగా రకరకాల కార్లను తయారుచేసి ఇచ్చే పద్ధతి వస్తుంది. వ్యక్తిగత అభిరుచులను నెరవేర్చడం సులువైపోతుంది. నాలుగో పారిశ్రామిక విప్లవం ప్రభుత్వ పాలన సమర్థంగా సాగడానికి తోడ్పడుతుంది. అద్భుత సాంకేతిక ప్రగతి వల్ల వస్తుసేవలు ఇబ్బడిముబ్బడిగా ఉత్పత్తి కావడంతో ప్రభుత్వానికి ఆదాయం పెరిగిపోతుంది. రవాణా నియంత్రణ, నిఘా, భద్రత, రోడ్లను శుభ్రం చేయడం వంటివన్నీ స్వయంచాలిత యంత్రాలే చేస్తాయి. అంతర్జాలం ద్వారా అనుసంధానత పెరిగి ప్రజలు నేరుగా ప్రభుత్వ విధాన నిర్ణయాలు, వాటి అమలులో పాలు పంచుకోగలుగుతారు. ఇలాంటి ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి నాలుగో పారిశ్రామిక విప్లవం బాటవేస్తుంది.

సత్వర కార్యాచరణ కీలకం
ఇంతకూ నాలుగో పారిశ్రామిక విప్లవం వర్ధమాన దేశాలను అభివృద్ధి వైపు ఉరకలు తీయిస్తుందా అంటే కచ్చితంగా జవాబివ్వలేని స్థితి ఎదురవుతోంది. ఈ విప్లవాన్ని సమర్థంగా వినియోగించుకునే నైపుణ్యాలు, సంకల్పం, విధివిధానాలను వర్ధమాన దేశాలు చప్పున అందిపుచ్చుకోవడం మీద అంతా ఆధారపడి ఉంటుంది. ఈ సత్తాను అమెరికా, బ్రిటన్‌, సింగపూర్‌లు ఇప్పటికే కనబరుస్తున్నాయి. భారతదేశానికీ ఆ సామర్థ్యం ఉందికానీ, దాన్ని వెంటనే ఆచరణలోకి తీసుకురావడం కీలకం. ప్రభుత్వం తనవంతుగా భారత్‌లో తయారీ, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. మేకిన్‌ ఇండియా (భారత్‌లో తయారీ) కింద కోటి మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలని లక్షించినా, అది వాస్తవ రూపం ధరించలేదు. నాలుగో పారిశ్రామిక విప్లవానికి అవసరమైన నైపుణ్యాలను యువతరానికి బోధిస్తే నిరుద్యోగం తగ్గి ఉపాధి పెరుగుతుంది. మన దేశంలో వృత్తిపరమైన సాంకేతిక శిక్షణ, నిపుణ కార్మికులకు ఇప్పటికీ కొరతే. మన ఇంజినీర్లలో ఉద్యోగాలకు కావలసిన అర్హతలు కొరవడ్డాయని పలు అధ్యయనాలు సూచించాయి. భారత్‌లో 50 కోట్లమంది పనిచేయగలవారు ఉన్నా, కేవలం 44 లక్షలమందికే శిక్షణ వసతులు ఉన్నాయి. ఇది 0.8 శాతంగా లెక్కతేలుతుంది. అమెరికాలో ఇది 6.7 శాతం, చైనాలో 11.5 శాతంగా ఉన్నట్లు ప్రపంచ బ్యాంకు తెలిపింది. నాలుగో పారిశ్రామిక విప్లవాన్ని అందుకోవాలంటే భారతదేశం తన విద్యా సంస్థలను, సాంకేతిక శిక్షణ పద్ధతులను వెంటనే మార్చుకోవాలి. ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌, కృత్రిమ మేధ, రోబోటిక్స్‌, బయో టెక్నాలజీ, నానో టెక్నాలజీ కోర్సులను పాఠ్య ప్రణాళికల్లో అంతర్భాగాలుగా చేయాలి. పరిశ్రమలు కూడా ఎప్పటికప్పుడు మారిపోయే సాంకేతికతలను అందిపుచ్చుకొని రాణించాలి. పరిశోధన-అభివృద్ధి, సాంకేతిక శిక్షణ కార్యక్రమాలను అంకిత భావంతో చేపట్టాలి. బెంగళూరులో ఒక కంపెనీ భావి కర్మాగారం (ఫ్యాక్టరీ ఆఫ్‌ ది ఫ్యూచర్‌) ప్రాజెక్టును చేపట్టి ఇతరులకు ఆదర్శంగా నిలుస్తోంది. నాలుగో పారిశ్రామిక విప్లవాన్ని అందుకోకపోతే భవిష్యత్తు ఉండదని ప్రజలు, పరిశ్రమలు, ప్రభుత్వం గ్రహించి పట్టుదలతో వేగంగా కార్యాచరణ ప్రారంభించాలి.

చదువుల తీరు మారాలి
మొదటి నుంచీ మన దేశ విద్యావిధానంలో బట్టీ చదువులకే ప్రాధాన్యం ఇస్తూ వచ్చారు. చదివినది గుర్తుపెట్టుకుని పరీక్షలు రాసి మంచి మార్కులు తెచ్చుకుంటే చాలు. కానీ, కంప్యూటర్లు, ఇతర తెలివైన యంత్రాలకున్న జ్ఞాపక శక్తి ముందు మనన శక్తి ఎందుకూ కొరగాదు. కాబట్టి కంప్యూటర్‌లలో నిక్షిప్తమైన అపార సమాచార రాశిని నేర్పుగా ఉపయోగించుకోగల ప్రతిభావంతులదే మున్ముందు పైచేయి అవుతుంది. సంబంధిత నైపుణ్యాలను నేర్పించే పాఠ్య ప్రణాళికలను రూపొందించుకోవాలి. విద్యార్థుల్లో ప్రశ్నించే తత్వాన్ని, సృజనాత్మకతను పెంచి పోషించే విద్యా విధానాన్ని చేపట్టాలి.

వరమా శాపమా?
యంత్రాలు మానవులను శక్తిమంతుల్ని చేశాయి. కానీ, అవి లేనిదే గడవని నిస్సహాయులుగా కూడా మార్చేశాయి. సాంకేతికత అభివృద్ధి చెందినకొద్దీ జనం ఒకరితో ఒకరు కలవడం తగ్గిపోతోంది. వారిలో కలివిడితనం, చురుకుదనం తగ్గి బద్ధకం ఆవహిస్తోంది. వారి గోప్యతకు భంగం కలుగుతోంది. ‘బయోనిక్‌’ అవయవాలు, రసాయనాలతో ఆనందోత్తేజాలు పొందడం ఎక్కువ కానున్నాయి. సాంకేతికత, యంత్రాల సాయంతో మానవుడు అధిమానవుడయ్యే రోజు ఎంతో దూరంలో లేదు. ఈ పరిణామం అతికొద్దిమంది ఉన్నత వర్గీయులకే లాభిస్తుందా లేక జనబాహుళ్యానికీ ప్రగతి ఫలాలు పంచుతుందా అనేది తర్జనభర్జనలకు దారితీస్తోంది. అధిమానవుల ఆవిర్భావం మానవాళికి వరమా శాపమా అనే ప్రశ్న వేధిస్తోంది.Posted on 18-07-2019