Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఆర్థిక రంగం

జనాభా వడి వడి... రాష్ట్రాలపై ఒత్తిడి!

* భిన్న పార్శ్వాల్లో విస్తరిస్తున్న అసమానతలు

జనాభా పెరుగుదల విషయంలో భారత్‌ కొత్త రికార్డులు బద్దలు కొట్టే రోజు ఎంతో దూరంలో లేదనిపిస్తోంది. ఐక్య రాజ్య సమితి ఆర్థిక సామాజిక వ్యవహారాల విభాగం ఇటీవల వెలువరించిన అంచనాల ప్రకారం 2027లోగా భారతావని ప్రపంచంలోనే అత్యధిక జనాభాగల దేశంగా ఆవిర్భవించనుంది. భారత్‌లో ముఖ్యంగా వెనకబడిన ప్రాంతాల్లో జనాభా విస్తరణ జోరు ఆందోళనకర స్థాయిలో ఉంది. ఏడో దశకం తొలినాళ్లలో 55.52 కోట్లుగా ఉన్న జనాభా 146శాతం పెరిగి ప్రస్తుతం 136.64 కోట్లకు విస్తరించింది. మరోవంక ఇదే కాలంలో చైనా జనాభా పురోగతిని గమనిస్తే 82.76 కోట్లనుంచి 73శాతం పెరిగి 143.37 కోట్లకు చేరింది. ‘ఒకే బిడ్డ’ వంటి విధానాలు అందిపుచ్చుకుని, క్షేత్రస్థాయిలో వాటిని కఠినంగా అమలు చేసిన కారణంగానే ఆ దేశంలో జనాభా నియంత్రణ సాధ్యపడింది. 1965-70ల మధ్య 6.3గా ఉన్న చైనా మహిళల సగటు సంతానోత్పత్తి రేటు 1970-75నాటికి 5.41కి పడిపోయింది. ‘ఇద్దరు బిడ్డలు మాత్రమే’ ఆ తరవాతి కాలంలో ‘ఒకే బిడ్డతో సరి’ వంటి విధానాలను ‘బీజింగ్‌’ సర్కారు అమలుపరచడమే అందుకు కారణం. ప్రస్తుతం ఆ దేశంలో సంతానోత్పత్తి రేటు 1.69గా ఉంది. భారత్‌ ప్రస్థానం ఇందుకు భిన్నంగా కనిపిస్తుంది. 1965-70ల మధ్యకాలంలో 5.7గా ఉన్న సంతానోత్పత్తి రేటు, 1970-75నాటికి 4.85కి తగ్గింది. ‘మనమిద్దరం.. మనకిద్దరు’ వంటి నినాదాలను విస్తృతంగా ప్రచారం చేసి కొద్దో గొప్పో అమల్లో పెట్టిన కాలమది. ప్రస్తుతం భారత్‌లో సంతానోత్పత్తి రేటు 2.24గా ఉంది. ఈ విషయంలో దేశంలోని వివిధ రాష్ట్రాల మధ్య తీవ్ర అసమానతలు ఉండటం గమనించాల్సిన అంశం. తమిళనాడు, పశ్చిమ్‌బంగలో సంతానోత్పత్తి రేటు 1.6గా ఉంటే; బిహార్‌లో 3.3; ఉత్తర్‌ ప్రదేశ్‌లో 3.1గానూ ఉంది. పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామాల్లో జననాల రేటు అధికంగా కనిపిస్తోంది. భారత్‌లో 2020నాటికి జనాభా సగటు వయసు 28.43గా, చైనాలో 38.4గానూ ఉండబోతోంది.

ఆర్థిక పరిస్థితులపై ప్రభావం
దేశంలోని వివిధ రాష్ట్రాల జనాభా పెరుగుదల రేట్లలో విపరీతమైన తేడాలు కనిపిస్తున్నాయి. దీనివల్ల దేశ రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక వాతావరణంపై పెను ప్రభావం పడనుంది. ఉత్తర్‌ ప్రదేశ్‌, బిహార్‌లు దేశ మొత్తం జనాభాలో సుమారు పాతిక శాతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. 2011నాటి లెక్కల ప్రకారం 2.74 సగటు సంతానోత్పత్తి రేటుతో యూపీ, 3.41 రేటుతో బిహార్‌ మిగిలిన రాష్ట్రాలకు అందనంత ఎత్తులో ఉన్నాయి. 1951లో తమిళనాడు జనాభా బిహార్‌తో పోలిస్తే కాసింత ఎక్కువగానే ఉంది. ఆరు దశాబ్దాల అనంతరం బిహార్‌ జనసంఖ్య తమిళనాడుతో పోలిస్తే ఒకటిన్నర రెట్లు ఇనుమడించింది. మరోవంక 1951లో కేరళతో పోలిస్తే 37శాతం అధికంగా ఉన్న మధ్యప్రదేశ్‌ జనాభా ఏకంగా 217శాతం పెరిగింది. ఈ అంతరాలు పార్లమెంటులో ఆయా రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని ప్రభావితం చేస్తాయనడంలో సందేహం లేదు. పార్లమెంటులో రాష్ట్రాల ప్రాతినిధ్యానికి 1971నాటి జనాభా లెక్కలనే ప్రాతిపదికగా నిర్దేశిస్తూ 1976లో ఆత్యయిక స్థితి సందర్భంగా రాజ్యాంగ సవరణ తీసుకువచ్చారు. పాతికేళ్ల కాలానికి నిర్దేశించిన ఆ గడువును 2001లో మరో 25ఏళ్లకు అంటే 2026వరకూ పొడిగిస్తూ 91వ రాజ్యాంగ సవరణ చేశారు. పార్లమెంటులో రాష్ట్రాల ప్రాతినిధ్యానికి 2026వరకూ 1971నాటి జనాభా లెక్కలే ప్రాతిపదికగా ఉంటాయి. జనాభా ప్రాతిపదికన రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని నిర్దేశిస్తే హిందీ మాట్లాడే ప్రాంతాలకే పార్లమెంటులో అత్యధిక స్థానాలు దఖలు పడే అవకాశాలు సుస్పష్టం. ఇప్పటికే దేశ రాజకీయాలను దాదాపుగా హిందీ రాష్ట్రాలే శాసిస్తున్న పరిస్థితి మనముందుంది. 2014నాటి లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి 51శాతం స్థానాలు కేవలం హిందీ మాట్లాడే నాలుగు రాష్ట్రాల (ఉత్తర్‌ప్రదేశ్‌, బిహార్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌)నుంచే వచ్చాయి. జనాభాపరంగా రాష్ట్రాలకు సీట్ల కేటాయింపు జరిగితే ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. కేంద్రంలో అధికారం నెరిపే ప్రభుత్వం దేశంలోని ప్రాంతాలన్నింటికీ సమాన ప్రాతినిధ్యం వహించేదిగా ఉండాలి. దక్షిణాదిపట్ల దుర్విచక్షణ పెరుగుతోందన్న విమర్శలు కొంతకాలంగా వినిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వానికి పన్నుల రూపేణా దక్షిణాది అత్యధిక ఆదాయం సమకూరుస్తున్నప్పటికీ- నిధుల కేటాయింపులో మాత్రం ఉత్తర్‌ ప్రదేశ్‌, బిహార్‌ వంటి ఉత్తరాది రాష్ట్రాలకే అగ్రపీఠం దక్కుతోందన్న విమర్శలున్నాయి. తమ ఆర్థిక బలిమి రాజకీయ శక్తిగా రూపాంతరం చెందడంలేదన్న అభిప్రాయం దక్షిణాదిలో ఏదో ఒక స్థాయిలోనైనా ఉందని చెప్పక తప్పదు.

జనాభా పెరుగుదల రేటు అధికంగా ఉన్న పేద రాష్ట్రాలనుంచి- బతుకుదెరువుకోసం ప్రజలు సంపన్న రాష్ట్రాలకు వలసపోయే సంస్కృతి ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. 1991-2001 మధ్యకాలంలో ఒక రాష్ట్రంనుంచి మరొక రాష్ట్రానికి వలసవెళ్ళిన వారితో పోలిస్తే రాష్ట్రాల్లోనే వివిధ ప్రాంతాలకు బతుకుదెరువు కోసం వలసపోయినవారి సంఖ్య అయిదు రెట్లు ఎక్కువ. ఆ తరవాతి దశాబ్దంలో అంటే 2001-2011 మధ్యకాలంలో అంతర్‌ రాష్ట్ర వలసలు రెండింతలయ్యాయి. మరీ ముఖ్యంగా వలసదారులు దక్షిణాది రాష్ట్రాల్లోని నగరాలు, పట్టణాల్లో పెద్దయెత్తున స్థిరపడుతున్న ధోరణి కనిపిస్తోంది. 2001-2011 మధ్యకాలంలో తమిళనాడుకు వలసవెళ్ళినవారి సంఖ్య గతంతో పోలిస్తే 3.9 రెట్లు అధికం. మరోవైపు ఇదే కాలంలో బిహార్‌, ఉత్తర్‌ ప్రదేశ్‌లనుంచి ఇతర రాష్ట్రాలకు వలసవెళ్ళిన వారి సంఖ్య 2.3 రెట్లు పెరిగింది. సంప్రదాయేతర పద్ధతులను అనుసరించి, విలక్షణ మార్గాల్లో పరిశీలన జరిపి 2017నాటి ఆర్థిక సర్వేలో వలసదారుల సమాచారం గుదిగుచ్చారు. దక్షిణాది రాష్ట్రాల అసంఘటిత రంగంలో 20శాతం హిందీ ప్రాంత వలసదారులే ఉన్నారు. ఒడిశా, ఝార్ఖండ్‌, యూపీ, బిహార్‌, రాజస్థాన్‌ ప్రాంతాలకు చెందినవారు అధిక సంఖ్యలో దక్షిణాది అసంఘటిత రంగంలో ఉపాధి పొందుతున్నారు. కేరళలో వ్యవసాయం, తోట పనుల్లో యాభైశాతానికిపైగా హిందీ రాష్ట్రాలకు చెందినవారే పనిచేస్తున్నారు. 60ఏళ్లకు పైబడిన వారి సంఖ్య దక్షిణాది రాష్ట్రాల్లో 2011లో 10.3శాతం కాగా 2031నాటికి ఆ సంఖ్య 17.3శాతానికి పెరుగుతుందని అంచనా. ఇంకోవైపు హిందీ ప్రాంతం (ఉత్తర్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, హరియాణా, హిమాచల్‌ ప్రదేశ్‌, దిల్లీ, బిహార్‌, ఝార్ఖండ్‌)లో 60కి పైబడి వయసున్న వారి సంఖ్య 2031నాటికి 11.4శాతంగా మాత్రమే ఉండబోతోంది.

మౌలిక వసతులకు కటకట
జనాభా అడ్డూఆపూ లేకుండా పెరగడం ఏ దేశానికైనా సవాలే. వనరుల అందుబాటు తగ్గిపోతుంది. మితిమీరిన సేద్యంవల్ల భూసారం క్షీణిస్తుంది. ఆహారం, నీరు, మౌలిక సౌకర్యాలు, ఆరోగ్య వసతులు, విద్యా సదుపాయాలకు సంబంధించి తీవ్ర కటకట ఏర్పడుతుంది. నేరాలు ఇనుమడిస్తాయి. కాలుష్యం పెచ్చరిల్లుతుంది. భూగర్భ జలాలు తగ్గిపోతాయి. జనాభా పెరుగుదల అన్నది ఒకరకంగా ఆర్థికాభివృద్ధిని వెనక్కిలాగే ముప్పు. జనసంఖ్య పెరిగే కొద్దీ మౌలిక సౌకర్యాల కోసం అంత పెద్దయెత్తున పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. భారత్‌ వంటి అభివృద్ధి చెందుతున్న దేశం ఒకపరిమితికి మించి మౌలిక సౌకర్యాలపై ఖర్చు చేయలేదు. ఫలితంగా వనరుల లభ్యత, జనసంఖ్య మధ్య అగాధం పెరిగి నిరుద్యోగిత విస్తరిస్తుంది.

ఆదాయ వనరుల సృష్టి తప్పనిసరి
ఏటా దేశ జనాభా ఒక శాతం చొప్పున పెరుగుతుందనుకున్న పక్షంలో- ప్రస్తుత తలసరి ఆదాయ స్థాయిని యథాతథంగా కొనసాగించాలంటే జాతీయాదాయంలో రెండు నుంచి అయిదు శాతాన్ని పెట్టుబడుల రూపంలో ఖర్చు పెట్టాలని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. విస్తరిస్తున్న జనాభాకు అవసరమైన కనీస సౌకర్యాల కల్పనకు పెద్దయెత్తున నిధులు అవసరపడతాయి. అందుకోసం పన్నుల పరిధిని పెంచుకోవడంతోపాటు ఇతర ఆదాయ వనరులనూ సృష్టించుకోవాల్సి ఉంటుంది. దేశంలో ఏటా సుమారు 50 లక్షల మంది కొత్తగా ఉపాధి మార్కెట్లోకి ప్రవేశిస్తున్నారనుకునుకుంటే- వారి గౌరవానికి భంగం కలగని రీతిలో అంతమందికీ ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించడం ప్రభుత్వానికి అతిపెద్ద సవాలు. ఈ పరిస్థితుల్లో భిన్న వర్గాల సామాజిక భద్రతను దృష్టిలో పెట్టుకొని ‘సార్వత్రిక కనీస ఆదాయ’ విధానాన్ని అమలు చేయడమే మెరుగైన మార్గం. ఆ పరిస్థితుల్లో పన్ను విధానాలనూ సంస్కరించుకోవాల్సి ఉంటుంది. అటవీ, జల వనరుల పరిరక్షణ ప్రభుత్వాల కీలక ప్రాథమ్యంగా మారాలి. దక్షిణాది తరహాలోనే హిందీ రాష్ట్రాలూ మహిళా అక్షరాస్యత, ఆరోగ్యం, ఉపాధి కల్పనపై దృష్టి సారించి మేలిమి ఫలితాలు రాబట్టాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ‘మిషన్‌ పరివార్‌ వికాస్‌’ పేరిట ఒక ప్రత్యేక కార్యక్రమం ప్రారంభించింది. ఈ కార్యక్రమం కింద 3.0 కంటే జననాల రేటు ఎక్కువగా ఉన్న 145 జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. యూపీకి చెందిన 57 జిల్లాలు, బిహార్‌లోని 36 జిల్లాలు, మధ్యప్రదేశ్‌కి చెందిన 25, రాజస్థాన్‌కి చెందిన 14 జిల్లాలు ఈ కార్యక్రమం పరిధిలో ఉన్నాయి. ఈ కార్యక్రమం విజయవంతమైతే అత్యధిక జనాభాకు కారణమవుతున్న పేద రాష్ట్రాల ముఖచిత్రం మారుతుంది. హిందీ మాట్లాడే ప్రాంతాల్లో దఖలుపడే మౌలిక మార్పు భారతావని భవిష్యత్తునూ గుణాత్మకంగా తిరగరాస్తుంది!

Posted on 19-07-2019