Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఆర్థిక రంగం

గాడి తప్పిన గ్రామీణ బ్యాంకులు

పల్లెసీమల్లో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వర్గాలకు ఆర్థికంగా చేయూతనివ్వడానికి గ్రామీణ బ్యాంకులను నెలకొల్పారు. ఇప్పుడు అవి పేరుకే ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు. చట్టం నిర్దేశించిన ప్రకారం పేదలకు ఆర్థిక సహాయం చేయాల్సిన బాధ్యతను అవి ఎన్నడో గాలికి వదిలేశాయి. నిజానికి వాటిని ఇప్పుడు గ్రామీణ బ్యాంకులనడం పూర్తిగా అసమంజసం!

బంగ్లాదేశ్‌లోని గ్రామీణ బ్యాంకు నమూనాను మిగతా ప్రపంచం ప్రశంసించడం సంతోషమే. దానికన్నా ఎంతో మెరుగ్గా, విస్తృతంగా పేదలకు ఆర్థిక సేవలు అందించే సత్తా ఉండి కూడా భారతదేశ గ్రామీణ బ్యాంకులు వివిధ కారణాలవల్ల ఆ పని చేయలేకపోవడం విచారకరం. 1975లో ఒక శాసనం ద్వారా ఆవిర్భవించి, 1976లో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల(ఆర్‌ఆర్‌బీ) చట్టం ద్వారా ఇవి కార్యకలాపాలు చేపట్టాయి. వీటిని సామాజిక బ్యాంకులుగా కూడా వ్యవహరించేవారు. ఆర్‌ఆర్‌బీలను వ్యాపారం కోసం నెలకొల్పలేదని గుర్తించాలి. 1993 నుంచి దశలవారీగా తీసుకొచ్చిన సంస్కరణల వల్ల ఆర్‌ఆర్‌బీలు తమ అసలు లక్ష్యాలు, లక్షణాలను కోల్పోయాయి. పేదలకు సహాయం చేయాలని చట్టం నిర్దేశిస్తున్నా, అవి ఇప్పుడు ధనికుల సేవలో తరిస్తున్నాయి. గడచిన డిసెంబరులో లోక్‌సభ ఆమోదించిన ఆర్‌ఆర్‌బీల సవరణ బిల్లు(2014)కు రాజ్యసభ కూడా ఆమోదముద్ర వేశాక ఆర్‌ఆర్‌బీల స్వరూప స్వభావాలు సమూలంగా మారిపోతాయి. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర, ప్రాయోజక బ్యాంకులు వరసగా 50:15:35 నిష్పత్తిలో ఆర్‌ఆర్‌బీలకు మూలధనాన్ని సమకూరుస్తున్నాయి. తాజా సవరణ వల్ల ఈ మూడింటి సమష్ఠి వాటా 51శాతానికి తగ్గిపోతుంది. బిల్లు అమలులోకి వస్తే, ఆర్‌ఆర్‌బీల ప్రైవేటీకరణకు, పూర్తి వ్యాపారీకరణకు బాట వేసినట్లవుతుంది. అసలు ఆర్‌ఆర్‌బీలు ఏ లక్ష్యాల కోసమైతే నలభై ఏళ్ల క్రితం ఆవిర్భవించాయో, అవన్నీ ఇక అమలుకు నోచుకోవు.

ఘనమైన లక్ష్యాలు గాలికి...

రైతు కుటుంబాల్లో 27శాతం మాత్రమే సంస్థాగత రుణాలను పొందుతుండగా, మూడోవంతు రుణాల కోసం ప్రైవేటు మార్గాలపై ఆధారపడాల్సి వస్తోందని, సమ్మిళిత ఆర్థికాభివృద్ధిపై ఏర్పాటైన రంగరాజన్‌ సంఘం పేర్కొంది. చివరకు 18శాతం రైతు కుటుంబాలకు మాత్రమే అవసరాలకు తగిన రుణాలు అందుతున్నాయి. 87శాతం సన్నకారు రైతులు (ఒక హెక్టారు లోపు సాగుదారులు), 70శాతం చిన్న రైతులు (రెండు హెక్టార్లలోపు సాగుదారులు) ఆర్థిక సంస్థల నుంచి ఎటువంటి రుణాలు పొందలేకపోతున్నారని ప్రపంచ బ్యాంకు తెలిపింది. భారత ప్రభుత్వం నియమించిన యు.సి.సారంగి సంఘమూ కేవలం 14శాతం సన్నకారు రైతులకే సంస్థాగత రుణాలు లభిస్తున్నాయని నిర్ధారించింది. చిన్న, సన్నకారు రైతులకు ఆర్థిక సంస్థల నుంచి బొత్తిగా రుణాలు లభించడం లేదు. అసోచాం అధ్యయనమూ కూడా ఇదే తేల్చిచెప్పింది. దేశంలోని వ్యవసాయ కమతాల్లో 84.93శాతం చిన్న, సన్నకారు రైతులకు చెందినవేనని గుర్తిస్తే, సమస్య తీవ్రత అర్థమవుతుంది. కాబట్టి ఆర్‌ఆర్‌బీలు ఏ లక్ష్యాల కోసం ఏర్పాటయ్యాయో, వాటిని కచ్చితంగా అమలు చేయడానికి పునరంకితం కావాలే తప్ప, వాటికి తిలోదకాలు ఇవ్వకూడదు.

అసలు ఆర్‌ఆర్‌బీలను స్థాపించాలన్న భావనే విప్లవాత్మకమైనది. వీటి రంగప్రవేశానికి ముందు గ్రామీణ పేదలకు సంస్థాగత రుణాలు లభించేవి కావు. బ్రిటిష్‌ వలస పాలనలో ఏర్పాటై, స్వతంత్ర భారతంలో కూడా కొనసాగిన సహకార రుణసంస్థలు రైతులకు తగు సహాయం అందించలేకపోతున్నాయని 1954లో అఖిల భారత గ్రామీణ రుణ సర్వే సంఘం నిగ్గుతేల్చింది. 1955లో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాను స్థాపించినప్పుడు, 1969లో బ్యాంకుల జాతీయీకరణ జరిగినప్పుడు కూడా పేదలకు ఒరిగిందేమీ లేదు. ఈ వాణిజ్య బ్యాంకులు పేదలను దగ్గరికి రానిచ్చేవి కావు. దీంతో పేదలకు సంస్థాపరంగా రుణాలు అందించడం కోసం ప్రభుత్వం ఆర్‌ఆర్‌బీలను స్థాపించింది. సామాన్యుల సేవకు అంకితమైన ఈ ఆర్‌ఆర్‌బీలు ధనికులకు రుణ సహాయం అందించడం పాపమన్నట్లుగా నడుచుకునేవి.

గ్రామ ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాల్లో నివసిస్తున్న పేదలకు సులువుగా, చౌక రేట్లకు రుణ సహాయం అందించే క్రమంలో ఆర్‌ఆర్‌బీలకు నష్టాలు వస్తాయని ముందే అంచనా వేశారు. అవి సామాజిక ప్రయోజనం కోసం అనివార్యంగా భరించాల్సిన నష్టాలని భావించారు. అంటే, ఆర్‌ఆర్‌బీలు ఎంత లాభాలు ఆర్జించాయనేది కాకుండా, అవి ఎంతమంది పేదలకు రుణ సహాయం అందించాయన్నదే ముఖ్యం. ఆర్‌ఆర్‌బీలు ఎంతో వేగంగా విస్తరించాయి. అవి స్థాపితమైన పదిహేనేళ్లకే, అంటే 1990లో 196 ఆర్‌ఆర్‌బీలు ఏర్పాటయ్యాయి. అంతవరకు బ్యాంకింగ్‌ సదుపాయాలు లేని గ్రామీణ, గిరిజన, మారుమూల ప్రాంతాల్లో 14,500 శాఖలు తెరిచాయి. ఎటువంటి పూచీకత్తు చూపే స్థోమత లేని 12.30కోట్లమంది పేదలకు చిన్న మొత్తాల్లో వ్యవసాయ, వ్యాపార రుణాలు ఇచ్చాయి. ఆర్‌ఆర్‌బీలు అసలు ఏ లక్ష్యం కోసం ఏర్పాటయ్యాయనేది విస్మరించి, వాటి పనితీరును వ్యాపారపరంగా అంచనా వేసే పద్ధతిని చేపట్టారు. 1991-92నాటికి మొత్తం 196 ఆర్‌ఆర్‌బీల్లో 152 నష్టాల్లో ఉన్నాయి. వాటి మొత్తం నష్టాలు రూ.621కోట్లకు చేరడం, అప్పటి ప్రభుత్వానికి ఆందోళన కలిగించింది. నిజానికి ఈ నష్టాన్ని సమంగా పంచితే ప్రతి ఆర్‌ఆర్‌బీకి ఏటా రూ.18లక్షల చొప్పున నష్టం వచ్చినట్లు లెక్క. కోట్లాది గ్రామీణ పేదలకు ఆర్‌ఆర్‌బీలు అందిస్తున్న సేవల ముందు ఈ నష్టం ఏ పాటిది? పైగా, ఈ నష్టాల భర్తీకి ప్రత్యామ్నాయాలు కనుగొనడం కష్టమేమీ కాదు.

పేదలే ఆలంబన

గ్రామీణ పేదలకు అనుకూలమైన విధివిధానాలు రూపొందించాలన్న విషయమే విధాన నిర్ణేతలకు పట్టలేదు. ఆర్‌ఆర్‌బీలు కేవలం పేద, బలహీన వర్గాలకు మాత్రమే రుణ సౌకర్యం కల్పించాలన్న నిబంధనను 1992-93లో తొలగించి, ఆర్‌ఆర్‌బీల వ్యాపారీకరణకు నాంది పలికారు. ఈ సంస్కరణలకు ముందు వాటి రుణాలన్నీ పేదలకు దక్కగా, సంస్కరణ తరవాత వారి వాటా 15శాతానికి పడిపోయింది. ఆపై ఆర్‌ఆర్‌బీలకు స్వయంగా వడ్డీరేట్లు నిర్ణయించుకునే అధికారంతోపాటు కంపెనీ వాటాలు, సెక్యూరిటీల్లో పెట్టుబడి పెట్టే వెసులుబాటూ కల్పించారు. దీంతోపాటు గ్రామాల్లో శాఖలు తెరవడం, మూసివేయడం, కొన్ని శాఖలను విలీనం చేయడం వంటి అధికారాలనూ కల్పించారు. సంస్కరణలకు ముందు 196 ఆర్‌ఆర్‌బీల్లో 152 బ్యాంకులు నష్టాల్లో ఉండగా, 2013-14నాటికి అన్ని బ్యాంకులూ లాభాలను కళ్లజూడసాగాయి. ఆ సంవత్సరం ఆర్‌ఆర్‌బీలకు రూ.2,833కోట్ల నికర లాభాలు వచ్చాయి. చక్రవర్తి సంఘం సిఫార్సుల ప్రకారం వీటికి పెట్టుబడుల పునఃపూరణ కింద రూ.1,003కోట్ల నిధులు అందించిన ప్రభుత్వానికి, వాటినుంచి పన్నుల రూపంలో రూ.9,318కోట్ల ఆదాయం సమకూరింది. బడుగుల ప్రయోజనాలను పణంగా పెట్టడం వల్లే పేదల బ్యాంకుల నుంచి ప్రభుత్వానికి అంత భారీగా ఆదాయం దఖలుపడింది. గ్రామాల్లో సమీకరించిన డిపాజిట్‌ మొత్తాలను ఆర్‌ఆర్‌బీలు పట్టణాల్లో కంపెనీ షేర్లు, సెక్యూరిటీల్లో పెట్టుబడి పెట్టడం క్షంతవ్యం కాదు. చట్టబద్ధ నగదు చలామణీ నిష్పత్తి(ఎస్‌ఎల్‌ఆర్‌)ని మించిన రొక్కాన్ని ఆర్‌ఆర్‌బీలు స్టాక్‌మార్కెట్లో పెట్టుబడులు పెట్టాయి.

మొదట్లో ప్రతి ఆర్‌ఆర్‌బీ తన కార్యకలాపాలను ఒకటో రెండో జిల్లాలకు పరిమితం చేయవలసి ఉండేది. కానీ, 2014 మార్చిలో మొత్తం 196 ఆర్‌ఆర్‌బీలను పునరేకీకరణ చేసి 57కి కుదించారు. వ్యాపార పరిమాణం, ఇతర పరామితుల రీత్యా కొన్ని ఆర్‌ఆర్‌బీలు భారీ బ్యాంకులుగా రూపాంతరం చెందాయి. దీనికి ఉదాహరణగా ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకును చెప్పవచ్చు. ధనలక్ష్మీ బ్యాంకు, లక్ష్మీ విలాస్‌ బ్యాంకు, తమిళనాడు మర్కంటైల్‌ బ్యాంకు వంటివి ప్రైవేటురంగ వాణిజ్య బ్యాంకులకన్నా చాలా పెద్దవి. ప్రస్తుతం మూడువేల కోట్ల రూపాయలకు పైగా డిపాజిట్లు ఉన్న ఆర్‌ఆర్‌బీలు 33 ఉన్నాయి. ఆర్‌ఆర్‌బీలు పేరుకు గ్రామీణ బ్యాంకులైనా, వాటి కార్యకలాపాలు, కార్యనిర్వహణ క్షేత్రం నగరాలకు మారుతున్నాయి. 2013 మార్చినాటికి ఆర్‌ఆర్‌బీలకు 1,080 పట్టణ శాఖలు, 190 మహానగర శాఖలు ఉన్నాయి. సంస్కరణలకు ముందు తమ రుణాలన్నింటినీ గ్రామ ప్రాంతాల్లోనే కేంద్రీకరించిన ఆర్‌ఆర్‌బీలు, ఇప్పుడు మొత్తం రుణాల్లో 64.78శాతం మాత్రమే గ్రామాలకు ఇస్తున్నాయి. గ్రామాల నుంచి రూ.1,20,826కోట్ల డిపాజిట్లు సేకరించి, అందులో రూ.88,021కోట్లు మాత్రమే గ్రామాలకు రుణాలుగా ఇస్తున్నాయి. పేద, బలహీనవర్గాలవారికి చిన్న మొత్తాల్లో రుణాలు ఇవ్వాలనే భావన రానురానూ అంతరించిపోతోంది. 2013లో ఆర్‌ఆర్‌బీలు రూ.100కోట్లకు మించి 20రుణాలు, రూ.25-100కోట్ల మధ్య 539 రుణాలు, రూ.10-25లక్షల మధ్య 30,022 రుణాలను ఇచ్చాయి. అయిదు లక్షల రూపాయలకు మించిన రుణాలు రూ.15,937కోట్ల మేరకు ఉన్నాయి.

ఈ రుణాలను పేద వర్గాలకు ఇచ్చి ఉండరని వేరేగా చెప్పనవసరం లేదు! దానాదీనా ఆర్‌ఆర్‌బీలు పేదలకు తక్కువ వడ్డీకి రుణాలనిచ్చే సంప్రదాయానికి నీళ్లు వదిలేశాయి. వాటి నిధులు పట్టణాలకు తరలుతున్నాయి. ఆర్‌ఆర్‌బీల సవరణ బిల్లు ఆమోదం పొందినట్లయితే వాటి పాక్షిక ప్రైవేటీకరణకు మార్గం సుగమం అవుతుంది. ఆర్‌ఆర్‌బీలపై ప్రైవేటు వాటాదారుల నియంత్రణ పెరిగి, పేద వర్గాలకు అవి మరింత దూరమవుతాయి. లాభార్జనే వాటి పరమావధి అవుతుంది. ప్రభుత్వం ఈ పెడధోరణిని అరికట్టి, ఆర్‌ఆర్‌బీలు ఏ లక్ష్యాల కోసమైతే ఏర్పడ్డాయో వాటిని సాధించడానికి పునరంకితమయ్యేలా చర్యలు తీసుకోవాలి.

(రచయిత - డాక్టర్ ఎస్.అనంత్)
Posted on 01-03-2015