Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఆర్థిక రంగం

నిర్దుష్టలబ్ధికి విస్పష్ట వ్యూహం

* బడ్జెట్ల అమలుపై త్రైమాసిక సమీక్షలు

ఆదాయ, వ్యయ వివరాలను చట్టసభలకు ఏటా బడ్జెట్ల రూపంలో సమర్పించే ప్రభుత్వాలు క్షేత్రస్థాయిలో లక్ష్యాల అమలు తీరుపై దృష్టిపెట్టడం లేదన్న విమర్శలున్నాయి. వార్షిక బడ్జెట్లు అమలు జరిగే విధానమే ప్రభుత్వ పనితీరుకు కొలమానం. గతంలో ప్రభుత్వాలు బడ్జెట్లో నిధుల కేటాయింపుపైనే ఎక్కువ దృష్టి సారించేవి. కానీ 2005-06 నుంచి ఆ పద్ధతి మారింది. నిధుల వినియోగం, తద్వారా వచ్చే ఫలితాలవైపు చూపు మరలినా, ఆ దిశగా గుణాత్మక సంస్కరణలేవీ పట్టాలకెక్కలేదు. బడ్జెట్‌కు అనుగుణంగా మంత్రిత్వ శాఖలు, వాటి అనుబంధ విభాగాలు ఏర్పరచుకున్న లక్ష్యాలు, సాధించిన ఫలితాల వివరాలను ప్రజలకు తెలియజెప్పే వెసులుబాటు కల్పించాలి. ప్రస్తుతం సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకుంటేతప్ప పాలన నిర్ణయాలకు, ఫలితాలకు సంబంధించిన వివరాలు తెలిసే అవకాశం లేదు. ఈ విధానం మారాలి. ప్రభుత్వాలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి తమ పనితీరుకు సంబంధించిన కీలక సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజల ముందు ఉంచే పద్ధతి అమలులోకి రావాలి.

స్టాక్‌ ఎక్స్‌ఛేంజీల్లో పేర్లు నమోదై కార్యకలాపాలు నిర్వహించే సంస్థలు, తమ పనితీరుకు సంబంధించిన కీలక ఆర్థిక వివరాలను మూడు నెలలకోసారి వెల్లడిస్తుంటాయి. ఈ పద్ధతిని ప్రభుత్వరంగంలోనూ అమలుపరచాలి. అన్ని ప్రభుత్వ శాఖలు, మంత్రిత్వ విభాగాలు విధిగా ప్రతి త్రైమాసికాంతంలోనూ కేటాయింపులు, అప్పటివరకు సాధించిన ఫలితాల సమాచారాన్ని చట్టసభలకు నివేదించే ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ పనితీరుకు స్థూలంగా మూడు ప్రమాణాలను నిర్దేశించుకోవచ్చు.

అవి- ఒకటి: వార్షిక బడ్జెట్లో కేటాయించిన నిధుల విడుదల, వాటి వినియోగం వివరాలు.
రెండు: నిధులను ఏ పథకం లేదా ప్రణాళిక కింద ఉపయోగించారు, అది పూర్తి కావడానికి పట్టిన కాలం లేదా ప్రస్తుతం అది ఏ దశలో ఉందన్నదానిపై వివరణ.
మూడు: ఆయా ప్రణాళికల కింద లబ్ధి పొందినవారి సంఖ్య. ఈ ప్రమాణాల విషయంలో ప్రభుత్వాలు నిబద్ధంగా వ్యవహరించే ఏర్పాటు చేయాలి. త్రైమాసిక ఆరంభంలో నిర్దేశించుకున్న లక్ష్యాలు, అది ముగిసేనాటికి సాధించిన ఫలితాల వివరాలను అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలు ప్రజలందరికీ విదితం చేయాలి. ఆ మేరకు సంబంధిత చట్టాల్లో సవరణలు తీసుకురావాలి. దీనివల్ల ప్రభుత్వ శాఖల పనితీరుపై ప్రజలకు స్పష్టత ఏర్పడుతుంది. ఏయే శాఖలు సమర్థంగా పనిచేస్తున్నాయో, ఏవి తమ పనితీరు మెరుగుపరచుకోవాలో ప్రస్ఫుటంగా వెల్లడవుతుంది. వార్షిక బడ్జెట్లో ప్రతిపాదించే ఆదాయ వ్యయాలు, నిధుల సమీకరణ, రుణాలు వంటివన్నీ పార్లమెంటు ఆమోదంతో జరుగుతాయి. కాబట్టి బడ్జెట్‌కు లోబడి పనిచేసే మంత్రిత్వ శాఖలు తదితర అనుబంధ విభాగాలు తమ పనితీరుపై నివేదికను పార్లమెంటుకు సమర్పించడమే కాకుండా- తమ పనితీరుకు జవాబుదారీగా వ్యవహరించాలి. బడ్జెట్లోని వివిధ ప్రణాళిక లక్ష్యాలకన్నా సాధించిన ఫలితాలు నాసిరకంగా ఉన్నప్పుడు- పార్లమెంటుకు త్రైమాసిక నివేదిక సమర్పించడంతోపాటు, తగిన వివరణ/సంజాయిషీ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది.

వాణిజ్య సంస్థలు లాభాలే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తాయి. ప్రభుత్వరంగ వ్యవస్థలు ప్రజా సంక్షేమాన్ని లక్ష్యంగా పరిగణిస్తాయి. లాభార్జన వాటి ఉద్దేశం కాదు కాబట్టి, నష్టాలు వాటిల్లినా తప్పులేదన్న దురభిప్రాయం ప్రబలింది. అందువల్లే దేశంలో అనేక ప్రభుత్వరంగ సంస్థలు నష్టాల బాటలో ఉన్నాయి. 2017-18 నాటి గణాంకాల ప్రకారం దేశంలోని 71 కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో వాటిల్లిన నష్టం సుమారు రూ.31,261 కోట్లుగా అంచనా వేశారు. కేంద్ర ప్రభుత్వ అధీనంలో నిర్మాణ దశలోని 295 వివిధ భారీ మౌలిక ప్రాజెక్టుల నిర్మాణం సకాలంలో పూర్తి కాకపోవడంవల్ల పెరిగిన వ్యయం ఆగస్టు 2014లో లక్ష కోట్ల రూపాయలు. 2018 నవంబర్‌నాటికి ఆ సంఖ్య 347 ప్రాజెక్టులకు విస్తరించి అదనపు వ్యయం మూడు లక్షల కోట్ల రూపాయలకు పెరిగింది. జాప్యంవల్ల పెరిగిన మూడు లక్షల కోట్ల రూపాయల ఖర్చు కేంద్ర ప్రభుత్వ ఖజానాకు ఒకరకంగా మోయలేని భారమే. ప్రభుత్వంలోని భిన్న శాఖల మధ్య సమన్వయం లోపించడంతోపాటు, జవాబుదారీతనం కొరవడటం ఇందుకు కారణం. ఈ పరిస్థితి మారాలంటే ప్రతి త్రైమాసికంలోనూ ప్రభుత్వ సంస్థల లక్ష్యాలు, ఫలితాలను వెల్లడించే విధానం అమలులోకి తీసుకురావాలి. తద్వారా వనరుల కేటాయింపు, వివిధ విభాగాలు వాటిని వినియోగించిన తీరుపై సమగ్ర అధ్యయనానికి అవకాశం ఏర్పడి, దుబారా తగ్గడంతోపాటు పనితీరూ మెరుగుపడుతుంది. నిర్దిష్ట కాలపరిమితిని మించకుండా కేటాయించిన నిధులను ఖర్చు చేయడంవల్ల లబ్ధిదారులకు ఫలితాలు సకాలంలో అందుతాయి. సంక్షేమ పథకాల అమలుకు ఉపక్రమించే సందర్భంగా వాటి లబ్ధిదారులను ముందే గుర్తిస్తారు. వాటి అమలు పూర్తయ్యాక కానీ ఫలితాలు ఎంతమందికి చేరాయో తెలియదు. నిధుల కేటాయింపు, వినియోగం తీరుతెన్నులపై ఎప్పటికప్పుడు కచ్చితమైన వివరాలను వెల్లడిస్తే ప్రభుత్వ కార్యక్రమాల అమలులో లోటుపాట్లు స్పష్టమై దిద్దుబాటు చర్యలకు అవకాశం ఉంటుంది. తద్వారా పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం ఇనుమడిస్తాయి!‌ - బి.ఎన్‌.వి.పార్థసారది
Posted on 18-07-2019